"గుడ్. మరి నీ అసలు పేరు?"
"చూ, నాకు కోపం తెప్పించకు. బెదిరించి నానుండి రహస్యం లాగుదామని చూస్తున్నావు. మైకేల్ తెలియదు ఏమీలేదు. ఈ బెదిరింపేమిటి? నా పేరుతో పని ఏమి? నా నిజమయిన పేరు కావాలంటే చెపుతా. నా నామం జపిస్తూ కూర్చో. పోలీసులు ఎవరికోసమయితే తీవ్రంగా గాలిస్తున్నారో, మద్రాస్, బాంబే, కలకత్తా నగరాలలో పందొమ్మిదిమంది అమ్మాయిలను రేప్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడో, లక్షాధికారి హరేరాంని ఘోరంగా హత్య చేసి అతని ఇనప్పెట్టెలో విలువైన సామాగ్రీ సొంతం చేసుకున్నాడో, ఎవరిపేరు చెపితే మనుషులు హడలి పోతారో, ఆ సాహూచంగల్ నేనే! నా అసలు పేరు అది. అందరికీ తెలిసిన పేరు భగవత్ దాస్."
వాంగ్ యీచూ రెండడుగులు వెనక్కు వేశాడు. "భగవత్ దాస్" అన్నాడు నిర్ఘాంతపోతూ.
"ఊఁ. ఇహ చెప్పు, భయపడే పనిలేదు. మైకేల్ నిజంగా నీకు తెలిస్తే చెప్పదలుచుకుంది చెప్పు. ఆ బిళ్ళ తాళం చెవి వుంటే చాలు. మనపని అయిపోతుంది అంతులేని సంపదతో మనం మీదేశం కాకపోతే మరో దేశం వెళ్ళి రాజాల్లా బ్రతుకుదాము."
"మైకేల్ మరణించి ఉండి, అతని వస్తువులు ఉంటే?" కాసేపు ఆలోచించి అన్నాడు చూ.
"వాడి శవమూ, వస్తువులు కావాలి" అన్నాను.
"మైకేల్ మరణించాడు. నేనే అతన్ని చంపాను. ఇందాక చెప్పానే మైకేల్ ని ముక్కలుచేసి కూర వండించాను. అందరి కడుపులోకి వెళ్ళి అరిగికూడా పోయాడు.
"ఓ గాడ్, ఎంత పనిచేశావ్ చూ! అతని మెడలో పెద్ద శిలువ వుంది, అదీ పోయిందా? నాశనం సర్వనాశనం. ఆ శిలువలో తాళం బిళ్ళను దాచేడు. నాకు బాగా తెలుసు ఈ విషయం" పెద్దగా అరిచాను. కుర్చీలోంచి గబుక్కున లేచి.
"శిలువ ఉంది" నవ్వుతూ అన్నాడు చూ.
"నిజం?"
"నిజం! అయితే, నిది అన్నావ్. ఆ వివరం నాకు చెప్పు. ఇద్దరం చెరిసగంవాటా తీసుకుందాం. నన్ను బెదిరించో చంపటానికి పూనుకోటమో, చేశావనుకో. ఆ శిలువెక్కడుందీ చెప్పను. చావనన్నా చస్తానుగాని, నాతోపాటే శిలువా మాయం అవుతుంది. నీవే చెప్పావుగా మూడూ ఓ చోట చేరితేగాని నిధి రాదని."
"నిన్ను చంపటంవల్ల నాకేం వరగదు. చేతులారా సర్వనాశనం చేసుకున్న వాడినవుతాను. మంచయినా, చెడ్డయినా మనిషిని మనిషి నమ్మాలి మిష్టర్ చూ! అప్పుడే పనులవుతాయి" అంటూ నిధి గురించి కొన్ని విషయాలు దాటేసి చెప్పే విధంగా చెప్పాను చూకి.
చూ ముఖం వెలిగిపోయింది.
"మైకేల్ ని ఎందుకు చంపావు మిష్టర్ చూ!"
"చెప్పి లాభం ఏముంది?"
"మైకేల్ చచ్చినా బ్రతికినా ఒకటే నాకు కావలసింది తాళం బిళ్ళ దాచిన శిలువ. నీ ఇష్టమయితే చెప్పు లేకపోతే, దాచుకో!"
"కోపం తెచ్చుకోకు. నిజం ఏమిటంటే, హోటల్ పెట్టానన్నమాటేగాని పైసా లాభం లేదు. ఇంతవరకు పడిపోకుండా ఇలా లాక్కొస్తున్నానంటే లాభాలొచ్చికాదు. పెట్టుబడిపై కొంచెం మిగిలీ కాదు. మరో పని చేతగాక ఇలా రోజులు దొర్లించేస్తున్నాను. ఓ రోజు రెండు సూట్ కేసులతో ఈ హోటల్లో దిగాడు ఒకతను. అతనే నీవు చెప్పిన మైకేల్. నీవు వర్ణించిన రూపం అక్షరాలా అతనిది. పైగా మెడలో పెద్ద శిలువ."
