చెమటతో ఒళ్ళంతా తడిసిపోయి, బాగా అలిసిపోయి కనిపిస్తున్నాడు తిమ్మడు. వంటిమీదున్న పాత ఫాంటు, షర్ట్ అప్పటికే నాలుగైదుసార్లు కుట్లేసి కనిపిస్తున్నాయి. చెమటతో తడిసి, ఎండి, చారికలు కట్టుకున్నాయి అవి. మౌనంగా లోపలకు వెళ్ళి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. ఒక్క గుక్కలో వాటిని తాగేసి ఇంకా అన్నట్టు చూసాడు. మరో గ్లాసు... మరో గ్లాసు... మొత్తం నీళ్ళు తాగేసి, ఓసారి గుండెలనిండా ఊపిరి తీసుకొని అక్కడే నేలమీద చతికిలబడ్డాడు.
హిందూ మౌనంగా చూస్తూండిపోయింది.
ఇంజనీర్, సైంటిస్ట్ గాఢనిద్రలో వున్నారు. బయట ప్రపంచం సుషుప్తిలో మునగదీసుకుంది. లోతైన నిశ్శబ్దం అంతటా.
ఆ ఏరియా అంతటికి ఆ గదిలోనే లైట్ వెలుగుతోంది.
ఆ వెలుగును పంచుకుంటున్న ఆ ఇద్దరిమధ్య ఓ నిమిషం నిశ్శబ్దం.
ముందుగా తిమ్మడే నోరు విప్పాడు.
"నాకు రెండు వేలు కావాలి...."
హిందూకి ఒక్కక్షణం అతనేమన్నాడో అర్ధంకాలేదు.
విస్మయంగా తిమ్మడివేపే చూస్తుండిపోయింది.
"నిన్న నువ్వు చెప్పిన బిల్డింగ్ మతలబు చెబితే ఎవరో నీకు రెండు వేలిస్తారన్నావ్ గా?" తిమ్మడు స్థిరంగా అన్నాడు.
తేరుకున్న హిందూ తిమ్మడివేపు ఆశ్చర్యంగా చూస్తూ, "అవును. దాన్ని విడదీస్తేగదా...? అదంత తేలిగ్గా పరిష్కారం చూపించగల సమస్య కాదు" అంది హిందూ నిస్పృహగా.
ఆమె వ్యక్తపర్చిన నిస్పృహలో అప్పటికే ఆమె దాని గురించి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన నిస్సహాయత కనిపిస్తోంది.
"నేను ఆ సమస్యకు సూత్రం చెబుతాను. ఆ రెండువేలు నాకిస్తావా?" అతని కంఠంలో ఆత్మవిశ్వాసం తొంగిచూసింది.
హిందూ ఉలిక్కిపడింది.
నిజానికి ఆమె నిన్నటినుంచి తిమ్మడి తెలివితేటలు గురించే ఆలోచిస్తోంది. రైల్వే పజిల్ విడదీయటాన్నే ఆమె ఇంకా నమ్మలేకపోతోంది.
అంతలో ఇదొకటి...?
తెలివితేటలకీ, చదువుకీ సంబంధం వుండక్కర్లేదా...?
ఏదో పెద్ద అవసరమే వుండి వుంటుంది.
తిమ్మడి వాలకం చూస్తుంటే నిన్నటినుంచీ తనలా అదే ఆలోచనలో వున్నట్టు అనిపిస్తోంది.
సంభ్రమంగా తిమ్మడివేపే చూస్తూ, "అలాగే. నువ్వా సమస్య నిబంధనలకు లోబడి విడదీయగలిగితే ఆ రెండువేలు నీకే ఇస్తాను. ఇవ్వట మేమిటి? ఇప్పిస్తాను."
హిందూ ఆలోచన వేరుగా వుంది. డబ్బవసరం వల్ల సరదా పడుతున్నాడు కాని, అది చెప్పడం అతని శక్తికి మించినపని...
