8
రాధాకృష్ణ శ్యామ్ సుందర్ వాసంతి డాబామీదకొచ్చారు.
ఆరుగంటలు దాటటంవల్ల వీదుల్లోను అన్ని యిళ్ళలలోను కరెంటుదీపాలు కాంతులు విరజిమ్ముతూ వెలుగుతున్నాయి.
పదిహేను నిమిషాలటైమ్ యిచ్చి వాళ్ళిద్దరినీ డాబామీద వదిలి రాధాకృష్ణ కిందకి దిగాడు.
ఇంట్లో అందరికి ఈ ఏర్పాటు ఆమోదంగా వున్నా అది లక్ష్మమ్మకు మాత్రం ఎంతమాత్రం నచ్చలేదు. "మాకాలంలో యిలాంటివి ఎరగం" అంది. ఆవిడమాట ఎవరూ లెక్కచేయలేదు.
వాసంతి డాబాపై పిట్టగోడనానుకుని వీధిలోకి చూస్తూ నుంచుంది. శ్యామ్ సుందర్ కి ఏంమాట్లాడాలో ఎలా పలకరించాలో తెలియలేదు. నాలుగునిమిషాలు గడిచిపోయాయి.
"చూపులకి పెద్ద హీరోలాగున్నాడు. ఉత్తబుద్ధావతారం. నేనే ముందుగా పలకరించి ఓ ఆట ఆడిస్తే..." వాసంతి అనుకుంటూ వుండగానే శ్యామ్ సుందర్ పలకరించాడు. "మిస్ వాసంతీ!" అంటూ.
"తనూ అతగాడిని పేరుపెట్టి పిలిస్తే ఎలా వుంటుంది!" అని అనుకుంటూనే "ఊ" అనేసింది వాసంతి.
"నా పేరు శ్యాంసుందర్. మీకు తెలిసే వుంటుంది మిస్ వాసంతీ!"
శ్యాంసుందర్ మాట్లాడేతీరు వాసంతికి నవ్వు తెప్పించింది. చిన్నగా నవ్వింది.
టైము అయిపోయిందేమో అనుకుని ఒకటికి రెండుసార్లు వాచీవైపు చూసుకుంటూ కంగారుగా ఎవరో తరుముతున్నట్లు అన్నాడు శ్యాంసుందర్.
"పెళ్ళిచూపుల పేరుతో ఆడపిల్లలను శల్యపరీక్షచేసి అవమానించటం నాకు అవమానంగా భావిస్తాను. అందుకే నేను పెళ్ళి చూపులకు వెళ్ళేవాడినీకాదు. మా అమ్మ మాట కాదనలేక ముందుగా ఫోటో చూసి అమ్మాయి నచ్చితే చూద్దాం అనుకునేవాడిని. అందుకే అమ్మ నాన్నగారిని ముందుగా పంపి వాళ్ళకి పిల్లనచ్చకపోవటంతో తప్పించుకునేవాడిని. మీ ఫోటో నాకు నచ్చింది వాసంతీ! అందుకే అమ్మవాళ్ళని పంపాను. వాళ్ళకి నీవు నచ్చావు. నాయిష్టమంటూ అయితే యిలా కాదు వాసంతీ! అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని పరస్పరం అర్ధంచేసుకుని యిష్టపడి పెళ్ళాడితే బాగుంటుందని మాత్రమే. ఈ దేశంలో అబ్బాయి ముందడుగు వేసినా నూటికి తొంభయితొమ్మిది మంది ఆడపిల్లల తల్లితండ్రులే వెనుకాడుతారని నా ఉద్దేశ్యం మరి మీ ఉద్దేశ్యం ఏమిటి వాసంతీ?"
"నిజమే మీరు చెప్పిన నూరు కుటుంబాలలో తొంభైతొమ్మిది మంది వదిలేస్తే నూరో వాళ్ళం మేము." అంది వాసంతి కించిత్ గర్వంతో.
"నా గురించి మీ అభిప్రాయం ఏమిటి వాసంతీ!"
"ఈ కొద్ది పరిచయంతో ఏం నిర్ణయించి చెప్పగలను?"
భుజాలు తడుముకున్నట్లయింది. "నిజమే, నిజమే" అన్నాడు శ్యాంసుందర్.
"పోనీ ఈ కొద్ది ముఖపరిచయం నాలుగు మాటలతోనే నా గురించి మీరు చెప్పగలరా శ్యాంసుందర్?" అంది వాసంతి.
"అపార్ధంచేసుకోనంటే...?"
"ఆ విషయం ముందే ఎలా చెప్పగలను? మీరు చెప్పేదాన్నిబట్టి వుంటుంది" గడుసుగా అంది వాసంతి.
