Previous Page Next Page 
వేగు చుక్క పేజి 8


    "అతనికి పిచ్చి ఉందా  అనేనా మీ ప్రశ్న? ఉహుఁ? అతను ఇందాకటి దాకా నార్మల్ గానే  ఉన్నాడు" అన్నాడు ఆ రెండోషిప్పు కెప్టెన్ చైనావాళ్ళు ముక్కుతో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాడు అతను. అతన్ని పరీక్షగా చూశాడు సాగర్.

    తల వెంట్రుకల దగ్గరనుంచీ కాలిగోళ్ళదాకా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే మనిషి సాగర్. అతని పక్కన నిలబడ్డ ఆ రెండో కెప్టెన్ చూసే వాళ్ళకి రోత కలిగించేలా ఉన్నాడు మంగోలియన్ జాతులకి ఉండే పసుపురంగు వళ్ళు, బాదంకాయల్లాంటి కళ్ళు. బాగా వెలిసిపోయిన బ్లూ డెనిమ్ జీన్సు వేసుకుని వున్నాడు.  నెత్తిమీద మడ్డిగా వున్న టోపి, వదులుగా వున్న చెక్ షర్టు టకప్ చేశాడు. షర్టు మీద నిన్నటి డిన్నరు తాలూకు ఆహారపు మరకలు వున్నాయి. పై మూడు గుండీలు పెట్టుకో లేదు లోపల మాసిన బనీను కనబడుతూంది. చాతీ మీద తెల్లటి గుబురు వెంట్రుకలు.

    అతని ఛాతీ మీదా, నొసటి మీదా, తలమీదా వున్న వెంట్రుకలన్నీ కూడా తెల్లగా నెరిసిపోయాయి. చెంపమీద మంచుపడినట్లు కనబడుతోంది రెండు రోజుల గెడ్డం. వెంట్రుకలన్నీ నెరిసిపోయినా అతను వృద్దుడిలా కనబడుటంలేదు. బలిష్టంగా, ఆరోగ్యంగా వుండి, ధృవ ప్రాంతాలలో కనబడే తెల్లటి ఎలుగుబంటిని గుర్తుకు తెస్తున్నాడు. ఎంత పొడుగున్నాడో, అంత వెడల్పు కూడా వున్నాడతను, జెయింట్ సైజ్ పుట్ బాల్ లా గుండ్రంగా వున్నాడు.

    సాగర్  పక్కనే నిలబడి చూస్తున్న అనూహ్యకి మొదటి చూపులోనే  అతనంటే వ్యతిరేక భావం కలిగింది.

    "నా పేరు చాంగ్!"  అన్నాడతను. గ్రీజు ఆయిల్ మరకలు అంటిన చేతివి సాగర్  కరస్పర్శకై ముందుకు జూస్తూ.

    ఆ చేతిని చూసి, అందుకోకుండానే తల పంకించి ఊరుకున్నాడు సాగర్.

    మొహం గంటు పెట్టుకున్నాడు చాంగ్. "మాది హాంగ్ కాంగ్! మా మదర్ చైనీస్, మా పాదర్ ఇండియన్!" అన్నాడు గొప్ప  ప్రకటన ఏదో చేస్తున్నట్లు.

    "ఐసీ!" అని తల పంకించాడు సాగర్. "మీ షిప్పు మునిగి పోవడం చాలా దురదృష్టకరం! దీని ఓనరు ఎవరు?"

    "నేనే!" అన్నాడు చాంగ్ కొంచెం గర్వంగా. అతని చూపులు మధ్య మధ్య అనూహ్య మీద పడుతున్నాయి.

    ఆశ్చర్యం కలిగింది సాగర్ కి.

    మామూలు ఓడ కళాసీలా కనబడే ఇతగాడు ఒక షిప్పుకి, అది ఎంత శిథిలావస్థలో ఉన్న సీనారేకు డబ్బాలాంటి షిప్పు అయినా సరే, ఓనరా? అంటే అతను తన సర్వస్వం పెట్టి అది కొని ఉండాలి. ఆ మునిగిపోయిన షిప్పు దాదాపు ఇరవైవేల టన్నుల ఉండి ఉంటుంది. అంటే దాదాపు నాలుగుకోట్ల ఎనభై లక్షల రూపాయలు.

