తండ్రి చెబుతున్న మాటల్ని మేఖల కూడా విని ఆశ్చర్యపోయింది.
మనిషిని చూడకపోయినా అచ్యుత్ ఎంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో విని వుంది మేఖల. తన తమ్ముడు అచ్యుత్ మనుషుల్ని ఎదుర్కొన్నందుకు ముందుగా ఆమె భయపడలేదు. ఆశ్చర్యపోయింది. అంత బలం, ధైర్యం, మొండితనం, తెగింపు తమ్ముడికున్నాయా?
ఆటో రణరంగంలా మారిన ప్రాంతానికి పది గజాల దూరంలో ఆగిపోయింది.
అరుణాచలం హడావిడిగా ఆటో ఫేర్ ఇచ్చేసి భార్య చేయి పట్టుకొని బరబరా ఆ వేపుకి లాక్కెళ్ళి పొసాగాడు. వారి వెనుకే మేఖల కూడా పరుగెత్తింది.
అభిరామ్ ఒక మనిషిని అమాంతం గాల్లోకి లేపి ప్రక్కనే ఉన్న మురికి కాలువలోకి విసిరివేశాడు. ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆదిలక్ష్మి, మేఖల షాక్ తిన్నారు.
అచ్యుత్ అనుచరులు అభిరామ్ పన్నిన పద్మవ్యూహంలో ఇరుక్కుపోయి ప్రాణభయంతో అటూ ఇటూ పరిగెత్తుతున్నారు.
అభిరామ్ మిత్రబృందం చేయి అప్పటికే పైన ఉండటంతో ఉత్సాహంతో అచ్యుత్ అనుచరులను వేటాడుతున్నారు.
చుట్టూ చేరిన జనం నరకాసుర వధ జరుగుతున్నంత ఆనందంగా ఫీలవుతూ చూస్తున్నారు.
ఆ ప్రాంతమంతా అస్తవ్యస్థమై పోయింది. పరిస్థితి గందరగోళంగా వుంది.
"ఏమిట్రా చూస్తున్నారు? సిగ్గులేదు మీకు? ప్రభుత్వం పన్నులడిగితే ఎగ్గొడతారు....? మున్సిపాలిటీలు ఇంటి పన్నడిగితే ఇంటి వెనక్కి వెళ్ళి దాక్కుంటారు. ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు వస్తే ఇన్ కమే లేదంటారు. అందుకు చచ్చినన్ని అబద్దాలాడతారు. ఈ వెధవలొచ్చి అడిగితే నోళ్ళు మూసుకొని అడిగినంత ఇచ్చేస్తారు. మీరు బ్రతుకుతున్నది మంగోలియన్ అడవుల్లోనా? మాతృభూమ్మీదా....? ఏంట్రా ఇంకా చూస్తారు? అందిన వాడ్ని అందినట్టే బాదండి. బాది మీ కసి తీర్చుకోండి....." చుట్టూ మూగి చూస్తున్న జనాల్ని ఉద్దేశించి ఓ ప్రక్క అంటూనే, మరో ప్రక్క అచ్యుత్ అనుచరుల్ని వేటాడుతూనే వున్నాడు అభిరామ్.
పరిస్థితి చేయిదాటి పోతోందని ఆదిలక్ష్మి గ్రహించింది. అప్పటికే కొడుకు బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి.
మొండిగా ముందుకు వెళ్ళిపోయి కొడుక్కి అడ్డంగా నించుంది ఆదిలక్ష్మి.
హఠాత్తుగా తన ఎదుట తల్లి ప్రత్యక్షం కావటంతో అభిరామ్ దిమ్మెర పోయాడు.
జరిగింది క్షణాల్లో ఊహించాడు.
"నువ్వు ప్రక్కకు తప్పుకోమ్మా..... ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన పీడ పోవాలి" అన్నాడు పట్టుదలగా అభిరామ్.
