Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 10

    "అల్లుడిని కదా, ఏదీ కాదనరులేరా కృష్ణా!"
    "మొత్తానికి అల్లుడి హోదా నిలుపుకునేటట్లున్నావు అన్నయ్యా!" నవ్వుతూ అన్నాడు కృష్ణ.
    "చదువుకున్నది, పిల్ల బాగుంటదట. పిల్ల నాన్నగారు అన్నయ్య బ్యాంకీకొచ్చి నీకు తెలియకుండా నిన్ను చూశారట. మీరు "ఊ" అంటే పెళ్లిచూపులు ఏర్పాటుచేస్తానని వకుళమ్మ యిప్పటికి పదిసార్లు చెప్పింది. నీవు గట్టిగా వద్దంటే వకుళమ్మతో చెపుతాను."
    తల్లిముందు తండ్రిమాట ఎత్తటం ఏనాడో మరిచిపోయాడు రఘు. "తల్లీ తండ్రీ యీ జన్మకు కలుస్తారన్నది లేదు. తనపెళ్లి అయితేనే శకుంతల పెళ్ళి. నిండాపాతికేళ్ళు లేకపోయినా జీవిత సహచారిణి కావాలని యీ మధ్య పదేపదే అనిపిస్తున్నది. తను పెళ్లిచేసుకోటమే అమ్మ అభిప్రాయం కూడ." రఘు ఆలోచించాడు.
    ఈ విషయంలో తన జోక్యం అనవసరం అనుకుని కృష్ణ పత్రిక తిరగేస్తూ కూర్చున్నాడు.
    "నీకెలా మంచిదనిపిస్తే అలా చెయ్యమ్మా!" అన్నాడు రఘు.
    "వకుళమ్మతో చెబుతాను. పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని"
    "అలాగే" అని కూర్చున్న చోటునుంచి లేశాడు రఘు.
    పార్వతికి మధుసూధనం గుర్తుకు వచ్చాడు.
                                          9
    సాయంత్రం అయిదు గంటలయింది.
    కృష్ణ మాటిమాటికి గుమ్మంవైపు చూస్తూ కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్నాడు. పది నిముషాలు కాగానే గేటు వద్దకు వెళ్ళి వీధిచివరంటా చూచి చిరాకుపడుతూ ఇంట్లోకి వచ్చేశాడు.
    మరో పావుగంటకు పార్వతి యింట్లో కాలుపెట్టింది.
    రాత్రి తొమ్మిది ,పదిగంటలకు తప్ప యింట్లో వుండని కృష్ణ ఈరోజు ఇంట్లోనే వుండటం చూచి రవంత ఆశ్చర్యం పొందింది. పెరట్లోకెళ్ళి కాళ్ళూ చేతుకు కడుక్కుని వంటింట్లోకి వచ్చింది. శకుంతల కనపడలేదు. ప్లాస్క్ లో చూస్తూ కాఫీ వుంది. వున్న కాఫీని రెండు కప్పుల్లో పోసుకుని ముందుగదిలోకి వచ్చింది పార్వతి.
    "శకుంతల ఎక్కడికి వెళ్లిందిరా కృష్ణా" అంది పార్వతి కాఫీకప్పు కృష్ణకు అందిస్తూ.
    "స్నేహితురాలింటికి వెళ్లివస్తానని నేరాంగానే వెళ్లింది. ఇంతకుముందే తాగాను కాఫీ, ఊ__సరేలే ఇవ్వు తెచ్చావుగా" అన్నాడు కృష్ణ.
    "పెందరాళే యింటికివచ్చావు, పని అయిపోయిందా."
    "రోజూ వుండేపనేకదమ్మా, విసుగ్గా వుండి వచ్చేశాను."
    కృష్ణ చెప్పింది పూర్తి నిజంకాదేమో అనిపించింది పార్వతికి. "ఊ" అని కాఫీ తాగుతూ కూర్చుంది.
    తల్లికి ఏదో చెప్పాలని రెండుసార్లు తలఎత్తి చూచి ఆలోచిస్తూ కూర్చున్నాడు కృష్ణ. ఆ సంగతి గ్రహించింది పార్వతి. ఏదన్నావుంటే దాచుకోడు వాడే చెబుతాడు అనుకుంది.
    "అమ్మా! అన్నయ్య అత్తవారికేం తీసిపోరు శకుంతల అత్తగారి తరుపువాళ్ళు." అన్నాడు కృష్ణ.
    "ఏం? యిప్పుడేమయింది?" అంది. ఏం జరిగిందో అని ఆత్రుతపడిపోయింది పార్వతి.
