Previous Page Next Page 
రౌడీరాజ్యం పేజి 8


    చదవడం ఒకచోట సెటిలయినట్లుంది.

    ప్రతి నిమిషానికీ ఒక పేజీ తిప్పుతున్న శబ్దం!

    అర్దరాత్రి పన్నెండు దాటాక_

    పేజీలు తిప్పుతున్న సవ్వడి వినిపించడం మానేసింది.

    గదిలో లైటు మాత్రం ఆరిపోలేదు.

    ఏం చేస్తోంది డాక్టర్ సుధ?

    చదువుతూనే నిద్రలోకి జారిపోయిందా?

    నెమ్మదిగా కదిలాడు తను.

    బాత్ రూంలో నుంచి డాక్టర్ సుధ బెడ్ రూంలోకి వచ్చాడు.

    ఇటే మొహం పెట్టి పడుకుని ఉంది సుధ.

    సీరియస్ గా ఉండటం ఆమెకి పుట్టుకతోనే వచ్చిన స్వభావమేమో, నిద్రలో కూడా నుదురు చిట్లించినట్లే వుంది ముఖ కవళిక!

    నడుం మీద చేతులు పెట్టుకుని నిల్చున్నాడు తను. పరిశీలనగా చూశాడు ఆమె వేపు.

    ఆ అమ్మాయి చాలా పొగరుబోతని తను విన్నాడు. ఆమె పొగరుకి పొలిమేరల్లా వున్నాయి ఆమె ఒంపులు. నిద్రలో ఆమె చీరె కుడికాలి మీద మోకాలి దాకా లేచిపోయి వుంది. కప్పుకున్న దుప్పటి తొలగిపోయి వుంది.

    ఒక్కక్షణం సంకోచించాడు తను.

    తర్వాత ఒక నిశ్చయానికి వచ్చి ముందుకు వంగాడు.

    చెయ్యి ఆమె వేపు చాచాడు.

    నెమ్మదిగా ప్రక్కకు పోయిన దుప్పటిని సరిగ్గా కప్పాడు.

    మరుక్షణం వెనుదిరిగి వేగంగా స్టోర్ రూంలోకి వచ్చేశాడు. బాల్కనీ మీదికి వాలినట్లున్న ఒక చెట్టుకొమ్మని అందుకుని, లాఘవంగా చెట్టు మీదకి వెళ్ళిపోయి, అక్కడ నుంచి దిగడం మొదలెట్టాడు. పాదాలు నేలను తాకగానే, ఏదో చిట్లినట్లు శబ్దం! బహుశా ఏ ఫ్లవర్ వాజ్ తాలూకు ముక్కనో, లేకపోతే కుండ పెంకో అయివుండాలి.

    చీమ చిటుక్కుమంటే చాలు, చిరతలా మీద పడటానికి అక్కడే రెడీగా వుంది ఒక డాబర్ మాన్ కుక్క! ఉరుకుతూ మీదికి వచ్చింది. దాదాపు తోకే లేనట్లు వుంటుంది ఆ జాతి. పెద్ద జింక అంత ఎత్తుగా వుంది అది.

    భీతిగొలిపేలా ఉన్న దాని అరుపులతోబాటు....

    ఒక ఆడపిల్ల ఆర్తనాదం! బహుశా సుధే అయివుండాలి. ఆ వెంటనే మనుషుల కేకలు.

    "కొట్టండి! నరకండి! చంపండి! గొడ్డలేదీ?"

    ప్రాణాలరచేతిలో పెట్టుకుని ప్రహరీగోడ వేపు పరుగెత్తాడు తను.

    తన వెనుక తరుముకొస్తున్న మనుషులు....

    వాళ్ళ కేకల్లో రక్తపిపాస....

    తను గోడ ఎక్కేశాడు.

    అంతలోనే....

    వెనుక నుంచి చావు కేక వినబడింది.

    చటుక్కున ఆగిపోయాడు తను. వెనుదిరిగి చూశాడు.

    రక్తపు మడుగులో ప్రాణం కోసం పెనుగులాడుతున్నాడు ఒకడు.

    తనను చంపుతున్నాననుకొని తమలో ఒకడ్ని చంపేసినట్లున్నారు వాళ్ళు.

    ఫాటల్ మిస్టేక్! పూర్ సోల్! ప్రాణాంతకమైన పొరబాటుకి బలైపోయాడు.

    అయినా ఈ రౌడీ రాజ్యంలో ప్రాణానికి, రక్తానికీ విలువేమిటి?

    చెప్పలేనంత విరక్తి కలిగింది తనకి. వ్యధతో నిండిపోయింది మనసు.

