"మీరు ఏమీ అనుకోకపోతే ఒక్కమాట" సందేహంగా అడిగాడు శ్రీకర్.
"అడగండి-"
"నన్ను టీకి ఎందుకు పిలుస్తున్నారు?" సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసాడు. జ్యోతి కలవరపడిందా చూపులకు చప్పున సిగ్గుతో తలదించేసుకుంది.
"ఊరికే...మీరంటే మా డాడీకి ఇష్టం. పరిచయం చేద్దామని" నసిగింది.
అతను నవ్వి__"అబద్ధం ఆడినా గోడకట్టినట్లు అందంగా వుండాలి" అన్నాడు.
"నేనేం అబద్ధం ఆడలేదు. అంత అవసరమేమిటి?" కొద్దిగా రోషపడింది జ్యోతి.
"మీ డాడీకి నేనంటే ఎలా ఇష్టం: ఆయన నన్ను ఎప్పుడూ చూళ్ళేదు, నా గురించి తెలీదు. ఇంకెలా ఇష్టం?" కొంటెగా ప్రశ్నించాడు.
దొరికిపోయిన దొంగలా తల దించుకుంది జ్యోతి. తనమాట నెగ్గకపోతే ఆవిడకు నిద్దరరాదు. అందుకే బుకాయించింది.
"ఏం ఎందుకు తెలీకూడదూ? నేనే చెప్పాను. మిమ్మల్ని చూడాలన్నారు వస్తారా రారా?"
"ఇప్పుడుకాదు మరోసారి..."
"ఇప్పుడేమిటి అభ్యంతరం?" అసహనంగా అన్నది జ్యోతి.
"పనుందని చెప్పాగా."
"నా ఆహ్వానంకన్నా మించినపని వున్నదా?"
చివ్వున ఆమె కళ్ళల్లోకి చూసాడు. ఆమె కళ్ళల్లో చిందులేస్తున్న స్వాతిశయం. గర్వరేఖలు చూసి అతని అభిమానం దెబ్బతిన్నది.
"అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం?"
"మీరు ఈ దినం తప్పక రావాలి-"
"శాశిస్తున్నారా?" కటినంగా అన్నాడు శ్రీకర్.
"ఎందుకంత ఇదవుతారు? నేను పిలిస్తే ఎంతోమంది వచ్చేందుకు సిద్ధంగా వున్నారు. నీలాయెవరూ బ్రతిమాలించుకోరు_"
"సారీ! నేను అందరిలాంటివాడిని కాదు. మీ మనసు కష్టపడితే క్షమించండి. నేను రాలేను-" అని తలదించుకొని చరచరా కదలిపోయాడు శ్రీకర్.
అతని తిరస్కారం ఆమె గుండెను మండించింది,
ఏం చూసుకుని ఇంత తలబిరుసు? టీకి పిలిస్తే రానంటాడా? చూస్తాను. నిన్ను ఎలా దారికితెచ్చుకోవాలో నాకు తెలుసు.
నిన్ను వంచకపోతే నా పేరు జ్యోతిగాదు. మంగమ్మ శపథంలాంటి శపధం చేసుకుంది జ్యోతి మనసులో.
8
రూంలో కూర్చుని షేక్ స్పియర్ చదువుతున్నాడు శ్రీకర్. కాలేజీకి ఎలక్షన్స్ సంబంధంగా సరిగా వెళ్ళటం లేదు. ఊళ్ళో, సినిమాహాళ్ళల్లో కాలేజీ స్టూడెంట్స్ రూముల్లో అంతా హడావిడి ఒకటే గోల...
"గుడ్ యీవినింగ్!"
"ఠక్కున తలెత్తి చూశాడు జ్యోతి! తనగది గడపలో ఆమెని చూడగానే తడబడ్డాడు.
"గుడీవినింగ్! కమిన్ ప్లీజ్!" గౌరవం వుట్టిపడేట్టుగా చిరుదరహాసంతో అన్నాడు లోపలకి వచ్చింది జ్యోతి అతని గదిలో బార్ లైట్ వెలిగించి ఇంటిమేట్ స్ప్రే చేసినట్టుగా అయింది ఆమె రాక.
"కూర్చోండి!"
కుర్చీలో కూర్చుంటూ "ఏం మనుషులుబాబూ! మేమంతా ఎలక్షన్ ప్రవాహంలో కొట్టుకుచస్తుంటే మీరు శుభ్రంగా నాటకాలు చదువుకుంటూ కూర్చున్నారా!" అంది నిష్టూరంగా.
నవ్వేశాడు శ్రీకర్. అతను స్టూలుమీద కూర్చున్నాడు. వాలుకుర్చీలో వెనక్కివాలి కూర్చుని తమాషాగా నవ్వుతూ కాళ్ళూపుతూ కూర్చున్న జ్యోతిని తదేకంగా చూడసాగాడు కుర్చీ వెనక్కి వేసుకుంది జడవిసురుగా!
