వారిరువురి ముఖభంగిమలు చూచిన వాసంతి చిలిపిగా నవ్వుకుంది.
వాసంతి అంతక్రితం పెద్దవాళ్ళ మాట విని జరీబుటాలున్న వైలెట్ కలర్ పట్టుచీర, మ్యాచింగ్ బ్లవుజు, వాలుజడ, జడనిండా పెద్ద జాజీదండ, వస్తువులుమాత్రం సింపుల్ గా ధరించి ఆంధ్రుల ఆడబడుచు అంటే ఇలా వుండాలన్నట్లు తయారయింది. వాసంతికి చీరలయితే వున్నాయిగాని మొదట్లో పట్టుచీరలంటూ లేవు, కాలేజీ గరల్స్ కి పట్టుచీరలు ఫాషనయి ఫ్రెండ్స్ కొనటం చూసి ఓ అరడజను కొంది, తన చీరల్లో ఓ చీర తీసి కట్టుకుంది.
తలుపులుతీసి బైటికొచ్చిన వాసంతి యిందాకటి డ్రస్ మార్చకుండానే వుందని అనుకున్నారు. వాసంతిమాత్రం గదిలోకి వెళ్లి గడియ బిగించగానే చీర విప్పి మంచంమీద విసిరి పారేసింది. ఇల్లుపీకి పందిరేసిన చందంగా పూలమాల డ్రస్సింగ్ టేబులుమీద వుంచి జడ విప్పేసి రిబ్బన్ తో జుత్తు పైకి కట్టుకుని బ్లూ కలర్ ఎలిఫెంట్ ప్యాంటు, మ్యాచింగ్ షర్టు పెద్దపెద్దపూలది, దానిమీద రూపాయిబిళ్ళలంతగుండీలది తొడిగింది. ఆపై తీరుబడిగా ఆలోచిస్తూ విశ్రాంతిగా మంచానికడ్డంగా పడుకుంది. జానకిపిలుపు విని అదే డ్రస్ తో బైటికొచ్చింది.
"తొందరగా చీరకట్టుకురా అబ్బాయొచ్చాడు" అతి చిన్నగా చెప్పింది ఆదిలక్ష్మమ్మ. గట్టిగా చెబితే అవతల అతడు వింటాడేమోనని భయం.
"అతను చూసేది నన్నా! నాముఖాన్నా! నా డ్రస్ నా!" అంది వాసంతి.
"కాస్త నెమ్మదిగా మాట్లాడలేవూ?"
"ఎందుకు మాట్లాడటం?" అంది వాసంతి కావాలని స్వరం పెంచి.
"భగవంతుడా! ఈ పిల్లని మార్చటం నాతరంగాదు" గొణిగినట్లు అని "నువ్వు చూడమ్మా జానకీ! దానిసంగతి" అంది జానకితో.
జానకి పెదవి విప్పకముందే వాసంతి అందుకుంది. "అత్తయ్యా! నేనీ డ్రస్ లో యిలాగే వస్తాను. మీకిష్టంలేకపోతే చెప్పండి. అంతేగాని నచ్చజెప్పి బలవంతాన ఏదో నాచేత చేయించవద్దు. గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నానంటే అరచి గీపెట్టినా తీయను. మీరు తలుపు విరగొట్టాల్సిందే! ఆ...!" అంది బెదిరింపు ధోరణిలో.
ఆదిలక్ష్మమ్మ అవాక్కయి నుంచుంది.
జానకి పరిస్థితి గ్రహించి మసులుకునే మనస్తత్వం గలది కాబట్టి "మేమేమీ అనకముందే కంగారుపడిపోతున్నావు. పద, నాన్నగారు పిలుస్తున్నారు. డ్రస్ దేముందికాని కాస్త బుద్దిమంతురాలిలాగా కూర్చో. అహా.... అలా కోపంగా చూడకు. పదపద" అని వాసంతి రెక్క పట్టుకుంది.
"నాచెయ్యేం పట్టుకో అక్కరలేదు. బాగానే నడవగలను" అంది వాసంతి.
"ఓహ్! నా పెళ్ళిచూపులరోజు గుర్తొచ్చింది. ఇది వాసంతీదేవి పెళ్ళిచూపుల కధ కదూ?" అంటూ వాసంతి జబ్బవదిలేసింది జానకి.
"ప్లేటు ఫిరాయించడం అత్తయ్యకి బాగావచ్చు."
"ఇంకా నయం. ఏ ఎండకాగొడుగు పడతానని అనలేదు మీ మామయ్యలా!" అంటూ ముందుకు దారితీసింది జానకి.
వాస్తి నెమ్మదిగా జానకి వెనుకనే అడుగులు వేసింది.
'ఏంచేస్తావో భగవంతుడా!' అనుకుంటూ ఆదిలక్ష్మమ్మ వాళ్ళ వెనుకనే బయలుదేరింది.
తను ఏంచేయలేనప్పుడు భగవంతుడితో మొరపెట్టుకోటం ఆదిలక్ష్మమ్మకి అలవాటే.
7
ఈనాటి యువతరంమీద సినిమాల ప్రభావం ఎక్కువగా వుంది. ఆడ ఏదీ మగ ఏది అనుకరణలు, ఆలోచనలు ఆవేశం ఈ మూడింటికితోడు ఫోజులు అన్నీ ఎక్కువే. చదువుకున్నా చదువుకోకపోయినా నిజజీవితంలో అమ్మాయిలు కొన్నిరకాలుగా ఆలోచించి అవే ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు.
