Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 9

    నలుగురైదుగురు స్టూడెంట్స్ వచ్చేశారు...
    "ఏం గురూ అవతల కాలేజీలో ఎలక్షన్ మంట ఎగజిమ్ముకుంటూ వెళుతూవుంటే గదిలో కూర్చుని శుభ్రంగా భట్టుమూర్తివైపోతున్నావా? ఛ! ఛ! ఇది మన ఫెడరేషన్ కే అవమానం పద! పద! వెళ్ళి మన కాండిడేట్ కి ప్రచారం చేద్దాం!" చొరవగా అన్నాడు. అచ్యుత్ అతను శ్రీకర్ వాళ్ళ వూరి మునసబుగారబ్బాయి. లక్షలకి వారసుడు కాలక్షేపానికి చదువుతున్నాడు. ఫస్టియర్ సెకండియర్ పేపర్లలో ఒక్కటి రాయలేదు సుదూరభవిష్యత్తులో బి.ఎ. పూర్తి చేస్తాడన్న ఆశ అతనికేకాదు వాళ్ళవాళ్ళకీలేదు. ఏదో కాలేజీ మెట్లెక్కి కోర్సుపూర్తిచేసివస్తే కట్నం రేటు పెరుగుతుందనే ఆశతో చదివిస్తున్నారు.
    "సారీ అచ్యుత్ నేను రాలేను."
    "రావా! రాలేవా?"
    "ఏం మా కాండిడేట్ గెలవడం ఇష్టంలేదా?"
    "నా యిష్టాయిష్టాలతో పనేముంది?"
    "అయితే అవతలపార్టీ వాళ్ళకి చేస్తున్నావా?"
    "ఊహు"
    "ఇదో గురూ! చెపుతున్నావిను...ఇలా తటస్థంగా వుండిపోవటం అసలుకుదరదు అటో ఇటో యెటో లేక ఒక ప్రక్క రంగంలోకి దిగాలి కనీసం సపోర్ట్ అన్నా చేయాలి. అంతే!"
    శ్రీకర్ జవాబివ్వలేదు.
    "గురూ!" మరోకుర్రాడు పిలిచాడు. "అవతలజ్యోతి తీవ్రంగా పనిచేస్తూంది. ఆ అమ్మాయికి డబ్బుబలం వుంది. అందగత్తె కదా ఫాలోయర్స్, ఫాన్స్ కూడా వున్నారు. అంతా సపోర్టిస్తున్నారు. ఆఖరికి మనవాడికి నీళ్ళు పడేట్టుగా వున్నాయ్ గొంతులో!" దిగులుగా అన్నాడతను.
    శ్రీకర్ మౌనంగా విన్నాడు.
    "అంచేత_యిప్పుడు ఆ పార్టీ ఓడాలంటే జ్యోతి బలం తగ్గాలి...మనబలం హెచ్చాలి. మొత్తం మన కాలేజీలో ఎట్రాక్టివ్ ఫిగర్ జ్యోతిని డౌన్ చేసే వ్యక్తిత్వం వుండేది నీకే...నువ్వు_నీ స్టేచర్ - నీ కారెక్టర్ అందర్నీ ఎట్రాక్టు చేస్తాయి. దయచేసి మాతోరా! ఓ ఆడదానిచేతిలో ఓడిపోవటం మాకు సమ్మతంగా లేదు!"
    శ్రీకర్ తీవ్రంగా చూశాడు.
    "నువ్వు ప్రచారం చెయ్యొద్దు. స్లోగన్స్ అరవ్వద్దు. ఎవరికీ ఓటెయ్యొద్దని, వెయ్యమనీ చెప్పొద్దు...మా క్లాస్ లో తిరుగు...మా జీప్ ఎక్కు చాలు గెలిచేస్తాం. జ్యోతిని దిగాలు పడేట్టుగా చేస్తాం!"
    శ్రీకర్ లేచాడు అందరి ముఖాలు వికసించాయి. థాంక్యూ రవాలుగదిని దద్దరిల్లేట్లుగా చేసేయ్.
                                       9
    ప్రిన్సిపాల్ గారి వద్దనుండి శ్రీకర్ కి పిలుపు వచ్చింది. ప్యూనువచ్చి చెప్పగానే ఎందుకబ్బా! ప్రిన్సిపాల్ గారికి నాతో ఏమిటి పని? అని ఆలోచిస్తూ లేచి వెళ్ళారు.
    అక్కడి ప్రిన్సిపాల్ గారి గదిలో జ్యోతి, మరో నలుగురు అమ్మాయిలూ కూర్చుని వున్నారు.
    శ్రీకర్ని చూస్తూనే ముఖం తిప్పేసుకుంది జ్యోతి. అది పట్టించుకోకుండా ప్రిన్సిపాల్ గారికి విష్ చేసాడు శ్రీకర్. ఆయన తలూపుతూ "టేక్ యువర్ సీట్" అన్నాడు.
    శ్రీకర్ మౌనంగా బల్లమీద కూర్చున్నాడు ఎదురుగా.
    "మిష్టర్ శ్రీకర్! నీమీద ఓ రిపోర్టు వచ్చింది" ప్రిన్సిపాల్ గారి గొంతు గంభీరంగా పలికింది. శ్రీకర్ కేమీ అర్ధంకాలేదు. జ్యోతి వైఖరి చూస్తుంటే ఎందుకో గుండెలు దడదడలాడాయి. ప్రిన్సిపాల్ ఏం చెప్పబోతారోనని ఎదురుచూడసాగాడు శ్రీకర్.
