Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 9

    ఆవేశంగా మాట్లాడాడు లక్ష్మణమూర్తి.

    "తనకున్న తెలివితేటలు మరెవరికి లేవని. మరిదిగారి ఉద్దేశం. ఉద్దేశం వుండగానే సరా! ఊళ్ళు  ఏలటం కూడా రావాలి" అంది సామ్రాజ్యలక్ష్మి వ్యంగ్యంగా.

    "అందరూ కలిసి అనవసరంగా అన్నయ్యను ఆడిపోసుకుంటున్నారు. మీరలా చూస్తూ వుండండి, ఏదో ఒకనాడు అన్నయ్య గొప్ప పని చేసి, మీ అందరి నోళ్లూ మూయిస్తాడు" సుమిత్ర అంది.

    "గొప్పపని అంటే గాడ్సే చేసిన పనేనా? వ్యంగ్యంగా అడిగాడు లక్ష్మణమూర్తి.

    "మనం వాడి గురించి ఇన్ని మాటలు మాట్లాడుకోడం వృధా! బోసు పరాయివాడు కాదు వాడు మంచీ చెడ్డా చూడడం మనందరి బాధ్యతా. వాడి ఉద్దేశాలు బయటపెట్టడు మనం అడిగి ప్రయోజనం లేదు. దీనికి ఏదైనా మనందరం కలిసి ఒక మార్గం చూడాలి" ఆ యింటికి పెద్ద జగన్నాధం అన్నాడు.

    "ఏదైనా చెబితే తెలుస్తుంది, తనా చెప్పుడు, మనం చెప్పింది వినిపించుకోడు. అందరం మరిది గారికి భయపడబట్టే ఆయనగారి ఆటలు సాగుతున్నాయి. ఒకసారి ఆ తాళం పగలగొట్టి. ఆయనగారి గదిలో వున్నవేమిటో చూస్తే. నిజమేమిటో తెలుస్తుంది. పరిష్కారం తెలుస్తుంది."

    భార్య ఆ మాట అనగానే. వెంటనే లక్ష్మణమూర్తి "అవునవును అదొక్కటే మార్గం. అందరం ఒక యింట్లో వున్నాం మనమధ్య రహస్యాలేమిటి? వాడు తన గదిలోకి ఎవర్నీ రానీయడు. గదిలోంచి బయటికి రాంగానే తన గది తలుపులు తాళం వేసేస్తాడు. అంటే మనమెవరం ఆ గదిలో వున్నవి చూడకూడదనేగా! వాడేదో కాని పనులు చేస్తున్నాడని అందుకనే ఇంత రహస్యంగా వుంచడం అని నా అనుమానం" అన్నాడు.

    "నాకు అనుమానమే కాదు, భయం కూడా!" అంది కల్యాణమ్మ.

    "అన్నయ్య ఏం చేస్తే మీకెందుకు?" అంది సుమిత్ర.

    అందరూ బోసుబాబు గురించి, అతని గది గురించీ మాట్లాడుకొంటూ వుండగా బోసుబాబు ఆ గదిలోకి వచ్చాడు.

    బోసుబాబుని చూడగానే అందరి నోళ్లూ టక్కున మూతబడ్డాయి.

    బోసుబాబు అందర్నీ ఒకసారి కలయ జూసి, "నా గురించేనా మీరు మాట్లాడుకుంటున్నది" అని అడిగాడు.

    ఎవరూ పెదవి కదపలేదు.

    "ఊ! అర్ధమయింది. మీ అందరి చర్చా ఒక విషయం గురించే. బోసు గది తలుపులు బ్రద్దలుకొట్టాలి అనే కదా! అవునా సుమీ!" చెల్లెల్ని అడిగాడు బోసుబాబు.

    "అవును" అన్నట్లు తల ఆడించింది సుమిత్ర.

    బోసుబాబుకి కసి పెరిగింది.

    "మీ అందరి దృష్టిలో నేను ఒక పనికిమాలిన వస్తువునైనా అయి వుండాలి. ప్రమాదకరమయిన మనిషినైనా అయివుండాలి. నేను వూహించగలను. మీ ఆలోచనలు అలాగే సాగుతున్నాయి. ఎవరిష్టం వచ్చిన పన్లు వారు చేసుకుంటారు. నావల్ల మీకేమీ అపకారం జరగడం లేదు. మీ అందరికి నామీద ఎంతకింత ఇది?

    ఒకటి మాత్రం గుర్తుంచుకోండి! నేను అల్లాటప్పాపనులు చెయ్యను. తెలివిగల వాడెప్పుడూ తెలివి తక్కువ పనులు చెయ్యడు. నలుగురి నోళ్లలో నానే పని చేస్తాడు. పేపర్ ఫ్రంట్ పేజీలో ఎక్కేపని చేస్తాడు.

    మనం ఒక పని చేశామూ అంటే, బాక్స్ కట్టి పెద్ద పెద్ద అక్షరాలతో ప్రచురించి. పేపర్ ఫ్రంట్ పేజీలో వెయ్యాలి. నలుగురూ దాని గురించే పదే పదే చెప్పుకోవాలి" ఆవేశంగా చెప్పాడు బోసుబాబు.

