Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 9


    ఆ వైపు సెక్రటరీ ఉద్వేగంతో బిగుసుకుపోయాడు. అప్పటికే విశ్వేశ్వరయ్య ఫోన్ ని చేతిలోనికి తీసుకున్నాడు.

    "రేపు ఉదయం నుంచి మీరు మీ కాంప్లెక్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు" ప్రియాంక కాన్ఫిడెంట్ గా అంది.

    "ప్రాక్టికల్ జోకా?" విశ్వేశ్వరయ్య అనుమానంగా అడిగాడు.

    నిజానికి ఆయనకు చాలా దిగులుగా వుంది. ప్రకటన ఇచ్చి అప్పటికి రెండు వారాలైంది. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో చెబుతున్నారు కాని ఏ ఉపాయం తాను అమలు చేయదగ్గదిగా కన్పించడం లేదు. కాంప్లెక్స్ ని మూసేసుకోవాలా-? లేక వేరే వ్యాపారానికి అద్దెకిచ్చుకోవాలా? అనే ఆలోచనతో అతడి మెదడు వేడెక్కిపోయింది.

    అలాంటి టైమ్ లో ఓ యువతి ఫోన్ చేసి ఉపాయం చెబుతాను, రేపే కాంప్లెక్స్ ని ఓపెన్ చేసుకోండని నమ్మకంగా చెబుతోంది. నమ్మాలా వద్దా-? అయినా ఏ పుట్టలో ఏ పాముందో ఎలా చెప్పగలం? ఛాన్స్ ఇచ్చి చూస్తే పోలా-? ఆలోచనల నుంచి తేరుకున్న విశ్వేశ్వరయ్య "ఓ.కే." అన్నాడు ఇంకా సందేహిస్తూనే.

    రేపు ఉదయం కరెక్టుగా ఐదుగంటలకి మీ కాంప్లెక్స్ కి వస్తాం. అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా వుండండి" అంటూ ఠక్కున ఫోన్ పెట్టేసింది.


                      *    *    *    *


    "సిద్దప్ప...! రేపే అమ్మకు ఆపరేషన్. రడీగా వుండు" అన్నాడు తిమ్మడు చేతిలో వున్న కుక్కపిల్ల తల నిమురుతూ.

    సిద్దప్ప అయోమయంగా చూసాడు.

    "రెండు వేలవుద్ది... తెలుసా?" 

    "తెలుసు. ఇంకా వేరేవి కూడా తెలుసుకుంటున్నాను. రెండు వేలు కాదు రెండు లక్షలు, రెండు కోట్లు కూడా సంపాదించవచ్చు- మన బుర్రను సక్రమంగా ఉపయోగించుకుంటే-" అంటూ ఇదొందల రూపాయలు తీసి సిద్ధప్ప చేతిలో పెట్టాడు.

    వంద రూపాయల నోట్లు ఐదు. వాటిని చూస్తూనే సిద్ధప్ప షాక్ తిన్నాడు.

    జీవితంలో ఎప్పుడో ఒక వంద రూపాయల్ నోటును ఎవరో ఎవరికో ఇస్తుండగా చూశాడు. "ఐదొందలు" సిద్ధప్పకి చలిజ్వరం వచ్చినట్టుగా వుంది.

    కళ్ళు నులుముకొని, గిచ్చి చూచుకుని మళ్ళీ చూశాడు విప్పారిన నేత్రాలతో.

    సడన్ గా అనుమానం వచ్చింది సిద్ధప్పకి.

    "ఎక్కడ దొంగతనం చేశావ్?" సిద్ధప్ప నోటినుంచి బుల్లెట్ లా వచ్చిందీ ప్రశ్న.

    మెరుపుకన్నా వేగంగా లేచింది తిమ్మడి చెయ్యి- సిద్ధప్ప దవడ కదిలిపోయి బొటబొటా నెత్తురు వచ్చింది నోటెంట.

    తిమ్మడి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి.

    "లేనివాడి దగ్గర ఎప్పుడూ డబ్బు లేకుండానే పోతుందా?" సింహం పిల్లలా గర్జిస్తూ అన్నాడు తిమ్మడు.