    "మిష్టర్ శ్రీకర్ నువ్వు మంచి విద్యార్ధివని ఇంతవరకు నీపైన ఒక ప్రత్యేకమైన అభిమానముంది. కానీ, నీవు కూడా అందరిలా ప్రవర్తిస్తావని అనుకోలేదు. ఎందుకిలా చేశావు? నా విశ్వాసం, నమ్మకాలపై దెబ్బ వేసావు_"
    ఆయన ఏం చెబుతున్నాడో వెంటనే అర్ధం కాలేదు శ్రీకర్ కి.
    "సారీ! సర్! మీరు ఏమంటున్నారో నాకు అర్ధంగావటంలేదు" మెల్లగా అన్నాడు శ్రీకర్. ప్రిన్సిపాల్ గారి ముఖం కఠినంగా మారిపోయింది.
    "అబద్ధం చెప్పేవాళ్ళన్నా, విషయం అర్ధమయినా అర్ధంకానట్లు నటించేవాళ్ళన్నా నాకు ఎలర్జీ" భేత్కారంగా అన్నాడు.
    శ్రీకర్ వదనం పాలిపోయింది.
    జ్యోతి అతనివైపు తీక్షణంగా, కోపంగా చూస్తుంది.
    "మీరు అంటున్నది నాకు నిజంగా అర్ధంకావడంలేదు సర్! నేను తెలిసి ఎలాంటి పొరపాటు పనులు చేయలేదు. తడారిపోతున్న గొంతుకతో అన్నాడు శ్రీకర్.
    ప్రిన్సిపాల్ గారు కొన్ని క్షణాలు తీవ్రంగా చూసి టేబిల్ మీద వున్న కాగితం శ్రీకర్ మీదకు విసురుగా విసిరాడు.
    శ్రీకర్ విస్తుబోతూ ఆ కాగితాన్ని అందుకున్నాడు.
    "గట్టిగా చదువు మిష్టర్ ఇది నీవు జ్యోతికి రాసిన ప్రేమలేఖ కదూ?" ప్రిన్సిపాల్ గారి గొంతు ఖంగుమన్నది.
    శ్రీకర్ అయోమయంగా జ్యోతివైపు చూశాడు. ఆమె అయిష్టంగా మొహం మరోప్రక్కకి త్రిప్పుకుంది. శ్రీకర్ కళ్ళు కాగితంమీద నిలిచాయి.
    "మైడియర్ స్వీట్ జ్యోతీ!
    ఐ లవ్ యూ జ్యోతీ. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నీపైన మనసయింది నీ వాలుచూపులతో నా గుండె పరుగులెత్తుతుంది. నిన్ను తలచుకుంటే నా మనసు పులకరిస్తుంది. తనువు సోలి తూలుతుంది. నీ అందం అప్సరకేదీ? నీ సుధలూరే అధరాల మధురిమలు గ్రోలాలని ఉవ్విళ్ళూరుతున్నాను. నా కోరిక తీరుస్తావుగదూ? ఒక్కసారి కౌగిలిలో పొదువుకుని తనివితీరా గుండెలకు హత్తుకోవాలని వేగిరపడుతున్నాను.
    నా మనసు అర్ధం చేసుకోగలవనుకుంటాను.
    "నా కోరిక యెప్పుడు తీరుస్తావు? నీవు ఎక్కడికి రమ్మన్నా వస్తాను.
    నీవు కాదంటే నాకు జీవితమే శూన్యం.
                                                                                               సదా నీ నామాన్ని జపించే
                                                                                                ప్రేమపూజారి శ్రీకర్ ..."
    ఆ లేఖ చదివిన శ్రీకర్ పెదవులపైన చిన్న దరహాసం నృత్యం చేసింది.
    అతను నవ్వుచూసి జ్యోతికి వళ్ళు మండిపోతుంది.
    "వెధవపని చేసింది చాలక చూడండిసార్ ఎలా నవ్వుతూ వున్నాడో" ఉక్రోషంగా అంది జ్యోతి.
    "సార్ ...ఇది నేను వ్రాయలేదు..." కాగితాన్ని టేబుల్ మీద పెడుతూ తాపీగా అన్నాడు శ్రీకర్.
    ప్రిన్సిపాల్ పెదవి కదపబోయారు కోపంగా ఇంతలో జ్యోతి అందుకుంది. "అబద్ధం ఇది అతను వ్రాసిందే. ఆ రైటింగ్ అతనిదే!" అని అన్నది గట్టిగా.
    "అనవసరంగా బొంకకు. అది నీ రైటింగే! చేసిన తప్పు ఒప్పుకో - లేకుంటే చిక్కులపాలవుతావ్" ప్రిన్సిపాల్ కళ్ళు క్రోధాగ్నిని వెళ్ళగక్కుతున్నాయ్.
    "కావచ్చు. ఎవరో పోర్జరీ చేశారు. నేనుమాత్రం ఆ పని చేయలేదు. ఆవిడమీద నాకు ప్రేమ కాదుగదా ఇష్టం కూడా లేదు. అలాంటప్పుడు ప్రేమలేఖలెందుకు వ్రాస్తాను!"
    జ్యోతి అహం తిబ్బతిన్నది. చివ్వున తలెత్తి యేదో అనబోయింది.     

 Previous Page Next Page