మైకేల్ వెనుకనే బయలుదేరి వెతుకుతూ రంగూన్ దాకా వచ్చాము. రంగూన్ లో మైకేల్ చటుక్కున మాయమయ్యాడు. మైకేల్ ఈ హోటల్లో దిగినట్లు తెలుసుకున్నాము. హోటల్లో దిగిన మైకేల్ హోటల్లో దిగినట్లు తెలుసుకున్నాము. హోటల్లో దిగిన మైకేల్ హోటల్ దాటి బయటకు పోనట్లు మాకు తెలుసు. మరి ఏమయినట్టు? ఈ హోటల్లోనే దాగి ఉన్నాడా? సజీవ సమాధి అయ్యాడా? అది తెలుసుకోడానికి విశ్వప్రయత్నం చేశాము. ఫలితం శూన్యం. నేనో కొత్త ప్లాను వేశాను. బందిపోటు దొంగ భగవత్ దాస్ రెండేళ్ళక్రితం జైలునుండి పరారయి యింతవరకూ పట్టుపడకుండా తిరుగుతున్నాడు.
ఒక దొంగగా డబ్బు విచ్చలవిడిగా వెదజల్లే మారువేషగాడిలా...బందిపోటు భగవత్ దాస్ గా... నేను రూపం దాల్చి నీ హోటల్లో స్థానం సంపాదించాను. నన్ను నమ్మావు. నా అనుచరులు నాతోపాటు నాటకం ఆడి సహకరించారు. లల్లూరాం మరణించాడని చెప్పి, పెట్టెలో పెట్టి మనం కిందకువచ్చాము. అప్పుడు గాలికోసం పెట్టెలోంచి బయటకు వచ్చాడు. నేను కాల్చింది బొమ్మపిష్టల్ లల్లూరాం పొట్ట నొక్కుకుంటూ ముందుకు పడిపోతే వీపుమీద నుంచి రక్తం వచ్చే ఏర్పాటు ముందే చేసుకొచ్చాడు.
నీవు, నన్ను బాగా నమ్మాలని పిష్టల్ తో కాలికీ చేతికీ కాల్చుకుని గాయం చేసుకువచ్చాను. నాపై పూర్తి నమ్మకం ఏర్పడింది. నిధిలేదు, నిక్షేపమూ లేదు. ఆశ మానవుడిని రాక్షసుడిగా మారుస్తుంది. అదే జరిగింది. అన్నట్లు నీ మాటలన్నీ రికార్డు అయ్యాయి. వేరే సాక్ష్యం అక్కరలేదు. ఓ అన్నట్లు నేనెవరో నాపేరు ఏమిటో చెప్పలేదుకదూ? నేను డిటెక్టివ్ ని నాపేరు విజయ్. ఇప్పుడర్ధం అయిందా మిష్టర్ వాంగ్ యీచూ!"
వాగ్ యీచూ తల వంచుకున్నాడు.
8
టబ్ లో కూర్చుని గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తుంటే ప్రాణం హాయిగా వుంది.
వాగ్ యీచూని ఇన్ స్పెక్టర్ కి అప్పగించి ఆ తర్వాత కార్యక్రమం కూడా సాక్ష్యాధారాలతో సహా చక చక కానిచ్చి అక్కడ నుంచి తిరిగి వచ్చాను.
రంగూన్ లో కొత్తగా పరిచయం అయిన ఇన్ స్పెక్టర్ "నా ఆతిధ్యం స్వీకరించవా బ్రదర్!" అని ప్రేమగా అడిగాడు.
"లేదు భాయ్! మరోసారి వస్తాగా అప్పుడు కావాలంటే ప్రామిస్ చేస్తాను" చిన్న పిల్లాడిలా అన్నాను.
చేపట్టిన కేసు దిగ్విజయంగా పూర్తి అయితే నేను నిజంగానే పిల్లాడిలా మారిపోతాను. ఫ్రీగా తిరుగుతూ ఆకతాయి పిల్లాడిలా అల్లరి చేయాలనిపిస్తుంది. నా పెద్ద మనిషి తనం బరువు బాధ్యత అంతా డ్యూటీగా దిగినప్పుడే.
