"రకరకాల ఐస్ క్రీమ్స్ నీకు తెలియవు కదూ!" అయ్యోపాపం అన్న జాలితో అని ఆ తర్వాత "రెండు ఫ్రూట్ సలాడ్, రెండు క్రీమ్ ఐస్, బాదంపాలు రెండు గ్లాసులు" చెప్పింది పద్మిని.
గాజుకప్పులో గాజు గ్లాసుల్లో అన్నీ అరక్షణంలో టేబిల్ మీద ప్రత్యక్షం అయ్యాయి.
ఇదివరలో తన ఫ్రెండ్ తో పద్మిని ఇదే కూల్ డ్రింక్ షాపుకి వచ్చేది. ఫ్రెండ్స్ కి తన డబ్బుతోనే ఐస్ క్రీమ్స్ ఇప్పించేది. షాపువాళ్ళకి పద్మిని ఫలానా వాళ్ళ అమ్మాయని తెలియకపోయినా డబ్బుగలవారి అమ్మాయని తెలుసు. వేష భాషలే కాక సుకుమార సుందరరూపం, రకరకాల చిన్న కార్లలోంచి దిగి షాపులోకి రావటం వాళ్ళకి గుర్తే ఇప్పుడు పనిమనిషితోనో, పనిమనిషి కూతురుతోనో కలిసివచ్చింది అనుకున్నారు.
అమ్మాయిగారిలాగా స్పూనుతో తినటం రాకపోయినా కాస్త స్పూనుతో కాస్త ఎత్తి తాగి మొత్తానికి చల్లచల్లగా హాయి హాయిగా కడుపు భర్తీ చేసింది అచ్చమ్మ.
అరవైరూపాయల బిల్లుతో అక్కడనుంచి బయటికి వచ్చి మరో వంద ఖర్చుపెట్టి స్వీట్స్ పళ్ళు కొనుక్కుని ఇంటికి వచ్చారు.
రిక్షా అబ్బికి మరో పదిరూపాయలు యెక్కువ ఇచ్చిందామె.
"మీలాంటివారు చల్లగ వుండా"లని దీవిస్తూ పరిసరాలు చూసి భృకుటి ముడేసి అనుకూలంగా చూసి "ఏంటో" ననుకుంటూ వెళ్ళిపోయాడు రిక్షా అబ్బి.
"అమ్మాయిగారూ! మీకు కోపం రాదంటే ఒక్క మాట" అంది అచ్చమ్మ కాస్త జంకుతూనే.
"కోపం తెచ్చుకోను, అడుగు" చిరునవ్వు చిందిస్తూ అంది పద్మిని.
"బజారులో ఐసు తినకుండా ఆ డబ్బులువుంచుకున్నట్లయితే మనకి ఇక రెండు రోజూ చాలా ఇడ్డిలీలు, పుల్లట్లు, జీళ్లు, పప్పుండలు వచ్చేవికదా"
పద్మిని ప్రియదర్శిని పకపక నవ్వింది. "ఆ రుచి వీటికి ఉంటుందా?"
"అదికాదు అమ్మాయిగారూ! సరేలెండి నాకేం తెలియదు" బుర్ర గీరుకుంది అచ్చమ్మ.
ఆ తర్వాత రిక్షా ఎక్కి వెళ్ళి కార్మికుల రిలే నిరాహారదీక్ష శిబిరంలో తన ఇంటి యెదురుగుండా సాయంత్రందాకా కూర్చుని నినాదాలు చేసి చేసి అలసి సొలసిపోయి ఇంటికి వచ్చింది.
ఎలమందయ్యకి అయిదువందలు ఇచ్చి బియ్యం, పప్పు, ఉప్పు కూరలు ఇంకా అవసరమయినవి తెమ్మని అప్పటికప్పుడే జబారుకి పంపించింది పద్మిని.
చేతినిండా డబ్బులు లేవుగాని వుంటే ఫైవ్ స్టార్ హోటల్ ని తెల్లారేసరికి ఇక్కడ నిలిపి గూడెంలో వున్న అన్ని కుటుంబాలకి తలోగది రాసిచ్చేది. పద్మిని ప్రియదర్శిని హృదయం అంత విశాలం. ఆ ధనలక్ష్మికి లేదుమరి. పైన పైనకి వెనుతిరిగి పదిసార్లు చూసుకునే వారిదగ్గరికి చేరుతుంది.
