తన నిక నేమ్ తో నిజంగానే ఒక నరరూప రాక్షసుడు ఉండడం చాంగ్ కి సంతోషం కలిగించినట్లుంది. ఆసక్తిగా వింటున్నాడు.
అనూహ్యకి మాత్రం వెన్నులో నుంచి చలి పట్టుకు వచ్చింది. తనకి అసలే చచ్చేంత భయంగా ఉంది. దానికి తోడు ఈ రక్తం తాగేపిశాచాల కథలేమిటి?
రివ్వుమని చలిగాలి వీస్తోంది.
ప్రొఫెసర్ ఆనందరావు చెప్పడం మొదలెట్టాడు.
"అబ్బో ఎప్పటి మాట ఇది! దాదాపు అయిదొందల సంవత్సరాల క్రింద కథ! తూర్పూ యూరఫ్ లో ఉండేది వాలాబియా రాజ్యం. దానికి రాజు వ్యాద్ అతనికి 'డ్రాకులా' అనే బిరుదు ఉండేది. అంటే నిప్పులు కక్కే మహాసర్పం లాంటి డ్రాగన్ కి కొడుకు అని అర్థం. చిన్నతనం నుంచీ కూడా, క్రౌర్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసి, అనుభవించాడు అతను. టర్కులతాలూకు 'దుష్టాక్షి' అనే పేరు గల కోటలో బందీగా ఉన్నాడు కొంతకాలం పాటు. ఆ తర్వాత హంగరీ రాజ్యాధినేత ఆదేశం మేరకు తన తండ్రి హత్య చేయబడటం కళ్ళారా చూశాడు.
ఆ హింసా, ఆ కసీ అతని నరనరాల్లో జీర్ణించుపోయాయి. పెద్ద య్యాక మహా క్రూరుడిగా మారాడతడు తనకి గిట్టని వాళ్ళనీ, శత్రువులనీ మట్టు పెట్టడానికి అతను ఉపయోగించిన పద్దతుల్లో 'శూలానుహరోణం' అనేది అతనికి ఫేవరెట్.
శ్రద్దగా వింటున్న చాంగ్ ముందుకు వంగాడు "శూలారోహాణమా?" అన్నాడు సంతోషం పట్టలేక. ఆ వివరాలేమిటో తెలిస్తే తను కూడా తన శత్రువుల మీద ఆ ప్రయోగం చేసేటంత ఊపులో ఉన్నాడతను.
ప్రొఫెసర్ కి సంతోషంగా ఉంది. తనకి మంచి శ్రోత ఒకడు దొరికినందుకు, పుంజుకుని చెప్పడం కొనసాగించాడు. "అవును! శూలారోహణం! 'ఇంపేలింగ్' అని అంటారు ఇంగ్లీషులో అంటే శూలాన్ని భూమిలో పాతి, దాని మొనమీద కూర్చోబెడతారు శత్రువుని. ఆ శూలం వెంటనే శరీరంలో దిగి వాళ్ళకి శీఘ్రమరణం దొరకకుండా ఉండడానికిగానూ, శూలం మొనని మొద్దుబారి పోయేటట్లు చేయించేవాడు డ్రాకులా రాజు. అది అతి నెమ్మదిగా శరీరంలోకి దిగబడుతూ, ముఖ్యమైన అవయనం దేన్నో చీల్చిన తర్వాత అప్పుడు మరణిస్తాడు, ఆ దురదృష్టవంతుడు.
ఆలోగా, వర్ణించనలవి కాని బాధ అనుభవిస్తాడు.
ఒకసారి ఏమైందో తెలుసా? కొంతమంది టర్కిష్ వాళ్ళు అతని సమక్షంలో నెత్తిమీద టోపీలు తియ్యటానికి తిరస్కరించారు.
మీ పని ఇలా ఉందా అని, ఆ టోపీలని వాళ్ళ తలలకే మేకులు కొట్టి దిగకొట్టించాడు డ్రాకులా!"
చాంగ్ ఎక్సయిట్ మెంట్ ఆపుకోలేక, అరచేతితో గట్టిగా బల్ల మీద చరిచాడు. ప్లేట్లూ, గ్లాసులూ ఎగిరిపడ్డాయి.
"ఒకసారి తన రాజ్యంలోని బిచ్చగాళ్ళనందరినీ గాలించి పట్టుకొచ్చి, ఒక హల్లో పెట్టి తలుపులు వేసి, హాలుకి నిప్పంటించాడు డ్రాకులా.
