క్రిష్ణ తనలోతాననుకున్నాడు. చదువులోకన్నా లోకానుభవం ఎక్కువగా గడించటంవల్ల.
"అమ్మ మా మేలుకోరే చెబుతుంది. అమ్మ ఎలా చెబితే అలా చేస్తాను." రఘు తృప్తిగా అనుకున్నాడు.
"అమ్మకు వైలెట్ కలర్ పట్టుచీర కొనిపెడతాను. నేను ఉద్యోగం చేసేటప్పుడు. చీరచూసి అమ్మ ఎంత సంతోషిస్తుందో" అనుకుంది శకుంతల. వంటగదిలోంచి పిలుపు వచ్చేదాకా ఎవరి ఆలోచనలో వారు ఉన్నారు.
8
బి.ఎ. పాస్ అయింతరువాత రఘు ఐ.ఎ.ఎస్. పరీక్షకు కూర్చున్నాడు. ఒక్కోసారి విధిముందు తెలివిగలవారు కూడా అపజయం పొందుతుంటారు. రఘు పని అలాగే అయింది. చీకట్లో వెలుగురేఖలా బ్యాంక్ లో ఉద్యోగం వచ్చింది వెంటనే.
మంచి ఉద్యోగం వచ్చినందుకు పార్వతికన్నా రఘు సంతోషపడ్డాడు. ఉద్యోగం వచ్చిందికదా అని యింట్లో ఖర్చులు పెరగలేదు. తల్లి మాట జవదాటటం రఘుకు ఎప్పుడూ అలవాటులేదు. కాకపోతే మొదటిజీతంలో శకుంతల కోరిక తీర్చాడు, అన్నమాట ప్రకారం వైలెట్ కలర్ పట్టుచీర కొనిపెట్టి.
రఘు ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకు కృష్ణ ఇంటర్ సెకండ్ క్లాసులో పాస్ అయ్యాడు. ఇహపై చదువులు చదవను. వ్యాపారం పెడతానని మొండిపట్టుపట్టి కూర్చున్నాడు.
పార్వతి కళ్ళముందు డాక్టర్లు ,లాయర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు గిర్రున తిరుగుతున్నారు. రఘు ఆఫీసునుంచి వచ్చింతరువాత కృష్ణ విషయం గట్టిగా మాట్లాడదామని ఎదురు చూస్తూ కూర్చుంది.
రఘు వచ్చేటప్పటికి కృష్ణ కూడా వచ్చేశాడు. ఓ అరగంట ఆగి మెల్లగా విషయం కదిపింది పార్వతి.
"వ్యాపారమంటే ముందుగా డబ్బు పెట్టుబడి పెడతాము ఎలాగో అలాగా. వ్యాపారం దినదినాభివృద్ది కావాలి కానీ కాస్త నష్టం వచ్చినా చెరువుకి గండిపడినట్లే. వ్యాపారం చేయటం ఇంటావంటాలేదు. తెలియని వాటిల్లో తల దూర్చటం మంచిదికాదు. ఇంతకన్నా పెద్దచదువులు చదివితే నయం." అంది పార్వతి.
నీ అభిప్రాయం ఏమిటన్నట్లు తమ్ముడివైపు చూశాడు రఘు.
"పెట్టుబడి వేలు పెట్టనక్కరలేదమ్మా! ముందు వందలతో ప్రారంభించి లాభాన్నిబట్టి మనీ పెంచుదాము. వ్యాపారం చెయ్యటానికి లోకానుభవము, మెళుకువా వుంటే చాలు. తాతలనుంచీ వారసత్వం రానక్కరలేదు. పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఏమిటి? ప్రతివారూ డాక్టర్లూ, కలెక్టర్లూ కాలేరు. వెయ్యిమంది ప్రయత్నిస్తే సీటు వచ్చేది ఒక్కడికి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన అన్నయ్యకు ఏమి వచ్చింది! రాత్రింబవళ్ళు నీవు నూరిపోయబట్టే యీ పరీక్షయినా గట్టెక్కాను. ఇహపై ఆ నమ్మకం కూడాలేదు. నీ ఆశీర్వాదబలంవుంటే లాయర్లూ, డాక్టర్ల కన్నా ఎక్కువ సంపాదిస్తాను. నేను పైకి రాలేనని నమ్మకం గట్టిగా వుంటే చెప్పమ్మా! నా ఆశ చంపుకుని నీకోరిక తీరుస్తాను." అన్నాడు కృష్ణ.
