"నిజమే చెబుతాను. అయితే విని నువ్వు బాధపడవద్దు. పగలు షాపులో పనిచేస్తున్నాను కదా! కానీ ప్రతిఫలం చాలా తక్కువ. ప్రస్తుతానికి ఆ చిన్న ఉద్యోగం తప్ప ఇంకేమీ చేయటానికి దరిదాపుల్లో ఏ ఉద్యోగమూ కనపడడం లేదు, రాత్రిళ్లు నేను...." పాండురంగం ఆగిపోయాడు. ఆపై చెప్పడం ఇష్టంలేక.
భర్త జబ్బ పుచ్చుకుని బలంగా వూపుతూ "ఊ....ఆపై ఏమిటో పూర్తి చెయ్యండి." ఆత్రుతగా అంది కామాక్షి.
"నాకే వ్యాధీ లేదు. వంట్లో శక్తి కూడా బానే వుంది. రాత్రిళ్ళు కొందరి దగ్గరికివెళ్ళి రిక్షా అద్దెకి తీసుకుని రెండు మూడు గంటలు టైము ఏమైనా బాడుగలు వస్తే చూసుకొని బండి మళ్ళీ వాళ్ళకి అప్పగించి తెల్లవారు ఝాముకల్లా మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాను.
ఇది అడుక్కోటం కాదు కష్టపడి పని చెయ్యడమే. అయినా నువ్వు బాధపడతావని, మీ యింట్లో వాళ్ళు బాధపడతారని, నేను చేసేపని మీ యింట్లో ఎవరికీ తెలియకూడదని చూశాను. కయీ నీవు పసిగట్టేశావు. నేను ఈ పని చెయ్యటం తప్పా కామాక్షి?" జాలిగా అడిగాడు పాండురంగం.
"ఖచ్చితంగా తప్పే!" అంది కామాక్షి.
"తప్పా" తెల్లబోయాడు పాండురంగం.
"ముమ్మాటికీ తప్పే. మీ వంట్లో శక్తి వుండొచ్చు కానీ ఇలాంటివి మనకి అలవాటు లేని పనులు అలవాటు లేని పనులలో తలదూరిస్తే శరీరం శ్రమకి ఓర్చుకోలేక వ్యాధిగ్రస్తమవుతుంది. ఇంకెప్పుడూ అలాంటి పనుల జోలికి పోకండి. మనకి మంచిరోజులు రాకపోవు. అలసిపోయి వచ్చారు ఇంక పడుకోండి!" అంటూ కామాక్షి భర్తని మెత్తగా మందలించింది.
"అదికాదు కామాక్షి!" పాండురంగం ఏదో చెప్పబోయాడు.
"నాకేమీ చెప్పవద్దు పడుకోండి! మనం ఇలా మాట్లాడుకుంటూ కూర్చుంటే అవతల తెల్లవారి పోతుంది. ఈ కాస్త నిద్ర కూడా వుండదు." అంటూ కామాక్షి కళ్ళు మూసుకుంది.
ఆ తరువాత పాండురంగంకూడా 'అదికాదు. ఇది' అంటూ రెట్టించలేదు, తీవ్రంగా ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు.
"పిచ్చి కామాక్షి! తన మాటలు ఎంత తేలికగా నమ్మింది- నిజం చెబితే తను భరించలేదు. బాధపెట్టే ఒక్క నిజంకన్నా, వినినా బాధపడని ఒక అబద్ధం మంచిది. తను చేసే పనిలో ఎంత థ్రిల్లింగ్ వుంది. టెన్షన్ వుంది. ఎంత మజా వుంది! అన్నింటికన్నా ఎవరూ వూహించని తమాషా వుంది.
బయటపడితే భయంకరమైనది ఎప్పటికీ బయట పడకపోతే థ్రిల్లింగ్ థ్రిల్లింగ్ గా వుండేది. ఆ పని చెయ్యడానికి మొదట తను భయపడ్డాడు గానీ, తలదూర్చిన తరువాత సరదాగానే వుంది. డోంట్ కేర్! ఈ ప్రపంచం నాశనం కానీ తనకేమిటి?
పెద్దవాళ్ళు, పెద్ద తలకాయలు ,రాజభోగాలు, ఈ శక్తులు సామాన్యమైనవి కావు. ఒక్క అబద్ధంతో కామాక్షి నోరు మూయించగలిగాడు ఇకపై కామాక్షి కన్నుగప్పి తను బయటకి వెళ్ళాలి. కామాక్షి కన్ను గప్పాలంటే ఆమె నిద్రపోయేటట్లు చూడాలి. ఆమెకు తెలియకుండా తన పని పూర్తిచేసుకు రావాలి.
తను బయటకి వెళ్ళాలి అనుకున్నరోజు కామాక్షికి మంచి నీళ్ళలో కలిపి నిద్రమాత్ర ఇస్తేసరి. అలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తృప్తిగా నిద్రలోకి జారుకున్నాడు పాండురంగం.
పిచ్చి కామాక్షి! భర్త చెప్పింది నమ్మింది. ప్రస్తుతానికి మాత్రం ఆమె భర్తను అనుమానించలేదు.
