Previous Page Next Page 
వేగు చుక్క పేజి 9


    "ఫకర్!" అని పిలిచాడు పెద్దగా. "రేయ్ ఫకర్!" ఆ పేరు పిలుస్తున్నప్పుడు అతని పెదిమలు అప్రయత్నంగా అరవిచ్చుకున్నాయి చిరునవ్వుతో.

    వెంటనే ఆ ఫకర్ అనే మనిషి ప్రత్యక్షమయ్యాడు. మహాచిత్రంగా వున్నడతను. సరిగ్గా నాలుగే అడుగుల ఎత్తు, నల్లటి నలుపు, పొట్టి ఉంగరాల జుట్టు.

    అతను ఆ షిప్పుకి మూడో వంటవాడు.

    'ఫజక్' అంటే ఉర్దూలో "పౌరుషం గలవాడు, అధికారం గలవాడు" అన్న అర్థం చెప్పుకోవచ్చు. కానీ సెయిలర్ లు అందరూ ఆ పేరుకి వేరే మోటు అర్థం తీసి, అతన్ని ఉడికిస్తూ ఉంటారు.

    "కాసీని చేపలు పడదాం, దా!" అన్నాడు మహేంద్ర.

    అరడుగుల మహేంద్ర పక్కన నాలుగడుగుల ఫకర్ చిన్న చిన్న అంగలు వేస్తూ గబగబ నడుస్తూ వుంటే చూసేవాళ్ళకి మహా తమాషాగా అనిపిస్తోంది.

    రెయిలింగ్స్ దగ్గరి కెళ్ళి, ఒడుపుగా వల విసిరాడు మహేంద్ర, ఇద్దరూ ఓపిగ్గా కాచుకు కూర్చున్నారు.

    కొద్ది నిమిషాలలోనే వల బరువెక్కింది. బయటికి లాగారు ఇద్దరు కలిసి. బుట్టెడు చేపలు ఉన్నాయి అందులో.

    "ఈ పూటకి ఈ చేపలు చాలు! కానీ ఇంకొన్ని దొరికితే రాత్రికి కూడా సరిపోతాయి!" అన్నాడు ఫకర్.

    మళ్ళీ వల విసిరాడు మహేంద్ర.

    ఈసారి చాలాసేపు ఏమీ జరగలేదు. తర్వాత, తనకే ప్రాణం కానీ, చాలా పెద్దదిగా ఉన్న ఓకే ఒక్క చేప చిక్కుకుంది ఈసారి.

    షార్క్ చేప అది! సోరచేప అంటారు తెలుగులో. రంపంలా వుంటాయి దాని పళ్ళు. మనిషిని నోటితో పట్టుకుంటే, పట్టాకారుతో కత్తిరించినట్లు రెండు ముక్కలు చేసెయ్యగలదు అది!

    "మహేంద్రా! వల వదిలెయ్! పోతే పోయింది!" అన్నాడు ఫకర్ పెద్దగా.

    వలని వదిలెయ్యబోయాడు మహేంద్ర. అంతకుముందే దాని కొసల్ని అతను చేతిచుట్టూ చుట్టేసుకుని వుండడంవల్ల అది చిక్కు పడిపోయింది, వీడి రావడం లేదు.

    కంగారుగా దాన్ని వదిలించుకోవడానికి చూస్తున్నాడు మహేంద్ర.

    మళ్ళీ ఒక్కసారి ఉధృతంగా పెనుగులాడింది చేప. యావచ్చక్తినీ ఉపయోగించి, తనని పట్టుకోవాలని చూస్తున్న ప్రత్యర్థని నీళ్ళలోకి లాగాలని చూస్తోంది. దాని బలంముందు వల తాళ్ళు అగెట్లు లేవు ఇంకా సేపు పెనుగులాడిందంటే మాహేంద్రను వలతో సహా నీళ్ళలోకి గుంజడమో, వల తాళ్ళు తెంపుకు తప్పించుకుపోవడమో ఖాయం.

    మహేంద్రకు ముచ్చెమటలు పోస్తున్నాయి. వలలో చిక్కుకున్న చేతులు రావడంలేదు.

