అవంతి అటు వెళ్ళంగానే గుణవంతి స్ప్రింగ్ లా కుర్చీలోంచి లేచింది. తన చేతికున్న గడియారాన్ని గోడకి బీరువాకి మంచానికి తగిలించి చూసింది.
పక్కగదిలోకి వెళ్ళిన అవంతి అలా వంట గదిలోకి వెళ్ళలేదు. అటుపక్క గోడకి తగిలించిన పటం మీద ముఖం ఆనించింది. ఆ పటంలో సీనరీ వుంది. ఆ పటానికి సరీగ ఇవతలి గదిలో బొద్దుగా వున్న పాప బొమ్మ గోడకి అతికించి వుంది. అవతలి గది సీనరీలోంచి ఇవతలి గదిలోకి గోడమధ్య ఖాళీ సీనరీకి ముఖం ఆనించి చూస్తే బెడ్ రూములోకి పాపాయి బొమ్మ ద్వారా ఆ రూములో జరిగేవన్నీ చక్కగా కనిపిస్తాయి.
గుణవంతి ఎవరో తెలియకపోయినా తన పాలిటి డేంజర్ వ్యక్తి అన్న విషయం అవంతి బాగానే తెలుసుకుంది.
అవంతి కాఫీ తీసుకుని వచ్చేసరికి గుణవంతి కుర్చీలో మామూలుగా కూర్చుని కాళ్ళు వూపుతున్నది.
కాఫీ తాగింతరువాత పదినిమిషాలు కూర్చుని గుణవంతి ఆపై శలవు తీసుకుని వెళ్ళిపోయింది. రేపటిరోజు తప్పక రావాలని మరోసారి చెప్పింది.
గుణవంతి సంగతి అప్పటికప్పుడే తేల్చుకో దల్చలేదు. అందుకే అవంతి ఏమీ తెలియనట్లు వుండిపోయింది. గుణవంతి వెళ్ళంగానే తలుపులోపల గడియ వేసుకుని ఫోను దగ్గరకు నడిచింది.
అవంతి ఫోన్ చేసే లోపలే ఫోన్ ట్రింగ్ అంది.
రిసీవర్ అందుకుంది. అవంతి.
"సుగుణాకరరావ్ వచ్చాడు, పంపించనా?"
ఆ మాట ఫోన్ లో వినిపించంగానే అవంతికి ఆనందం కలిగింది. తను ఎవరికైతే ఫోను చేయాలనుకుందో అక్కడి నుంచే ఫోను వచ్చింది.
"సుగుణాకరరావ్ వచ్చాడు పంపించనా!" అన్నది కోడ్. ఆ మాట వింటూనే అవంతి కూడా కోడ్ వుపయోగించాలి. అప్పుడు అసలు విషయం నిర్భయంగా మాట్లాడుకోవచ్చు.
"కళావతి కూడా వచ్చింది. సుగుణాకరరావ్ ని పంపించండి" అంది అవంతి.
ఇంక అసలు విషయంలోకి వచ్చారు ఇరువురూ.
"ఆర్ పి ఆర్ ఆర్ ఆర్"
"ఆర్ పి ఎమ్ ఆర్"
"గుడ్. రాత్రికి గుర్తుందిగా"
"సిద్ధం చేసుకున్నాను. బ్లూ బటన్"
"వెరీ గుడ్, చక్కగా పూర్తి చేయాలి"
"రేపు మళ్ళీ ఇదే టైమ్ కి ఫోన్ చేస్తాను. ఇక చెప్పవలసింది ఏమీ లేదుగా!"
"వుంది" అంటూ గుణవంతి విషయం మొత్తం వివరంగా చెప్పింది అవంతి.
"గుణవంతి విషయం యింక మన బెటాలియన్ చూసుకుంటుంది గుణవంతి విషయం మర్చిపో. ఈ రోజే ప్రారంభం చేస్తున్న ఆ పనిలో పూర్తిగా నిమగ్నంకా."
"ఎస్సార్"
"వుంటా మరి"
"ఊ...." అని రిసీవర్ క్రెడిల్ పై వుంచి అవంతి భారంగా నిట్టూర్పు విడిచి 'అయిపోయావ్ గుణవంతీ!' అనుకుంది.
అవంతి తన డ్యూటీ వరకే ఆలోచిస్తుంది కరెక్టుగా చేస్తుంది. ఆపై చిన్న విషయం కూడా పట్టించుకోదు. అనవసరం విషయాలలో తల దూరుస్తే ఏం జరుగుతుందో అవంతికి బాగా తెలుసు.
సరీగ ఏడుగంటలకి అవంతి స్నానం చేసి కడిగిన ముత్యంలా తయారయి చూడీదార్ ధరించింది. ఆ తర్వాత అద్దం ముందు కూర్చుని మేకప్ చేసుకోవటం మొదలు పెట్టింది.