కూరుకుపోయినట్లుగా అక్కడి కక్కడే, మూడు వంతులు తగలబడి ఆగిపోయాయి.
బూడిదకుప్పలోంచి తగలబడక ఆగిపోయిన గుడ్డ పీలికలు మాత్రం కొన్ని కానవస్తున్నాయి.
ఇది ఎవరైనా కావాలని చేసిన పనా?
ఎవరికైనా లాల్ చంద్ మీద కక్ష వుందా?
ఇది విరోధుల పని కాకపోవచ్చు. విరోధుల పనే అయితే మొత్తం షాపు తగలబెట్టటానికి చూస్తారు. దుండగులయితే సరుకునంతా ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎవరో కావాలని చేసిన పని!
కావాలని ఇలాంటి పని చేసేవాళ్ళు వుంటారా?
వుంటే కారణం వుండి తీరాలి!
అదేమయివుంటుంది?
అది తెలియకనే అక్కడ గుమికూడిన జనం తలోరకం అనుకుంటూ తలలు బద్దలు కొట్టుకుంటున్నారు.
జనానికి అది వినోదంగా వుంటే, పదిహేను, ఇరవైవేల రూపాయలు నష్టపోయిన లాల్ చంద్, నెత్తీ నోరు బాదుకుంటున్నాడు.
తెలిసినంతలో లాల్ చంద్ కి శత్రువు లెవరూ లేరు. శత్రువులు చేసిన పని అయితే మొత్తం తగలబడిపోయేలా చేస్తారు.
ఈ పని దొంగలు చేసి వుంటే మొత్తం దోచుకునివెళ్లి వుండేవాళ్లు.
దొంగలూ కాక, విరోధులూకాక, ఈ పనిచేసిన ఆ మూడో మనిషి ఎవరు?
ఇప్పుడు అక్కడున్న అందరికీ, లాల్ చంద్ తో సహా, విచిత్రంగా కనిపిస్తోంది ఒక్కటే.
తగలబడ్డ దానికి కొంతదూరాన, ఒక అట్ట. ఆ అట్టమీద గిఫ్ట్ ని పాక్ చేసినట్టుగా వున్న బొమ్మ, దాని మీద "ది గిఫ్ట్" అని రాసిన అక్షరాలు. పైన 'బి' అన్న అక్షరం కింద 'పి' అన్న అక్షరం వుంది. షరా మామూలే! అచ్చం ఇది వరకు మారుతీ కారు దగ్గర పడేసిన అట్టలానే వుంది.
జనంలో మాటలు పలురకాలుగా సాగుతున్నాయి.
ఆ షాపులో పనిచేసే సేల్స్ బాయిస్ కంగారుగా అటూ ఇటూ తిరుగుతున్నారు. లాల్ చంద్ మాత్రం జరిగిన నష్టానికి నెత్తీ నోరూ కొట్టుకుంటున్నాడు.
అక్కడ పరిస్థితి ఆ విధంగా వున్న సమయంలో.
ఓ నీలిరంగు స్కూటర్ వచ్చి షాపు ముందు సడెన్ బ్రేక్ తో ఆగింది. ఆ స్కూటర్ లో వున్న మహత్యం ఏమోగానీ జనం గుంపుగా కనపడితే చాలు దానంతట అదే ఆగిపోతుంది.
స్కూటర్ నడుపుతున్న బబిత స్కూటర్ ఆగంగానే దాన్ని ఓ పక్కకు నిలిపి కీన్ ని పాంటుజేబులో వేసుకుని దర్జాగా జీన్స్ పాంటులో చేతులు పెట్టుకుని చాలా కంగారుగా షాపులోకి వచ్చింది.
బబితను చూడంగానే చీరలుకన్నా, మోడరన్ డ్రస్ లు ఎక్కువగా ధరించే అమ్మాయి అని గ్రహిస్తాడు.
బబితకి పట్టుమని పాతికేళ్ళు కూడా లేవు.
మొహం తీరు కూడా పసిపిల్ల మొహంలాగా లేతగా వుంటుంది. బుల్లినోరూ, పెద్ద పెద్దకళ్ళు సూటిగా వున్న ముక్కు బూరెల్లాంటి బుగ్గలు, లాంగ్ బాబ్ చేసిన తల వెంట్రుకలు, గడ్డం మీద ఆమె అందాన్ని రెట్టింపుచేస్తూన్నట్లుగా వున్న అందమైన పుట్టుమచ్చ. ముఖంలో అమాయకత్వం వున్నా, చూడంగానే ఆకర్షించే అందమైన రూపం. బబిత ముఖం చూడగానే అమాయకురాలో, అల్లరి పిల్లో చెప్పలేరు.
"ప్లీజ్ మూవ్!" అని షాపు డోర్ ముందు మూగిన జనంతో అంటూ షాపులోకి జొరబడింది బబిత.
అందమైన ఆడపిల్ల రాగానే అందరికళ్ళూ ఆటోమాటిక్ గా ఆమె వైపు తిరిగాయి.