కృష్ణ కార్యవాది. ఎదుటివారు చెప్పింది వింటానంటూనే తనమాట నెగ్గించుకుంటాడు. నేర్పూ, ఓర్పు సమానంగా వుంది. పైగా రఘులాగా చువ్వలాంటి మనిషి కాదు. చురుగ్గా చూచే కళ్ళు, గంభీరమైన విగ్రహం. అందుకేనేమో పార్వతి కూడా ఒక్కోసారి వెనక్కు తగ్గుతుంది.
"మాట్లాడవేమమ్మా?" అన్నాడు కృష్ణ, తల్లి మౌనం వహించటం చూచి.
"నీ అభిప్రాయం ఏమిటి రఘూ!" అంది పార్వతి.
తల్లి కోర్కె, తమ్ముడి అభిప్రాయం తెలిసిన రఘుకి ఏంచెప్పాలో తోచలేదు. చివరికి ... "చదువుకోటమూ మంచిదే, బిజినెసూ మంచిదే. దేనిలో అయినా కృషికి అదృష్టం కలిసిరావాలి" అన్నాడు నిదానంగా.
"కరెక్ట్ బ్రదర్! చక్కటి మాట శలవిచ్చావ్! ఏమంటావమ్మా!" రఘువైపు మెచ్చుకోలుగా చూచి వెంటనే వినయంగా తల్లినడిగాడు కృష్ణ.
"నీ యిష్టం కృష్ణా! మరోసారి ఆలోచించు," అంది పార్వతి స్పష్టంగా కృష్ణ అభిప్రాయం తెలుస్తుంటే చదువుకోవటమే మంచిదని గట్టిగా చెప్పలేకపోయింది.
అప్పటికి ఆ చర్చ కట్టిపెట్టి రఘు పెళ్ళి విషయం ఎత్తుకున్నారు.
"నిన్న మహిళామండలికి వెళితే వకుళమ్మ పెళ్ళి సంబంధం మాట ఎత్తింది. నిన్ను కనుక్కుని చెపుతానన్నాను." పార్వతి అంది.
"ఇప్పుడు నా పెళ్ళికేం తొందరమ్మా! శకుంతలకు యిరవై ఏళ్ళు రాబోతున్నాయి. ముందు దానికి చూద్దాము." తలవంచుకుని చిన్నగా అన్నాడు రఘు.
"శకూకి యీ ఏడుతో బి.కామ్ పూర్తి అవుతుంది. కుదిరితే పెళ్లి లేకపోతే పైచదువు. దాని పెళ్లి చేయాలంటే కన్నెధార పోయటానికి నీ పెళ్ళయి వుండాలి" పార్వతి లోలోపల బాధపడుతూ అంది.
"అహా!" అని వూరుకున్నాడు రఘు.
"బాగా డబ్బున్నవాళ్లా?" కృష్ణ అడిగాడు.
"కొద్దోగొప్పో వున్నవాళ్ళే. పదిమంది బలగం వుంది. అవసరానికి పదిమందీ ఆదుకుంటారు__"
పార్వతి మాట పూర్తిచేయకముందే కృష్ణ అడ్డం తిరిగి....."మననెవరు ఆదుకున్నారమ్మా! పదిమంది వుండగా సరా?" అన్నాడు.