Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 9

    "చాలదే, నిన్ను చూసి తగ్గానే పిల్లా" అచ్చమ్మను నిలువునా చూస్తూ పరాచికం ఆడాడు రిక్షావాలా.

    "అతని కష్టాన్ని బేరం పేరుతో మనం హీనంచేసి మాట్లాడకూడదు. కష్టజీవుల శ్రమని దోచుకోవటం అన్యాయం అధర్మం" అని మంచిగ మందలించి రిక్షా ఎక్కి కూర్చుంది పద్మిని. రిక్షాలో తనపక్కనే కూర్చోమంటే కూర్చోకుండా రిక్షాలోనే కింద కూర్చుంది అచ్చమ్మ.

    రిక్షా బయలుదేరింది.

    ముందుగా బంగారపు కొట్టుకు వెళ్ళిన పద్మిని అక్కడ తన బంగారుగాజు అమ్మబోయింది. గాజు తూకం వేస్తుండగా అచ్చమ్మ నోరువూరుకోక "ఏమయ్యోవ్! సరీగ తూకంకట్టు. అమ్మాయిగారు ఎవరనుకున్నావ్?" అంటూ విషయం బయటపెట్టింది.

    "మీరు కోటీశ్వరుడు మధుసూదనరావుగారి అమ్మాయా? ఈ విషయం వారికి తెలిస్తే నా షాపు యిక్కడ నుంచి లేపేస్తారు. కావాలంటే డబ్బు యిస్తాను. గాజు మీరే ఉంచుకోండి" అన్నాడు బంగారపు కొట్టు ఓనరు.

    "ఇప్పుడు నేను లకారాల కదిపతి అయిన మధుసూదనరావుగారి అమ్మాయిగా యిక్కడికి రాలేదు. నాకు నేనై వచ్చాను. ఇది నా శరీరంమీద వున్నది నాకు చెందింది. అవసరమైతే అమ్ముకుంటాను. అనవసరం అనుకుంటే అవతల పారేస్తాను. అది నా యిష్టం. వెలకట్టి డబ్బు యివ్వండి" గంభీరంగా అంది పద్మిని.

    "నేను ఇవ్వను. నన్ను ఇబ్బంది పెట్టకండి" వినయంగా శలవిచ్చాడు షాపు యజమాని.

    "ధనవంతులను చూసి కష్టజీవులు భయపడే రోజులు పోవాలి. నిర్భయంగా మీరంతా ముందుకు రండి. మీ హక్కులకోసం పోరాడండి..." లాంటి మాటలు ఆవేశంగా నాలుగు అంది పద్మిని.

    "ఈ పిల్లని చూస్తే మెంటల్ కేసులా లేదు. మాటలు చూస్తే ఏమిటేమిటోగా ఉన్నాయి. ఇదేం గోలరా దేముడా" అనుకున్న షాపు యజమాని ఓ దణ్ణం పెట్టి "నన్ను వదిలేయండి. మీరు మధుసూదనరావుగారి అమ్మాయిగారని తెలిసింతర్వాత నాకంత ధైర్యం లేదు. నేను ఈ గాజుని ముట్టను" అనేశాడు.

    "సరేలెండి వెళుతున్నాను. మీ షాపు కాకపోతే మరో షాపు. కాని ఒకటి గుర్తుంచుకోండి. ఏ పని చేయాలన్నా ధైర్యం కావాలి. ధైర్యం నీకు కావాల్సిన శక్తినిస్తుంది. అధైర్యం చెందినవాడు అడుగు ముందుకు వేయలేడు" అని చెప్పి షాపులోంచి బయటికి వచ్చేసింది పద్మిని ప్రియదర్శిని.

    బంగారుషాపు యజమాని తేరుకోటానికి తెరిచిన నోరు మూయటానికి సరిగ్గా అయిదునిమిషాలు పట్టింది.

    అక్కడ నుంచి మరో బంగారుషాపు కెళ్ళింది పద్మిని ప్రియదర్శిని.

    "ఈగాజు ఎందుకు అమ్ముతున్నారు?" ఆ షాపులోని గుమాస్తా పద్మిని ముఖంలోకి గుచ్చి చూస్తూ అడిగాడు.

    "ఎవరయినా ఎందుకు అమ్ముతారు? అవసరానికి అమ్ముకుంటారు. ఇది నాచేతి గాజు. నాకు డబ్బు అవసరమైంది, అమ్ముకుంటున్నాను. తప్పా?" నిదానంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది పద్మిని.

    "ఎబ్బెబ్బే!" అంటూ కంగారుపడ్డాడు గుమాస్తా.

    "ఓయ్, అమ్మాయిగారు ఎవరనుకుంటున్నావ్?" అని ఏదో చెప్పబోయింది అచ్చమ్మ. "ఊ...నీవు మాట్లాడకు" వెంటనే గద్దించినట్లే అనేసింది పద్మిని.