లోపలికి వెళ్ళంగానే బబిత, "ఓ....! ఇక్కడ జరిగింది దొంగతనమా! మర్డర్ కాదన్నమాట." అంది అక్కడ జరిగిన విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటూ.
బబిత మాటలు విన్న అందరూ ఉలిక్కిపడ్డారు.
లాల్ చంద్ అయితే బిత్తరపోయాడు.
"మీరెవరు?" లాల్ చంద్ బబితను ప్రశ్నించాడు.
"ఐ యామ్ లేడీ జర్నలిస్ట్. బబితను అంతేకాదు ప్రెస్ రిపోర్టర్ ని కూడా. క్విక్ గా వార్తలు అందించడంలో మా పత్రిక 'ది న్యూస్' అందెవేసిన చెయ్యి అని తెలుసుకదా! ఆ పత్రికలో పని చేస్తూంటాను." చక్రాల్లాంటి తన కళ్ళు త్రిప్పుతూ చెప్పి, "అసలు ఇక్కడ జరిగిందేమిటి?" అని అడిగింది.
'ది న్యూస్' లాంటి ప్రముఖ దినపత్రికలో ఆమె పనిచేస్తోందని తెలియగానే అందరూ మరింత క్యూరియాసిటీతో ఆమెను చూడసాగారు.
బబిత ప్రెస్ రిపోర్టర్ అని తెలియగానే లాల్ చంద్ విషయం చెప్పడానికి నోరు తెరిచాడు.
"జస్టేమినిట్!" అంటూ జేబులోంచి పుస్తకం, పెన్నూ తీసి "ఇప్పుడు చెప్పండి!"
లాల్ చంద్ జరిగినదంతా చెప్పాడు.
బూడిద కుప్పని చూపించాడు. "ది గిఫ్ట్" తాలూకా అట్టముక్కని కూడా చూపించాడు.
బబిత ఒక్కసారి అంతా కలయజూసి, పాంటు ఎడమవైపు జేబులోంచి, చాలా చిన్న కెమెరాను తీసింది. అది అరచేతి వెడల్పు మాత్రమే ఉంది. వెంటనే అక్కడ, ఆ బుల్లికెమెరాతో అయిదారు స్నాప్ లు లాగింది. మళ్ళీ కెమెరాని నోట్ బుక్ ని జేబులో పెట్టేసుకుంది.
బబిత వంటినంటుకునే, ఈ బుల్లి కెమెరా, నోట్ బుక్, మరికొన్ని పరికరాలు వుంటాయి. అవికాక స్కూటర్ కిట్ లో డ్యూమ్ లెన్స్ వున్న కెమెరా, అతి ముఖ్యమయిన కొన్ని వస్తువులు, పెద్దసైజు రిపోర్ట్ బుక్, తదితర సామానులు ఎప్పుడూ వుంటాయి. అవసరమనిపిస్తేనే ఆ కిట్ ని ఓపెన్ చేస్తుంది.
సాధారణంగా జేబులోవున్న మినీ కెమెరాతోనూ, మినీ నోట్ బుక్ తోనూ పనికానిస్తూ ఉంటుంది.
బబిత ఈ తఫా ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది.
"నిన్నటి రోజున మీకు ఎవరైనా, ఏదైనా గిఫ్ట్ పంపించారా?" లాల్ చంద్ ముఖంలోకి పరీక్షగా చూస్తూ అడిగింది బబిత.
"ఎవరూ, ఏవిధమైన గిఫ్ట్ పంపించలేదు!" లాల్ చంద్ చెప్పాడు.
"మరి ఆ 'గిఫ్ట్' అని రాసి వున్న అట్టముక్క ఇక్కడ ఎందుకు వుంది?"
"అది తెలిస్తే దాదాపు ఇరవైవేల రూపాయల సరుకు ఎవరు తగలబెట్టారో తెలిసేది! ఈ తగలెట్టిన వాళ్ళే దీన్నికూడా ఇక్కడ తగలెట్టి వుంటారు."
"తగలబెట్టిన వాళ్ళు అంటున్నారు. ఆ తగలబెట్టిన వాళ్ళు ఎంతమంది?"
"వాళ్లో, వాడో, ఆమె ఎవరో ఎవరికి తెలుసు?" అసలే లబలబలాడుతున్న లాల్ చంద్. మరింత లబలబ లాడుతూ అన్నాడు.
ఏదో అర్ధమయినట్లుగా "ఐసీ" అంది బబిత తల పంకిస్తూ.
ఒకసారి నలువైపులా కలయజూసి "ఎవరైనా ఈ 'గిఫ్ట్' అని రాసివున్న అట్టముక్కను ముట్టుకున్నారా?" అని అడిగింది.
"ముందు నేను ముట్టుకొని చూశాను. ఆ తరువాత మా షాపులో సేల్స్ బోయిస్ కొంతమంది ముట్టుకుని చూశారు" లాల్ చంద్ చెప్పాడు.