Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 10


    లిఫ్ట్ కి కాస్త దూరంలో విశ్వేశ్వరయ్య, ప్రియాంక, హిందూ, తిమ్మడు కూర్చున్నారు.

    ఒక్కక్షణం ఒక్కో యుగంలా భారంగా గడుస్తోంది అక్కడున్న అందరికీ.

    తిమ్మడు ఒక్కడే ఎలాంటి అపనమ్మకం లేకుండా ధైర్యంగా వున్నాడు.

    కరక్టుగా 9-30కి మొదటి కస్టమర్ వచ్చింది.

    9-32కి ఇద్దరు- 9-40కి ముగ్గురు... 9-50కి పదిమంది... కస్టమర్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందరూ ఆడవాళ్ళే. డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు.

    విశ్వేశ్వరయ్య టెన్షన్ తో బిగుసుకుపోయాడు.

    ఈ ప్రయోగం సక్సెస్ అయితే కాలేజీలో తనకు ఎదురుండదు. లేదంటే ఆ మాలిని ముందు తల కొట్టుకు చావాలి. ఐడియా ఏమిటో ముందే తెలుసుకోకుండా అది సక్సెస్ అవుతుందో, లేదో ముందే ఆలోచించుకోకుండా ఛాలెంజ్ ని ఎదుర్కొనేందుకు సిద్ధపడి రావటం తన బుద్ధితక్కువ. ఇవి ప్రియాంక ఆలోచనలు. 

    చదువూ సంధ్యా లేకుండా కనిపించే ఒక మొరటువాడితో మానవ బలహీనతలతో ఆడుకునే తెలివితేటలు! అపారమైన అభినవ వాస్తు శాస్త్ర విజ్ఞానాన్నే సవాలు చేసి సంచలనం సృష్టించిన జటిలమైన సమస్య కేవలం కామన్ సెన్స్ వుపయోగించి పరిష్కరించబోతున్న నివురుకప్పి వున్న మేధావి... ఇవి హిందూ ఆలోచనలు.

    సరీగ్గా 10 గంటలయింది.

    వచ్చేవారి సంఖ్య అంతకంతకు ఎక్కువవుతోంది.

    ఆ ప్రయోగం సక్సెస్ అవుతుందా, లేదా అని ఊపిర్లు బిగబట్టి చూస్తుండగా బయటనుంచి వచ్చినవారు సరాసరి లిఫ్ట్ దగ్గరకు వెళ్ళటం లేదు. లిఫ్ట్ ఎదురుగా వున్న అద్దం ముందు నిలబడి పెదాల్ని, చెక్కిళ్ళను, కురుల్ని సరిచూసుకుంటున్నారు. ఈలోపు పైకివెళ్ళేవారు వెళుతున్నారు. వచ్చినవారు వచ్చినట్టు లిఫ్ట్ దగ్గర గుమికూడాల్సిన వాళ్ళు అద్దం ముందుకు కొంతమంది, లిఫ్ట్ దగ్గరకు కొంతమంది చీలిపోతున్నారు.

    విశ్వేశ్వరయ్య కళ్ళెదుట జరుగుతున్న ఆ పచ్చి నిజాన్ని నమ్మలేక పోతున్నాడు. అతనికిప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుంది. పాతికలక్షల ఖర్చుకి భయపడి లక్షకి ఛాలెంజ్ విసిరితే కేవలం ఐదువేలతో పరిష్కరింపబడిన అద్భుతమైన సంఘటన. ఇంకా నమ్మలేకపోతున్నాడు.

    కృతజ్ఞతగా ప్రియాంకవైపు చూశాడు.

    దాన్ని గర్వంగా రిసీవ్ చేసుకుంది ప్రియాంక. హిందూకి అది బాధ కలిగించింది. తిమ్మడి వేపు చూసింది అతని రియాక్షన్ ఏమిటన్నట్లు? అతని చూపులు ఎక్కడో వున్నాయి.


                      *    *    *    *


    అదే ఆటోలో గదికి తిరిగొచ్చారు హిందూ, తిమ్మడు.