    సరిగ్గా అదే క్షణంలో జ్ఞానోదయం కూడా అయ్యింది తనకి.

    తను గ్యాంగ్ స్టర్ కాడు.

    కాలేడు. నెవర్ ....

    అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా! నెవర్ నెవర్ నెవర్!

    గ్యాంగ్ స్టర్స్ మధ్య తను ఉండలేడు కూడా.

    తన మాట వేరు. తన బాట వేరు.

    ఈ కాకుల్లో హంసలాంటి వాడు తను.

    అలా కాదనుకుంటే....

    ఈ హంసల మధ్య తనే కాకిలాంటి వాడేమో!

    నెత్తుటి కూడు తిని హరాయించుకోలేని అసమర్ధుడు! అర్భకుడు.... అప్రయోజకుడు తను.

    తనకు తన తండ్రి ఇచ్చినవే ఈ బిరుదులన్నీ.

    బహుశా ఆ బిరుదులూ తనకి తగినవేమో కూడా.

    మొత్తానికి తను చాలా డిఫరెంట్. అదొక్కటి మాత్రం తెలుసు తనకి.

    తనకి రౌడీయిజం అక్కర్లేదు. చదువు కావాలి. విజ్ఞానం కావాలి. వేదాంతం కావాలి.

    క్షణంలో సగంలో ఒక దృడ నిర్ణయానికొచ్చేసింది తన మనసు.

    ఇంక లాభం లేదు. ఈ రక్తపిశాచాలకి దూరంగా వెళ్ళిపోవాలి.... ఇప్పుడే....ఇట్నుంచే....

    తండ్రి మొహం ఇంక చూడలేడు తను.

    తన మొహం చూడటానికి తండ్రి కూడా ఇష్టపడడు.

    దుర్గేష్ కూతుర్ని చెడగొట్టకుండా తిరిగి వెళితే బహుశా తండ్రి తనను యింట్లోకి రానివ్వకపోవచ్చు కూడా.

    ఓ.కే! తనకి కావలసిందీ అదే.

    ఇంక ఇంటికి వెళ్ళే ప్రసక్తి లేదు.

    ఇటు నుంచీ ఇటే ఎక్కడికన్నా వెళ్ళిపోతాడు తను.

    అప్పుడు కనబడింది ఒక లారీ. అదే రోడ్డు మీద అతి వేగంగా దూసుకొస్తోంది.

    కన్ను మూసి తెరిచేలోగా తను ఉన్న చోటికి వచ్చేసింది లారీ.

    ఆలోచించకుండా దాని మీదికి దూకేశాడు తను.

    బాలన్స్ తప్పి బోర్లాపడ్డాడు.

    లారీ దూసుకుపోతూనే ఉంది అతి వేగంగా.

    క్షణాల్లో అర్ధమయ్యింది తనకి.

    ఆ లారీకి బ్రేకులు ఫెయిలయినట్లున్నాయి. వెర్రెత్తినట్లు పరిగెడుతోంది.

    చటుక్కున కేబిన్ మీదికెక్కేశాడు తను. ఒంగి డ్రైవర్ సీట్లోకి చూశాడు.

    డ్రైవింగ్ సీట్లో ఇక సర్దార్జీ కూర్చుని ఉన్నాడు. ఆందోళన కనబడుతోంది అతని మొహంలో.

    అతని ప్రక్కన కూచుని ఉన్న క్లీనరు కేకలు పెడుతున్నాడు.

    "ఆ కాంపౌండ్ వాల్ కి గుద్దెయ్! ఆగిపోతుంది" అని అరుస్తున్నాడు క్లీనరు.

    స్టీరింగ్ గబగబా ఎడం వేపుకి తిప్పబోయాడు సర్దార్జీ.

    క్షణంలో సగంలో పరిస్థితి ఆకళింపు అయ్యింది తనకి.

    ఆ కాంపౌండ్ వాల్ ని ఆనుకునే ఒక హైటెన్షన్ ఎలక్ట్రిక్ లైన్ తాలూకు పోల్ వుంది. లారీ గుద్దుకుని ఆ పోల్ గనక కూలిపోతే, తమతోబాటు, అక్కడున్న అనేకమందికి కూడా ఆపద తప్పదు!

    అందుకని పెద్దగా అరిచాడు తను.

    "భాయ్! ఇక్కడొద్దు! ఇంకో వంద గజాలుపోయి రైట్ కి తిరిగితే అక్కడ ఇసక కుప్పలు పోసి ఉంటాయి. దాన్లోకి పోనియ్!"