ఇన్ని దుర్మార్గపు పనులు చేసిన ఆ వ్యాడ్ డ్రాకులా చూడ్డానికి పిశాచంలా ఉండే వాడనుకున్నారా ఏమిటి? అబ్బే! నవమన్మదుడంటే నమ్మండి!
కూలారోహణం చేయించీ బతికి ఉండగానే చర్మం ఒలిపించీ, నీళ్ళలో ఉడకబెట్టీ, నూనెలో వేయించీ, తన పదేళ్ళ పాలనలో కనీసం యాభై వేలమందిని-వింటున్నారా-అరలక్షమంది-నిర్భాగ్యులని నిర్థాక్షిణ్యంగా చంపించాడు డ్రాకులా.
చివరికి అతనూ అంత ఘోరంగానే చచ్చాడనుకోండి శత్రువుల చేతుల్లో అతని శిరస్సుని శూలానికి గుచ్చి జనానికి ప్రదర్శించారు. ఇతని భయానక వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకునే, బామ్ స్ట్రోకర్ డ్రాకులా పాత్రని సృష్టించాడు.
వీటన్నిటికన్నా ఇంకా భయంకరమయిన సమాచారం ఏమిటో తెలుసా? డ్రాకులాకి నరమాంసం తినే అలావాటు ఉండేదనీ, రక్తం తాగేవాడనీ గుసగుసగా చెప్పుకునేవారు జనం.
నరమాంసం అంటే గుర్తుకు వచ్చింది. అండమాన్స్ లోకి ఒక తెగ..........." అని మళ్ళీ తన ఫేవరేట్ సబ్జెక్ట్ లోకి జారిపోయాడు ప్రొఫెసర్ ఆనందరావు.
వింటూ, తింటున్న వాళ్ళందరికీ కడుపులో తిప్పినట్లయింది. అన్నం హితవు నశించింది.
ఇంక అక్కడ కూర్చోలేక, చటుక్కున లేచి కేబిన్ వైపు వెళ్ళిపోయింది అనూహ్య.
ఆమె మొహం సిక్ గా అయిపోవడం గమనించిణ సాగర్ కూడా ఆదుర్దాగా లేచి, "ఎక్స్యూజ్ మీ!" అని అక్కడున్న వాళ్ళతో చెప్పి అనూహ్య వెంట వెళ్ళాడు.
అప్పటికే మంచం మీద ఒరిగిపోయి బోర్లా పడుకుని ఉంది ఆమె.
"మిస్ అనూహ్యా!" అని పిలిచాడు మెల్లిగా.
ఉలిక్కిపడి చూసింది అనూహ్య. వలలో చిక్కుకున్న లేడిలా చూస్తున్నాయి ఆమె విశాల నయనాలు.
"సారీ ఫర్ దట్ అన్ ప్లెజెంట్ నెస్! ఆ ప్రొఫెసర్ కి అసందర్భ ప్రేలాపన అలవాటు! ఆ చాంగ్ ఆం సివిలైజ్డ్ బ్రూట్! వాడినీ, రాక్షసి మూకలాంటి వాడి క్రూనీ మన షిప్పులో ఎక్కనివ్వడం తప్పే అయినట్లుంది. కానీ తప్పదు కదా! ప్రొఫెషనల్ కర్టెసీ! ఆపదలో ఉన్న వాళ్ళని ఆడుకోవడం మన విద్యుక్త ధర్మ! మిస్ అనూహ్య! మీకు కలుగుతున్న అసౌకర్యానికి ఈ షిప్పు కెప్టెన్ క్షమార్పణ చెప్పుకుంటున్నాను మన్నించండి."
"ఇందులో మీ తప్పేం ఉంది! ఏం లేదు!"
"దైర్యంగా ఉండండి అనూహ్య. త్వరలోనే అండమాన్స్ చేరుకుంటాం. దొరికిన ఫస్ట్ ప్లయిట్ లోనే మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు."
అతను ఓదార్పుగా మాట్లాడుతున్నకొద్దీ ఆమె కళ్ళ వెంబడి నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి. అమ్మ గుర్తొచ్చింది నాన్నగా తమ్ముళ్ళూ గుర్తొచ్చారు.