    "రెండు వేలిస్తానన్నావ్ గా...?" తిమ్మడు హిందూను నిలదీశాడు.

    "ఇస్తాను. నువ్విక్కడే వుండు. నేను ప్రియాంక దగ్గరకెళ్ళి వస్తాను" అంటూ బయటకు నడిచింది.

    తిమ్మడి మనసంతా ఆందోళనగా వుంది. డబ్బులిస్తేనేగాని ఆపరేషన్ చేయరు. పరిష్కారం చూపించగానే డబ్బులిస్తానంది- ఇప్పుడేమో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళొస్తానంటూ అదృశ్యమైంది.

    మిగతా డబ్బులు ఈ సాయంత్రానికే తెస్తాను. అమ్మను హాస్పిటల్ లో చేర్పించు అంటే దాన్ని నమ్మి వెళ్ళాడు సిద్దప్ప. ఇప్పుడెలా...?

    తిమ్మడికి చిరాగ్గా వుంది.

    సరీగ్గా ఇదే సమయంలో ప్రియాంక బయటకు వెళుతోంది.

    "మన ఒప్పందం ప్రకారం రెండు వేలిస్తే బాగుంటుంది" అంది హిందూ.

    "రెండు వేలా? రెండు వేలేంటి...?" ఆశ్చర్యంగా కనుబొమలు ఎగురవేసింది ప్రియాంక.

    హిందూ ఉలిక్కిపడింది. ప్రియాంక వైపు అనుమానంగా చూసింది.

    "మన ఒప్పందం అప్పుడే మర్చిపోయావని నేననుకోను..." అంది స్థిరంగా హిందూ.

    "అసలు నువ్వెవరో నాకు తెలియదు. ఒప్పందం అనేది మన మధ్య ఎలా జరుగుతుంది...?" ప్రియాంక ఒక్కో అడుగే కారువేపు వేస్తూ అంది నిర్లక్ష్యంగా.

    "నాటకాలు ఆడకు దొరికిపోతావ్. మనం ముగ్గురం కల్సి ఆ కాంప్లెక్స్ కి వెళ్ళాం. దానికి విశ్వేశ్వరయ్య, వాళ్ళ సిబ్బంది, ఆటోడ్రైవర్ సాక్ష్యం. ఆటో నెంబరు AEY 424."

    ప్రియాంక పెద్దగా నవ్వింది.

    ఆ నవ్వు త్రాచుపాము బుసలు కొడుతున్నట్టుంది.

    "మీ ఇద్దరు నా కూలీలు. నేను రమ్మంటే నా వెనుక వచ్చారు. నేను చేయమన్నట్టు చేశారు. అందుకు కూలీ పడేశాను. మీరు నా కూలీలు కాదనటానికి, నేను కూలీ ఇవ్వాలేదనటానికి మీ దగ్గర సాక్ష్యం వుందా?"

    హిందూ అదిరిపడింది.

    ప్రియాంక ఇంత మోసం చేస్తుందని ఏమాత్రం ఊహించలేదు. ఇప్పుడేం చేయాలి? తిమ్మడు మొండివాడు. ఇప్పుడు తను వట్టి చేతులతో వెళ్తే ఊరుకోడు. ఎలా...?

    హిందూ అడ్డం తిరిగిన ప్రియాంక తత్వాన్నే ఆలోచిస్తున్నంతలో ప్రియాంక కారు బయటకు దూకింది.


                                                  *    *    *    *


    కాలేజీలో భారీ ఎత్తున ప్రియాంక ఫంక్షన్ ఏర్పాటు చేసింది.

    కాలేజీ అంతా ప్రియాంక తెలివితేటల గురించే గొప్పగా చెప్పుకుంటున్నారు.

    మాలిని ప్రియాంకను ప్రత్యేకంగా అభినందించింది.

    విశ్వేశ్వరయ్య దగ్గర బహుమతిగా తీసుకున్న లక్ష రూపాయల వైభవం కాలేజీ అంతటా కనిపిస్తోంది.

    అరగంటకి స్టూడెంట్స్, లెక్చరర్స్ ఆడిటోరియంలో కూర్చున్నారు.

