"ఉహూ, మంచిగానే ఉన్నాడు. డబ్బుకోసం నేనూ చాంగూ ఆలోచించి చిన్న వలపన్నాము. చాంగ్ పుట్టినరోజు, ఈ రోజు మా ఇంట్లో మాతో పాటు విందు ఆరగిద్ధురుగాని రండని పిలిచాను. మైకేల్ నమ్మి రాత్రి డిన్నర్ కి మేడపైకి వచ్చాడు."
"మైకేల్ చాలా జాగ్రత్త మనిషి. మీరు పిలవంగానే వచ్చాడా? నేను నమ్మను."
"మైకేల్ చాలా జాగ్రత్త మనిషి. నేనూ కనిపెట్టాను. చాంగ్ ని మీరు చూచారుగా? అందమైనది. నా ప్లాను ప్రకారం తరచు మైకేల్ కి కనబడుతూ అతన్ని ఆరదిస్తున్నట్టు ప్రేమగా, సిగ్గుగా చూస్తుండేది."
"అలా చెప్పండి మిష్టర్ వాంగ్ యీచూ! మైకేల్ కి వెరైటీ సరుకుకావాలి. నాకు బాగా తెలుసు. నీగ్రోస్, ఫ్రెంచ్, ఆంగ్లో ఇండియన్స్, ఫారెన్ గరల్స్, అన్ని రకాల జాతుల ఆడవాళ్ళను చూసాడు."
"డిన్నర్ కి స్వయంగా చాంగ్ వెళ్ళి పిలవటంవల్ల ఆరాత్రి పైకివచ్చాడు. మా దేశంలో ప్రసిద్ధమైన సూప్, అంటూ మొదట టమేటా సూప్ ని ఇచ్చాము. నిజమే అనుకుని, మా ఆచారం ప్రకారం ముగ్గురం సూప్ తింటూ కూర్చున్నాము. సూప్ లో మత్తు పదార్ధం కలపటం వల్ల మైకేల్ అప్పటికప్పుడే మత్తుగా తల వాల్చాడు. అంతే."
"అంటే, ఆ తర్వాత?..."
"ఏముంది? వెరీ సింపుల్. చకచక మైకేల్ కంఠం నులమటం, ముక్కలు ముక్కలుగా శరీరాన్ని ఖండించి మాంసం మాంసంలో చేర్చటం, బొమికలు బొమికల్లో చేర్చటం చకచకా అయిపోయింది."
"మైకేల్ సామానులన్నీ ఎక్కడ దాచారు?"
"మీ ప్లాన్ అర్ధం అయింది. సామాను గురించి చెపితే శిలువ తీసుకుందామనా?" చూ నావైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు.
"మిష్టర్ చూ! దొంగయినా, దొరయినా జాయింట్ గా పని చేసేటప్పుడు ఒకరినొకరు నమ్మాలి. నేను ఆ శిలువ కాజేసే ఉద్దేశ్యంతో అడగటం లేదు. యధాలాపంగా అడిగాను. సరే, నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మాను. మనం దక్కించుకోబోయే నిది చెరిసగం. సరేనా? ఇహపై ముందు కార్యక్రమం గురించి ఇరువురం చర్చించుకుని చేద్దాం. డబ్బు కోసం మైకేల్ ని చంపినట్లు నన్ను చంపటానికి మాత్రం ప్రయత్నించ వద్దు."
"నా మాటలకు కోపం వచ్చినట్లుంది? సారీ! తొందరపడ్డాను" చూ అన్నాడు.
"నా వద్ద డబ్బు వున్నట్లు చూచావు. మైకేల్ ని చంపినట్లు నన్నూ చంపటానికి ప్రయత్నిస్తే మీ మెడకు మీరే ఉచ్చు బిగించుకున్నట్లు" ముందు జాగ్రత్త పడుతూ అన్నాను.
"మనిషిని నమ్మాలని మీరే చెప్పి మళ్ళీ ఇదేం మాట? బంగారు బాతు బంగారు గుడ్డు రోజుకొకటి మాత్రమే పెడుతున్నదని బాతునే చాపితే పొట్టలో ఎన్ని బంగారు గుడ్లు ఉంటాయో అని ఆశపడితే ఫలితం ఏమయిందో నాకు తెలియంది కాదు. అలాంటి పిచ్చిపని ఎప్పుడూ చేయను."
"గుడ్, నిన్ను నమ్ముతున్నాను మిష్టర్ చూ! ఈ లల్లూరాంగాడి శవాన్ని ఇప్పుడే ముక్కలు చేయవద్దు. నా అనుచరులచేత వీడున్న ప్రదేశం, సామానులు వెతికించి అప్పుడు చూద్దాం వీడి శరీరంలోనే ఏ భాగంలోనయినా దాచాడేమో?"