    ఒకవేళ ఇతను సెకెండు హాండు షిప్పుకొని ఉన్నా, అది రెండు కోట్ల రూపాయలకు తక్కువ ఉండదు.

    చెప్పాలేనంత సానుభూతి కలిగింది సాగర్ కి. "ఐయామ్ వెరీసారీ!" అన్నాడు సిన్సియర్ గా.

    "వెరీ కైండ్  ఆఫ్ యూ సర్!" అని విచారంగా మొహం పెట్టాడు చాంగ్. కానీ అతనికి నిజంగా ఎక్కువ విచారం లేదేమో అనిపించింది సాగర్ కి ఎందుకో.

    "రెండు కేబిన్స్ ఖాళీ చేయించి మీకు ఇస్తాను. అండమాన్స్ చేరేదాకా ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాం."

    "వెరీ  కైండ్ ఆఫ్ యూ సార్!" అన్నాడు చాంగ్ మళ్ళీ,  వినయంగా భూమిని తాకేలా వంగి నిలబడుతూ.

    ఒకవైపు చిరిగిపోయిన స్కర్టు వేసుకుని వున్న అనూహ్య అతను వంగగానే, అప్రయత్నంగా మోకాళ్ళు దగ్గరికి తీసుకుని ఒక అడుగు వెనక్కి వేసింది.

    "మీరు కనబడి మమ్మల్ని రక్షించారు, సార్!" అన్నాడు చాంగ్, హిప్ పాకెట్ లో నించీ సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసి. సాగర్ కి ఆఫర్ చేస్తూ.

    "నో థాంక్స్! నేను స్మోక్ చెయ్యను" అన్నాడు సాగర్ చిరు నవ్వుతో.

    అతన్ని వింతగా చూసి, సిగరెట్ అంటించాడు చాంగ్.

    ఆశ్చర్యంగా సాగర్ ని చూసింది అనూహ్య. సో! ఇతను సిగరెట్లు కూడా కాల్చడా? సాధారణంగా సముద్రాల మీద తిరిగేవాళ్ళంతా తాగుబోతులనీ, స్త్రీ వ్యసనపరులనీ, అల్లరి రకాలనీ చదివింది తను చాలా కథల్లో. దానికి వ్యతిరేకంగా ఇతను.... .... గ్రేట్!

    "మీ గాయం.... ....." అంది నెమ్మదిగా.

    అప్పటిదాకా తన గాయం సంగతి మర్చిపోయిన సాగర్ చిరునవ్వు నవ్వాడు. "మీరు వర్రీ కాకండి! చిన్న దెబ్బే! నేను బేండేజ్ చేసేసుకోగలను."

    తర్వాత అందరూ ఆ మునిగిపోతున్న షిప్పువైపే విచారంగా చూస్తూ ఉండిపోయారు.

    మెల్లిగా తూరుపు ఎర్రబడింది. సముద్రంలో నుంచీ పైకి తేలినట్లు వచ్చింది సూర్యబింబం.

    దానితోపాటే తేలింది, మునిగిపోయిన షిప్పులో ఉండిపోయిన సెయిలర్ తాలుకు శవం. అతని కుడి చెయ్యి ఇంకా స్క్రూ డ్రయివరు చుట్టూ బిగుసుకుపోయి ఉంది.

    ఒక లైఫ్ బోటుని కిందికి దించాడు సాగర్. ముగ్గురు నావికులు ఆ లైఫ్ బోటులో వెళ్ళి సింహాద్రి శవాన్ని షిప్పులోకి తీసుకొచ్చారు.

    వెంటనే ఆతృతగా  శవాన్ని మొత్తం శోధించి చూశాడు చాంగ్. అతని వింత ప్రవర్తనకి ఏమీ దొరకలేదు.

    "శవాన్ని అండమాన్స్ దాకా తీసుకెళ్ళడం అసాధ్యం. ఆ లోపలే కుళ్ళి దుర్వాసన వస్తుంది. అందుకని ఇక్కడే అంత్యక్రియలు చేసేయ్యాలి" అన్నాడు సాగర్.

