Previous Page Next Page 
ముద్దుగుమ్మ పేజి 8

    "ఇదిగో చూడబ్బాయ్! నీపేరేమిటో నాకు తెలియదు. ఈ సాయంత్రమే నీ డబ్బులన్నీ ఇచ్చేస్తాను. వీళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇడ్లీలు తినటానికి ఇవ్వు" అని చెప్పి ఒక ఇడ్లీముక్కని తుంచి నోట్లో పెట్టుకుంది పద్మిని. రూపంతో పాటే రుచి కోల్పోయి ఏదో నానిన చెక్కముక్క తిన్నట్లు అనిపించింది. కారం బాగా తగిలించటం వలన పచ్చడి నాలుక్కి తగలంగానే చుర్రుమంది. "అబ్బా మంట" అంది నోరంతా తెరిచి.

    అచ్చమ్మ పరుగెత్తుకుంటూ వెళ్ళి సత్తుగళాసుతో నీళ్ళు తెచ్చి యిచ్చింది. అచ్చమ్మ చేయి కడుక్కోలేదు. అంట్లగ్లాసు అదేమి గమనించే పరిస్థితిలో లేదు పద్మిని. గ్లాసెడు నీళ్ళు తాగేసింది.

    ఆ తర్వాత__

    వాళ్ళందరి బలవంతాన రెండు ఇడ్లీలు తింది పద్మిని.

    వాళ్ళందరూ మాత్రం పద్మిని దయవల్ల తలో డజను ఇడ్లీ ఉఫ్ న వూదిపారేశారు. ఒక డజను ఇడ్లీ తండ్రి కోసం తీసుకుని యింట్లో పెట్టుకుంది అచ్చమ్మ.

    "రోజూ ఇడ్లీ తెస్తాను అమ్మాయిగారూ! రేపు కారంపొడి కూడా తెస్తాను. కావాలంటే పుల్లట్లుకూడా వేసుకుతెస్తాను. తేనా" ఆశగ అడిగాడు ఇడ్లీలమ్మే సత్తిబాబు.

    అందరి ముఖాలవేపు ఒకసారి చూసి "తీసుకురా" అంది పద్మిని.

    "డబ్బులు..." నసిగాడు సత్తిబాబు.

    "సాయంత్రం వచ్చి పట్టుకుపో" అంది పద్మిని.

    సత్తిబాబు ముఖంలో ఒక్కసారిగ కోటి వెలుగులు. రోజూ ఇంతపెద్ద బేరం తగిలితే యింకేం కావాలి. అప్పటికప్పుడే వాడు పెద్ద హోటల్ కి మేనేజరు అయినట్లు మా గొప్ప ఫీలింగ్ కలిగింది.

    ఆ ఉదయం__

    పద్మిని ప్రియదర్శిని ధర్మమా అని అక్కడున్న వాళ్లు మొదటిసారిగ తృప్తిగ ఇడ్లీలు తిన్నారు.

    తన చేతలవల్ల ఎదుటివాళ్ళు తృప్తిపడి ఆ తృప్తితో కృతజ్ఞతాభావంతో చూస్తే ఆ చల్లని చూపులు దీవెనులుగా ఎంత గొప్పగా వుంటాయోనన్న యధార్ధాన్ని జీవితంలో మొదటిసారి పద్మిని చవిచూసింది.

    ఇడ్లీలు తింటే కడుపు నిండలేదు.

    కాని వాళ్ళు తృప్తి చెందటంతో పద్మినికి కడుపు నిండినట్లయింది.


                                                                                        5


    ఆ పూటకి__

    మధుసూదనరావు ఇంటిముందు సమ్మె చేసే స్థలంలో కూర్చోటానికి వర్కర్స్ తో పాటు పద్మిని వెళ్ళలేదు.

    "మీరంతా ముందు వెళ్ళండి. నేను కాస్త పని చూసుకుని వస్తా"నని చెప్పి వాళ్ళందరిని పంపించి వేసింది.

    సమ్మె చేసిన మొదట్లో టెంటులాగా ఎండ తగలకుండా పందిరిలాంటిది వేసుకుని అక్కడ నిలబడి ఆ తర్వాత కూర్చుని నినాదాలు చేసేవాళ్ళు. నాలుగురోజులయినా మధుసూదనరావు కదిలిరాలేదు. దాంతో వాళ్ళల్లో కొందరు రిలే నిరాహారదీక్షలు మొదలుపెట్టారు.

    రిలే నిరాహారదీక్షలు మొదలు పెట్టింతరువాత పద్మిని ప్రియదర్శిని వాళ్ళ ఇల్లువదిలి బయటికి వచ్చేసింది.

