Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 9


    మాటల్లో క్లీనరు పేరు రామ్ భరోసే అని తెలిసింది తనకి. పేరుకి తగినట్లు మహా అమాయకంగా వున్నాడు రామ్ భరోసే! లారీ ఎక్కబోతూ, వెనక రాసి వున్న అక్షరాలని చదివాడు తను.

    "బురీ నజర్ వాలే, తేరా మూ కాలా!"

    "దరిద్రపు దిష్టి చూపులవాడా, నీ మొహం మాడా!" అని అర్ధం.

    ఉలికిపడి, చూపులు మరలించుకుని లారీ ఎక్కాడు తను. ఉత్తమ్ సింగ్ చెడ్డానీ, రామ్ భరోసేనీ చూస్తుంటే ఇంక ఢిల్లీ దాకా తనకి కాలక్షేపానికి కొరత వుండదనిపించింది.

    దార్లో బోలెడు జోకులు చెప్పాడు ఉత్తమ్ సింగ్.

    "ఎలాగూ పేర్ల ప్రస్తావన వచ్చింది కదా, పేర్ల మీదే ఒక జోకు చెప్పనా?"

    ఆసక్తి నటించాడు తను.

    చెడ్డా చెప్పాడు-

    "నాలాంటోడే ఒక సర్దార్జీ వున్నాట్ట. అతని దగ్గర అరడజను జమాజెట్టీల్లాంటి కుక్కలున్నాయ్. వాటిని దర్జాగా పెంచేవాడు అతను.

    ఒకరోజున ఎవరో అడిగారతన్ని. ఆ కుక్కలా పేర్లు ఏమిటని?

    సర్దార్జీ సగర్వంగా చెప్పాడు. "ఇదిగో, దీని పేరు కర్నల్ సింగ్, ఇది మేజర్ సింగ్, దీని పేరు హుకుమ్ సింగ్, దీని పేరు సర్దార్ సింగ్, దీని పేరేమో దుర్లభ్ సింగ్, దీని పేరు నవాబ్ సింగ్."

    "వారెవా! కుక్కలకే ఇంత జబర్దస్తీగా వుండే పేర్లు పెట్టావే. మరి నీ పేరేమిటి?" అన్నాడు అవతలి వ్యక్తి ఆసక్తిగా.

    "నా పేరా? నా పేరు టామీ!" అన్నాడు సర్దార్జీ.

    విరగబడి నవ్వాడు తను. తన వాళ్ళ మీదే జోకులేసుకుంటున్న ఉత్తమ్ సింగ్ అంటే అభిమానం కలిగింది.

    కానీ క్లీనర్ రామ్ భరోసేకి మాత్రం జోకులు అర్ధం కావు. అతను నోరెళ్ళబెట్టి విని, "అట్లా నిజంగా జరుగుతుందా సాబ్" అన్నాడు అమాయకంగా.

    తిక్కరేగింది ఉత్తమ్ సింగ్ కి.

    "జోకు చెప్పినప్పుడల్లా అట్లా నిజంగా జరుగుతుందా అని అడిగి జోకుని చంపేశావంటే నిన్ను చంపేస్తా!" అన్నాడు ఉత్తమ్ సింగ్. లారీ హాండిల్ అందుకోబోతున్నట్లు నటిస్తూ.

    ఢిల్లీ చేరేలోగా తను ఉత్తమ్ సింగ్ కి హెల్పర్ గా పనిచేశాడు. కొంతదూరం తనే డ్రైవ్ చేశాడు కూడా.

    ఢిల్లీ చేరేసరికి తనకి బెస్టు ఫ్రెండయిపోయాడు ఉత్తమ్ సింగ్. ఢిల్లీలో అతని పూరింట్లోనే తనని కూడా వుండమన్నాడు. వదల్లేదు. మక్కన్ దీ రోటీ, సరసోం కాసాగ్, లస్సీ, గన్నేకీ రస్ వీటితో రోజూ భోజనం లగాయించెయ్యవచ్చనీ, తనకి 'నౌఖ్రీ' దొరికేదాకా అలా సర్దుకుపోవచ్చనీ చెప్పాడు.

    అతని మిత్రబంధాన్ని తప్పించుకోలేకపోయాడు తను. అతనితోబాటే వుండిపోయాడు. కానీ మనసు వుండబట్టుకోవడం మాత్రం కష్టమై పోయింది. సింగ్ ఒక్కడూ కష్టపడుతుంటే తను తిని కూర్చోవడం నచ్చలేదు. ఎంత చిన్న పని అయినా చేసి నాలుగు డబ్బులు సంపాదించి ఖర్చులు షేరు చేసుకోవాలనిపించేది.

    అందుకని, రకరకాల పనులు చేశాడు తను. బస్టాండ్ దగ్గర బరువులు మోశాడు. ఖేల్ పూరీ బండీల దగ్గర ప్లేట్లు కడిగాడు. అలా సంపాదించిన డబ్బులతో ఇంటికి కావలసినవేమైనా పట్టుకెళుతుండేవాడు సింపుల్ గా వున్న ఈ జీవితమే బాగుందన్న భావన కలిగింది.

