Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 10


    కానీ మరిడేశ్వరరావు కేవలం ఒక రౌడీ షీటర్. గ్యాంగు లీడరు. అతను బతికి ఉండడం దేశానికి నష్టం. అయితే అతను బతికి వుండడం అతనికీ, అతని గ్యాంగుకి మాత్రం చాలా ముఖ్యం.

    దేశాధినేతతో పోలిస్తే మరిడేశ్వరరావు అల్పమైన విషక్రిమిలాంటివాడు కావచ్చు. కానీ తన ప్రాణాన్ని తను కాపాడుకోవడంలో అతను తీసుకునే జాగ్రత్తలు ప్రపంచంలో ఏ దేశ నాయకుడు తీసుకునే జాగ్రత్తలకి తీసిపోవు.

    విండోలో నుంచి అలర్టుగా బయటికి చూస్తున్నాడు మరిడేశ్వరరావు.

    వెనుకగా ఒక తెల్లటి మారుతీ 1000 కారు వస్తోంది. తదేకంగా దానివైపు చూశాడు. మారుతీ వెనుకగా ఒక నల్ల అంబాసిడర్, దాని వెనుక ఒక జెయింట్ సైజు క్రేను. దాని వెనుక ఇంకొన్ని కార్లు.

    మరిడేశ్వరరావు కారుకి ముందుగా ఒక రోడ్డు రోలరు నెమ్మదిగా దొర్లి వెళ్తోంది.

    హఠాత్తుగా అన్నాడు మరిడేశ్వరరావు.

    "సత్యనారాయణ్ కారాపు!"

    సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్.

    ఒక్క కుదుపుతో ఆగింది మరిడేశ్వరరావు అంబాసిడర్.

    ముందు వెళ్తున్న రోడ్డురోలరు కూడా సంకేతం అందుకున్నట్లు రోడ్డుకి అడ్డంగా ఆగింది. మారుతీ 1000 వెనకగా వస్తున్న కార్లు రెండు ముందుకి ఉరికి మారుతికి అటూ ఇటూ పక్కగా ఆగాయి. మారుతి వెనక వున్న జెయింట్ సైజ్ క్రేన్ కూడా ఆగింది.

    ఇలా అన్నివైపులా అన్ని వెహికల్స్ ఆగేసరికి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నట్లయి మారుతి 1000 కూడా ఆగింది. అష్ట దిగ్భంధనంలో చిక్కుకున్నట్లు ఉంది ఆ కారు.

    ఆ మారుతి కారుని అలా ట్రాప్ చేసిన ఆ వెహికిల్స్ అన్నీ మరిడేశ్వరరావువే.

    తాము అలా ట్రాప్ అయిపోయామని గ్రహించలేదు మారుతికార్లో వున్నవాళ్ళు. చిత్రమైన ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నామని మాత్రమే అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఉండి జరగబోతున్న ఘోరాన్ని పసిగట్టలేకపోయారు. ఆ కారు డ్రైవింగ్ సీట్లో స్మార్ట్ గా వున్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని పక్కనే చాలా అందంగా ఉన్న అతని భార్య వాళ్ళిద్దరి మధ్య ముద్దులు మూటగట్టే చిన్న పాప.

    ఎదుటి కారులోకి తల బయటికి పెట్టి చూస్తున్న మరిడేశ్వరరావు కనబడ్డాడు ఆ దంపతులకి.

    కానీ అతనే తమపాలిట యమదూత అని వాళ్ళకి తెలీదు. తెలిసే అవకాశం కూడా లేదు. అతన్ని అంతకుముందు వాళ్లెప్పుడూ చూసి ఉండలేదు. అతనికి వాళ్ళెప్పుడూ ఏ విధమైన అపకారం చేసి ఉండలేదు. అసలు అతనెవరో కూడా వాళ్ళకి తెలియదు.

    అలాంటి వ్యక్తి తమకి అంతటి దారుణమైన హాని చేస్తాడని వాళ్లెలా అనుకుంటారు? వాళ్ళకి రౌడీరాజ్యపు రాక్షసన్యాయం గురించి తెలియదు. రౌడీలు రక్తపాతం చెయ్యడానికి, పాశవికంగా ప్రవర్తించడానికి, వ్యక్తి గతమైన కక్షలూ, కార్పణ్యాలే ఉండనక్కరలేదు.

    కిరాయి తీసుకుని కిరాతకంగా ప్రవర్తించగలరు వాళ్ళు. కాసు చూపిస్తే కరుణ, కార్పణ్యం మరిచిపోగలరు.