మీరూ లేవండి నాతోపాటే! మీరూవస్తే మీ ఫాలోయర్స్, యెడ్ర్మరర్స్, ఫ్రెండ్స్ అంతా మా కాండేట్ కే ఓట్లు వేస్తారు. మీ బలం మాకు కావాలి" బలవంతం చేస్తున్నట్టుగా తనకేదో అతనిమీద అధికారం వున్నట్టుగా అంది.
మృదువుగా తిరస్కరిస్తున్నట్టుగా "సారీ జ్యోతి! నాకు ఎలక్షన్సంటే ఎలర్జీ! మూడేళ్ళుగా ఈ కాలేజిలో వుంటుంన్నానా! యేనాడూ నేను వాటిల్లో జోక్యంకలిగించుకోలేదు.
వారిమధ్య కొద్దిక్షణాలు నిశ్శబ్దం ఆవరించింది.
అదేమిటో నేనెప్పుడూ అంతే! నాకవి గిట్టవు!" అన్నాడు.
జ్యోతి ముఖం ముడుచుకుంది. వెంటనే ముఖం ప్రసన్నంగా మార్చుకొని తేలిగ్గా నవ్వేసి "యూ సిల్లీ, దిగ్రేట్ జ్యోతి వస్తేకూడా నో అంటే ఎలా? అయినా యిదేం దేశమో! యెవరూ ఎలక్షన్స్ కి ప్రామినెన్స్ యివ్వరు. అందుకే రాజకీయాలు కంపుకొడుతున్నాయ్! ఎడ్యుకేటెడ్ వోట్ వాల్యూ గుర్తించకుంటే ఎలా అంది?
"పోలింగ్ కి వస్తాలే!"
"వస్తావు-మా కేండేట్ కే వేస్తావు. ఉద్దరించావుగానీ లెండి! నాతో రండి! మీరు ఒకపూట నాతి తిరిగితే ఎలక్షన్ ట్రెండ్ పూర్తిగా మారిపోతుంది, ఐవిల్ బియెట్ ది యెండ్ ఆఫ్ సక్సెస్!"
"ఊహు నువెన్నయినా చెప్పు...
"రానంటావు?" అడ్డొస్తూ అడిగింది.
తలూపేశాడు.
కనుబొమలు ముడేసింది. ఇదో రాతిబొమ్మ...యితన్నేం చేయలేం! దాంతో నిషా చూపులు గుమ్మరించి ఖాళీగా నవ్వుంది.
"ఒకే! మరీ అంత పవివ్రతలా వుంటానంటే ఏం చేస్తాం చెప్పు అలాగే! వదిలెయ్యాలి. నీలాంటి వారిని...దట్సాల్ పోనీ ఓమాట చెప్పు నీ ఓటు మాకేనా?"
ఫక్కున నవ్వేడు శ్రీకర్ "దీన్నెమంటారో తెలుసా యంగ్ మేడమ్? అటు నుంచి నరుక్కురావడమంటారు...ఎస్ ఎలక్షన్సంటే...ఎలక్షన్సే...సీక్రెట్ ఆఫ్ ఓటింగ్ తెలుసుగా? ఎలా చెప్పను..."
బుంగమూతి పెట్టింది జ్యోతి. గారాబం కురుస్తున్నట్టుగా చప్పున కుర్చీలోంచి లేచింది.
"ఇదో చెపుతున్నా విను! నువ్వు మాకేఓటు వేయాలి. తప్పదు వేయకపోయినా పర్వాలేదు. కానీ అవతలి వాళ్ళకి మాత్రం వేయకూడదు తెలుసా?" తర్జనతో బెదిరిస్తూ అంది.
అలాగేనన్నట్టుగా నవ్వాడు శ్రీకర్.
"థాంక్యూ! థాంక్యూ! మా కాండిడేట్ చైర్మన్ అయితే స్టూడెంట్ కవిసమ్మేళనం పెట్టించి నీకు శాలువా కప్పిస్తా"
ఆనందోత్సాహాలతో వెళ్ళిపోయింది జ్యోతి. అతన్నుంచి ఆ మాత్రమైన అంగీకారం లభించినందుకు పొంగిపోయిందామె.
జ్యోతి వెళ్ళగానే తలుపులు చేరవేసి తిరిగి పుస్తకం చేతిలోకి తీసుకొని ఎమర్జన్సీయే మేలన్నట్టుగా వుందిరా బాబు. ఈ ఎలక్షన్ లతో మాలాంటి వాళ్ళం చచ్చిపోతున్నాం అనుకున్నాడు. ఒక పేజీ చదివాడో లేదో మళ్ళీ తలుపు చప్పుడయింది. విసుగ్గా వెళ్ళి తలుపు తీశాడు.