    "నడి సముద్రంలో ఎవరైనా చనిపోతే, శవాన్ని అనాధ ప్రేతంలా సముద్రంలో వదిలెయ్యవలసిన అవసరంలేదు. అలాంటి విపత్కరపరిస్థితులని ఎదుర్కోవడానికి వీలుగా, షిప్పు కేప్టెన్ కొన్ని అధికారాలు ఉంటాయి. షిప్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా చనిపోతే షిప్పు కేప్టెనే వాళ్ళకి అంత్యక్రియలు జరిపించవచ్చు. అలాగే సముద్ర ప్రయాణములోనే ఎవరైనా పెళ్ళి చేసుకోదలచుకున్నా కేప్టెన్ వాళ్ళకి పెళ్ళి జరిపించవచ్చు.

    "మా మేట్ అన్యాయంగా సముద్రానికి బలైపోయాడు" అన్నాడు చాంగ్. "అతను మీ ఇండియన్. తెలుగు మాట్లాడే హిందూ. హిందువుల ఆచార, వ్యవహారాలు నాకు బొత్తిగా తెలియవు. మీరు సహకరిస్తే తూతూ మంత్రంగా తంతు ముగించేద్దాం."

    "తప్పకుండా!" అన్నాడు సాగర్.

    ఆ దురదృష్టవంతుడి అంత్యక్రియలు విరాడంబరంగా, క్లుప్తంగా జరిగిపోయాయి.

    తను సర్వీసులో చేరాక అలాంటి అన్ ప్లెజస్ట్ డ్యూటీ నిర్వర్తించవలసి రావడం మొదటిసారి సాగర్ కి. అతని మనసు కలచి వేసినట్లయిపోయింది.

    అసలే బేజారైపోయి వున్న అనూహ్య మరీ భయభ్రాంతురాలాయి పోయింది జరుగుతున్నది చూసి. కానీ ఎంత భయమేసినా ఆమె సాగర్ పక్కనుంచి కదలలేదు. అతను దరిదాపుల్లో లేకపోతే, ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయేటట్లు ఉంది.

    "మిస్! మీరు కేబిన్లో కెళ్ళి రెస్టు తీసుకోండి!" అన్నాడు సాగర్  నిద్రలేమితో ఎర్రబడ్డ ఆమె కళ్ళని చూస్తూ.

    'వెళ్ళను' అన్నట్లు గట్టిగా తల ఆడించింది అనూహ్య.

    చెప్పలేనంత సానుభూతి కలిగింది సాగర్ కి. అవును? అందరూ ఇక్కడేఉండి, ఆ అమ్మాయి మాత్రం వంటరిగా కేబిన్ లోకి వెళితే ఆ స్వారూపరాణి బాధ తప్పదు.

    కాలుస్తున్న సిగరెట్ పూర్తవకుండానే దానితో మరొక సిగరెట్ అంటించుకున్నాడు చాంగ్. గుండెలనిండా పోగపీల్చి, వెంటనే కొరబోయినట్లు ఉక్కిరిబిక్కిరై పోయాడు.

    "హలో! హలో! ఏం చూస్తున్నాను నేను? బ్లాక్ రోజ్! అవునా బ్లాక్ రోజ్ ఇక్కడా?" అన్నాడు ఎక్సయిటేడ్ గా.

    అతని చూపులని అనుసరించి తాముకూడా పైకి చూశారు సాగర్ అనూహ్య.

    షిప్పు బ్రిడ్జిమీద కొంచెం చాటుగా నిలబడి జరుగుతున్నదంతా గమనిస్తున్నా స్వరూపరాణి పట్టుబడిపోయిన దొంగలా చూసింది. భయాందోళనలు కనబడ్డాయి ఆమె మొహంలో.

    "బ్లాక్ రోజేనా? బ్లాక్ రోజ్ కాకపోవడమేమిటి? నువ్వెలాంటి డ్రస్సు వేసుకున్నా, నువ్వసలు డ్రెస్సే వేసుకోకపోయినా, అడ్రస్సు మార్చేసి ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా నేను ఠకీమని గుర్తుపట్టేయ్యగలను. అవునా బ్లాకీ?" అన్నాడు చాంగ్.