    కార్లో కూర్చున్న యువకుడు బాగా చదువుకున్నవాడు. చిన్నప్పుడు కళ్ళు పేలేలా చదివాడు. కష్టపడి పైకొచ్చాడు. అమెరికా వెళ్ళాడు. అడిషనల్ డిగ్రీలు, అవసరమైన డబ్బు సంపాదించాడు. "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ" అని చిన్నప్పుడు మాస్టారు నేర్పించిన సూక్తిని మర్చిపోకుండా మాతృభూమి మీద మమకారంతో తనకు చేతనయిన సేవ చేయాలన్న భావంతో పదిమందికి పనికొచ్చే పెద్ద ఫ్యాక్టరీ ఒకటి పెట్టడానికి నిశ్చయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అప్పటికే ఫీల్డులో వున్న బిజినెస్ మెన్ ఇతని ఉత్సాహం చూసి అదిరిపోయారు. అతని అంతం చూస్తేగానీ తమకి భవిష్యత్తు లేదనుకున్నారు. బృహత్ ప్రణాళిక వేసి మరిడేశ్వరరావుని అప్రోచ్ అయ్యారు. పెద్ద సంఖ్య దగ్గర బేరం సెటిల్ అయ్యింది.

    ఇదంతా ఆ యువకుడు మహేంద్రకి, అతని భార్య మానసకి తెలియదు. మానస హాబీ మహిళాభ్యుదయం కోసం పాటుపడటం హాబీ కాదు అది. ఆమె జీవితమే అనొచ్చు.

    మహేంద్ర కళ్ళు చిట్లించి విసుగ్గా ముందుకు చూసి హారన్ మోగించాడు.

    కార్లో నుంచి కిందకి దిగాడు మరిడేశ్వరరావు. మారుతి కారు దగ్గరికి వచ్చి తల విండో దగ్గర పెట్టాడు.

    అది చూసి అలర్టుగా అయిపోయాడు మహేంద్ర.

    "ఏమిటి?" అన్నాడు.

    మహేంద్ర పక్కన కూర్చున్న పాప సీట్లోనే లేచి నిలబడి రబ్బరు మిక్సీమౌస్ బొమ్మని నవ్వుతూ మరిడేశ్వరరావు మొహానికి తాకించింది స్నేహంగా.

    "నీ పేరేమిటి?" అన్నాడు మరిడేశ్వరరావు మహేంద్రతో.

    "మహేంద్ర" అన్నాడు యువకుడు, అని అనుమానంగా_

    "ఎందుకు?" అన్నాడు.

    సమాధానంగా చటుక్కున రివాల్వర్ తీసి మహేంద్ర కనుబొమ్మల మధ్య ఆనించి ట్రిగ్గర్ నొక్కాడు మరిడేశ్వరరావు.

    ఆ ప్రేలుడుతోపాటు పెనుకేక పెట్టింది మానస.

    పాప పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది.

    అటు తిరిగి వచ్చాడు మరిడేశ్వరరావు.ఫ్రంట్ డోర్ తీసి మానసని బలవంతంగా బయటకు లాగాడు.

    లాగుతూనే వెనుక డోర్ తెరిచి ఆమెని బ్యాక్ సీట్ మీదకి తోశాడు. తను కూడా లోపలికి వచ్చేశాడు. బ్యాక్ సీట్ మీదకి ఒరిగి ఆమెని ఆక్రమించుకోబోయాడు.

    ఆక్రందిస్తూ అతనికి అందకుండా ఉండటానికి విశ్వప్రయత్నం చేస్తోంది మానస. గింజుకుంటోంది. అటూ ఇటూ దొర్లుతోంది. చేతులతో నెట్టేస్తోంది.

    చిరాగ్గా తామరతూడుల్లాంటి ఆమె చేతుల్ని అందుకున్నాడు మరిడేశ్వరరావు. మరుక్షణం ఎముకలు విరిగిన చప్పుడు. ఆమె చేతులు కీళ్ళే లేనట్టు వెనక్కి వంగిపోయాయి. ఆమెకి దుర్భరమైన బాధవల్ల స్పృహ తప్పింది.

    అప్పుడు నింపాదిగా ఆమెని ఆక్రమించుకున్నాడు మరిడేశ్వరరావు.

    ఆ పావుగంటసేపూ ముందు సీట్లోని పాప గుక్కపెట్టి ఏడుస్తూనే వుంది.

    తన పని పూర్తి అయ్యాక లేచి బట్టలు సరిచేసుకున్నాడు మరిడేశ్వరరావు.