"అయితే చెప్పు" తిరిగి అంది హిందూ.
"చెప్పటం కాదు. చేసి చూపిస్తాను."
"అదేం?....
"చెబితే ఓస్ ఇంతేనా అంటారు. పైగా నా అంచనా కరక్టో కాదో ఒక రోజు పరీక్షించి చూసుకోవాలి..." తిమ్మడి కళ్ళలో నమ్మకం, పట్టుదల కనిపిస్తున్నాయి.
"అయితే ఏం చేద్దాం...?" హిందూ తిమ్మడ్నే పరిశీలనగా చూస్తూ అంది.
"ముందుగా ఒకసారి నన్నక్కడికి తీసుకెళ్ళాలి. నేననుకొనే విధంగా వుంటే ఐదారు వేలు ఖర్చు పెట్టాలి...."
"ఐదారు వేల ఖర్చుతోటే ఆ సమస్యను పరిష్కరిస్తావా?" నమ్మలేనట్టు నీకేమన్నా పిచ్చి పట్టిందాన్నట్టు తిమ్మడ్ని చూసింది.
"మనిషిని నమ్మాలి. నమ్మి నష్టపోరులే..."
తిమ్మడి మాటల్లో నిష్టూరానికి ఒకింత కలవరపడింది హిందూ.
"ఓ.కె! మనం రేపే బయలుదేరుదాం."
ఒక నిర్ణయానికొచ్చిన హిందూ తిమ్మడి గురించే ఆలోచిస్తూ అంది.
తిమ్మడు కదల్లేదు. తన అభిప్రాయమేమిటో కూడా చెప్పలేదు. ఓ క్షణం అలాగే వుండి లేచాడు.
వెళ్తూ, వెళ్తూ తిమ్మడు చూసిన చూపులో హిందూకి ఏ భావమూ స్పురించలేదు. కాని అతని కనురెప్పల క్రింద పైకి ఉబికి వచ్చిన నీరును చూసి చకితురాలైంది.
అప్పటికే అతను గేటు దగ్గరకు వెళ్ళిపోయాడు.
చిత్రమైన మనిషి!
అసలా సమస్య అంత తేలికైనదే అయితే పేపర్ లో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాటికి చాలామంది ఈ ప్రకటనను చూసే వుంటారు. బుర్ర మోకాల్లో వుండేవారు కూడా ప్రయత్నించి బహుమతి కొట్టేయాలని చూస్తుంటారు. ఈపాటికి ఆర్కిటెక్ట్స్ దానికి పరిష్కారం కనుక్కొనే వుండవచ్చు.
ఆకాశాన్ని అంటే అంబర చుంబి సౌధాల్ని నిర్మించి, అభినవ వాస్తు కళకు కొత్త అర్ధం కల్పించిన మాన్ హట్టన్ ఇంజనీర్స్ ప్రపంచానికే గర్వకారణం. నూట ముప్పై అంతస్థుల 'ట్రంప్ టవర్స్'నే నిర్మించిన వాస్తు శిల్పులున్నారు నేడు. ఈ ప్రకటన వారికి మాత్రం ఛాలెంజ్ కాదా? తమదాకా రానిస్తారా? అయినా అది ప్రియాంక విషయం. తనది కాదు. ఆలోచిస్తూ అలాగే చాపమీద వాలిపోయింది.
* * * *
ఆ రాత్రంతా జాగారం చేస్తూనే వున్నాడు సిద్ధప్ప. ఆ పగలే గవర్నమెంటాస్పిటల్ కెళ్లాడు. సూపర్నెంట్ చలపతిరావు అనుమతి లేనిదే అక్కడ ఏదీ జరగదని తెలుసుకున్నాడు. అతని అనుమతి డబ్బుతోగాని దొరకదు. సాయంత్రం వరకు ఆశగా అలా గేటు దగ్గరే వున్నాడు సిద్ధప్ప. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా డాక్టర్ చలపతిరావు ఎపాయింట్ మెంట్ దొరకలేదు.