                     *    *    *    *


    నాలుగింటికే లేచాడు తిమ్మడు. లేస్తూనే బజారుకెళ్ళి రాత్రి మాట్లాడుకున్న అటోవాడ్ని లేపి అడ్రస్ చెప్పాడు. తిమ్మడు వచ్చేసరికే హిందూ లేచి సిద్ధంగా వుంది. గతించిన రోజు సాయంత్రం కొన్న వస్తువుల్ని భద్రంగా ఆటోలోకి చేర్చాడు. ఆ పార్సెల్ కి రెండువైపులా తిమ్మడు, హిందూ కూర్చున్నారు. ఆటో డైనమిక్ కార్పొరేషన్ బిల్డింగ్ వేపు బయలుదేరింది.

    సరిగ్గా అదే సమయంలో ప్రియాంక ఎక్కిన మెర్సిడస్ కారు కూడా ఆ అడ్రస్ కే బయలుదేరింది.

    అధునాతన వాస్తుకళను సవాల్ చేసిన సమస్య- పాతిక లక్షల ఖర్చును కేవలం ఐదారు వేలతో పొదుపు చేయగల మాస్టర్ ఐడియా- ఒక అనామకుడు- అడ్రస్ లేనివాడి మెదడులో మెరిసిన ఫ్లాష్- అటు ఇంజనీర్స్ ప్రపంచంలో, ఇటు బిజినెస్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించబోతున్న ఓ సరికొత్త ఆలోచన మరికొద్ది నిమిషాల్లో ఓరూపు దిద్దుకోబోతోంది.

    అనితర సాధ్యమైన అద్భుత కట్టడాల్ని సయితం కడురమ్యంగా పటిష్టంగా, పకడ్బందీగా కట్టగల మేధావుల వర్గం, వాస్తుకళకు చెందిన అపార విజ్ఞానం చేతులెత్తేసిన చిత్రమైన పరిస్థితిలో, అదంటే ఏమిటో కూడా తెలియని ఒక నిరక్షరాస్యుడు దానికి పరిష్కారం కనుక్కోబోతున్న వేళ సభ్య ప్రపంచం గా సుషుప్తిలో వుంది.

    నిర్మానుష్యంగా వున్న హైదరాబాద్ రోడ్లపై కారు, ఆటో వేగంగా దూసుకుపోతున్నాయి. కదిలించగలిగితే చిన్న సంఘటన చాలేమో ఒక వ్యక్తిలో ఆలోచనల్ని, పంథాన్ని పూర్తిగా మార్చివేయడానికి.

    మరికొద్ది నిమిషాల్లో అబిడ్స్ సమీపిస్తారనగా సడన్ గా ప్రియాంక కారు రోడ్డుకు అడ్డంగా తిరిగి ఆటోని ఆపేసింది.

    సడన్ గా ఆగిన కారులోంచి ప్రియాంక దిగి సరాసరి ఆటో వద్దకు వచ్చింది. అప్పటికే హిందూ ఆటో దిగి ఏమిటన్నట్లు చూసింది.

    "మాట తప్పకూడదు. ఇప్పుడు నువ్వు కనుక్కోబోయే పరిష్కారం నేను చూపించినదేనని నువ్వు కూడా చెప్పాలి. ఆ అవసరం వస్తేనే..."

    ప్రియాంక మాటలకు హిందూ నిశ్శబ్దంగా నవ్వుతూ అలాగే అన్నట్లు తలూపింది.

    తిరిగి కారు, ఆటో బయలుదేరాయి.

    కరక్టుగా అయిదుగంటలకి కారు, ఆటో ఆ కాంప్లెక్స్ ముందాగాయి. ముందుగా ప్రియాంక దిగి చకచకా లోపలకు నడిచింది. అప్పటికే విశ్వేశ్వరయ్య తన స్టాఫ్ తో వచ్చి ఎదురుచూస్తున్నాడు. ప్రియాంక నేరుగా ఆయన దగ్గరకే వెళ్ళి అన్ని వివరాలు చెప్పింది.

    విశ్వేశ్వరయ్యకు ఎంతమాత్రం నమ్మకం లేదుకాని దాన్ని పైకి కనిపించనివ్వలేదు.

    ప్రియాంక స్టయిల్ గా ఆటోలో వున్న హిందూకి సైగ చేసింది.

    హిందూతోపాటు దిగిన తిమ్మడ్ని కోపంగా చూసింది ప్రియాంక. ఈ దరిద్రుడు ఇక్కడ దాపురించాడేమిటి అని చిరాకుపడింది.