మెల్లి మెల్లిగా ఆమె వీపు వెక్కిళ్ళతో ఎగిరెగిరిపడటం మొదలెట్టింది.
ఆర్ద్రంగా అయిపోయింది సాగర్ హృదయం జాలిగా ఆ అమ్మాయివైపు చూశాడు. ఆమె వానలో తడిసిన గువ్వపిట్టలాగా ఉంది. డీప్ ఫ్రీజ్ రూమ్ తలుపుకి చిక్కుకున్న స్కర్టుకి అయిన చిగురు పెద్దదై, చీలికలా కనబడుతోంది. టాప్స్ కొద్దిగా మాశాయి. రెండ్రోజుల లోనె కళ్ళు బాగా లోతుకి పోయాయి.
పిక్నిక్కుకని వచ్చినవాళ్ళని పీకనొక్కేస్తే ఎలా వుంటుందో లా అయింది అనూహ్యపని.
సంకోచంగా చెయ్యిజాచి, ఆమె వెన్ను నిమిరాడు సాగర్.
తనకు జ్వరం వస్తే, వళ్ళు తాకి చూసే అమ్మ అమృతహస్తం గుర్తొచ్చింది. అనూహ్యకి అంతేగాని అది పరాయి మగవాడి చెయ్యి అని పించలేదు.
చలిగాలి వీస్తూనే వుంది. సన్నగా ఒణుకుతోంది ఆమె స్లీవ్ లెస్ టాప్సూ. మోకాళ్ళదాకనే వచ్చే స్కర్టూ వెచ్చదనాన్ని ఇవ్వలేక పోతున్నాయి.
"స్వరూపరాణి బట్టల్లో సౌకర్యంగా ఉండేవి ఏమైనా వేసుకోకూడదా అనూహ్య?"
ఒళ్ళు జలదరించింది అనూహ్యకి. "ఆమె బట్టలా? వద్దు! వద్దు!"
సంశయంగా అన్నాడు సాగర్__ "పోనీ, నా పైజమా సూటు........."
"సరే!" అంది మెల్లగా.
అతను వార్డురోబ్ లో నుంచీ తన పైజమా సూట్ తీసి ఇచ్చాడు.
బాత్ రూంలోకి వెళ్ళి, అవి వేసుకుని తిరిగి వచ్చింది అనూహ్య, కొంచెం మొహమాట పడుతూ.
అవి ఎంత పెద్దవిగా ఉన్నాయంటే, అంత ఒడ్డూ పొడుగూ ఉన్న అనూహ్యలాంటి అమ్మాయిలు ఇద్దరు దూరొచ్చు అందులో.
చేతుల కఫ్స్ పైకి మడత పెట్టుకుంటూ, అతను నవ్వుతున్నా డేమోనని క్రీగంట చూసింది.
అతను నవ్వడంలేదు. అభిమానంగా చూస్తూ అన్నాడు. "నా మాట నమ్ముతారా అనూహ్య! కొద్దిగా ఓపిక పట్టండి! ఎవ్వరిథింగ్ విల్ బీ ఆల్ రైట్!"
అతని మాటలని వెక్కిరిస్తున్నట్లు ఏదో శబ్దం వినబడింది.
వెంటనే అలర్టుగా అయిపోయాడు సాగర్. చెవులు రిక్కించి విన్నాడు. అతని మొహంలో సీరియస్ నెస్ చోటు చేసుకుంది.
"క్షమించండి! ఒక్క నిమిషం!" అంటూ త్వరత్వరగా వెళ్ళి పోయాడు.
ఆ వెళ్ళినవాడు రెండు గంటలు గడిచిన తిరిగి రాలేదు.
నిద్రపోవడానికి ప్రయత్నించింది అనూహ్య. నిద్ర పట్టడంలేదు. చాలాసేపు అశాంతిగా అటూ ఇటూ దొర్లి ఇంక లాభంలేదని లేచి కూర్చుంది.
ఊగుతూ వెళుతోంది షిప్పు టేబుల్ మీద ఉన్న రెండు గ్లాసులు ఒకదానికొకటి తగులుతూ దిగులుగా శబ్దం చేస్తున్నాయి.
హఠాత్తుగా భయం ముంచుకొచ్చింది అనూహ్యకి వద్దనుకున్నా, ప్రొఫెసర్ చెప్పిన డ్రాకులా కథ గుర్తుకోస్తోంది. ఇంక వంటరిగా అక్కడ ఉండడం అసంభవం అని నిర్ణయించుకొంది.
