Previous Page Next Page 
అనురాగ జలధి పేజి 10

    "నీవు వుండు జ్యోతి! ఇతని విషయం నేను చూస్తాను" అని వారిస్తూ శ్రీకర్ ని ఉద్దేశించి ఇలా అన్నారు. "ఇది స్పష్టంగా నీరాతే! ఎవరో నీ రైటింగ్ ని పోర్జరీ చేయాల్సిన పనేం కలిగింది?"
    "అంత అవసరం ఎవరికి కలిగిందో అదే అర్ధంగావడం లేదు సార్."
    "అసలు నీవు వ్రాయలేదంటావు?"
    "ముమ్మాటికీ నిజం అంతే-"
    "సరే! నా నిర్ణయం కూడా విను. నీవు నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా?"
    "మీరు ఏమన్నా నా దగ్గరున్న నిజాన్ని మాత్రం చెప్పగలను. ఆపైన మీ యిష్టం" ఆ మాటలు ప్రిన్సిపాల్ గారికి కోపాన్ని రెచ్చగొట్టాయి.
    "నిన్ను వారం దినాలు సస్పెండ్ చేస్తున్నాను. తరువాత వచ్చి నిజంచెప్పి ఆ అమ్మాయికి క్షమార్పణలుచెపితేగాని ఈ సమస్య ఆగదు. లేకుంటే శాశ్వతంగా ఈ కాలేజీ నుండి వెళ్ళిపోవాల్సి వస్తుంది."
    శ్రీకర్ లేచి నిలబడ్డాడు.
    "మీ ఇష్టం ఏమైనా చేయండి. చేయని నేరానికి తల వంచాల్సిన పనిలేదు నాకు" అని నమస్కరించి అక్కడి నుండి చరచరా కదిలిపోయారు శ్రీకర్.
    కొన్ని క్షణాల తరువాత "జ్యోతీ! యూ కెన్ గో. అతనిచేత క్షమార్పణలు చెప్పిస్తాను. డోంట్ ఫీల్..." అన్నాడు.  
    జ్యోతి మరేం మాట్లాడలేదు. ఒక విధంగా శ్రీకర్ అహంమీద దెబ్బతీయ కలిగినందుకు ఆమెకు గర్వంగా వుంది. స్నేహితులతో కలసి బయటకు వచ్చింది. అంతా క్లాసులకు వెళ్ళిపోయారు. చివరగా జ్యోతి, వాసవి మాత్రం మిగిలారు.
    "జ్యోతీ! నీ పద్ధతేం బాగలేదు. అన్యాయంగా అతనిమీద నిందమోపావు" నొచ్చుకుంటూ అన్నది వాసవి.
    "అలాంటి మూర్ఖునికి ఇలా శాస్తి జరగాల్సిందే! లేకుంటే నాతో పంతం పెట్టుకుంటాడా? అప్పుడే ఏమయింది? కాలేజీనుంచి పంపేవరకు నిద్రపోను" జ్యోతి మాటలోని కరుకుదనానికి వాసవి బాధపడింది.
    "అలా చేసినందుకు నీకు లాభమేమిటి? అన్యాయంగా అతని జీవితం స్పాయిల్ అవుతుంది. ఇది మంచి పద్ధతికాదు విరమించుకో" అని అన్నది వాసవి."
    అలా చేస్తేగాని అతనికి బుద్ధిరాదు."
    "ఇంతకు అతను చేసిన నేరమేమిటి?"
    "నా ప్రేమను తిరస్కరించాడు. నా మనసును గాయపర్చాడు."
    "అంటే అతన్ని నీవు ప్రేమించావా? లేదు! నీవు నిజంగా అతన్ని ప్రేమించగలిగితే అంతటి అభాండాన్ని సృష్టించి అతని నెత్తిన రుద్డవు. ప్రేమ ఎప్పుడూ మంచినే కోరుతుందికానీ ద్వేషాన్ని వెలిగ్రక్కదు. ఇది ప్రేమకాదు. అతని జీవితంతో చెలగాట మాడుతున్నావు."
    "వాసవీ!"
    నా మాటలు కష్టంగా వుండవచ్చు జ్యోతీ! నీవు నిజంగా అతని ప్రేమను పొందాలంటే మార్గం యిది కాదు. వెళ్ళి జరిగిన దానికి క్షమార్పణలు చెప్పు. అతని మనసును కరగించు. మంచిగా అతనితో కలిసిపో. మనసిప్పి మాట్లాడు. అప్పుడుగానీ నీకు అతని హృదయంలో చోటు దొరకదు. ప్రేమతో, మంచితనంతో గెలుచుకోవాలికానీ, ద్వేషంతో, పగతో ఏమీ సాధించలేవు. ఇలా చేస్తే నీకు అతను మరింత దూరమవుతాడుగానీ, చేరువకాలేడు ఎప్పటికీ_"
    వాసవి మాటలు జ్యోతిలో ఆలోచనలు పుట్టించాయ్. నిజానిజాలు గ్రహించసాగింది. ఆలోచించేకొద్దీ వాసవి మాటలు నిజమేననిపిస్తున్నాయి.