"అసలు విషయం చెప్పటంలేదు" చూ మాటలకు రవంత విసుగు ప్రదర్శిస్తూ అడిగాను.
"వివరం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మైకేల్ మా హోటల్లో ఏకంగా రెండు నెలలకు బుక్ చేస్తుకున్నాడు. నీలాగే రూమ్ విడిచి బయటకు వచ్చేవాడు కాదు. ఎప్పుడయినా సాయంత్రం వేళల బయటకు వెళితే పూర్తిగా వేషం మార్చుకునేవాడు."
"ఏ విధంగా తయరయేవాడు?"
"చాలాసార్లు రూమ్ లో ఉన్నప్పుడు చూచాను ముందు రెండు పళ్ళూ లేవు. కాఫీ టిఫెన్ కి రూమ్ లోంచి బయటకు వచ్చేవాడు కాదు. బేరర్ రూమ్ లోపలికి అన్నీ సప్లయి చేసేవాడు. మధ్యమధ్య యోగ క్షేమాలు కనుక్కోటానికి నేను రూమ్ లోకి వెళ్ళేవాడిని. అప్పుడు చూచాను. మైకేల్ కి ముందుపళ్ళు రెండు లేనట్లు. బయటకు ఎప్పుడయినా వెళ్ళాలంటే పళ్ళు పెట్టుకునేవాడి నంటినే ఆ పళ్ళు కొంచెం పొడుగ్గా కనిపిస్తూ ఉండేవి.
మైకేల్ పేరు, మెడలో శిలువ క్రిష్టియన్ అనిపిస్తుంది కదా? కాని...ఇక్కడ తిరిగే ముస్ లిమ్స్ తరచు ధరించే దుస్తులు ధరించి ఆ వేషంలో బైటకు వెళ్ళేవాడు. మైకేల్ మీద నాకు అనుమానం వచ్చింది. ఓ రోజు అర్ధరాత్రి అతను రెండో ఆట పిక్చర్ కి వెళ్ళాడు. మారు తాళం చెవితో మైకేల్ రూమ్ తలుపు తెరిచి రూమ్ లో ప్రవేశించాను. మైకేల్ ఓ సూట్ కేసుకి తాళం వేశాడు. మరో సూట్ కేసుకి తాళం లేదు. ఆ రెండు సూట్ కేసులు తెరిచి చూచాను. కళ్ళు చెదిరిపోయాయి."
"ఏమున్నాయి దానిలో?" ఆతృతగా అడిగాను.
"అన్ని వందరూపాయల నోట్లు సరికొత్తవి. కొన్ని లక్షలు వుంటాయి. ఓ పక్కగా బంగారంతో తయారయిన కడ్డీలు, బిస్ కెట్స్ ఆకారంతో బంగారు బిళ్ళలు, కిలో తూగే ముత్యాలు, నాలుగు మణుగులు చిన్న చిన్నవి. ఖరీదెంతుంటుందో తెలియదు. ఓ పిష్టల్ కూడా వుంది. మరో సూట్ కేసులో ఖరీదైన సూట్లు వున్నాయి. అన్నీ చూచాను యధాప్రకారం తాళాలు వేశాను.
నాలుగు రోజులు ఆగి మాటల సందర్భంలో అడిగినట్లుగా, మీదే ఊరు? మీ వాళ్ళెందరు? అంటూ అడిగాను. నావైపు అనుమానంగా చూచాడు. అదేం నేగమనించనట్లు ఉండిపోయాను. తనకి చలామందిపిల్లలుట. భార్య నాలుగేళ్లక్రితం మరణించిందిట. పిల్లలను నాయనమ్మ దగ్గర వుంచి ఏదయినా బిజినెస్ చేసుకుందామని పొట్ట పట్టుకుని ఇలా బైలుదేరి వచ్చాడుట. రెండెకరాల పొలం అమ్మి ఆ డబ్బుతో వచ్చాడుట. ఏం వ్యాపారం చేద్దామా? అని చూస్తున్నాడుట. మైకేలు చెప్పిన సంగతులు ఇవి" శ్వాస పీల్చుకోటానికా అన్నట్లు ఒక్క నిమిషం ఆగాడు చూ.
"దొంగ వెధవ. తనవద్దనున్నదంతా మూటగట్టుకుని నాకు కనబడకుండా దాక్కోవటానికి పారిపోయి వచ్చాడు. ఊ...మంచి కట్టు కథ అల్లాడు. ఆ తర్వాత ఏమయింది. ఏ విషయంలో నయినా నీతో పేచీ పెట్టుకున్నాడా?"