తన ఖర్మను, తలరాతను తలపోస్తూ డాక్టర్ ఇంటి దగ్గరకెళ్ళాడు. అక్కడా అదే జరిగింది. కనీసం గేటు ముందు కూడా నిలబడనివ్వలేదు గూర్కా, నిరాశగా ఇంటికి తిరిగొచ్చాడు.
రోజు రోజుకు తల్లి ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఆమెను బ్రతికించుకోలేని నిస్సహాయత అతన్ని నిలువెల్లా దహించివేస్తోంది.
చీకటి క్రమంగా పల్చబడుతోంది.
* * * *
నిద్రనుంచి లేచిన హిందూ ఓసారి కళ్ళు నులుముకుంది. ఇంకా నిద్రలోనే వున్నారు ఇంజనీర్, సైంటిస్ట్.
ఒక పెళ్ళికాని యువతి తను-
ఆపద వస్తే ఆదుకొనేందుకు ఆప్తులే లేని తను-
ఒంటరిగా బ్రతుకుదెరువు కోసం రోడ్డున పడిన తను ముందు తలదాచుకోవటానికి నీడకోసం వెతుకుతున్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో తారసపడ్డారు ఇంజనీర్, సైంటిస్ట్. వాళ్ళ అసలు పేర్లు వేరే వున్నా చదివిన చదువును బట్టి వారికా పేర్లు ఖాయం చేసింది.
విడివిడిగా రూమ్స్ అద్దెకు తీసుకోలేని పరిస్థితి. ఒకే రూమ్ లో ముగ్గురుంటే అద్దె తక్కువ పడుతుందని తనే ముందా ప్రపోజల్ పెట్టింది. ఇద్దరూ ముందు ఆశ్చర్యపోయారు.
నామీద నాకు నమ్మకం వుంది. మీ సంస్కారం మీద నమ్మకం వుంచుకోవాలనిపిస్తోంది. అయినా ఇప్పుడు మన ముందు నిరుద్యోగ భూతం నృత్యం చేస్తోంది. నేటి యువతను ఆశ్రయించుకొనే నిరాశా, నిస్పృహలే మనల్ని ఆశ్రయించుకున్నాయి. ఆకలే మన స్నేహం, నిరుద్యోగమే మన మధ్య బంధుత్వం. ఈ స్థితిలో మీకు నాపై వేరే ఆలోచన కలగదు. కనుక నాకే అభ్యంతరమూ లేదు- అంది. తమకు రూమ్ దొరికి అందులో చేరేవరకు నమ్మలేక పోయారు.
ఆలోచనల నుంచి తేరుకొని బయటకు వచ్చింది. పరిసరాల్ని పరికిస్తున్న హిందూ తమ గది ముందున్న అరుగుమీద ఆదమర్చి నిద్రపోతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
తిమ్మడు! చిన్నపాటి అరుగుమీద అతని శరీరం సగం వేళ్లాడుతోంది. చలింకా తగ్గలేదు. గది తలుపు లేసుకొని కూడా చలికి తట్టుకోలేక దుప్పటి పైన గోనెసంచులు వేసుకొని తాము జాగ్రత్తపడుతుంటే ఇతను? అసలు తెలియనట్టు ఈ గొట్టుచలిలో రాత్రంతా ఎలా వుండగలిగాడు?!
"హలో..." అంది గట్టిగా.
ఉలిక్కిపడి లేచాడు తిమ్మడు. హిందూ వైపు వెళదామా అన్నట్లు చూసాడు.
అలాగే అన్నట్లు తలూపుతూ లోపలకు వెళ్ళి రెండు నిమిషాల్లో తయారయి వచ్చింది.
"నువ్విక్కడే వుండు. నేను ప్రియాంకతో మాట్లాడి వస్తాను" అంటూ చకచక వెళ్ళిపోయింది.
