"విరోధం పెంచుకోవడాన్ని నిర్ణయించేది స్థాయికాదు, మంచిచెడుల మీ మాంస"
"అదే మీకెందుకంట....? ఎవరి దారిన వాళ్ళు పోవచ్చుగా?"
"పోవచ్చు కానీ వాళ్ళు మనదారిలోకి అడ్డు తగిలారు. మనం వాళ్ళ దారికి అడ్డుపోలేదు."
ఆదిలక్ష్మికి కూతురు వాదన ఓ క్షణం దిక్కుతోచనట్లు చేసింది.
"రేపేదన్నా జరిగితే....?"
"రేపే ఎందుకు? తమ్ముడి గాయాలకు మందురాయకుండా డెట్టాల్ సీసాను ఉన్మాదంతో విసిరికొట్టినా, ట్రీట్ మెంట్ ఇప్పించకపోయినా ఈరోజే తమ్ముడికేదైనా కావచ్చు...."
"అదే....అదంతా ఎందుకు అలాంటి గొడవల్లో తలదూర్చట మెందుకు? ప్రాణం మీదకు తెచ్చుకోవడం ఎందుకు?"
"అది మామీద ప్రేమతో అంటున్నావా? వాదించడానికి బేస్ దొరక్క అంటున్నావా? నీది పాముజాతి అనిపిస్తోంది. పాము తన పిల్లల్ని తనే కొరికిపడేస్తుందట" మేఖల మాటలు పూర్తవుతుండగానే ఆదిలక్ష్మి కూతురి మీదకు చెయ్యెత్తింది.
క్షణంలో తేరుకున్న అభిరామ్ తల్లి చేతిని మధ్యలోనే ఆపుతూ "ఇదే మరొకరై ఉంటే ఇక్కడే, ఇప్పుడే సమాధి చేసుండేవాడ్ని..." అంటూ తల్లి చేతిని విసిరికొడుతూ వదిలేశాడు.
అప్పుడు.... సరిగ్గా అప్పుడు తిన్నది ఆదిలక్ష్మి నిజమైన షాక్.
అరుణాచలం కూడా డీప్ షాక్ కి లోనయ్యాడు.
ఆదిలక్ష్మి తన చేతిని కొడుకు చేతిలోంచి వెనక్కి తీసేసుకుంది. కొద్దిక్షణాల వరకు ఎవరూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు.
అభిరామ్ అలా అంటాడని మేఖల కూడా ఊహించలేదు. చివరకు తను అంత ఎమోషనల్ గా తన తల్లి మీదనే రియాక్టు అవుతానని ఆవ్వవలసి వస్తుందని అభిరామ్ కూడా ఊహించలేదు.
ఆ పరిస్థితి అందరికీ బాధాకరంగానే వుంది. కూతురు మీదే చేయి చేసుకోవలసి వస్తుందని. తను ఆవేశంలో ఆ విధంగా డ్రయివ్ అవుతానని ఆదిలక్ష్మి క్కూడా తెలియదు.
అది తప్పే.....పెళ్ళీడు కొచ్చిన కూతురి మీద, అందునా విశిష్టమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న కూతురి మీద, జీవితంలో ఏ తప్పు చేయక, ఆ జీవితంతో రాజీపడలేని తన ప్రథమ సంతానం మీద కేవలం కని, పెంచానన్న అహంతో, ఆ అధికారంతో చేయి చేసుకోబోయింది తను.....ఇప్పుడేమయింది? ఆదిలక్ష్మి చాలా బాధపడిపోయింది.
భార్యకి మరీ అలుసిచ్చి అధికారాన్ని కట్టబెట్టానా? కుటుంబ బాధ్యత వహించే తనే ఇంతవరకు కనీసం పౌరుషంగా కూడా ఒక్క మాటనలేదు. దాని మూలంగా ఇప్పుడు తమకు, తమ సంతానానికి మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడింది. ఇవన్నీ అలా వుంచితే మరో ప్రక్క గాయపడ్డామన్న అవమానంతో కసితో అచ్యుత్ రూపంలో ముంచుకు రానున్న ప్రమాదం ఏమిటి దారి? ఎలా వీళ్ళను రక్షించుకోవాలి?