    "కేవలం కామన్ సెన్స్ పాతికలక్షల ఖర్చును, వాస్తుకళ చేసిన తప్పును సరిదిద్దింది. ప్రియాంక అసాధారణ తెలివితేటలుగలది. మానవ బలహీనతపై సాధించిన విజయం, మానవ మనస్తత్వ పరిశీలనలో లోతైన ఆలోచనలున్న వారు మాత్రమే సాధించగలిగే విజయం ఇది.

    ఈనాటి మనిషికి కేవలం శాస్త్రీయ విజ్ఞానం ఒక్కటే వుంటే చాలదు. దాన్ని సమర్ధవంతంగా ఛానలైజ్ చేయగల సమయస్పూర్తి వుండాలి.

    శాస్త్రీయ విజ్ఞానం వుంటే ఓ అందమైన వస్తువుని తయారుచేయగలరు. దాన్ని మార్కెట్ చేయటానికి మానవ మనస్తత్వ పరిశీలన, వారి అభిరుచి, బలహీనతలు తెలియాలి. అదే స్ఫూర్తి- అదే కామన్ సెన్స్. అది ఈనాడు ప్రతి ఒక్కరికి వుండాలి" మాలిని ప్రసంగాన్ని మంత్రముగ్ధులై వింటున్నారు కొన్ని వేలమంది.

    సరిగ్గా అదే సమయానికి హిందూ తిమ్మడి ముందు సిగ్గుతో తల దించుకుంది.

    తిమ్మడి కళ్ళు నెత్తురు చిమ్ముతున్నాయి.

    "నాకు మాట తప్పటం అంటే అసహ్యం. నాకు చదువులేకపోవచ్చు. కాని సంస్కారం వుంది. డిగ్రీలు లేకపోవచ్చు. కాని ఎవరికెలా బుద్ధి చెప్పాలో తెల్సు. మోసం చేస్తే వూరుకునే వాళ్ళది మానవ జన్మేకాదు. అయినా ఇవన్నీ అనవసరం. నాకు డబ్బు కావాలి." తెగేసినట్టు చెప్పాడు తిమ్మడు.

    నిస్సహాయంగా చూసింది హిందూ. ఆమె కళ్ళ లోతుల్లో మోసపోయిన నిర్లిప్తత కనిపించింది తిమ్మడికి.

    "ఇప్పుడెలా? మరో రెండు గంటల్లో రెండువేలు డాక్టర్ కి కట్టాలి."

    "ఇంత దారుణంగా మోసం చేస్తుందనుకోలేదు."

    "మరోసారి అడుగుదామా?" ఆశగా అన్నాడు తిమ్మడు.

    "ప్రయోజనం వుండకపోవచ్చు" నిరాశగా అంది హిందూ.


                     *    *    *    *


    ఐదుగంటలవుతోంది.

    సిద్దప్ప అప్పటికి కొన్ని వందలసార్లు బయటకు వచ్చి చూశాడు. డబ్బులు తెస్తానని నమ్మకంగా చెప్పిన తిమ్మడి జాడేలేదు.

    డబ్బు లేకుండా నేను మాత్రం ఎంతమందికి చికిత్స చేయను? నేను చేసేది సంఘసేవ కాదు. ఐదుగంటలకి రెండువేలు చేతిలో పడితే మీ అమ్మ ఆపరేషన్ గదిలోకి, లేదంటే బయటకు అని ఖచ్చితంగా చెప్పేశాడు డాక్టర్.

    సిద్ధప్పకి ఇప్పుడు ఏడుపు రావటం లేదు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఇన్నాళ్ళు తను ప్రయోజకుడు కాలేదని తన తల్లి ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన కళ్ళతో చావు ఘడియల్ని లెక్కకట్టుకుంటోంది.

    కన్నబిడ్డలు ప్రయోజకులు కాకపోతే ఏమవుతుందన్న దానికి తన అసమర్ధతే రుజువు. తన తల్లినే కాపాడుకోలేని తను, ఈ సమాజానికేం చేయగలడు? ఈ దేశానికేం చేయగలడు?

