Previous Page Next Page 
మారనికాలంలో మారినమనుషులు పేజి 8

    రెండుసార్లు డబ్బు పంపింది. అది నేరం అయింది. దాచే డబ్బులోంచి పంపు అని రాస్తుందా? ఇదంతా తన మెతకదనం. వింటున్నకొద్దీ ఆడిస్తారు. అందుకే ఇహపై కానీ పంపటానికి వీలులేదంటూ రాస్తూ మరో నాలుగు ముక్కలు రాసింది. ఉండటానికో యిల్లు ఉండి ఆ యింటిమీద అద్దెలు వస్తూ ఉండగా నన్ను డబ్బు పంపమనటం న్యాయంకాదు అని. ఉత్తరం చదివి ఏమనుకుంటుంది? దీనికి పొగరుపట్టింది అనుకుంటుంది. అనుకోని నలుగురితోపాటు పిన్ని, అంతేగా? నా పిల్లలు నన్నర్ధం చేసుకుంటే చాలు. కిష్టుడి తల నిమురుతూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోయింది పార్వతి.
                                                                                  7
    "అమ్మా! అమ్మా!" పెద్దగా కేకలు పెడుతూ న్యూస్ పేపర్ తో యింట్లో అడుగుపెట్టాడు రఘు.
    "అమ్మ యింట్లో లేదు, మహిళామండలికెళ్ళింది" శకుంతల వంటింట్లోంచి బైటకువస్తూ అంది.
    నిస్పృహగా కుర్చీలో చతికిలపడ్డాడు రఘు.
    "అమ్మతో ఏం పని?"
    "అమ్మ వచ్చింతరువాత చెబుతాను. సీక్రెట్, అంటే తెలుసా? సరె, సరె ఎక్కిరించనక్కరలేదు. అమ్మ ఉదయమే మహిళామండలికి దేనికి వెళ్ళింది?"
    "సీక్రెట్ అడగరాదు" అసలే పెద్దవయిన కళ్ళను మరింత పెద్దవిగా చేసి అంది శకుంతల.
    రఘు ఏదో అనబోయేలోగా న్యూస్ పేపరుతో హడావిడిగా లోపలికి వచ్చాడు కృష్ణ. కుర్చీలో కూర్చున్న అన్నయ్యను చూడలేదు. సరాసరి శకుంతల దగ్గరకు వెళ్ళాడు. "మంచి శుభవార్త చెబుతాను, ఏమిస్తావ్ శకూ!" అన్నాడు.
    శకుంతలను "శకూ" అని పేరుపెట్టి పిలుస్తాడు కృష్ణ.
    కృష్ణ చెప్పబోయే శుభవార్త ఏమిటో రఘు గ్రహించాడు. "నువ్వేది కోరితే అది" అన్నాడు కుర్చీలో నుంచి లేస్తు.
    "హాయ్! బ్రదర్ నీవిక్కడే వున్నావ్! ఫస్టు క్లాస్ లో పరీక్ష పాసయినందుకు కంగ్రాచ్యులేషన్స్." అన్నాడు కృష్ణ గిర్రున పక్కకు తిరిగి.
    "థాంక్యూ!" అన్నాడు రఘు.
    శకుంతల రివ్వున వంటగదిలోకి పరుగెత్తుకెళ్ళి పంచదార డబ్బాతో తిరిగి వచ్చింది. నోరు తెరవమని ఇద్దరి నోళ్ళలో గుప్పెడు గుప్పెడు పంచదార గుమ్మరించింది. మరో గుప్పెడు పంచదార ఎత్తి నిట్లో పోసుకుంది.
    "చెల్లాయి కోరిక గ్రహించాను. అడగక ముందే అనుగ్రహిస్తున్నాను. నాలుగుకిలోల పంచదార చెల్లాయి ఒక్కతే తినటానికి సాయంత్రం లోపల తెచ్చిపడేస్తాను."
    "మంచివార్త విన్నప్పుడు తీపి పెట్టాలి. స్వీట్ లేదు కాబట్టి పంచదార పెట్టాను. నాకేం పంచదారవద్దు, పానకం వద్దు. శశి కట్టుకున్న వైలెట్ కలర్ పట్టుబుటాల చీర కావాలి." శకుంతల చిరుకోపంతో అంది.