"మీరు ఈ కేసుని ఇంత చక్కగా పరిశోధించారంటే నమ్మబుద్ధి కావటం లేదు బ్రదర్! మీలో హుందాతనం గంభీర్యత చూశాను. ఇప్పుడు కుర్రాడిని చూస్తున్నాను" ఆశ్చర్యంగా అన్నాడు ఇన్ స్పెక్టర్ "ఎస్ నేను కుర్రాడినే ఏ ఆడ పిల్లనైనా అడగండి కాదంటుందేమో! మూడుపదులు నిండని వాళ్ళంతా కుర్రాళ్ళే."
ఇన్ స్పెక్టర్ నవ్వాడు.
స్నానం చేస్తుంటే ఎవరికైనా ప్రాణం హాయిగా వుండి మధురస్మృతులు గుర్తు వస్తుంటాయి. నాకు రంగూన్ ఇన్ స్పెక్టర్ మాటలు గుర్తు కొస్తున్నాయి. టబ్ లో నీళ్ళు చిందగొడుతూ కూర్చున్నాను నీళ్ళు చిందగొట్టే పిల్లవాడిలా.
"పాపం, వాగ్ యీచూ ఊఁ పాపం ఎందుకు! వెధవ పనిచేస్తే వెల్లికింతలా పడక తప్పదు. వాంగ్ పని అంతే అయింది. ఆ పని నా ద్వారా అయింది. హంతకులు దొంగలు స్మగ్లర్లు ఎవరైనా అంతే. ఆ మనస్తత్వం వున్న వాళ్ళకి ఆశ ఎక్కువ. చేసిన మొదటి నేరంతో వూరుకోరు మరో నేరం చేస్తారు. అలా ఎన్నో చేస్తూనే వుంటారు. అందుకే వాళ్ళు మాకు ఈజీగ దొరుకుతారు. ఒక నేరం చేసి తెలివిగా తెరవెనక్కి పోతే పట్టుకోవడం చాలా కష్టం. నేరస్తుడిలో వుండే ఆశ కంగారుతో చేసే తెలివి తక్కువ పనులు అవే మళ్ళీ మళ్ళీ చేయటం మాకు క్లూ యిస్తాయి.
"...ఛత్, వెధవ ఆలోచన. డ్యూటీలో లేను. అందమైన ఆలోచనలు చేయాలి సుందర దృశ్యాలు వూహించుకోవాలి. ఇక్కడ కూడా హంతకులు నేరస్తులు దొంగలు...బుద్ధి లేదురా విజయ్ నీకు!" నన్ను నేనే తిట్టుకున్నాను.
ఎంత ఆలోచించినా అందమైన ఆలోచనలు రాలేదు. సుందర దృశ్యాలు గోచరించలేదు. పాట అందుకున్నాను. "జిల్లు జిల్లు మంటున్నాయ్..." వేడి నీళ్ళల్లో కూర్చుని జిల్లు జిల్లు మంటున్నాయ్. నీళ్ళు వళ్ళు పళ్ళు, అనుకోవటం ఏమిటి పాట పాడినా సహజత్వం వుండాలి. వేడి నీళ్ళ మీద పాట ఏ తెలుగు సినిమాలోనైనా వేటూరి, కాటూరి, వీటూరి ఎవరూ రాసినట్లు లేరే! నేనే ప్రస్తుతం ఓ పాట తయారు చేస్తే!
వేడి వేడి నీళ్ళు ఎన్ని పోసుకున్నగాని
వెచ్చగానె వుండుగాని చల్లగుండవు
వేడిగా వుండు వెచ్చనీళ్ళు
నులి వెచ్చగా వుండు కన్నీళ్ళు
ఏవైనా నీళ్ళేగదరా నాయనా
వేమా రామా విశ్వధాభీ వినరా
ఆ...ఆ...ఆ...ఆ...
తలుపు మీద టక్ టక్ మని చప్పుడైంది. పాట తయారు చేయబోతే పద్యమైంది. అయినా మహా వుషారుగా పాడుతున్న నాకు వళ్ళు మండింది. "ఎవరిదీ! నా కంద సీస బొంద పద్యమునకు అంతరాయము కలిగించిన పాషాండుడు?" గట్టిగా అడిగాను.
"నేనే" బైట నుంచి అర్జున్ అన్నాడు.
"నేనంటే, నీకు ఓ రూపము వూరు పేరు లాంటివి లేవా?"
"అన్నింటికీ సమాధానం చెపుతాను. అయిదు నిముషాలు మాత్రమే టైము ఇస్తున్నా బాత్ రూమ్ నుంచి బయటకి అఘోరించు"
"తప్పదా!"