    ఆటోడ్రైవర్ సహాయంతో ఐదడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు వున్న ఒక పార్శిల్ ని దింపాడు తిమ్మడు.

    అక్కడున్న ఎవరికీ ఏం జరగబోతోందో తెలియక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

    ప్రియాంక ఏం చేస్తుందని విశ్వేశ్వరయ్య...

    హిందూ ఏం చేయబోతోందని ప్రియాంక....

    తిమ్మడు ఏం చేస్తాడని హిందూ ఆసక్తిగా చూస్తున్నారు.

    పెద్ద పార్శిల్ తోపాటు మరో అట్టపెట్టె కూడా దిగింది ఆటోలోంచి.

    తిమ్మడు అప్పుడు చూశాడు ప్రియాంకవేపు. క్షణాల్లో జరిగింది గ్రహించగలిగాడు.

    క్షణాల్లో ఆ ఆలోచనల్ని పక్కకు నెట్టేసి వడివడిగా ఆ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లోకి నడిచాడు. ఇప్పుడతని ఆలోచనలన్నీ సిద్ధప్ప తల్లి చుట్టూ తిరుగుతున్నాయి. గతరాత్రే ఆమెను సిద్ధప్ప డాక్టర్ చలపతిరావు ప్రయివేటు నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు తిమ్మడు ఇచ్చిన ఐదొందలతో.

    తిమ్మడు సరాసరి లిఫ్ట్ దగ్గరకు నడిచాడు. ఓ క్షణం అక్కడాగి ఎదురుగా వున్న గోడవైపు చూశాడు. అతనికిప్పుడు సంతృప్తిగా వుంది.

    "ఏం చేయబోతున్నారు?" విశ్వేశ్వరయ్య అర్ధంకాక అడిగాడు.

    "వీళ్ళిద్దరూ నా మనుషులు- అంటే పనిమనుష్యులు, నా కూలీలు- వాళ్ళకి ఐడియా చెప్పేశాను. ఇప్పుడది వాళ్ళు అమలు చేస్తారు. వాళ్ళకి కావల్సినవి అందజేయండి" అంది ప్రియాంక పొగరుగా విశ్వేశ్వరయ్య వైపు చూస్తూ.

    హిందూ పెదాలపై ఓ క్షణం చిర్నవ్వు కదలాడింది.

    తిమ్మడు కాసేపు సర్దాగా ప్రియాంకను ఏడిపించాలనుకున్నాడు.

    "మేడమ్... మీరు చెప్పింది మర్చిపోయాను. ఏం చేయాలో మరొక్కసారి చెప్పకూడదు?" అన్నాడు అమాయకంగా ముఖంపెట్టి.

    ప్రియాంక షాక్ తింది.

    ఆమె కళ్ళలో అనుమానంతోపాటు భయం ప్రవేశించింది.

    ఒక్కక్షణం ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు. కనీసం ఆ పార్శిల్ లో ఏం వుందో కూడా తనకు తెలియదు. ప్రియాంక పళ్ళు పటపటా కొరుకుతూ హిందూవైపు చూసింది.

    హిందూకి ప్రియాంక బాగా అర్ధమయి, అభ్యర్ధనగా తిమ్మడివేపు చూసింది.

    తిమ్మడు తమాషాగా నవ్వి చటుక్కున ఫ్లోర్ మీద కూర్చుండిపోయాడు.

    ఒక పార్శిల్ విప్పదీస్తూనే "ఈ గోడకి నాలుగు మేకులు వేస్తాను. ఏమంటారు...?" అంటూ తిమ్మడు విశ్వేశ్వరయ్యవైపు చూశాడు.

    పరధ్యానంగా ఎక్కడో ఆలోచిస్తున్న ఆయన ఉలిక్కిపడి కానివ్వమన్నట్లు తలూపాడు.

    క్షణంలో తిమ్మడి చేతిలో గోడకు చిల్లులు పెట్టే బర్నర్ ప్రత్యక్షమయింది. దాన్నోసారి సరిచూసుకొని జేబులోంచి టేప్ తీసి చకచక గోడ వైశాల్యాన్ని, గోడకు, లిఫ్ట్ కు మధ్య వున్న దూరాన్ని కొలిచి మనస్సులోనే గుర్తు పెట్టుకున్నాడు.

