Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 9

    "నాకేమొచ్చింది!" అనుకుంది వాసంతి.
    వాసంతి వెనుకనే వున్న జానకి "గుమ్మంపట్టుకు వేలాడుతున్నావేమిటి పద." అంది నెమ్మదిగా.
    సిగ్గనేది ఆడదాని సహజ లక్షణమని, అది పిలిచినా తెప్పించుకున్నా రాదని సమయాన్ని బట్టి సిగ్గనే మాయలమారి, ఆడదాని అణువణువునా ఆక్రమించి మొగ్గలా శరీరం ముడుచుకుపోయేటట్లు చేసి బుగ్గలు నిగ్గుతో ఎర్రబర్చి కనురెప్పలు బరువుగా వాలిపోగా తల వాల్చేటట్లు చేస్తుందని వాసంతి ఎరుగదు. సమయానుకూలంగా సిగ్గుపడటానికి నాటకంలో పాత్రా! నిజజీవితంలో ఓ అందమైన సన్నివేశంగాని.
    వాసంతికి గుమ్మంలో నుంచోవాలన్నా ముందుకు కదిలి అడుగు వేయాలన్నా ఏది చేయలేక ఏదోగా వుంది. వాసంతికి మరికాసేపు శ్రమలేకుండా "రారా వాసూ! రామ్మా జానకీ!" అంటూ వెంకట్రామయ్యగారు పిలిచారు.
    పెద్ద భారం దిగిందానిలా "అమ్మయ్య" అనుకుని వాసంతి తండ్రి దగ్గరకు నడిచింది. 
    తండ్రి పక్కనే సోఫామీద వాసంతి కూర్చుంది. జానకిని కూర్చోమంటే కూర్చోలేదు. సోఫాని పట్టుకు నుంచుంది.
    సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ తో తిరుగుతున్నది. ఎవరికి వుక్కపోయటంలేదు. శ్యామ్ సుందర్ మాత్రం షర్ట్ కాలర్ సరిచేసుకుని చేతిలోవున్న పేపరుతో చిన్నగా విసురుకుంటూ వాసంతిని చూడటానికి ప్రయత్నిస్తు అందరెదుట ఎలా చూడాలో తెలియక నానా బాధపడిపోతున్నాడు. "ఎవరైనా మాట్లాడితే బాగుండును. తనతో పెద్దవాళ్ళని తీసుకురాకపోవడం వాళ్ళొచ్చినప్పుడు తను రాకపోవడం ఎంత బాధ! వాళ్ళేదయినా ప్రశ్నలడుగుతుంటే తను వాసంతిని చూసేవాడు. తనేమి అడుగుతాడు!" ఇలా ఆలోచిస్తున్నాడు శ్యామ్ సుందర్.
    "శ్యామ్ అందంగా ఆకర్షనీయంగా వున్నాడు. ఓసారి చూస్తే ఏం తెలుస్తుంది! పోనీ తలెత్తి చూస్తే! అబ్బే బాగుండదు. అతను తనవైపు చూస్తుంటే ఎలా? చూడడని ఏముంది? తనని చూస్తూనే వుండొచ్చు. ఎలా? చూస్తున్నాడో లేదో ఎలాగో అలా వక్కసారి చటుక్కున చూస్తే. ఎలా? ఎలా? వాసంతి ఆలోచనలు అలాసాగుతున్నాయి.
    కొద్దేసేపు తర్వాత ఏక సమయానికి శ్యామ్ వాసంతి ఓ నిర్ణయానికి సిగ్గుని వదిలేసి వచ్చారు. తల ఎత్తి ఒకరివైపు వకరు చూసుకున్నారు. సిగ్గు కంగారు వీటిని వాళ్ళయితే వదిలేశారుకాని అవి వీళ్ళని వదలలేదు. చటుక్కున రెండూ ఏకకాలంలో వచ్చి శ్యామ్ ని వాసంతిని ఆక్రమించుకున్నాయి. షరా మామూలే. శ్యాం కంగారు కంగారుగా వాసంతిపై నుంచి చూపులు మరల్చుకుని అంతకన్నా కంగారుగా మహా జోరుగా పేపరుతో విసురుకోటం మొదలుపెట్టాడు. వాసంతి అయితే ఠకీమని తలవంచుకుని అరచేతిలో రేఖలు పరిశీలించుకుంటూ మునిపంటితో పెదవినొక్కి సోఫామీద కూర్చున్నా ముళ్ళ కంచెమీద కూర్చున్నట్లు ఏమిటో తెలియని బాధతో కూర్చుండిపోయింది.
    వాసంతి బజార్లల్లోను కాలేజీలోను పరిచయస్తులలోను ఎందరో అందమైన అబ్బాయిలను చూసింది. ఎలాంటి వారిని చూసినా ఎప్పుడు సిగ్గుపడి ఎరుగదు. ఇప్పుడెందుకు సిగ్గేస్తున్నదో కూడా ఎరగనిదయింది. ప్రకృతిలో ఆడది సిగ్గుపడేభాగాలు చాలా వున్నాయి. సమయము సందర్భముబట్టి సిగ్గు ఆడదాన్ని వరిస్తుంటుంది. సమయాను కూలంగానో లేక సందర్భానుసారంగానో మరేదో. ఏదయితేనేం, మొత్తానికి వాసంతికి సిగ్గు తెప్పించాయి.