ఆలోచనల్నుంచి ముందుగా తెరుకున్న్ ఆదిలక్ష్మి కూతురివేపు "నేనో నిర్ణయానికి వచ్చాను..... ప్రస్తుతానికి మీ ఆందోళనను తగ్గించే పని చేస్తాను....మన కుటుంబ సభ్యులంతా ఉండగా ఆ నిర్ణయాన్ని తెలియజేస్తానన్నావు.....అదేమిటో తెలియజేసి పుణ్యం కట్టుకో" అంది.
ఆ సమయంలోనూ తల్లి తన మొండి వాదనను విడనాడకపోవటం మేఖల అసహనానికి కారణమైంది.
"ఒక మనిషి బ్రతకటానికి ఉద్యోగం తప్ప మరో దారేలేదని అమ్మ వాదన. మీరు సరిగ్గా వినండి నాన్నగారు నువ్వు కూడా తమ్ముడు" అని ఓ క్షణం ఆగింది మేఖల.
"ఎంత పౌరుష హీనులకైనా ఒక దశ దాటితే ఆవేశం ముంచు కొస్తుంది.
నేను పౌరుషం వున్న దాన్ని.
నా అందాన్ని అడ్డంపెట్టి, నా వయస్సును ఎరగా చూపి నేను నా ఉద్యోగాన్ని నిలుపుకోవాలి ఆ ఉద్యోగం నన్ను బ్రతికిస్తుంది. ఆ ఉద్యోగం నాకు పెళ్ళి కొడుకుల్ని తెచ్చి పెడుతుంది. అంటే శారీరకంగా పవిత్రంగా వుంటూ, మానసికంగా చెడి పొమ్మంటోంది అమ్మ. ఆ పని అమ్మ వయస్సులో వుండగా చేసుంటే మీరు అమ్మను ఏలుకునేవారా నాన్నగారు? అసలేభర్తయినా మానసికంగా చెడిపోయిన భార్యతో వుండగలడా? ఉండడు. మరి రేపు నాకు పెళ్ళయితే.....నా భర్తకు నా మానసిక వ్యవహారం తెలిస్తే ఏమవుతుంది?
వీటన్నింటిని మదింపు చేసుకున్న నేను ఒక నిర్ణయానికి వచ్చాను" మేఖల తన నిర్ణయాన్ని మరోసారి తనలో తాను తరిచి చూసుకొనేందుకు ఒకింతసేపు ఆగింది.
తల్లి, తండ్రి, కూతురు, కొడుకుల మధ్య చోటుచేసుకున్న ఆలోచనల కందని అగాధం ఇప్పుడు ఆ నలుగుర్ని ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది.
ఆ పరిస్థితి అక్కడున్న నలుగురికీ ఇబ్బందిగానే వుంది. మేఖల ఏ నిర్ణయం తీసుకుందోనని ఊపిరి బిగబట్టి ముగ్గురూ ఎదురు చూస్తుండగా-
"కట్టుబట్టలతో నేనిప్పుడే, ఈ క్షణం నుంచే మీ నుంచి వేరుబడి పోతున్నాను. నా బ్రతుకు నేను బ్రతికేందుకు నాకు నచ్చిన విధంగా జీవించేందుకు ఈ ఇంట్లోంచి బయటకెళ్ళిపోతున్నాను. ఉద్యోగం లేకుండా ఒక యువతి బ్రతకలేదా? ఉద్యోగాలు చేసే ఈ ప్రపంచంలోని స్త్రీ జాతంతా బ్రతుకుతోందా?" ఆవేశంతో మేఖల ఊగిపోతూ అంది.
కూతురు నిర్ణయానికి అరుణాచలం షాక్ తిన్నాడు.
అభిరామ్ కి తన అక్క నిర్ణయం పిడుగుపాటులా అనిపించి ఉలిక్కిపడ్డాడు.
ఆదిలక్ష్మి మాత్రం పైకేవిధంగా రియాక్టుకాలేదు. తనాశించిన ఫలితమే దక్కినట్లు నిర్విరామంగా వుండిపోయింది.
"ఇక ఈ నా నిర్ణయంలో తిరుగులేదు. బయటకెళ్ళి పరువు తక్కువ పనులు చేసి మీ పరువు ప్రతిష్టల్ని మంట గలుపుతానేమోనని భయపడకండి. ఉద్యోగం కోసం పరువు తక్కువ పని చేయకూడదనే బయటకు వెళ్తున్నాను" మేఖల కంఠంలో కసి, పట్టుదల స్పష్టంగా తొంగిచూశాయి.