    విశ్వేశ్వరయ్య, ఆ కాంప్లెక్స్ జనరల్ మేనేజర్, మరో ఇద్దరు సిబ్బంది, ప్రియాంక, హిందూ చేష్టలు దక్కి చూస్తుండిపోయారు. అతనేం చేయబోతున్నాడన్నది ఊహామాత్రంగా కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు.

    గోడపై టేప్ తో కొలుస్తూ ఒక్కో లైన్ లో నాలుగు గుర్తులు పెట్టాడు. ఆ లైన్ కి నిలువుగా పైకి కొలిచి రెండు గుర్తులు పెట్టాడు. అదే లైన్ కి మరోవైపు అలాగే కొలిచి గుర్తులు పెట్టాడు. నిలువుగా గీచిన రెండు లైన్ల చివరలను కలుపుతూ టేపు నుంచి పైన నాలుగు గుర్తులు పెట్టాడు.

    ఓ అడుగు వెనక్కి వేసి తను పెట్టిన గుర్తుల్ని ఓసారి సంతృప్తిగా చూసుకున్నాడు.

    బర్నర్ ని చేతుల్లోకి తీసుకుని గుర్తులు పెట్టినచోట రంధ్రాలు చేయటం ప్రారంభించాడు. పటిష్టమైన ఆ గోడని తొలచటం చాలా కష్టంగా వుంది తిమ్మడికి. బర్నర్ వెనక్కి తన్నుతోంది. అయినా అలాగే పట్టుదలగా హేండిల్ చేస్తున్నాడు.

    చెమటతో అతని బట్టలు తడిసిపోయాయి. అయినా క్షణం కూడా ఆగకుండా మెషిన్ లా పనిచేసుకుపోతున్నాడు.

    అప్పుడు సమయం ఉదయం 5-30.

    క్రమంగా చీకటి పల్చబడుతోంది. ఈరోజునుంచే కాంప్లెక్స్ తిరిగి ప్రారంభం అన్న బోర్డ్ ఓ పక్క గోడకు నిలబెట్టింది. విశ్వేశ్వరయ్య గుండెల్లో గుబులు. కోట్లు పెట్టి కట్టించాడు ఆ కాంప్లెక్స్ ని. ఇంట్లో వున్న నాగ, నట్రాతో సహా అన్నీ ఊడ్చివేయటమే కాదు, దొరికినచోటల్లా అప్పులు తెచ్చాడు. మరో నెలకి వాయిదాలు కట్టటం మొదలవ్వాలి. లేదంటే తన పరువు నడిరోడ్డు కొస్తుంది.

    వీళ్ళను నమ్ముకొని రేపే కాంప్లెక్స్ ప్రారంభం అని తెలిసినవాళ్ళందరూ ఫోన్ చేసి చెప్పుకున్నాడు.

    నూటికి నూరుశాతం మీ సమస్యను పరిష్కరించే మార్గం నా దగ్గరుందని చెప్పిన పిల్ల- మరోపిల్లను, మరో అడవి మృగంలా వున్నవాడ్ని తీసుకురావటం, గోడలకు రంధ్రాలు చేస్తూ కూర్చోవటం చూస్తుంటే విశ్వేశ్వరయ్యకు మండిపోతుంది. అయినా ఏదో పిసిరంత నమ్మకం. అందుకే ఏం అనలేక చూస్తుండి పోయాడు.

    గంటసేపు క్షణం తీరిక లేకుండా, తననుకున్న విధంగా ఆ గోడను మార్చి వేశాడు.

    ఇప్పుడా గోడమీద ఐదడుగుల వెడల్పు, మూడున్నర అడుగుల ఎత్తు వున్న అద్దం బిగించబడింది. అద్దం క్రింది భాగాన పొడవుగా ఒక అర ఏర్పాటు చేశాడు.

    తిమ్మడు చేసే పనులు చూస్తుంటే అక్కడున్న అందరికీ మతి పోతోంది. చకచక, వంచిన తల ఎత్తకుండా ఒక యజ్ఞాన్ని పూర్తిచేస్తున్న మహా ఋషిలా వున్నాడు తిమ్మడు. అతని చర్యలు అర్ధమయింది ఒక్క హిందూకే.

    తిమ్మడి తెలివితేటలు ఆమెను విస్మయానందంలో ముంచెత్తాయి.

    సరిగ్గా 9-30కి కాంప్లెక్స్ బయట రీ ఓపెన్ చేస్తున్న బోర్డ్ ప్రత్యక్షమయింది.

 Previous Page Next Page