    స్వరూప మొహం వెల్ల వేసినట్లు తెల్లగా పాలిపోయింది. ఆమె అతి కష్టంమీద గుటక మింగడం అంత దూరం నుంచీ కూడా స్పష్టంగా తెలుస్తోంది.

    కానీ శీఘ్రంగానే తేరుకుంది స్వరూప. తన యాజమాన్య దర్పం అంతా చూపిస్తూ విసవిస మెట్లు దిగి వచ్చింది.

    "సాగర్! ఎవడీ జోకర్? షిప్పు ఓనర్ భార్యతో మాట్లాడేటప్పుడు మేనర్స్ ఎలా ఉండాలో నేర్చుకోమను! బ్లాక్ రోజ్ ట! పిచ్చెక్కిందా ఏమిటి?......" అంటూ విసురుగా వెనక్కి తిరిగి, చకచక నడుస్తూ వెళ్ళిపోయింది.

    "షిప్పు ఓనర్ భార్యా!" అన్నాడు చాంగ్, ఆ నిజాన్నిజీర్ణించు కోవడానికి ప్రయత్నిస్తూ ఆమె వెళ్ళిన వైపే కొద్దిక్షణాలపాటు కళ్ళప్పగించి, నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు. తర్వాత మెల్లగా తేరుకుంటూ, "షిప్పుకి ఓనరుకి భార్యా? అర్థమయింది! అర్థమయింది!" అని గొణుక్కున్నాడు చిన్నగా.

    "ఓకే బడ్డీ!" అని చనువుగా సాగర్ తో చెప్పి, జీన్స్ జేబులో చేతులు పెట్టుకుని సన్నగా విజిలేస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చాంగ్.

    అతని మొహంలో ఇందాకటి నుంచీ కనబడుతున్న మర్యాదా, మన్ననా తడిగుడ్డతో తుడిచేసినట్లు మాయమై పోవడం గమనించాడు సాగర్.

    సాలోచనగా కాసేపు అక్కడే ఉండిపోయి, తర్వాత అనూహ్యవైపు తిరిగాడు. "రండి మిస్! బ్రేక్ ఫాస్ట్ తీసుకోండి నాతో! చాలా నీరసంగా కనబడుతున్నారు" అన్నాడు.

    ఆకలి లేదని అభ్యంతర పెట్టబోయింది. కానీ అతను వినిపించుకో కుండా, సున్నితమైన అధికారంతో ఆమెని తన వెంట తీసుకెళ్ళాడు.

   
                                                                       *    *    *


    కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళే పవర్ లైన్ షార్టు సర్క్యూట్ అయిపోవడం వలన అది రిపేరు చేసేలోగానే కాయగూరలూ, మాంసం, కొన్ని రకాల ఆహార పదార్థాలూ చాలావరకూ పాడయిపోయాయి. మామూల పరిస్థితిలో అయితే అవి అండమాన్స్ చేరుకునేవరకూ సరిపోయేవి.

    హెడ్ కుక్ ఇబూకా బ్రేక్ ఫాస్ట్ కి ఆరెంజ్ మెంట్స్ పూర్తిచేసి, మిగిలి ఉన్న ఆహార పదార్థాలవైపు అనాసక్తిగా చూశాడు. చిరాగ్గా వుందతనికి. అతను జపనీస్, చైనీస్, కాంటినెంటల్ రకాల వంటలు చెయ్యడంలో ఎక్స్ ఫర్ట్. రోజుకో కొత్తరకం వంటకం చేస్తేనేగానీ తృప్తిగా ఉండదు.

    "మహేంద్రా!" అని పిలిచాడు విసుగ్గా.

    "ఏమిటి బాస్?" అంటూ వచ్చాడు మహేంద్ర. అతను బెంగాలీ.

    సముద్రంలోకి వల విసురు. చేపల పేరు కింద చలామణీ అయ్యేవి ఏదో ఒకటి దొరక్కపోవు వాటిని ఇవాళ్టి మెనూలో చేరుద్దాం!ఏమంటావు?"
   
    "అలాగే బాస్!" అని స్టార్ రూమ్ లోకి వెళ్ళి వల తీసుకువచ్చేడు మహేంద్ర. బలమైన నైలాన్ దారాలతో అల్లి ఉంది అది.

 Previous Page Next Page