    "హెల్ప్! హెల్ప్!" అని కేకలు పెడుతూ అక్కడినుంచి పరిగెత్తి వెళ్ళాడు ఫకర్. మహేంద్రను రక్షించడం తన ఒక్కడివల్లా కాదని తెలుసు అతనికి.

    మళ్ళీ లాగింది చేప.

    ఆ విసురుకి పట్టు తప్పింది మహేంద్రకి. బాలన్స్ తప్పి, రెయిలింగ్స్ మీదగా సముద్రంలోకి ఒరిగిపోబోతూ, చావు కేక పెట్టాడతను.

    మరో సెకెండ్ లో అతను నీళ్ళలోపడి, ఆ షార్క్ కి ఆహారమై పోయేవాడే.

    కానీ__

    ఎవరో వెనుకనుంచి వచ్చిబలంగా అతని కాళ్ళనిపట్టేసుకున్నారు.

    అతని కాళ్ళదగ్గిర నుంచీనడుముదాకా రెయిలింగ్స్ కి ఇవతల ఉంది. నడుము దగ్గరనుంచీ తలదాకా నీళ్ళవైపు జారి ఉంది.

    ఆ పెద్ద సోరచాప మహొద్రేకంగా నీళ్ళని కలచివేస్తూ, వలనిలాగేస్తో,ది ఒకవైపునుంచీ.

    ఆ షార్క్ కన్నా బలశాలి ఎవరో రెండోవైపునుంచీ అతని కాళ్ళని గట్టిగా పట్టేసుకుని ఉన్నాడు.

    ఆ రెండు వ్యతిరేక శక్తుల మధ్యా తన నడుములు జారిపోతాయేమో అన్నంత బాధ కలిగింది మహేంద్రకి. అటు చేతులూ, ఇటు కాళ్ళూ కీళ్ళతో సహాఊడి వచ్చేస్తాయేమోనని భయం వేసింది.

    వలతో బాటు షార్క్ చేపని లాక్కెళ్ళిపోతోంది షిప్పు.

    ఊపిరి అందడం లేదు మహేంద్రకి. రెయిలింగ్స్ పొత్తికడుపుని కోసేస్తున్నట్లు అయి, యమ యాతన పడుతున్నాడు.

    ఉన్నట్లుండి పరిస్థితి మారిపోయింది 'ఠప్' మని శబ్దం వెంటనే నీళ్ళకి ఇంతెత్తున ఎగిరి గిల గిల్లాడుతూ కొట్టుకుంది సోర చేప.

    మహేంద్ర కాళ్ళని పట్టుకుని ఉన్న చేతులు అతన్ని ఒడుపుగా పైకి లాగి, వలని అందుకున్నాయి.

    చావు తప్పిన మహేంద్ర, ఆయాసంతో రొప్పుతూ తలెత్తి చూశాడు.

    భీమబలుడు చాంగ్ నిలబడి ఉన్నాడు ఎదురుగా. అతని పెదిమల కొసన వేలాడుతున్న సిగరెట్టు ఇంత గందరగోళంలోనూ జారి పడిపోనే లేదు. బాదంకాయల్లాంటి కళ్ళు సగం మూసుకుని, సన్నటి గీతల్లా కనబడుతున్నాయి. అతను ఒక చేతితో వలని పట్టుకుని  ఉన్నాడు రెండో చేతిలో 'షార్పూన్' అనే జలచరాలను కాల్చే తుపాకీ వుంది.

    షార్పూన్ ని కిందపడేసి, ఒక కాలితో రెయిలింగుని తన్ని పట్టి, సర్వేంద్రియాలలో శక్తినీ చేతులలో కేంద్రీకరించి హుమ్మని వలని పైకి లాగాడు చాంగ్.

    విసురుగా వచ్చి ఓడలో పడింది సోరచేప. దాని వీపులో శూలంలా గుచ్చుకుని ఉంది షార్పూన్.