    పై నుంచి మాట్లాడుతున్నదెవరని ఆశ్చర్యపడే వ్యవధి కూడా లేదు సర్దార్జీకి. తను చెప్పినట్లే వంద గజాలు ముందుకు పోనిచ్చి, స్టీరింగ్ ని శక్తి కొద్దీ గిరగిరా కుడివేపుకి తిప్పాడు. అక్కడొక కన్ స్ట్రక్షన్ సైటు ఉంది. దాని ముందు ఇసక కుప్పలు వున్నాయి. ఇసకలోకి వెళ్ళిపోయింది లారీ. టైర్లు ఇసకలో కూరుకుని నెమ్మదిగా ఆగిపోయింది.

    ముగ్గురూ కిందికి దిగారు.

    బ్రేకులు సరిచేశాడు సర్దార్జీ. తర్వాత అఖిల్ వేపు మెచ్చుకోలుగా చూశాడు.

    "వాహె గురూ! నానక్ జీ నీ ద్వారా మమ్మల్ని రక్షించాడు ఇవాళ!" అని, అప్పుడే గుర్తొచ్చినట్లు మళ్ళీ అన్నాడు. "ఒరె భలె భలె భలే! నా లారీలో నువ్వెప్పుడెక్కావ్?"

    "బ్రేకు ఫెయిలవడానికి ముందు ఒకచోట నువ్వు స్లో చేశావే, అక్కడెక్కా!" అన్నాడు తను, పల్చటి అబద్ధం ఒకటి ఆడేస్తూ.

    నుదురు చిట్లించి ఆలోచించి, తల ఎగరేశాడు సర్దార్జీ.

    "ఎందుకూ?"

    "నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాలి!"

    అప్పటికే లారీ తాలూకు నెంబర్ ప్లేట్ చూశాడు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ "ఆల్ ఇండియా పర్మిట్!" అని రాసి వుంది బాడీ మీద. సర్దార్జీ తరచుగా హైదరాబాద్ వస్తూ ఉంటాడు లాగుంది. శుభ్రంగా మాట్లాడుతున్నాడు తెలుగు. తమాషా ఏమిటంటే, సిక్కులు గనుక తెలుగు నేర్చుకుంటే చాలా స్వచ్చంగా మాట్లాడతారు. మిగతా రాష్ట్రాల వాళ్ళు తెలుగు మాట్లాడితే వినబడే యాస వాళ్ళకి ఉండదు.

    తనవేపు ఎగాదిగా చూశాడు సర్దార్జీ.

    "పాసింజర్ ని ఎక్కించుకుంటే చెక్ పోస్టుల దగ్గరా, అక్కడా ఇబ్బంది అవుతుంది. అయినా సరే, నీ కోసం ఏమన్నా చేసి తీరాల్సిందే! ఎక్కు" అన్నాడు.

    కేబిన్ లో ఎక్కి క్లీనర్ పక్కన కూర్చున్నాడు తను.

    "నా పేరు ఉత్తమ్ సింగ్ చెడ్డా!" అన్నాడు సర్దార్జీ.

    ఉత్తమ్ సింగ్ చెడ్డా! చిత్రంగా అనిపించింది పేరు.

    "మరి నీ పేరు?" అన్నాడు ఉత్తమ్ సింగ్.

    ఒక్కక్షణం ఆలోచించి "గౌతమ్!" అన్నాడు తను.

    "పూర్తి పేరు?"

    "గౌతమే! ఉత్త గౌతమ్! అంతే!"

    "రావూ, రెడ్డీ, శర్మా, చౌదరీ?"

    "అవేం లేవు."

    "వాహె గురూ!" అన్నాడు ఉత్తమ్ సింగ్ చెడ్డా మెచ్చుకోలుగా, "పేరంటే అట్లా వుండాలి. మా వాహె గురూ నానక్ జీ కూడా కులాలూ అవీ వుండకూడదనే అందరినీ 'సింగ్' అని పెట్టుకోమన్నారు. కానీ మనిషికి కుల గుల ఎక్కడ పోతుందీ? కొన్నాళ్ళు పోగానే మళ్ళీ సింగ్ కి తోకలాగా కులం పేరో, కనీసం ఊరి పేరో తగిలించుకోవడం మొదలెట్టాం. గురు చరణ్ సింగ్ ఆహ్లూవాలియా, తేజ్ సింగ్ రణధావా, ప్రకాష్ సింగ్, బాదల్ అట్లా అట్లా....ఎంతమంది గురువులు పుట్టి ఎంత మంచి బోధించినా కూడా మనిషి మారతాడా....సరే! సత్ శ్రీ అకాల్! ఎక్కు! వెళ్దాం!"

 Previous Page Next Page