వెళ్ళి, సాగర్ ఎక్కడున్నాడో చూడాలి.
ఎందుకు తిరిగి రాలేదతను?
లేచి తలుపు దగ్గరికి వచ్చి బయటకు తొంగి చూసింది.
సాగర్ ఏడీ? పెద్దగా కేకవేసి పిలిస్తే వినబడుతుందా అతనికి? తనకి సాయం వస్తాడా? లేదా తన కేకలకి అందరూ లేచి వచ్చి తనని వెర్రిదాన్ని చూసినట్లు చూసి నవ్వుతారా?
కేబిన్ లోకి తిరిగి వెళ్ళడానికి మనస్కరించలేదు అనూహ్యకి. నెమ్మదిగా ముందుకి నడిచింది సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి ఉయ్యాలలా ఊగుతూ ప్రయాణం చేస్తోంది షిప్పు అడుగులు చూసి చూసి బాలెన్స్ డ్ గా వెయ్యవలసి వస్తోంది.
కారిడార్లోకి వచ్చింది.
పోడుగాటి ఆ కారిడార్ మొత్తానికి ఒక చిన్న లైటు డిమ్ గా వెలుగుతోంది.
మలుపు తిరిగింది అనూహ్య.
హఠాత్తుగా ఆమె భుజం చుట్టూ ఒక చెయ్యి పడింది ఉలిపిరి కాగితం నలుపుతున్నట్లు సన్నటి నవ్వు. చెంపలకు తాకుతున్న వెచ్చటి ఊపిరి!
"నిద్ర పట్టలేదా హనీ! నాకూ అలాగే ఉంది!"
ఒక్క క్షణం సేపు ఊపిరి ఆగిపోయి నట్లనిపించింది అనూహ్యకి. తేరుకుని చూసే ఎదురుగా స్వరూపరాణి!
పల్చటి నైట్ గౌను వేసుకుని ఉంది ఆమె. సముద్రం తాలూకు ఉప్పు నీటివాసనని తాత్కాలికంగా దూరం చేస్తూ మృధుమధుంమైన పరిమళం సోకుతోంది ఆమె దగ్గర.
"నన్ను చూస్తే భయమా హనీ! ఎందుకు?" అంది స్వరోప నవ్వుతూ. రెండో చేతిని కూడా ఆమె భుజం చుట్టూవేసి తన వైపుకి తిప్పుకుని హత్తుకోవడానికి ప్రయత్నిస్తూ, "నేను నీకు చాలా కావలసిన దాన్ని డియర్! నిజం!" అంది తమకంగా.
ఆ చీకటి వెలుగుల్లో ఆమె చెయ్యి గోధుమ వన్నె త్రాచులా కనబడింది. అనూహ్యకి అసహ్యం కలిగింది.
అంతలోనే__
జరజర ఏదో పాకుతున్నట్లు శబ్దం!
ఏమిటది?
కళ్ళప్పగించి చూస్తూఉండిపోయింది అనూహ్య.
నిజంగానే గోధుమవన్నె తాచు ఒకటి, మెలికలు తిరుగుతూ ముందుకు పోతోంది కొంచెం దూరంలో.
క్రీనీడలో నుంచి కొంచచిలువలా బలంగా ఉన్న చెయ్యి ఒకటివచ్చి దాన్ని పట్టేనుకుంది.
"కమాన్ మై పెట్!" అని బుసకొడుతున్నట్లు గుసగుసగా వినబడింది ఒక గొంతు.
ఆ గొంతు చాంగ్ ది! డ్రాకులా అనే నిక్ నేమ్ గల చాంగ్ ది!
రక్తం గడ్డకట్టేసినట్లు అయిపోయింది అనూహ్యకి.
స్వరూప కూడా అదే స్ధితిలో ఉన్నట్లు అర్ధమవుతోంది.
కదలకుండా, శిలావిగ్రహాల్లా నిలబడిపోయారు ఇద్దరూ.
వాళ్ళు నిలుచున్నా ప్రదేశంలో నుంచి క్రీనీడలో ఉన్న చాంగ్ అస్పష్టంగా కనబడుతున్నాడు.
కానీ చాంగ్ కి వాళ్ళు కనబడరు.