తిమ్మడు తొలిసారిగా తన గురించి ఆలోచించుకుంటున్నాడు. ప్రపంచంలో మనిషి బ్రతకాలంటే డబ్బు కావాలి. ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి. ఇంతకాలం తను చదువుకోలేకపోవడం వల్లే డబ్బు సంపాదించలేక పోతున్నాననుకున్నాడు. అది నిజం కాదు. అలా అయితే పెద్ద పెద్ద చదువులు చదివిన హిందూ, ఇంజనీర్, సైంటిస్ట్ ఎందుకు తిండికే లేక బాధలు పడుతున్నారు?
చదువు తెలివితేటల్ని నేర్పదేమో? నేర్పితే రైలు ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్ళు.
కాని, తెలివితేటలు వున్నవాళ్ళలాగే ప్రతివాళ్ళు ఫోజు పెడతారు. ఆ ఫోజు పెట్టేవాళ్ళపై తన తెలివితేటలు వుపయోగించి డబ్బు సంపాదించవచ్చు.
బి.ఎ., ఎం.ఎ.లు చదివిన వాళ్ళే ఉద్యోగాలు లేక రోడ్లెంట తిరుగుతున్నారు. ఏ చదువు లేని తనకు ఉద్యోగం రావడం అసంభవం.
కాని డబ్బవసరం... ఎలా..."
సిద్ధప్ప తల్లికి అనారోగ్యమైతేనే తను అల్లాడిపోతున్నాడే... అదే తన తల్లికి ఏదన్నా జరిగితే?!
తిమ్మడు భయంగా లేచి కూర్చున్నాడు. ఎదురుగా కనిపిస్తున్న పంపు దగ్గరకెళ్ళి కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కుని కడుపునిండా నీళ్ళు తాగాడు.
సరిగ్గా అదే సమయంలో ప్రియాంక ఎదురుగా కూర్చునుంది హిందూ.
"మిమ్మల్ని నమ్మి ఐదువేలు ఖర్చుపెడితే, తరువాత ఐడియా ఫెయిల్యూర్ అయితే?"
"నువ్వు ఐడియా కొనుక్కొనే దానివి. ఆ అపనమ్మకం అంత మంచిది కాదు" హిందూ కాస్త కటువుగా అంది.
"ఓ.కె... ఓ.కె!" అంటూ గదిలోకి వెళ్ళి అయిదువేల రూపాయల కట్ట తెచ్చి నిర్లక్ష్యంగా విసిరేసింది.
రాబోయిన కోపాన్ని బలవంతాన అణుచుకుంది హిందూ ఆ కట్టని చేతిలోకి తీసుకుంటూ.
"నేనూ అక్కడికి వస్తాను. టైమ్ చెప్పు..." ప్రియాంకకు ఐడియా కొనుక్కుంటున్నందుకు గర్వంగా వుంది.
"రేపు సరిగ్గా ఐదుగంటలకు. ఉదయం" అంటూ లేచింది హిందూ.
ప్రియాంక వెంటనే ఫోన్ అందుకుంది. ఒక నెంబర్ డైల్ చేసింది.
ఆవైపు లైన్లోకి ఎవరో వచ్చారు.
"ప్రియాంక దిస్ సైడ్."
"ఎవరు కావాలి?"
"డైనమిక్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్ చైర్మన్ విశ్వేశ్వరయ్యగారు కావాలి" ప్రియాంక నిర్లక్ష్యంగా అడిగింది.
"మీకు ఎపాయింట్ మెంట్ వుందా...?" ఆ వేపు సెక్రటరీ అడుగుతున్నాడు.
"లేదు. కాని అవసరం ఆయనదే."
"అంటే...?"
"లక్ష రూపాయల ఖర్చుతో పాతిక లక్షల ఖర్చు తగ్గించగల ఉపాయం చెబుతాను."