"సరే అలాగే చేద్దాము."
"ఓసారి ఇప్పుడే మనవాళ్ళకు ఫోన్ చేద్దాము."
"అలాగే."
"నేనూ, వాంగ్ యీచూ ఫోన్ చేయటానికి కిందకు బయలుదేరాము.
7
తెల్లవారుఝాము 4 గంటలు కావస్తున్నది.
"ఊ చేతులు పైకెత్తు!" పిష్టల్ కిందకు పైకి ఆడిస్తూ అన్నాను.
"మోసం ఇదేమిటి? వీళ్ళంతా ఎవరు? నీ అనుచరులా? నన్ను బెదిరించినా, బంధించినా, చచ్చినా ఆ శిలువెక్కడుందో చెప్పను-" వాంగ్ యీచూ కోపంగా ఊగిపోతూ అన్నాడు.
"మిష్టర్ వాంగ్ యీచూ! శిలువెక్కడుందో నాకు తెలుసు."
"అబద్ధం! నాకూ చాంగ్ కి తప్ప ఎవరికి తెలియనిచోట దాచాను. మైకేల్ హత్య బయట పడుతుందేమో అనే భయంతో మైకేల్ ధనాన్ని రెండు మూడేళ్ళదాకా వాడకూడదని పెరటి వేపు భూమిలో పాతిపెట్టి కిచన్ రూమ్స్ పెంచాలంటూ దాని పై గోడ పెట్టించి మరో రూమ్ ఆ వారలోనే కట్టించాను."
"వెరీగుడ్, మనిషికి ఆవేశం తెప్పిస్తే మూర్ఖుడిలా మారుతాడు. నీ నోటినుంచే ఆ కాస్త పూర్తి అయింది. సరే, పిష్టల్ మటుకు మైకేల్ ది కదూ?"
అన్ని రహస్యాలు నాకెలా తెలిసి పోయాయా అని అయోమయంగా ముఖం పెట్టి, అవునన్నట్లు తలాడించాడు వాంగ్ యీచూ.
నా పక్కనున్నతనికి కనుసైగ చేశాను. అతను బైటకు వెళ్ళిపోయాడు.
"నమ్మించి ద్రోహం తలపెట్టావు. నిన్ను మించిన ద్రోహి ఎక్కడా ఉండడు." నవ్వి ఊరుకున్నాను.
బూట్లు టకటకలాడిస్తూ, ఇన్ స్పెక్టర్ పైకివచ్చాడు.
"ఇహ నీపని కానియ్యవచ్చు ఇన్ స్పెక్టర్ భాయ్ నాపని అయిపోయింది" బేడీలు తీసుకుని ఇన్ స్పెక్టర్ వాంగ్ యీచూ వద్దకు నడిచాడు.
"ఇదేమిటి? ఇదేమిటి!" వాంగ్ యీచూ గజగజ వణకిపోతూ అన్నాడు.
"ఓహ్ అసలు విషయం నీకు చెప్పలేదు కదూ? స్మగ్లర్లవల్ల దేశం ఎంతగానో నష్టపోతున్నది. వాళ్ళుమటుకు మకుటం లేని మహారాజుల్లా చలామణి అవుతున్నారు. పోలీసు డిపార్టుమెంటు ప్రభుత్వము కళ్ళుమూసుకుని లేరు, స్మగ్లర్స్ ని బంధిస్తూనే ఉన్నారు. అయితే ఉన్నత పదవులలో ఉన్న ఉన్నతాధికారులు కూడా కొందరు స్మగ్లర్స్ తో చేతులు కలపటం వల్ల సరిఅయిన న్యాయం జరగలేదు. ఈ ఎమర్జన్సీలో స్మగ్లర్స్ ని పట్టుకోవడం, వాళ్ళ ఆస్తులు అక్రమ సంపాదనని తెలిస్తే ఆస్తులను జప్తు చేసుకోవడం అమలు పరిచారు. పెద్ద పెద్ద స్మగ్లర్స్ ని ఎప్పుడయితే ప్రభుత్వం పట్టేసిందో, అప్పుడు కొందరు పెద్ద స్మగ్లర్స్ పరారయ్యారు. మైకేల్ పేరు పొందిన పెద్ద స్మగ్లరు. తనని పట్టుకోవడానికి పోలీసులొస్తున్నారని, తన ఉనికి ఆధారాలతో సహా తెలిసిపోయిందని ఎప్పుడయితే తెలుసుకున్నాడో, వీలయినంత రొక్కం నగలు నాణ్యాలు మూటగట్టుకొని పరారయాడు.