    "అయ్ బాబోయ్! పట్టుచీర__వైలట్ కలర్ పట్టుచీర! చీర.....అదీ పట్టుది, చాలా పెద్ద కోరిక. నేనేం ఉద్యోగం చేస్తున్నానా, ఊళ్ళేలుతున్నానా! నీకోరిక నేను ఉద్యోగంలో ప్రవేశించగానే మొదటి జీతంలో కొని తీరుస్తా, ప్రామిస్" రఘు తిరిగి కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
    "పెద్ద, అక్కడికి అడగంగానే తీర్చేటట్టు ఫోజు," శకుంతల మూతి తిప్పింది.
    చిలిపి పోట్లాటలు, వాళ్ళకి అలవాటే. ఓ పక్క నవ్వుతూ మరో పక్క వాదించుకుంటూ పావుగంట గడిపేశారు. అప్పటికి పార్వతి ఇల్లు చేరింది. కూడబలుక్కున్నతలు ముగ్గురూ ఒకేసారి చెప్పేశారు పార్వతికి.
    "రఘూ! పరిక్ష పాస్ అయినందుకు సంతోషపడితే చాలదు. పైకి పోవటానికి మరింత కష్టపడాలి. విజయం సాధించటం తేలిక దానితో వచ్చే బరువు బాధ్యతలే కష్టమైనవి. వాటిని గెలవాలి. అదేనిజమైన విజయం అని ఓ సామెత వుంది__"
    పార్వతి మాటలకు అడ్డు తగులుతూ రఘు "అమ్మా! నే ఉద్యోగ ప్రయత్నం చేస్తాను" అన్నాడు.
    పార్వతి ఉలిక్కిపడింది.
    "ఇంటర్ తో చదువు ముగిస్తావా? నీకెందుకొచ్చిందీ ఆలోచన?" గద్దించి అడిగింది పార్వతి.
    "నువొక్కదానివి కష్టపడుతుంటే, మేమెందాకా చదవమమ్మా?"
    "అందుకని చదువుమానేస్తావా? ఇంటర్ పాస్ అయితే వచ్చే ఉద్యోగం ఏమిటో తెలుసా? ఇటుకలు మోయటం నేను కష్టపడుతున్నది మీ సుఖంకోసం కాదు. నా సుఖం కోసం."
    పార్వతి అనేదేమిటో తెలియక తెల్లబోయి వింటున్నారు ముగ్గురు.
    "ఇప్పుడు నేను కష్టపడితే, మీరు పెద్ద చదువులు చదివి గొప్ప ఉగ్యోగాలు చేస్తు, నాకు ముసలితనంలో కష్టమంటే ఏమిటో తెలియకుండా సుఖపెడతారని....." పార్వతి నవ్వుతూ అంది.
    ముగ్గురూ కూడా తల్లి నవ్వులో పాలుపంచుకున్నారు.
    ముందు కార్యక్రమం ఏమిటి? అంటూ కాసేపు చర్చించుకున్నారు. ఆ తరువాత__ప్రొద్దుటే మహిళామండలికి ఎందుకు వెళ్లాల్సివచ్చిందో చెప్పి పార్వతి వంటగదిలో ప్రవేశించింది. వంటతోపాటు క్షీరాణ్నం చేయాలనుకుంటూ.
    "సంఘంలో గుర్తింపు ఉండాలంటే. నోరూ, పదవి వుండాలి. మహిళామండలి ప్రెసిడెంటువయిన గుర్తింపు. దానికి నాలుక పదును చేర్చి పులిలాంటిదానివని అనిపించుకుంటున్నావు. ఉద్యోగం ఒక్కదానివల్లా పనులు జరుగవు. నిజం గ్రహించావుగానీ అమ్మా! తలపండని వయసు రాకపోయినా తలలో వెండి తీగలు చోటుచేసుకుంటున్నాయి, ఆ కాలంలోనే వృద్ధాప్యం మీదపడుబోతున్నదని గ్రహించటంలేదు. మేము పెద్దయేది ఎప్పుడు? నిన్ను సుఖపెట్టేది ఎప్పుడమ్మా!"

 Previous Page Next Page