    "వాసవీ! అయితే యిప్పుడు నన్నేం చేయమంటావ్" బేలగా చూసింది జ్యోతి.
    "అతని రూంకెళ్ళి క్షమాపణ చెప్పు."
    నేను అతని వద్దకువెళ్ళి క్షమాపణ చెప్పడమా?" ఆమెలో అహం తలెత్తింది.
    "ఆ అహం చంపుకుంటేగానీ అతను నీకు దక్కడు. అతను మంచివ్యక్తి! వెళ్ళి తప్పు ఒప్పుకుంటే క్షమిస్తాడు. అలాంటి ఉదారత అతనిలోవున్నది! ఆలస్యంచేసి అతని మనసు విరిచేయకు. నీవే బాగా ఆలోచించుకో" అని వాసవి వెళ్ళిపోయింది.
    జ్యోతి వంటరిగా నిలబడిపోయింది.
    ఆమె కేమిటో అసహనంగా వున్నది.
    ఆలోచిస్తూ క్లాస్ రూంలోకి నడిచింది.
                                       10
    ఇంగ్లీషు లెసన్స్ జరుగుతుంది! జ్యోతి చెవులు పాఠాన్ని ఆలకిస్తున్నాయేగానీ, మనసుమాత్రం శ్రీకర్ గురించే ఆలోచిస్తూంది! వాసవి మాటలే ప్రతిధ్వనిస్తున్నాయ్.
    తను తప్పు చేయలేదుగదా - తప్పుకాక మరేమిటి_లొంగదీసుకోవాలని ప్రేమలేఖను సృష్టించి-అవమాన పరిచింది! ఏమయింది? అతను సస్పెండ్ చేయబడ్డాడు! వెళ్ళేముందు తనవేపు అతను చూసిన చూపు...అబ్బ! ఇప్పటికీ ఆ చూపులోని అసహ్యం, కరుకుదనము తనను వెంటాడుతూనే వున్నాయి.
    ఏదో జరుగుతుందనుకుంటే-మరోలా మలుపు తిరుగుతోంది.
    దీనికి ఇక్కడితో ఆపాలి! లేకుంటే ఎన్నో వక్రమైన మలుపులు తిరిగి చివరకు తను ఊహించినట్లు జరగదు. వాసవి చెప్పినట్లు చేస్తే?
    తను వెళ్ళి క్షమాపణ చెప్పుకోవడమా - లక్షాధికారి కూతురు వెళ్ళి ఒక పేదవాడిముందు తలవంచడమా?
    ప్రేమముందుతలవొంచాలి ఓడిపోవాలి. అదో ఆనందం. అది అనుభవించిన మనసుకుగాని తెలీదు వెళ్ళు. అతని మనసు విరిగిపోకముందే త్వరపడు..." అంతరాత్మ హితవు చెప్పింది."
    చాలాసేపు ఆ విషయాన్నే తలపోసింది.
    చివరకు అతనివద్దకు వెళ్ళి క్షమార్పణలు చెప్పుకోవడం మంచిదని నిశ్చయించుకున్నది.
    సాయంత్రం శ్రీకర్ గదికి వెళ్ళింది జ్యోతి. అప్పుడు శ్రీకర్ గదిలోనేవున్నాడు. ఆమెని చూసి చిరునవ్వు నవ్వి ఆహ్వానించాడు. కోపం తెచ్చుకుంటాడని అసభ్యంగా తిట్టి తూలనాడతాడని అనుకుంది జ్యోతి. కానీ అతని ప్రవర్తన అందుకు భిన్నంగా వుండటంతో విస్తుపోయింది జ్యోతి. ఇతని మనసు నిజంగా మంచిదే, అని అనుకున్నది.
    "మీరు వస్తారని నాకు తెలుసు" చిన్నగా నవ్వుతూ అన్నాడు శ్రీకర్.
    జ్యోతి వింతగా చూసింది అతని దెస.
    "ఎందుకలా అనుకున్నారు?"
    "నిజం మీకు తెలీదా?"
    ఆ ప్రశ్నకి ఆమెవద్ద సమాధానంవుంది. చెప్పలేదు. అందుకే దోషిలా తలదించుకుంది.
    "క్షమించండి. ఏదో అజ్ఞానంవలన అలా చేశాను. అందుకు సిగ్గుపడుతున్నాను" బిడియంగా, సిగ్గుగా అన్నది జ్యోతి.
    ఆమె ముఖంలోకి చూశాడు శ్రీకర్. అమాయకత్వం, ముగ్ధత్వం సంతరించుకున్న ఆమెముఖం చూస్తుంటే కటినంగా పలకలేకపోతున్నాడు. పైగా తనంతటతానే వచ్చి క్షమించమని అడుగుతుంటే ఇంకెలాఅనగలడు. అందుకే తేలిగ్గా నవ్వగలిగాడు.  అతని మంచిమనసుకు అదే నిదర్శనం. మంచివాళ్ళెప్పుడూ తప్పుచేసినవాళ్ళను క్షమించగలరు.

 Previous Page Next Page