    కారు దిగి సైగ చేశాడు. వెంటనే జెయింట్ క్రేన్ లో కదలిక వచ్చింది. కిందకి వంగింది క్రేన్. దానికి వున్న హుక్ కారుని బలంగా పట్టుకుంది.

    పట్టుకోగానే కారుని విసురుగా గాల్లోకి ఎత్తేసింది క్రేన్.

    గాల్లో అటూ యిటూ ఊగుతోంది కారు.

    అక్కడ రోడ్డుకి ఒక పక్కగా బాగా పల్లంగా వుంది.

    క్రేన్ కారుని పూర్తిగా పైకి ఎత్తేసింది. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉంది కారు.

    అప్పుడు__

    హఠాత్తుగా కారుని వదిలేసింది క్రేన్.

    కారు పల్లంలో పడిపోయింది. దారుణమైన ఇంపాక్ట్. పెద్ద శబ్దం. కారు నేలని తాకగానే ఆ తాకిడికి కారు ఫ్రంట్ డోర్ వూడిపోయి విష్ణు చక్రంలా గిర్రున తిరుగుతూ గాల్లోకి ఎగిరింది.

    ఆ తలుపుని పట్టుకుని ఉన్న పాప కూడా గాల్లోకి ఎగిరింది. నాలుగయిదు క్షణాల తరువాత అంత ఎత్తుమీద నుంచి కిందపడటం మొదలుపెట్టింది పాప.

    తనకు తెలియకుండానే ఊపిరి బిగపట్టి పాపవేపు చూస్తున్నాడు గన్ మాన్ గఫార్. అప్రయత్నంగానే అతను కదలబోయాడు పాపను అందుకోవడానికి.

    అంతలోనే అక్కడికి చేరుకున్నాడు ఒక అజ్ఞాత వ్యక్తి. ఒడుపుగా వంగి పాపను పడకుండా గాల్లోనే పట్టేసుకున్నాడు.

    ఒక్కసారిగా దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు గన్ మాన్ గఫార్.

    కళ్ళు చిన్నవిగా చేసి గఫార్ వేపు చూస్తున్నాడు మరిడేశ్వరరావు.

    "ఏమిటి?" అన్నాడు మరిడేశ్వరరావు.

    "పాపని చూస్తున్నా! బతికి బయటపడింది."

    "ఇంకేం చూడలేదా?" అన్నాడు మరిడేశ్వరరావు కఠినంగా.

    గుటకలు మింగాడు గఫార్.

    "యాదీ నువ్వేం చూసినావ్ రా?" అన్నాడు మరిడేశ్వరరావు.

    నములుతున్న పాన్ ఉమ్మేసి అన్నాడు యాది.

    "పాపని పట్టుకున్న ఆ మనిషి హిందూరావు."

    "హిందూరావు" అన్న పేరు వినగానే ఉలిక్కిపడ్డాడు గఫార్. ఆ వ్యక్తివేపు చూశాడు.

    హిందూరావు మనిషి కొద్దిగా మారాడు.

    అయినా పరీక్షగా చూస్తే అతనే అని తెలుస్తోంది.

    పాప ప్రాణం వుంటుందా పోతుందా అన్న టెన్షన్ తో తను పాపనే చూశాడుగానీ హిందూరావు మొహం చూడలేదు.

    పెద్ద తప్పయిపోయింది.

    మరిడేశ్వరరావు మొరటుగా అన్నాడు.

    "అంటే నా ప్రాణంకంటే నీకు ఆ పాప ప్రాణాలు ముఖ్యమైపోయాయట్రా"

    బాస్ మాటలు వినగానే గఫార్ మొహానికి చెమటలు పట్టాయి. అంత భయంలోనూ అతనికి హిందూరావు ఎవరో గుర్తుకు వచ్చింది.

    హిందూరావు మహారాష్ట్రియన్. ఇదివరకు తమ వూళ్ళోనే వుండేవాడు. అప్పట్లో సాయిబాబా మందిరంలో ఇతను పూజారి. హిందూరావు ప్రోద్భలం మీదే రాధారాణి, రాజు పెళ్ళి చేసుకున్నారనీ, ముందుగానే దేవుడి దగ్గర పూలదండలు మార్చుకుని ఆ తర్వాత రిజిష్ట్రార్ సమక్షంలో సివిల్ మ్యారేజ్ చేసుకున్నారనీ తమ గ్యాంగుకి తెలిసింది. 

 Previous Page Next Page