    అలా అనుకుని తృప్తి పడుతుండగా ఒక రోజున జరిగింది అతి చిత్రమైన సంఘటన ఒకటి.

    కొద్ది కాలం క్రితం జరిగిన ఆ చిత్రమైన సంఘటనను ఎన్నిసార్లు గుర్తుకు తెచ్చుకున్నా తమాషాగానే వుంటుంది అఖిల్ కి, టెన్షన్ లో వున్నప్పుడు ఇలాంటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని నెమరు వేస్తుంటే, అదో రకమైన రిలీఫ్ గా వుంటుంది. నిజం!

    ఇప్పుడు కూడా అఖిల్ ఆ సంఘటన తాలూకు పూర్వాపరాలు గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నంలో వుండగా....

    అతని పక్కనే కూర్చుని వున్న వ్యక్తి హఠాత్తుగా లేవడంతో ఉలికిపడ్డాడు అఖిల్. ఆలోచనల్లో నుంచి బయటికి వచ్చాడు.

    అతని మొదటి రియాక్షన్ కీడుని శంకిస్తూ అన్ని వేపులా పరీక్షగా చూడడం, ఆపదలని అడ్డుకోవడానికి అలర్టుగా వుండడం అతని స్వభావంలో ఒక భాగమైపోయింది.

    ప్రమాదమేమీ పక్కనే పొంచిలేదని రూఢీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వ్యక్తివేపు చూశాడు అఖిల్.

    ఆ వ్యక్తి ఒక స్త్రీ అని ముందుగా మనసుకి ఎక్కింది.

    మరుక్షణంలోనే అర్ధం అయ్యింది అఖిల్ కి. ఆ అమ్మాయి సుధ. డాక్టర్ సుధారాణి. దుర్గేష్ కూతురు. చనిపోయిన రాధారాణి చెల్లెలు.

    తనకి తెలిసిన సమాచారం ప్రకారం తండ్రికి తగ్గ కూతురు. అగ్గి బరాటాలాంటి ఆడది. గూడుపుఠాణీలకి రారాణి. సుధారాణి.

    ఒక్క మాటలో చెప్పాలంటే ప్యూర్ డైనమైట్! డెడ్లీ డేంజరస్ ఉమన్ సుధారాణి.

    తన పక్కన కూర్చున్నది అఖిల్ అని అర్ధం అవగానే సీట్లోనుంచి లేచిన సుధ రేడు సీట్ల అవతల వున్న ఒక స్త్రీని రిక్వెస్టు చేసి ఆమె సీట్లో తను కూర్చుంది. ఆ స్త్రీ లేచి వచ్చి సుధ ఖాళీచేసిన సీట్లో కూర్చుంది. ఆవిడ ఒక ముస్లిం మహిళ. చాలా డిగ్నిఫైడ్ గా, పండు తమలపాకులా వున్న పెద్దమనిషి ఆవిడ. చాలా సంవత్సరాలపాటు జుట్టుకి రంగేసి, ఓపిక తగ్గాక ఇంక మానేసినట్లు ఆమె జుట్టు చాలా భాగం ఎర్రగా మారిపోయి వుంది. కొంత మేర వెండితీగల్లా తెల్లగా వుంది జుట్టు. నవ్వుతూ వుండే పెదిమలు. నిత్య తాంబూల సేవనం వల్ల ఎర్రబడిన నోరు, పాన్ లో వేసే కాసువల్ల కాబోలు పళ్ళు కొద్దిగా బల్లబడి వున్నాయి. క్రితం తరంలో ఉన్నత వంశాలకు చెందిన స్త్రీలు అలా తాంబూల పేవనంవల్ల పళ్ళు నల్లబడడమే ఒక అందంగా భావించేవాళ్ళు.

    ఆమె నవ్వు అత్యంత శోభాయమానంగా కనబడుతోంది.

    ఆమె పక్కనే షేర్వాణి వేసుకుని ఉన్న ఒక పెద్దమనిషి కూర్చుని వున్నాడు. చాలా సన్నగా వున్నాడాయన. ఎత్తుగా, దృఢంగా, అందంగా కనబడుతున్న ముక్కు. ఆయన దగ్గర నుంచి సన్నగా అత్తరు సువాసన. తల మీద ఫెజ్ క్యాప్.

    అర్ధమయ్యింది అఖిల్ కి.

    ఆ స్త్రీని ఈ సీట్లోకి రమ్మని చెప్పి ఆమె సీట్లోకి తను మారిందన్న మాట ఈ సుధారాణి.

    ఆ అమ్మాయికి తనంటే అంత అలర్జీనా? తనేం అంత అంటరాని వాడా?

    ఆ అమ్మాయిని చూస్తే తనకీ అంతే అసహ్యమని చంప పగిలేలా చెప్పుతో కొట్టినట్టు చెబితే బాగుండు.