పద్మిని ప్రియదర్శిని చేసింది మంచిపనే కావచ్చు. కాని మంచితనానికి కంచెలాగా ముళ్ళచెట్లు వుంటాయి. మంచితనం బయటికిరాబోతే గంటు ముళ్ళు గుచ్చుకుంటాయి.
మంచితనం అయినా, వంచన అయినా పుట్టుకతోనే వస్తాయి. అలా అని సమయం సందర్భం చూసుకోకుండా మంచితనం పదిమందితో పంచుకోవాలన్నా వంచనతో ఒక్కరిని మోసగించాలనుకున్నా అది తిప్పికొడుతుంది, తిరుగుబాటు చేస్తుంది.
ఇప్పుడు అక్కడ__
పద్మిని ప్రియదర్శిని పని అలా తయారయింది.
పద్మిని వచ్చింతరువాత అచ్చమ్మ పని ఎలమందయ్య పని ఈ మూడురోజులలో మూడు పూలు ఆరు కాయల్లా తయారయింది.
పక్కనే చేరిన కొందరికి కడుపునిండింది. అది చూసి సహజంగానే చాలామందికి కడుపు భగ్గునమండింది.
ఫలితం...
6
ఆరోజు...
అంతా ఒకచోట సమావేశం అయ్యారు.
"యజమాని హృదయం మనంచేసే సమ్మెవల్ల కరగలేదు అవునా?" సూరిబాబు అడిగాడు.
"అవును" అందరూ తల తాటించారు.
"అమ్మాయిగారు మన కోర్కెలు తీరుస్తానని చెప్పి ఇక్కడొచ్చి చేరారు ఔనా!" సూరిబాబు స్వరం పెంచుతూ అడిగాడు.
"ఔను"
"అయినా మన కోర్కెలు నెరవేరలేదు అవునా?"
"ఔను"
"ఎందుకని? ఎందుకని నేనడుగుతున్నాను. మీలో ఎవరకయినా తెలిస్తే చెప్పండి"
"మాకు తెలియదు నీవే చెప్పు" కొందరు అరిచారు.
"జరుగుతున్నది నాటకం కాబట్టి" నిదానంగా శలవిచ్చారు సూరిబాబు.
"నాటకమా?" అంతా తెల్లబోయారు.
"ఔను. చాలా పెద్ద నాటకం. చూస్తుంటే అర్ధం కావటంలేదా?"
"నీ కర్దమయితే మాకు బాగా అర్ధమయేలా చెప్పు" అందులోని ఓ ముసలి వర్కరు విసుక్కుంటూ అన్నాడు.
"సరే, అర్ధమయేలా చెపుతాను. యజమాని మన కోర్కెలు తీర్చనందువల్ల మనమంతా కలిసి సమ్మెలోకి దిగాము. ఫ్యాక్టరీ గేటుకి తాటికాయంత తాళంకప్పు తగిలించి మీ చావు మీరు చావండని చాలా నిరంకుశంగా ప్రవర్తించాడు. ఆయనగార్కి ఈ ఫ్యాక్టరీ కాకపోతే ఇంకో ఫ్యాక్టరీ వుంది. బోలెడు కంపెనీలున్నాయి. యింకా వ్యాపారాలున్నాయి. మనకలా కాదు. వున్నది రెండు చేతులు తినేది కడుపులు పది. నాలుగు రూపాయలు ఖర్చు పెడమామంటే గతిలేని బతుకులు మనవి. నాలుగు లక్షల రూపాయలని అవలీలగా అవతల పారేయగల శక్తి మన యజమానికి వుంది. అయినా పారేయడు. ఆయనకి కష్టం తెలియదు. శ్రమశక్తి విలువ అంతకన్నా తెలియదు. డబ్బు పెంచటం తెలుసు. అంతులేని దానం వుందన్న గర్వంతో మనల్ని ఆడించటం తెలుసు.
ఆ...ఆటలోని భాగమే అమ్మాయిగారు ఇంటినుంచి బయటకు రావటం ఆగండి. మీ నోళ్ళు తెరుచుకున్నాయి. మీరేం చెప్పబోతున్నారో నేను ఊహించగలను. సాంతం నేను చెప్పేది విని ఆపై నాపై ప్రశ్నల వర్షమే కురిపిస్తారో! నిప్పుల వర్షమే కురిపిస్తారో మీ ఇష్టం. మీ అనుమానాలు తీర్చటానికి నేను సిద్ధంగా వున్నాను. వివరంగా చెపుతాను వినటానికి సిద్ధంగా వున్నారా! చెప్పండి"
"వింటాం చెప్పు" చాలామంది అరిచారు.