    మరో రెండు నెలల్లో శకుంతల పెళ్లి జరగబోతున్నది. రఘు అత్తవారి తరుపు బందువుల్లోనే సంబంధం కుదిరింది. పిల్లవాడు రూపవంతుడు, గుణవంతుడు. ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు ఏడువందలదాకా వస్తుంది. ఎన్నో సంబంధాలు చూచాడు. ఒక్కపిల్లా నచ్చలేదు. శకుంతల అందం పిల్లవాడిని కట్టిపడేసింది. శకుంతలను తప్ప చేసుకోనని కూర్చున్నాడు. పిల్లవాడి పేరు శ్రీపతి.
    శకుంతల ,శ్రీపతి భార్యాభర్తలయితే చూడముచ్చటగా వుండటమేగాక ఒండొరులు సుఖపడతారని అనిపించింది పార్వతికి. కృష్ణ బంధువులమాట ఎత్తేటప్పటికి ఆందోళన కలిగింది. "ఏమయిందిరా కృష్ణా?" అంది మామూలుగా అడిగినట్లు.
    "శ్రీపతి బావగారికి ఏదో చుట్టం అవుతాడట, ఇవాళ మా షాపుకి వచ్చాడు. వచ్చినవాడు ఎంతవరకో అంతవరకు వుండాలి. అధికప్రసంగం మొదలుపెట్టాడు. "శకుంతలకు శ్రీపతిలాంటి భర్త దొరకటం మన అదృష్టంట." వెంటనే నవ్వుతూనే అన్నాను. "శ్రీపతి బావగారికి మా అక్క దొరకటం మీ అదృష్టం" అని...వెంటనే షాపులో వాళ్ళు, కష్టమర్స్ చూచేటట్లు పెద్దపెట్టున ఓ వెధవ నవ్వు నవ్వాడు. శ్రీపతి వైపు వేలెత్తి చూపించే ఏ వంకాలేదట. ఆడదానివైపు వేలెత్తి చూపుతారట కాస్త వంకవున్నా? అన్నీవున్నా ఆడపిల్లకు పెళ్ళికావటం కష్టంగావున్న రోజులట యివి?"
    "ఇలా అంటుంటే ఒళ్ళుమండింది. శకుంతల అత్తారి వేపు బంధువు కాబట్టి సరిపోయింది. మరొకడయినట్లయితే మెడపట్టుకు గెంటేవాడిని" కృష్ణ కోపంతో నొసలు ముడేసి అన్నాడు.
    "ఏదో అన్నాడని అంతకోపం ఎందుకురా కృష్ణా? మనుషులంతా ఒకే విధంగా వుంటారా?"
    "అక్కడితో ఆగితే ఫరవాలేదమ్మా - ఆయన ఎలా మాట్లాడాడో అచ్చం అలా చెపుతా విను. నీకే అర్ధం అవుతుంది......నీపేరేమిటన్నావ్, ఆ ...కృష్ణమూర్తనికదూ__? చూడు మూర్తీ! మీ నాన్నగారు దేశాలు పట్టుకుపోయారటగా! లోకులు తలా ఓవిధంగా అంటారోయ్, అవి మనం పట్టించుకోకూడదు. ఏం జరిగిందో ఎవరికీ తెలీదుకదా! అదలావుంచు. మీ అమ్మనోట్లో నలుకున్న మనిషి కాబట్టి మిమ్మల్ని యింతవాళ్ళను చేసింది. అందరాడాళ్ళకీ అది సాధ్యమా? అని పంతులమ్మ వుద్యోగం చేస్తూ, ఇంకా చదువుకుని లెక్చరర్ అయిందంటే మాటలటోయ్! మహిళా మండలి ప్రెసిడెంటట. ఆ మధ్య ఓ పెద్దమనిషి ఏదో అన్నాడని నలుగురిలో పట్టుకు దులిపేసిందట. అంత మొగాడూ నోరెత్తలేదట __ విడ్డూరంగా చెప్పుకుంటున్నారనుకో. ఒంటరి ఆడది మెత్తగా వుంటే సమాజం అణచి పారేస్తుంది. ఆడదానికి కూడా మంచి ధైర్యం లేకపోతే లాభం లేదోయ్ మూర్తీ! అన్నట్లు పెళ్ళికూతురికి మీ అమ్మ తెలివితేటలూ, ధైర్యం వచ్చాయా? లేక మీ నాన్నగారిలా మెతక మనిషా?" ఇదమ్మా ఆ వృద్ధజంబూకం అంది" యాక్షన్ చేస్తూ చెప్పాడు కృష్ణ.

 Previous Page Next Page