    అక్కడ అఖిల్ అలా ఆలోచిస్తూ వుంటే__

    ఇక్కడ అతని తండ్రి మరిడేశ్వరరావు ఊరి బయట అంబాసిడర్ కార్లో వెడుతూ తన ఆలోచనల్లో తను మునిగిపోయి ఉన్నాడు. మరిడేశ్వరరావు పక్కనే కూర్చుని ఉన్నాడు అతని బాడీగార్డు యాది. అతని చేతిలో రైఫిల్ రెడీగా ఉంది. ముందు సీట్లో గన్ మాన్ గఫార్ కూర్చుని ఉన్నాడు. గఫార్ దగ్గర తపంచా ఉంది. డ్రయివ్ చేస్తున్న సత్యనారాయణ దగ్గర కూడా నడుముకి రివాల్వర్ వుంది.

    కారు వెనక విండోలకి నల్లటి అద్దాలున్నాయి. వెనుక సీట్లో కూర్చుని ఉన్నాడు మరిడేశ్వరరావు. అతను బయటవున్న వాళ్ళకి కనబడడంలేదు. కనబడితే అతను శతృవుల బుల్లెట్స్ కి ఈజీ టార్గెట్ అవుతాడు. అందుకే విండోస్ కి డార్క్ గ్లాసెస్.

    శతృవుల బారినుంచి తనని తాను రక్షించుకోవడానికి అనేకమైన జాగ్రత్తలు తీసుకుంటాడు మరిడేశ్వరరావు. బాస్ ణి నీడలా అంటిపెట్టుకుని ఉంటాడు యాది. బాస్ ఫైవ్ స్టార్ హోటల్లో డిన్నర్ తీసుకుంటే యాది కూడా అదే ఫైవ్ స్టార్ హోటల్లోనే డిన్నరు తీసుకుంటాడు. బాస్ ఫ్లయిట్ లో ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో వెడితే యాది కూడా ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోనే వెళతాడు. బాస్ టాయ్ లెట్ కి వెళితే యాది గుమ్మం దగ్గరే కాపు ఉంటాడు.

    పోనుపోను తను ఒకడు కాదేమో తను ఇద్దరేమో అన్న భ్రమ కలగడం మొదలుపెట్టింది మరిడేశ్వరరావుకి.

    మరిడేశ్వరరావు మూవ్ మెంట్స్ అతి సీక్రెట్ గా ఉంటాయి. తను ఫలాని టైంలో ఫలాని చోట వుంటానని ముందుగా ఎవ్వరికీ తెలియనివ్వడు అతను. తెలిస్తే అతని మీద బాంబులు వేసి చంపడానికి అనేకమంది సిద్ధంగా వుంటారు.

    మరిడేశ్వరరావుకి పత్రికలు చదివే అలవాటు లేదు. అతనికి చదువు రాదు.

    పత్రికలు చదివే అలవాటే కనుక ఉండి ఉంటే అతనికి ఒక విషయం తెలిసి వుండేది.

    పాలస్తీనా విమోచనోద్యమంలో ఇజ్రాయిల్ తో తలపడి టెర్రరిస్టు టాక్టిక్ట్స్ తో సహా అన్ని పద్ధతుల్లోనూ పోరాటం సాగించే సంస్థ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పి.ఎల్.ఓ) దానికి మొదటినుంచి మూలస్తంభం లాంటివాడు యాసర్ అరాఫత్. యాసర్ అరాఫత్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ తర్వాత ఉద్యమానికి అంకితమైపోయాడు. ఇజ్రాయిల్ దేశానికి పక్కలో బల్లెమైపోయాడు. తన ప్రజల కోసం గెరిల్లా యుద్ధాలు చేయడంతోనే అతనికి అరవై ఏళ్ళు వచ్చేశాయి. సెక్యూరిటీ కారణాలవల్ల అతను ఇవాళ తిన్న చోట రేపు తినడు. ఇవాళ పడుకున్నచోట రేపు పడుకోడు. అతని కదలికలూ, కార్యక్రమాలు అన్నీ చివరిక్షణందాకా అత్యంత గోప్యంగా వుంచబడతాయి. అనుక్షణం అతని అంగరక్షకులైన కమెండోలు అతన్ని అంటిపెట్టుకుని కాపలా కాస్తుంటారు.

    ఇవన్నీ ఒకప్పటి పేపరు వార్తలు.

    కానీ ఇప్పుడవి ఇండియాలో మరిడేశ్వరరావుతో సహా అనేకమందికి అనుభవంలోకి వస్తున్న నిత్య సత్యాలు.

    యాసర్ అరాఫత్ ఒక ఉద్యమానికి వెనుక వున్న శక్తి. తన ప్రజలకు ప్రియతమ నాయకుడు. అతను సురక్షితంగా ఉండడం అతని ప్రజలకు ముఖ్యం.

 Previous Page Next Page