    శక్తి తగ్గిపోయిందిగానీ పూర్తిగా చావలేదు అది భీకరంగా తోకతో డెక్ ని కొడుతూ. ఎగిరెగిరి పడుతోంది.

    చాంగ్ పెదిమలు మెల్లిగా విచ్చుకున్నాయి. బెల్టుకిఉన్న చాకుతీశాడు.

    కేని శక్తిని తెచ్చుకుని, ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు మహేంద్ర. "సర్! ఈ బాస్టర్ నా ప్రాణాలు తియ్యాలని చూసింది! దీన్ని నాకొదిలేయ్యాండి! స్వయంగా నా చేతులతో దీన్ని నిలువునా చీలిస్తే గానీ నాకు తృప్తి వుండదు" అన్నాడు ఆయాసంతో.

    అతని ప్రతీకారం వాంఛ తనకి నచ్చినట్లు ప్రశంసాపూర్వకంగా చూశాడు చాంగ్.

    "నువ్వే చంపుతానంటావా! చంపు!" అన్నాడు విశాలంగా నవ్వుతూ.

    స్నేహితుడికి ప్రమాదం తప్పినందుకు బ్రహ్మానందభరితుడయ్యాడు ఫకర్. "స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఏమయిందో చూడాలి" అని గబగబ వెళ్ళిపోయాడు.

    బొడ్లోనుంచీ రంపంలాంటి పళ్ళున్న కిచెన్ నైఫ్ తీసి, షార్క్ మెడమీద ఖస్సున పొడిచాడు మహేంద్ర.

    విలవిల్లాడుతూ ఎగిరి పడింది షార్క్ చేప.

    మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ వళ్ళు తెలియని ఆవేశంతో, కసితో ఇష్టమొచ్చినట్లు పొడిచాడు.

    క్రమంగా షార్క్ కదలికలు బలహీనమై పోయాయి.

    నెమ్మదిగా నిశ్చలమైపోయింది అది.

    ఈ 'తమాషా' అంతా కాసేపు సరదాగా చూసి, వెళ్ళిపోయాడు చాంగ్.

    అక్కడ ఇంకెవ్వరూ లేరు.

    చివరిసారిగా కత్తిని సొరచేప కడుపులో దింపి, సర్రున చీల్చాడు మహేంద్ర తన కసి అంతా తీరేటట్లుగా.

    వెంటనే అతని కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి ఆశ్చర్యంతో.

       
                                                                        6


    చాంగ్, అతని సహచరులకోసం రెండు కేబిస్లు ఖాళీ చేయించాడు సాగర్.

    ఆ తర్వాత చాలాసేపు హడావిడిగా ఉండిపోయాడు. మునిగిపోతున్న షిప్పుని రక్షించదానికి దిశ మార్చుకుని వెనక్కి రావడంలో చాలా టైమ్ వృధా అయిపోయింది. ఆ నశ్యపోయిన సమయాన్ని భర్తీచేసే ప్రయత్నంలో పడ్డాడు.

    రాత్రి భోజనాల సమయం అయింది.

    డైనింగ్ హల్లో, సాటి కేప్టెన్ అయిన చాంగ్ కోసం తన పక్క సీటుని ఖాళీగా వుంచాడు సాగర్. అతనికి రెండో వైపున అనూహ్య కూర్చుని వుంది. చాంగ్ కోసం వుంచిన సీటుకి అవతల ప్రొఫెసర్ ఆనందరావు కూర్చున్నాడు.

    సత్యనారాయణసింగ్ సీ సిక్ నెస్ ఇంకా తగ్గనేలేదు. అతను కేబిన్ లోంచి బయటికే రావడం లేదసలు.

    ఇవాళ స్వరూపరాణికూడా డిన్నర్ టేబుల్ దగ్గర గైరు హాజరయింది. "మా హబ్బీకీ ఆరోగ్యం బాగాలేదు. నేను ఆయన్నే కనిపెట్టుకుని వుండాలి. భోజనానికి రాలేను" అని కబురంపింది ఒక స్టివార్డుతో.