గతుక్కుమన్నాడు శ్యాంసుందర్. ఓసారి వాచీచూసుకున్నాడు. రాధాకృష్ణ పెట్టిన టైము అవుతున్నది కాబట్టి చెప్పదలుచుకున్నది ధైర్యంగా వెంటనే చెప్పేయాలి. ఓసారి కంఠం సవరించుకున్నాడు.
శ్యాంసుందర్ ఏం చెపుతాడో అని చెవులు రిక్కించుకుంది వాసంతి.
"నిజంచెప్పాలంటే మిస్. వాసంతీ! నేను చాలామంది అందమైన అమ్మాయిలను చూశాను. ప్రేమించుకోటం అన్నది తలవను నేను ఇలా అని నేను ఏ అమ్మాయికీ మనసు యివ్వలేదు. నా మనసులో నిలుపుకోలేదు. వాసంతీ! ప్రప్రధమంగా మీ ఫోటో చూడంగానే మరోసారి మరోసారి చూడాలనిపించింది. తర్వాత...ఎలా చెప్పాలో తెలియటంలేదు." అన్నాడు శ్యాంసుందర్.
"ఫరవాలేదు. మీకు చాతనయినట్లే చెప్పండి" అంది వాసంతి.
"అలాగే, బహుశా దీనిని ఆకర్షణ అనే అంటారనుకుంటాను. అలా గుమ్మంలో మిమ్మల్ని చూడంగానే నామతి పోవటమో మీరు నన్ను ఎంతగానో ఆకర్షించడమో ఏదో అలాంటిదే జరిగింది. మొదటి నుండి నా ఉద్దేశ్యం యువతీ యువకులు కొన్నిసార్లు కలుసుకుని స్నేహంగా మనసు విప్పుకుని మాట్లాడుకుని ఒకరి అభిరుచులు ఒకరు అర్ధంచేసుకుని మన్నించుకుని ఆపై పరస్పరము యిష్టపడి పెళ్ళాడాలని, అలా మనవాళ్ళు వప్పుకోరు. మన సాంప్రదాయంకాదని అడ్డుతగులుతారు. అదలా వుంచి, నా అభిప్రాయం మారిపోయింది. వాసంతీ! నేనో నిర్ణయానికొచ్చాను. మీ యిష్టమయితే మిమ్మల్నే వివాహం చేసుకుంటాను. నా గురించి మీ అభిప్రాయం నిర్ణయం చెపితే ఆనందిస్తాను." అంటూ చెప్పదలుచుకున్నది ఆతృతగా చెప్పాడు శ్యాంసుందర్.
వాసంతి వెంటనే ఏం మాట్లాడలేదు. ఆలోచిస్తూ వుండిపోయింది.
"ఇతను చాలామంచివాడుగా తోస్తున్నాడు. మనసులో వున్నది దాచుకోకుండా చెప్పాడు. ప్రధమ పరిచయంలోనే నీవు నీవు ఆనక ఓ వైపు మీరు అంటూ మన్నిస్తూ మరోవైపు పేరుపెట్టి పిలుస్తున్నాడు. అది అతని గడుసుతనంకాదు, తీరు అలాంటిది కావచ్చు. శ్యాంసుందర్ నిజంగా సుందరంగానే వున్నాడు. ఇతన్ని తిరస్కరించటంగాని పెళ్ళి విషయంలో అనంగీకారం ఎవరూ చెప్పరేమో చెప్పలేం. కాని ఇలా చూసి అలా చెప్పటం ఈ కొద్దిసమయంలో కొద్దిపాటి పరిచయంలో మనసు పారేసుకోటం పెళ్ళిదాకా రావటం...ఉహూ...సరీగ లేదు." మరి...
వాసంతి మవునం శ్యాంసుందర్ కి అసహనంగా వుంది. ఇక వుండలేక. "నే చెప్పింది మీకు బాధాకరంగా వుందా వాసంతీ!" అన్నాడు.
"లేదు. లేదు."
"మరి...!"
"ఆలోచిస్తున్నాను."
"నేను తెలుసుకోవచ్చునా?"
"ఆ..." ఆ అనయితే అంది కాని మళ్ళీ మవునంవహించి వూరుకుంది వాసంతి.
శ్యాంసుందర్ కి వాసంతి మవునం చెప్పలేనంత నిస్సత్తువని తెచ్చిపెట్టింది. వాసంతిని అలా చూస్తూ ఇలా నిర్ణయానికొచ్చేశాడు. "ఈ మెరుపుతీగ నా సహచారిణి అయితే ఎంత బాగుండును! ఇది అయ్యే పనేనా!"