అరుణాచలం ఏదో అనేందుకు ధైర్యం చేయబోతుండగా ఆదిలక్ష్మి నోరు తెరిచింది.
"శెభాష్..... అదీ పౌరుషమంటే....అలాగే వెళ్ళు తల్లిదండ్రుల చాటున వుండే భద్రతా భావం విలువ తెలుస్తుంది. మా ప్రమేయం లేకుండా బ్రతగ్గలనని నిరూపిస్తే అదీ భయపడకుండా బ్రతగ్గలిగితేనే, నీ విధానమే కరెక్ట్ అని నీ ముందు నేను తలవంచుతాను. అయితే ఒక్క విషయం మరిచిపోవద్దు" కూతుర్ని కవ్విస్తూ అంది ఆదిలక్ష్మి.
అరుణాచలం, అభిరామ్ ఆమె ప్రవర్తనకు విస్తుపోయారు.
నిజంగానే అక్కను వెళ్ళిపొమ్మంటుందేమిటి? అభిరామ్ కి ఏం పాలుపోలేదు. అక్క లేకుండా తనుండలేడు. అక్కను ఉండమని నిర్భంధించే సాహసం తనకులేదు. పోనీ అమ్మకు చెబితే.... ఉహూ... లాభం లేదు. అమ్మ మాట్లాడటం ఆపవచ్చేమో కానీ ఒక నిర్ణయానికి వచ్చిన అక్క తన నిర్ణయం మార్చుకోదు. ఒక కన్నతల్లి తన కూతురు పట్ల ఇంత రాక్షసంగా వ్యవహరించగలదా? అభిరామ్ మనస్సు విలవిలలాడిపోయింది.
"ఆదిలక్ష్మీ - నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?" మాటల్ని కూడదీసుకుంటూ అన్నాడు అరుణాచలం.
ఆదిలక్ష్మి షార్ప్ గా తల తిప్పి భర్తవేపు చూసింది.
ఆయన కలవరపడ్డాడో క్షణం.
"ఆ ఒక్క విషయమేమిటో చెప్పు" పౌరుషంగా అంది మేఖల.
"ఈ ఊరులోనే విడిగా వున్నావనుకో మేం సమాజం దృష్టిలో చెడ్డగా కనిపిస్తాం నీ జీవన విధానాన్ని సులువు చేసేందుకు మా పరువు ప్రతిష్టలు నీకు ఉపయోగపడతాయి అందుకని" ఆదిలక్ష్మి చెప్పటం పూర్తి కాక ముందే అడ్డు తగిలింది మేఖల.
"అర్ధమైంది. మీకు, ఈ నగరానికి దూరంగా నేను బ్రతగ్గలగాలి. అంతేగా."
అవునన్నట్లు ఆదిలక్ష్మి తలూపింది.
"నువ్వు కూడా ఏమిటమ్మా- ఒక్కసారి ఆలోచించమ్మా" అరుణాచలం ఈసారి కూతురివేపు నుంచి ప్రయత్నించాడు రాజీ ప్రయత్నాన్ని.
తండ్రివేపు చూసి వేదాంత ధోరణిలో నవ్వింది మేఖల "మీరెందుకు నాన్నా భయపడతారు? మీ కూతురి మీద మీకా మాత్రం నమ్మకం లేదా" చిన్నగా నవ్వుతూ ప్రశ్నించింది మేఖల.
ఉన్న ఫళాన ఇంట్లోంచి వెళ్ళవలసి వస్తున్నందుకు ఏం మాత్రం భయపడకపోగా ఎంత నిర్భీతిగా తన ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చుతోంది? అరుణాచలానికి మతిపోయింది కూతుర్ని చూసి.
"సరీగ్గా చెప్పావు - మాకు చాలా దూరంగా ఫలానా వాళ్ళ కూతురి నని చెప్పుకోకుండా బ్రతగ్గలవా? ఎందుకయినా మంచిది. ఒక్కసారి ఆలోచించుకుని చెప్పు" ఆమె కంఠంలో కూతుర్ని దూరం చేసుకుంటున్నానన్న కన్నతల్లి వ్యధ ఏ మాత్రం వ్యక్తం కాలేదు. కాక పోగా శత్రువును కవ్విస్తున్నట్లుగా ఉందామె ధోరణి.