    వెంకట్రామయ్యగారు శ్యామ్ ని ఏదో ఓ మాటలెత్తి పలకరిస్తున్నారు. పెళ్ళిచూపులనే తతంగానికీ ఆమాటలకి ఎక్కడా పొత్తులేదు. వాసంతి గొంతు శ్యామ్ వినాలంటే వాసంతి కూడా మాట్లాడాలి కాబట్టి మధ్యమధ్య వాసంతినేదో అడుగుతున్నారు. అయితే ఆ మాటల్లో జవాబుగా చెప్పేవి ఏవి లేకపోవటంతో "ఊ." ఉహూ" తో వుండిపోయింది వాసంతీ.
    అక్కడెవరికీ కూడా జరుగుతున్నది వుషారుగా లేదు. ముఖ్యంగా రాధాకృష్ణకీ అసలునచ్చలేదు. వాసంతి శ్యామ్ సుందర్ ఎదురెదురుగా సోఫాల్లో కూర్చున్నాగాని వాళ్లు తేరిపార చూసుకున్నదిగాని మాట్లాడుకున్నది గానిలేదు. తను శ్యామ్ పక్కనే కూర్చుని వాసంతిని పలకరిస్తే వాసంతి తలఎత్తి తనతో మాట్లాడుతుంది. ఆ మిషతో నయినా వాసంతి శ్యామ్ ని బాగా చూస్తుంది అనుకున్నాడు రాధాకృష్ణ. వెంటనే లేచి శ్యామ్ పక్కనే కూర్చున్నాడు.
    రాధాకృష్ణ మధ్యలోలేచి శ్యామ్ సుందర్ పక్కనే ఎందుకు కూర్చున్నాడో ఎవరికీ అర్ధంకాలేదు.
    రాధాకృష్ణ వుషారుగా మాట్లాడుతుంటే శ్యామ్ కి ఫ్రీగా వుంది. తనూ సరదాగా కబుర్లు చెపుతూ కూర్చున్నాడు. మామయ్య పలుకరింపువల్ల వాసంతికి బిడియం తగ్గింది. మాటల మధ్యలో నాలుగయిదు సార్లు శ్యామ్ ని చూసింది.
    "పెద్దవాళ్ళం మేమే అన్నీమాట్లాడుతున్నాము. మా వాసూని ఏమయినా ప్రశ్నలడగవోయ్ శ్యామ్ సుందర్!" అన్నాడు రాధాకృష్ణ కొద్దిసేపు అయింతరువాత.
    "ఊ. ఉహూహు." అన్నాడు శ్యామ్ సుందర్. మాట్లాడాలని వుందిగాని ఎలాగో తెలియక తికమకపడ్డాడు.
    జోక్ చేస్తున్నట్టు నవ్వుతూ "అరె వాసూ! కాలంమారిపోయింది. నువ్వే అబ్బాయిని ప్రశ్నలేసి పరీక్షచేస్తావేమిటి!" అన్నాడు రాధాకృష్ణ.
    వాసంతి చిరుకోపంతో రాధాకృష్ణవైపు చూసి ఆచూపుని అలాగే శ్యామ్ వైపుతిప్పి ఆపై కనురెప్పలు టపటపలాడించి మిన్నకుండిపోయింది.
    "ఈపిల్ల కోపంలో చాలాచాలా బాగుంది." అనుకున్నాడు శ్యామ్ సుందర్.
    "ఏదయినా మాట్లాడాలంటే మాట్లాడు బాబూ!" అన్నారు వెంకట్రామయ్యగారు.
    శ్యామ్ సుందర్ సందిగ్ధావస్తలో పడిపోయాడు.
    రాధాకృష్ణ మామూలు డాక్టరుగాక సైక్రియాటిస్ట్ గాబట్టి మనుషుల్నే గాక వారి మనసుల్ని కూడా చదవగలడు. శ్యామ్ సుందర్ వాసంతి మనసుల్ని అర్ధంచేసుకుని రంగంలోకి దిగాడు.
    "మా ఎదుట బిడియం అయితే మా వాసంతితో వంటరిగా మాట్లాడే ఏర్పాటుచేస్తాను, పరస్పరం మాట్లాడుకుని అర్ధం చేసుకుని ఏసంగతి చెప్పు శ్యామ్ సుందర్! ఈవిషయంలో మేమేమీ అనుకోము." అన్నాడు రాధాకృష్ణ.
    వాసంతితో వంటరిగా మాట్లాడాలని శ్యామ్ సుందర్ కి వుంది. అదెలా చెప్పాలో తెలియలేదు. ధైర్యం వహించి చెపితే వాళ్ళేమయినా అనుకోవచ్చని ఏమూలో రవంత భయం. ఏంచేయాలో తెలియనప్పుడే రాధాకృష్ణ ఈప్రసక్తి ఎత్తాడు.
    శ్యామ్ సుందర్ కి చాలా సంతోషం కలిగింది," మీ అందరికీ యిష్టమయితే..." అంటూ వాసంతివైపు చూశాడు.
    "నీ యిష్టమే మాయిష్టం అనుకో!" వెంటనే అనేశాడు రాధాకృష్ణ.

 Previous Page Next Page