"నా మాట విను ఈ గొడవలు మనకొద్దు. వాళ్ళడిగిన చందా నాన్న గారిచ్చేస్తానంటున్నారు...." అంది ఆదిలక్ష్మి కొడుక్కి మరింత దగ్గరగా వెళుతూ.
"అమ్మా.....నాకు అడ్డం రాకు" అంటూ అభిరామ్ ఒక అడుగు వెనక్కి వేస్తున్నంతలో పెద్దగా ఎవరిదో కేక వినిపించింది.
ఉలిక్కిపడి అందరూ అటువేపు చూశారు.
"అచ్యుత్ ముఠా వాళ్ళు మరో పదిమంది దాకా వచ్చిపడుతున్నారు" అంటూ ఓ యువకుడు పరిగెత్తుకుంటూ వస్తూ అరిచాడు.
అరుణాచలం గజగజా వణికిపోయాడు.
ఆదిలక్ష్మి నవనాడులు స్థంభించిపోయాయి.
"నువ్వయినా ప్రయత్నం చేయ్ తల్లీ, లేదంటే వాడు మనకు దక్కడు" అంటూ అరుణాచలం కూతురి చేతులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు.
మేఖల ఒకడుగు ముందుకువేస్తుండగా అభిరామ్ "అమ్మా" అంటూ ఎగిరి తల్లిని ప్రక్కకు లాగాడు.
మెరుపు వేగంతో అతనా పని చేసుండకపోతే అచ్యుత్ అనుచరుడు వేయబోయిన దొంగ దెబ్బకు ఆమె అక్కడే కుప్పలా కూలిపోయేది.
చుట్టు ప్రక్కల వున్నవాళ్ళు కూడా చివరకు ఆ కొట్లాట ఎక్కడికి దారి తీస్తుందోనని బిక్కచచ్చిపోయారు.
అప్పటివరకు వెనుకంజ వేసి మొండిగా పోట్లాడుతున్న అచ్యుత్ అనుచరులు కూడా ఆ పొలికేక విన్నారు.
తమకి అండగా మరికొంతమంది రాబోతున్న వార్త వారిలో తిరిగి ఉత్సాహాన్ని నింపింది.
పరిస్థితి మొత్తాన్ని ఆకళింపు జేసుకున్న మేఖల క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా ఆ వ్యూహంలోకి జొరబడి నేర్పుగా వాళ్ళని తప్పించుకుంటూ అభిరామ్ ముందుకెళ్ళి ఆగింది.
అక్కను చూస్తూనే అభిరామ్ షాక్ తిన్నాడు.
తలెత్తి అక్కవేపు చూడలేదు.
తల దించుకుని నేలకేసి చూశాడు.
మేఖల ఇక ఆలస్యం చేయదల్చుకోలేదు.
"తమ్ముడూ నా మీద ఏమాత్రం గౌరవం వున్నా తక్షణం ఈ పోట్లాటమాని ఇక్కడి నుండి నువ్వు నీ ఫ్రెండ్స్ అదృశ్యమైపోవాలి....." శాసిస్తున్నట్లుగా అంది.
అప్పటివరకు చిచ్చరపిడుగులా, చిరుతపులిలా విజ్రుంభించి వీర విహారం చేసిన అభిరామ్ ఇపుడు పిల్లయిపోయాడు. చేష్టలు దక్కి నిల్చుండి పోయాడు. అందుకే అందరూ ఆశ్చర్యపోయారు అభిరామ్ ని చూస్తూ.
"అక్కా....." అని అభిరామ్ చిన్నగా ఏదో చెప్పబోయాడు.
"ఆర్గ్యుమెంట్ వద్దు. వెళతావా లేదా?" మేఖల కంఠంలో ఈసారి ఒకింత కాఠిన్యం తొంగిచూసింది.
అంతే ఆ మరుక్షణం అభిరామ్ రెండు చేతులెత్తి గాల్లో ఊపి క్షణాల్లో అక్కడి నుంచి ప్రక్కకు తప్పుకున్నాడు. అభిరామ్ సంజ్ఞనందుకున్న అతని ఫ్రెండ్స్ కూడా వేగంగా అక్కడి నుండి కదలి అదృశ్యమైపోయారు.