    ఆ పూటకి పద్మిని తనకి కావాల్సినవి సమకూర్చుకుని వచ్చి రిలే నిరాహారదీక్షలో కూర్చుంటానని చెప్పింది.

    వాళ్ళు సరేనని చెప్పి వెళ్ళిపోయారు.

    వర్కర్స్ లో చాలామంది మంచివాళ్ళు వున్నారు. బియ్యంలో పలుగు రాళ్ళలాగా మధ్యలో కొందరు ఆశ పరులు ,తేరగ వస్తే పనిపాట లేకుండా పడి తిందామని చూస్తూవుంటే, కొందరు తాగుబోతులు, తిరుగుబోతులు బోలెడు డబ్బు వచ్చిపడితే బాగుండునని పేరాశతో గోతి కింద నక్కల్లాగ సమయం కోసం పొంచివున్నారు.

    అగ్నికి వాయువు డయినట్లు వీళ్ళకి కొత్తవర్కర్ సూరిబాబు తోడయ్యాడు, ఫలితం సమ్మె! యజమాని మధుసూదనరావు కఠినుడు కాడని చాలామందికి తెలుసు. అయినా యూనియన్ లు కోరికలు సమ్మెలు ఏదో వొక కారణాన మొదలవుతుంటాయి.

    ఇప్పుడు జరిగింది కూడా అదే.

    ఇదేమి తెలియని పద్మిని ఒక చిన్న మాట చెల్లలేదనే కారణాన తల్లితండ్రిని వదిలి ఉడుకురక్తం పరవళ్ళు తొక్కుతున్న ఆవేశంతో అనుభవశూన్యంతో ఇవతలికి వచ్చేసింది.

    కార్మికుల కష్టసుఖాలు పట్టించుకోవటం మంచిదే గాని వాళ్ళతో కలిసిపోయి నివసించాలనుకోవటం తెలివితక్కువతో కూడిన తొందరపాటు చర్య.

    పద్మిని ప్రియదర్శినికి అదేం అక్కరలేదు. విషయం పూజ్యం లోకజ్ఞానం శూన్యం ఫలితం కాలం నిర్ణయించాల్సిన విషయం.

    ఉదయం పదిగంటల వేళ__

    అచ్చమ్మని వెంటపెట్టుకుని పద్మిని ప్రియదర్శిని బజారు బయలుదేరింది.

    "రిక్షా ఎక్కి వెళదాం" అంది పద్మిని.

    "రిచ్చానా?" సంశయిస్తూ ఆగింది అచ్చమ్మ.

    "రిక్షా లేకపోతే ఆటో ఎక్కుదాం"

    "అయ్ బాబోయ్" అంది అచ్చమ్మ అదేదో గుండె పగిలే విషయం అన్నట్లు.

    "ఎందుకంత గాభరా! నీవు ఆటో యెప్పుడూ ఎక్కలేదా?" అయ్యోపాపం అనే జాలితో అడిగింది పద్మిని.

    "అది కాదు అమ్మాయిగారూ! మరి...మరి..."

    "కంగారుపడక అసలు విషయం చెప్పు నేనేమీ అనుకోను. నిన్నేమీ అనను సరేనా?" పద్మిని హామీ యిచ్చింది.

    "అదికాదు అమ్మాయిగారూ! మరే మనకాడ పైసలు లేవు కదా! రిక్షా ఎక్కితే మరి ఆడు ఊరుకోడు కదా?"
   
    అచ్చమ్మ చెప్పటం పూర్తిచేసిందో లేదో పద్మిని ప్రియదర్శిని పడి పడి నవ్వింది. నవ్వుతూనే "ఎంత పిచ్చిదానివి అచ్చమ్మా! ఆ విషయం నేను చూసుకుంటాను కదా! పద" అంటూ ముందడుగు వేసింది.

    "అమ్మాయిగారి ధైర్యం ఏంటో" అనుకుంటూ ఆశ్చర్యం అణచుకుంటూ అచ్చమ్మ వెనుకనే బయలుదేరింది.

    "నేను షాపింగ్ చేయాలి! జబారులో నాలుగయిదు చోట్ల నేను చెప్పినచోట్ల ఆగాలి. తిరిగి యిక్కడికే రావాలి. మొత్తం రెండుమూడు గంటలు పడుతుంది. కిరాయి ఎంత కావాలి?" అంటూ రిక్షా వాడిని పిలిచి బేరం అడిగింది పద్మిని.

    "యాభై రూపాయలు అయితే వస్తాను" ఇది కుదిరే బేరం కాదులే అనుకుంటూ అడిగాడు రిక్షావాలా.

    "నీ జిమ్మడ నీకెంత ఆశరా, యాభై చాలా!" అంది అచ్చమ్మ చేతులు తిప్పుతూ.

 Previous Page Next Page