అమ్మాయి వివాహం కాకముందు చిలిపిగా, గడుసుగా మాట్లాడుతూ, నవ్వుతూ, త్రుళ్ళుతూ అబ్బాయిలంటే లెక్కలేకుండా వుండటమేగాక మధ్యమధ్య వాళ్ళ నాడిస్తూ గడుగ్గా యిల్లా ఫలానా సినిమాలో వాణిశ్రీ లాగానో, జయచిత్ర లాగానో మరో తారలాగానో వుండాలనుకుంటారు. ఆపై అమితాబచ్చన్ కన్నా మూరెడు పొడుగు ఎత్తుగల హీరో భర్తలా వస్తే బాగుండనుకుంటారు. ఆ...పై...పెళ్ళిసీను. పెళ్ళికూతురుగా మేకప్ వీకోడెర్మటిక్ వ్యాన్ షింగ్ క్రీమ్ పెళ్ళికూతురులాగానో లేక హిందీ సినిమాలో తార పెళ్ళికూతురుగా వున్న రూపమో మదినిండా నింపుకుంటారు. ఆపై ఆలోచనలు కూడా యిలాగే రకరకాలుగా సాగుతుంటాయి.
పెళ్ళికూతురంటే బుగ్గలు సొట్టలు పడేటట్లు నునుసిగ్గుతో చిరునవ్వు హమేషా చిలికిస్తూ వుండాలి. ఎవరైనా పలకరిస్తే కనురెప్పలు బరువుగా వాలిపోతుండగా మృదువుగా నెమ్మదిగా జవాబు చెప్పాలి. పెళ్ళికూతురు అలంకరణ భారీపట్టుచీరగాని లేక వైట్ ట్రస్ అదీగాకపోతే ఆరంజ్ లెమన్ కొన్ని రంగుల చీరలు మాత్రమే వాడాలి. అప్పుడు నగలు ధరించాలి. మట్టిగాజులు చీరకి మ్యాచింగ్ గా మోచేతులదాకా వుండాలి, కనుబొమలపై తళుకుతో చుక్కలు చేతుల నిండా గోరింటాకుతో డిజైన్లు చీరని తలపై మేలిముసుగుగా వేసుకుంటే బాగుంటుంది. అది మన సాంప్రదాయం కాకపోయినా సరే. హిందీ సినిమాలలో బెంగాలీ నవలలో అలాగే వుంటుందికదా పెళ్ళి కూతురంటే, కాబట్టి అదీ ముఖ్యమే. అమ్మయ్య యిప్పుడు పెళ్ళికూతురు లక్షణాలు వచ్చేశాయి. కాబట్టి సిగ్గుపడాలి. ఇలా వుంటాయి అమ్మాయిల ఆలోచనలు, ఆ కోవకే చెందిన వాసంతి అలాగే ఆలోచించింది .ప్రస్తుతం తను చీర ధరించలేదు. కాబట్టి సిగ్గుపడనక్కరలేదు .ఎలిఫెంట్ పాంటులో వున్న తను సిగ్గుపడితే టైఫాయిడ్ రోగి ముఖంలా తన ముఖం వుంటుంది. దర్జాగా ఠీవిగా తలఎత్తి గంభీర్యంగా మాట్లాడితే అందంగా వుంటుంది. ఆ అబ్బాయిని చూసి తానెందుకు సిగ్గుపడాలి! ధైర్యంగా చూస్తూ మాట్లాడటమే. ఆ...అంతే అనుకుంది వాసంతి.
గుమ్మందాటుతూనే ఠీవిగా తలఎత్తే నడిచింది వాసంతి.
నిర్లక్ష్యంగా అతనో చూపు చూసి ఆపై తండ్రివైపుకి చూపు మరల్చి "పిల్చారా నాన్నగారూ!" అని అనాలనుకుంది వాసంతి.
హాలులో వాళ్లున్నారు. ఆ గుమ్మం దాటబోతూ అనుకున్నట్లుగానే ఠీవిగా తలఎత్తి శ్యామ్ సుందర్ ని చూసింది వాసంతి. ఎప్పుడెప్పుడు వాసంతిని చూద్దామా అని తహతహలాడుతున్న శ్యామ్ గుమ్మంలో అడుగుల సవ్వడి విని తనూ తలఎత్తి చూశాడు. లిప్తపాటులో శ్యామ్ చూపుల్లో వాసంతి చూపులు కల్సి చిక్కుపడిపోయాయి. కంగారుతో శ్యామ్ చూపులు మరల్చుకుని ఎదురుగా వున్న టీపాయ్ మీద పేపరందుకున్నాడు.
వాసంతి నిర్లక్ష్యంగా శ్యామ్ ని చూసి తండ్రితో మాట్లాడుదామనుకున్నది కాస్తా మర్చిపోయింది. శ్యామ్ చూపుల్లో తన చూపులు కలవగానే విపరీతంగా కళ్ళు చలించాయి. అరసెకండులో శ్యామ్ పైనుంచి చూపు మరల్చుకుంది. కాని సిగ్గుతో బరువుగా వాలిన తల మాత్రం ఎత్తి "పిల్చారా నాన్నగారూ!" అని అడగలేకపోయింది. తలపైకి లేవనంటున్నది. అడుగులు ముందుకు పడనంటున్నాయి.