    ఇప్పుడిక ఈ ఆఖరి ఘడియల్లో రిక్తహస్తాలతో తన తల్లికి చేయగలిగిందేమీ లేదు. చూస్తూ చూస్తూ తన కన్నతల్లి చావును తను చూడలేడు.

    అంతే.... ఒక నిర్ణయానికొచ్చినవాడిలా రోడ్డెక్కాడు సిద్ధప్ప.


                      *    *    *    *


    తిమ్మడు మానసికంగా బాగా దెబ్బతిన్నాడు. చదువు సంస్కారం నేర్పుతుందంటుంటే అది కోల్పోయినందుకు ఇంతకాలం బాధపడ్డాడు తను.

    చదువుకి, సంస్కారానికి సంబంధం లేదు.

    చదువుకి, తెలివితేటలకి సంబంధం లేదు.

    చదువుకి, సంపాదనకు కూడా సంబంధం లేదు.

    కాని డబ్బుకి, మానవ సంబంధాలకు, అవసరాలకు సంబంధం ఉంది.

    ఇతరుల్ని మోసం చేయటానికి అవసరం లేకపోయినా తను మోసపోకుండా వుండటానికి తెలివితేటలు కావాలి. అప్పటివరకూ- ఎటో చూస్తూ ఆలోచిస్తున్న తిమ్మడు సడన్ గా నడవటం ప్రారంభించాడు.

    చూస్తుండగానే తిమ్మడి నడకలో వేగం పెరిగింది.

    హిందూకి తిమ్మడ్ని ఫాలో అవటం కష్టంగా వుంది.

    పావుగంటకు తిమ్మడు డాక్టర్ చలపతిరావు హాస్పిటల్ ఆవరణలోకి వెళ్ళిపోయాడు.

    హాస్పిటల్ మెయిన్ గేట్ వేపే చూస్తూ రోడ్డువారగా నిల్చుంది హిందూ.

    వెళ్ళిన ఇరవై నిమిషాలకు బయటకొచ్చాడు. అతని భుజాన వేలాడుతున్న ఓ ఆడమనిషి కనిపించింది హిందూకి.

    హిందూ విస్మయంగా చూస్తూ వడివడిగా వచ్చి తిమ్మడితో కలిసింది.

    తిమ్మడు హిందూవేపు చూసినా ఏం మాట్లాడలేదు.

    తిమ్మడి భుజం మీద వేలాడుతున్న స్త్రీ మూర్తి ఆకారం నుంచి వుండి వుండి మూల్గులు వస్తున్నాయి.

    అప్పటికే కొంత అర్ధం చేసుకోగలిగింది హిందూ. ఈమె తిమ్మడికి బాగా కావల్సిన మనిషి. ప్రస్తుతం ఏదో జబ్బుతో తీసుకుంటోంది. ఆమెను రక్షించుకోవాలనే ఆ రెండువేలు అడిగుండాలి.

    హిందూకి గిల్టీగా వుంది.

    ఒక అమాయకుడు, చదువు, సంధ్యాలేని అనాగరికుడు నాగరికులమని భ్రమించేవారి చేతిలో ఓడిపోయాడు.

    తిమ్మడు సరాసరి సిద్ధప్ప గుడిసె దగ్గరకు వెళ్ళి తన భుజంమీద వేలాడే శరీరాన్ని జాగ్రత్తగా దించాడు.

    ఆ శరీరం వుండుండి ఉలికిపాటుగా కదిలిపోతోంది. తిమ్మడు నిర్లిప్తంగా ఆమెవేపే చూస్తున్నాడు.

    "ఎవరీమె! మీ అమ్మా...?" ఉండబట్టలేక అడిగింది హిందూ. తిమ్మడు ఏం మాట్లాడలేదు.

    క్రమంగా చీకట్లు ముసురుకుంటున్నాయి. ఆ పూరిపాకలో స్మశాన నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడప్పుడు చిన్న మూలుగు తప్ప, మరే మార్పు లేదు.

 Previous Page Next Page