    "గాంధీ మహాత్ముడే కాదు. ఆయన్ని చంపినగాడ్సే పేరు కూడా ఫ్రంట్ పేజీలో ప్రముఖంగా ప్రచురించారు" వ్యంగ్యంగా అన్నాడు లక్ష్మణమూర్తి.

    "మీకందరికి నన్ను చూస్తే వ్యంగ్యంగానూ, హేళన గానూ వుంది. నేను పనికిమాలిన వాడిని కాదని, ప్రయోజకుడే అని, చూపిస్తాను. ఏదో ఒకపని చేసే నిరూపించుకుంటాను.

    అయితే, నేను ఏం చేసినా సంచలనం కలిగే లాగా మరీ చేస్తాను. పేపర్ ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో నా పేరు ప్రచురణ అయిననాడు నేను చేసినపని చదివిననాడే అందరినోళ్ళూ వెళ్ళపెడుదురు గాని" ఆ మాట అని విసురుగా వెళ్ళిపోయాడు బోసుబాబు.

    "బోసుబాబు అన్నట్లు పేపర్ ఫ్రంట్ పేజీలో గాంధీగారి లాగానో, గాడ్సే లాగానో ఎక్కవచ్చు. వీడేదో కానిపని చేసి కొంపమీదికి తెచ్చిపెట్టేటట్లే వున్నాడు" ఎవరికి వాళ్ళు ఈ మాట అనుకున్నారు. పైకి మటుకూ ఎవరూ ధైర్యంగా అనలేకపోయారు. అప్పటికి ఆ యింట్లో అసెంబ్లీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది.


                                         6


    ఒక రెడీమెడ్ షాపు ముందు జనం మూగారు. అప్పుడు సమయం ఉదయం తొమ్మిది పది గంటల మధ్య. 

    ఆ షాపులో ఏం జరిగిందోగానీ, ఆదరా బాదరాగా ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు కూడా, ఆగి మరీ చూస్తున్నారు ఆ దృశ్యాన్ని.

    ఏ కాస్త వచ్చినా, జనం పనీ పాటా లేనట్లు, అక్కడ గుమికూడి మాట్లాడుకోవడం మామూలే.

    కాకపోతే ఎన్నోచోట్ల నిజ జీవితంలో జరిగినట్లు దినపత్రికలు వున్న తరువాత మరణవార్తలు పడాలన్నట్లు, అంత సామాన్య విషయమూ కాక, వింతలూ విడ్డూరాలలో చేర్చే ఓ వింత సంఘటన జరిగినట్లు అక్కడ చేరిన వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటున్నారు.

    ఆ వీధిలో, లాల్ చంద్ రెడీమేడ్ దుస్తులషాపు పెద్దదీ పేరు పొందిందీ. ఏ షాపులో దొరకని వెరయిటీ దుస్తులు ఆ షాపులో దొరుకుతూ వుంటాయి.

    చిన్నపిల్లలనుంచీ పెద్దవాళ్ళు ధరించే వివిధ రకాలదుస్తులే కాక ఇతర దేశంనుంచీ దిగుమతి అయ్యే ఖరీదయిన గౌన్లు, రకరకాల డ్రస్సులూ అక్కడ దొరుకుతాయి. డ్రస్సులన్నీ చాలా ఖరీదయినవే వుంటాయి. నాసిరకంవి ఆ షాపులో దొరకవు.

    రాత్రి ఎవరో ఆ షాపులో దొంగచాటుగా ప్రవేశించి దాదాపు పదిహేనువేల రూపాయల విలువ చేసే కొన్ని రకాల డ్రస్సులను మాత్రమే తీసుకుని, షాపు మధ్యలో వాటిని పెట్టి వాటిమీద కిరసనాయిలు పోసి తగలబెట్టడం జరిగింది. డ్రస్సులన్నీ అద్దాల బీరువాల్లో వుండడంవల్ల. తగలబెట్టిన చోటుకి దగ్గర్లో బల్లలు లాంటివి ఏమీ లేకపోవడం వల్ల షాపు మొత్తం అంటుకోలేదు. అది ఒక్కటేకాక షాపు అంటుకోకపోవడానికి ఇంకో కారణం కూడా వుండి వుంటుంది.

    ఎటుచూసినా ఆ షాపుకి తలుపులూ కిటికీలు వేసివున్నాయి లోపలికి గాలి జొరబడే వీలులేదు. జేబులో పట్టేంత చిన్న సీసాతోనో, డబ్బాతోనో, కిరసనాయిలు తీసుకువచ్చి డ్రస్సుల్ని, అట్టపెట్టెల్ని పాకెట్లనీ, అలానే వుంచి వాటి మీద కిరసనాయిల్ సల్లి అగ్గిపుల్ల వెలిగించి దుండగుడు మళ్ళీ తలుపుమూసి వెళ్ళటం వల్ల లోపలికి గాలి చొరబడక మంటలు పైకి ఎగిసిపడలేదు.    

 Previous Page Next Page