ఆ మరునిమిషంలోనే అరుణాచలం, ఆదిలక్ష్మి మేఖల అక్కడి నుండి తప్పుకున్నారు.
అక్కడున్న అందరూ జరిగిందేమిటో అర్ధంకాక పిచ్చెక్కిపోయారు.
అభిరామ్ అక్క మేఖల అతనికో సెంటిమెంటల్ ఏంకర్ అని అక్కడున్న వారికే కాదు వార్నికన్న తల్లిదండ్రులకే తెలీదు అప్పటి వరకు.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో క్షణకాలం క్రితం వరకు దద్దరిల్లిన ఆ ప్రాంతం ఇపుడు స్మశాన వైరాగ్యాన్ని నిశ్శబ్ధాన్ని ఆశ్రయించింది.
అచ్యుత్ పంపిన మనుష్యులు ఆ వీధి మలుపు తిరిగే సరికి ఆ వీధంతా నిర్మానుష్యమైపోయినట్లయింది.
దెబ్బలుతిని క్షతగాత్రులైన అచ్యుత్ అనుచరులు లేచి ఒళ్ళు దులుపు కుంటూ ఆ వేధిలో అపుడు తాము మాత్రమే ఉన్నట్లు గ్రహించి పళ్ళు పటపటా కొరుక్కున్నారు.
కొత్తగా వచ్చిన పదిమంది తమ అనుచరులు మాత్రమే దెబ్బలు తిని ఒంటరిగా ఉండటాన్ని చూసి జరిగింది అర్ధంకాక తికమక పడ్డారు.
ఏం జరిగిందంటూ వాళ్ళు, వీళ్ళను పరామర్శిస్తుండగా అచ్యుత్ నలుగురు అనుచరులతో ఎక్కి వచ్చిన జీప్ సరిగ్గా వారి ముందాగింది.
అచ్యుత్ కూడా కళ్ళెదుట కనిపించిన దృశ్యాన్ని చూసి అయోమయంలో పడిపోయాడు.
జీప్ లోంచి ఎగిరి దూకి-
"ఏమైంది...? వాళ్ళేరి....?" అంటూ గద్దించాడు.
"జస్ట్ ఇపుడే మేం చూస్తుండగానే ఇక్కడి నుంచి తప్పుకున్నారు" అన్నాడో అనుచరుడు ధైర్యం చేసి.
"పిరికి పందలు.....పారిపోయారన్న మాట....."అచ్యుత్ తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు.
"పారిపోలేదు. మన మనుష్యులు మరింత మంది వస్తున్నారన్న భయంతో వాళ్ళు వెళ్ళిపోలేదు" కేతువు రోడ్డు ప్రక్కనున్న గోతిలోంచి లేస్తూ అన్నాడు.
కేతువు స్వరూపాన్ని చూసి అచ్యుత్ షాక్ తిన్నాడు.
మొఖమంతా వాచిపోయి, బట్టలన్నీ చినిగిపోయి, రక్తసిక్తమై ఉన్న కేతువును చూసి ఆవేశంతో వూగిపోయాడు అచ్యుత్.
ముగ్గురు నలుగురు మనుష్యులకైనా తేలిగ్గా సమాధానం చెప్పగల కేతువు ఎందుకలా అయిపోయాడు? మిగతా వాళ్ళ పరిస్థితి కూడా దాదాపు అలాగే వుంది.
అంటే.....అంటే.....వాళ్ళు సామాన్యమైన వాళ్ళు అయుండరు. ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు. ఆలోచనల్నుంచి తేరుకుంటూ "పారిపోలేదా? మనవాళ్ళు వస్తున్నారనే భయంతో వెళ్ళలేదా? మరి....? పోలీసులొస్తున్నారనా?" అచ్యుత్ ఆశ్చర్యపోతూ అడిగాడు.