"కరెక్టు డోసులో కాటేయ్యాలి బేబీ! మీ డ్రాకులా నేరుగా స్వర్గానికి వెళ్ళిపోవాలి! గుర్తుందా? వెయ్ ! కాటేయ్!"
భయంతో అనూహ్య మెడమీద సన్నగా నూగులా ఉన్న వెంట్రుకలు లేచి నిలబడ్డాయి.
ఇదేమిటి? ఎందుకితను తనంతట తానుగా పాముచేత కాటేయించుకుని చనిపోతున్నాడు? ఆత్మహత్య చేసుకునే సరికి రకంలా కనబడడే అతను.
"హిస్స్ స్స్ స్స్......" అని శబ్దం పడగవిప్పి, బుసకొట్టి డ్రాకులాని ఖస్సున కాటేసింది పాము.
"అమ్ మ్.... మ్మా!" అన్నాడు డ్రాకులా చాంగ్.
అతని గొంతులో బాధలేదు, పరవశం ఉంది!
ఆ పాము తననే కాటేసినట్లు ఉలిక్కిపడింది అనూహ్య. "ఏమిటిది?" అంది మెల్లిగా తనని తానే ప్రశ్నించుకుంటున్నట్లు.
స్వరూప చేతులకి చెమటపట్టి, అవి అనూహ్య భుజాలని తడితడి చేసేస్తున్నాయి.
సన్నగా వణుతుతొన్న గొంతుతొ అనూహ్య చెవిలో చెప్పింది స్వరూపరాణి___"అది ట్రైనింగ్ ఇవ్వబడ్డ స్నేక్! కాటేసి కావలసినంత మోతాదులోనే విషాన్ని శరీరంలోకి ఎక్కిస్తుంది! అది చెప్పలేనంత కిక్కిస్తుందన్నమాట! అంత కిక్కు లిక్కరులో డ్రగ్స్ లో కూడా దొరకదు! ఈ అలవాటు చైనా వాళ్ళలో కొంతమందికి ఉంది. కలకత్తాలో చైనా టవున్ అవి ఉంది చూడు! అక్కడకూడా ఇలాంటి ట్రయిన్డ్ స్నేక్ చేత కాటేయించుకోవచ్చు, డబ్బులిచ్చి."
"ఎండిపోయిన పెదిమలు తడిచేసుకుంటూ ఇవన్నీ నీకెలా తెలుసు?" అంది అనూహ్య భయంగా.
పట్టుబడిపోయిన దొంగలా తడబడిపోయింది స్వరూప.
అనూహ్య ప్రశ్నకు సమాధానంలా డ్రాకులా చాంగ్ మాటలు వినబడ్డాయి.
"బ్లాక్ రోజ్ ని గుర్తుపట్టారట్రా?" అంటున్నాడు ఎవరితోనో.
అంటే, ఆ క్రీనీడలో అతనితోపాటు అతని క్రూ మెంబర్లుకూడా కొంతమంది కూర్చుని ఉండాలి. వాళ్ళెవరూ సరిగా కనబడటం లేదు అనూహ్యకి.
"బ్లాక్ రోజా? అంటే సింగపూర్ లో.....త్రీ మాచెస్ రెస్టారెంటు..... తస్సాదియ్యా! గుర్తొచ్చింది! గుర్తొచ్చింది!" అన్నాడొకడు ఎక్సయిటేడ్ గా.
"గుర్తొచ్చిందీ?" అని నవ్వాడు డ్రాకులా. "స్ట్రిప్ టీజు డాన్సు చేస్తూ అందరిముందూ బట్టలు విప్పేస్తుండేది రోజుకి రెండుసార్లు. రెండు సిగరెట్లు పడేస్తే మీదమీద పడేది. చీప్ స్టేక్! వార్నీ! అది ఓ కోటీశ్వరుడిని ట్రాప్ చేసి పెళ్ళి చేసుకుందన్నమాట! గట్టి పిండమే!"
అతని మాటలు కొద్దిగా తడబడటం మొదలేట్టాయి గొంతు మత్తుగా మారుతోంది.
చీకట్లో కూడా స్వరూప మొహం వెలా తెలా బోవడం తెలుస్తోంది అనూహ్యకి. గొంగళి పురుగుని చూసినట్లు చీదరగా ఆమెని చూసి, రెండంగుళాలు పక్కకి జరిగింది.
ఉన్నట్లుండి వికటంగా నవ్వాడు డ్రాకులా.