    ఆమెకి హఠాత్తుగా తన భర్తమీద అంత ప్రేమాభిమానాలు పుట్టడం చిత్రం అనిపించింది సాగర్ కి. అతను సాభిప్రాయంగా అనూహ్యవైపు చూశాడు.

    డైనింగ్ రూమ్ తలుపు దఢాలున తెరుచుకుంది.

    అందరూ తలలు తిప్పి చూశారు.

    ప్లోరింగ్ కి వేసిన కొయ్యపలకలు కిర్రుకిర్రుమని మూలిగేటంత గట్టిగా అడుగులువేస్తూ లోపలికి వచ్చాడు చాంగ్. వస్తూనే సాగర్ భుజం మీద బలంగా చరిచి, "హౌ ఆర్యూ మాన్?" అంటూ బర్రున కుర్చీ లాగి కూలబడ్డాడు.

    అతని అతిచనువు చిర్రుత్తుకొస్తున్నా అణచుకొని, మర్యాదకోసం తల పంకించాడు సాగర్.

    చాంగ్ కి ఉన్న మంచి అలవాట్లతో రోజూ స్నానం చెయ్యడం ఒకటికాదని ఆ టేబుల్ దగ్గర వాళ్ళందరికీ అర్థమయింది. ఘాటుగా స్వేదపు వాసన వస్తోందతని దగ్గర.

    ఆనందరావు ముక్కు చిట్లించి, తన ప్రయోగాలకు పనికివచ్చే సరి కొత్తరకం స్సెసిమాన్ ని చూసినట్లు పరిశీలనగా చూశాడు చాంగ్ ని.

    చాంగ్ తన ఎదురుగా  ఉన్న చిన్న కప్పులోని టమాటో సూప్ ని హీనంగా చూసి, మొత్తం సూప్ ఉన్న పెద్ద డిష్ ని ఎత్తేసి గటగట తాగేశాడు. పెదిమలు ఎడంచేత్తో తుడుచుకుంటూ, "బ్రదర్! ఇంతకీ నీ పేరేమిటో చెప్పనేలేదు!" అన్నాడు సాగర్ తో.

    "కృపాసాగర్!" అన్నాడు సాగర్ ముక్తసరిగా.

    విసుగ్గా బల్లమీద చరిచాడు చాంగ్. "ఇదిగో! పెద్ద పెద్ద చాంతాళ్ళ లాంటి పేర్లంటే బోరు నాకు! నిన్ను నేను సాగర్ అని పిలుస్తాను. అంతే! నా పేరు సింగ్ సింగ్ చాంగ్ అయినా నన్ను తెలిసిన వాళ్ళందరూ సింపుల్ గా డ్రాకులా అని పిలుస్తారు! విన్నావ? డ్రాకులా!"

    మాట్లాడేటప్పుడు  కళ్ళు పెద్దవి చేసి, గుడ్లు తిప్పుతూ ఉండడం అతనికి అలవాటు. ఆ ఎఫెక్టుకి ఎదుటి వాళ్ళు హడలిపోవడాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు.

    అతని పక్క పళ్ళు నిజంగానే డ్రాకులా కోరల్లా ముందుకు పోడుచుకు వచ్చిఉన్నాయి. అందుకే అతనికి ఆ నిక్ నేమ్ వచ్చింది అసలు.

    చాంగ్ ని బెదురుగాచూసింది అనూహ్య.

    "డ్రాకులానా?" అన్నాడు ఆనందరావు ఉత్సాహంగా. చేతిలోని పోర్కుని కింద పెట్టేసి హుషారుగా అరచేతులు  రాసుకున్నాడు.

    "సమాధిలోంచి నుంచి లేచివచ్చి, తన కోరలతో మెడ మీద గాటు పెట్టి, రక్తం పీల్చే కౌంచ్ డ్రాకులాని సినిమాల్లో చూసి అదిరిపోతాం! కానీ నిజంగా డ్రాకులా అనే భయం కరమైన శాల్తీ ఒకడు చరుత్ర లోఉండేవాడని మీ కెవరికన్నా తెలుసా అసలు?"

 Previous Page Next Page