    అచ్చమ్మ నోరు మూసుకుంది.

    "దీనిలో రాగి ఎక్కువ కలిసింది. తూకం ప్రకారం చూస్తే పదిహేనువందలు మించిరావు. ఒక్కగాజే కాబట్టి మజూరి తీసేస్తే పధ్నాలుగు వందలు వస్తాయి. ఇమ్మంటారా?"

    "మాడాడీ నాకు గాజులు చేయించినప్పుడు చెప్పారు జతగాజులు ఏడువేలు అయాయని. అంటే ఒక గాజు ధర మూడున్నరవేలు. ఎంత తగ్గించినా మూడువేలు పైనే వస్తుంది. నాకు తూకం తెలియకపోవచ్చుగాని దీని ధర తెలుసు" ఖచ్చితంగా చెప్పింది పద్మిని ప్రియదర్శిని.

    "మీ డాడీ ఎవరు?" వెంటనే అడిగాడు గుమాస్తా.

    "మా డాడీ వివరాలు మీకు కావాలా?" వెళ్ళిపోదామని అక్కడనుంచి లేస్తూ విసురుగా అడిగింది పద్మిని.

    అక్కరలేదమ్మా! ఒక్కోసారి దొంగ సొత్తు మా దగ్గరికి వస్తూ వుంటుంది. నిజానిజాలు తెలుసుకోకుండా కొంటే మేము చిక్కుల్లో పడతాము. అందుకని ముందు జాగ్రత్తకి యిలాంటి ప్రశ్నలు వేస్తూంటాము అంతే" బేరం ఎక్కడ చేయిజారిపోతుందోనని షాపు యజమాని వినయంగా చెప్పి "ఎవరెట్టాంటివారో ముఖం చూస్తే తెలియటంలేదా? మాట్టాడకుండా సరి అయిన రేటు కట్టు...డబ్బు యిస్తాను" అంటూ గుమాస్తాని మందలిస్తూ కన్ను గీటాడు.

    ఆ తర్వాత పని తొందరగానే అయింది. షాపు యజమాని గుమాస్తా కళ్ళతోనే మాట్లాడుకున్నారు.

    అమ్ముతున్నది జతగాజులు కాదు కాబట్టి ఒకగాజు అయినందున కరిగించాలి కాబట్టి గాజుకి మూడువేలు ఇవ్వటానికి నిర్ణయం జరిగింది.

    బేరాలు ఆడటం అచ్చమ్మకి అలవాటే కాబట్టి "మీకు అయిదువందలు లాబమా? బాగుందయ్యాయ్! మరో మూడొందలు యిటు పారేయండి" అంది గట్టి గొంతేసుకుని.

    "మూడు వేలు యివ్వండి" ముక్తసరిగా అంది పద్మిని.

    మారు మాట్లాడకుండా మూడువేలు తీసి యిచ్చాడు షాపు యజమాని.

    ఆ గాజులు చేయించేటప్పటికి ఇప్పటికి ధర చాలా పెరిగిందని...ఆ ఒక్క బంగారు గాజు విలువ ఇప్పుడు నాలుగువేల ఎనిమిది వందలని తెలియని పద్మిని మూడువేలు తీసుకుని షాపులోంచి బయటికి వచ్చేసింది.

    "మీరు గట్టిగా మాట్లాడితే యింకొ రెండొందలో మూడొందలో ఇచ్చేవాడు అమ్మాయిగారూ" అంది అచ్చమ్మ.

    నవ్వి వూరుకుంది పద్మిని.

    ఇరువురూ కలిసి అక్కడే వున్న చాలా షాపులు తిరిగారు. కావాల్సినవన్నీ కొన్నది పద్మిని. అక్కడికక్కడే వెయ్యిరూపాయలు హారతి కర్పూరంలా హరించుకు పోయాయి.

    చివరికి__

    పలురకాల ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అమ్మే ఖరీదయినషాపుకి అచ్చమ్మని తీసుకెళ్ళింది పద్మిని.

    "నీకేం కావాలి?" పద్మిని అడిగింది.

    ఇలాంటి షాపు గుమ్మంగూడా యెప్పుడూ యెక్కని అచ్చమ్మ చుట్టూతా వున్న అద్దాలలోంచి కనిపించే తన ప్రతిబింబాలని చూస్తూ ఆనందిస్తూ "మీ ఇష్టం అమ్మాయిగారూ" అంది.

    "అలా కాదు చెప్పు" అంది పద్మిని.

    "ఉత్త ఐస్ కడ్డీ అయితే పావలా, కొబ్బరి చల్లింది అయితే అర్ధరూపాయి. అదయితే బాగుంటుందమ్మాయి గారూ! బల్లిగాడి ఐసుపెట్టెలో ఐసుపూటులు చాలా బాగుంటాయి" 

 Previous Page Next Page