పాండురంగం ఆడిన అబద్ధం చిన్నదీకాదు. మామూలిదీ కాదు.
5
అందరూ హాల్లో సమావేశమయ్యారు.
ఒక్కోయింట్లో ఒక్కో అలవాటు వుంటుంది. ఎవరి దోవన వాళ్ళు పని చేసుకుపోవటం. పనయినపుడు, వీలయినపుడు కూర్చొని కబుర్లాడుకోడమో చేస్తూంటారు.
కానీ ఈ యింట్లో అలా కాదు.
ముందుగా ఒకళ్లు వచ్చి హాల్ లో కూర్చుంటారు. ఇల్లుచిమ్ముతున్న కోడలు ఏదో చిమ్మాను అనిపించి చీపురు మూలనపడేసి తనూ వచ్చి కూర్చుంటుంది.
సగం వంటలో వున్న కల్యాణమ్మ ఆ....వంటకాక పోతుందా! అనుకుంటూ, గ్యాస్ పొయ్యి తగ్గించో, లేక పూర్తిగా ఆపో ఆమె కూడా వచ్చి ఈసురోమంటూ ఓ పక్క చతికిలబడుతుంది. అలాగే మిగతావాళ్లు__
మొత్తానికి ఆ యింట్లో అందరికీ రోజు మొత్తం మీద ఒకసారో, రెండుసార్లో అలా సమావేశమై ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆ పూటకి వాళ్ళ ప్రాణాలకి పెద్ద వెలితిగా వుంటుంది.
అలా సమావేశమైన తరువాత.
ఇంట్లోవాళ్లు ఇంట్లోవాళ్ళనో, లేకపోతే ఇంట్లో వాళ్ళంతా కలిసి ఊళ్ళోవాళ్ళనో తూర్పారపడుతూ కాలక్షేపం చేస్తారు.
ఇంటిలో వాళ్ళ గురించీ కానీ మాట్లాడుకోడానికి ఏమీ దొరక్కపోతే వెళ్ళి వెళ్ళి రాజకీయాల మీద పడతారు.
ఇక మిగిలింది బోసుబాబు ఒక్కడే.
అతనికి దిక్కుమాలిన రాజకీయాలంటే మహామంట, ఇండిపెండెంట్ గెలవటానికి కూడా ఇష్టపడడు.
"నిరుద్యోగులకి ఉపాధి కల్పించలేని వీళ్లు వున్నా ఒకటే వూడినా ఒకటే" అని అంటాడు.
అక్కడితో ఆగక, ఎన్నికలప్పుడు పోలింగ్ బూత్ కివెళ్ళి, ఓటు మీద ముద్ర గుద్ది వస్తాడు. ఆ ముద్ర ఏ పార్టీకి కాదు, ఇండిపెండెంటుకీ కాదు, బ్యాలెట్ పత్రంమీద ఖాళీగా వున్న చోట ముద్రవేసి మరీ వస్తాడు.
ఆ ఇంట్లో ఆ హాల్ కి "అసెంబ్లీ" అని బోసుబాబే ఓ చక్కటి పేరు పెట్టాడు.
ఇప్పుడు ఆ యింట్లోని వివిధ పార్టీలవాళ్లూ, అసెంబ్లీ హాల్లో సమావేశమయ్యారు.
ప్రస్తుతం అక్కడలేనిది బోసుబాబు ఒక్కడే.
జరుగుతున్నా చర్చ బోసుబాబు గురించి.
"నిరుద్యోగమా నీకో నమస్కారం సినిమాలో క్రొత్త హీరో, కన్నబాబు అచ్చం అన్నయ్య లాగా వున్నాడు సుమిత్ర అంది.
"నీకు నోరు తెరిస్తే సినిమాలూ, నవలలూ ఇలా అయితే బాగుపడవే! ఇప్పుడు ఇంట్లో మీ అన్నయ్య ఒకడు తలనొప్పిగా తయారయ్యాడు. వాడికితోడు ఇప్పుడు నీవు కూడా తయారయితే, మా కింక రోజూ ఎడా పెడా వాయింపులే" కల్యాణమ్మ విసుక్కుంటూ అంది.
"అన్నయ్యనేమీ అనకమ్మా! వాడు చక్కగా చదువుకున్నాడు. ఏ ఉద్యోగమూ రాక అలా తయారయ్యాడు" అంది సుమిత్ర.
తనకన్నా బోసుబాబే సుమిత్రకి ఇష్టమని లక్ష్మణమూర్తికి తెలుసు. సుమిత్ర బోసుబాబుని సమర్ధించగానే లక్ష్మణమూర్తికి తిక్క ఎక్కుతుంది.
"నాలుగేళ్ళు ఆగితే, వాడికి తోడుగా నీవు తయారవుదువు గాని. పట్టుమని పది ఉద్యోగాలకి ప్రయత్నించాడో లేదో, అప్పుడే జీవితం మీద అంత విరక్తి అసలు అది విరక్తి కాదు, ఒళ్లు పొగరు. కష్టపడాలి, తిరగాలి, ప్రయత్నించాలి.