Previous Page Next Page 
రివర్స్ గేర్ పేజి 8

    దాంతో నెమ్మదించిన బెనర్జీ ఫోన్పెట్టేశాడు.
   
    తనూ ఫోన్ క్రెడిల్ చేసి తల పట్టుకొని కూర్చుండిపోయాడు మూర్తి.
   
                                        *    *    *    *
   
    సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది.....స్పెషల్ కోర్టులో వాదనింకా కొనసాగుతూనే వుంది.
   
    "నేను చేసింది ఈ సమాజం స్థాయికి అనైతికంగాను, పరువుకు సంబంధించిన విషయంగాను కనిపించవచ్చు. అలా కనిపించేవారి ఆలోచనల కంటే నేను ముందున్నాను నా ఆలోచనల పరిధి విస్త్రుతమయినది. మహాభారతం కన్వాస్ ఎంత పెద్దదో అంత పెద్దది. భవిష్యత్ లో నా స్థాయికంటే యింకా పైస్థాయిలో ఆలోచించే వాళ్ళు పుట్టుకురావచ్చు. వాళ్ళు ఈ సమాజానికి తారసపడవచ్చు. అందుకే సమాజం ఆశ్చర్యపోవచ్చు. నిజంగా మనిషి ఆరోగ్యానికి ఎన్నో విధాలా సహకరించే సబ్బుని ఆయుర్వేదంలో పండిపోయిన అపరమేధావి కనిపెట్టినా, యాభై ఏళ్ళక్రితం ఒంటికి లైఫ్ బాయే వాడాం. బట్టలకు సన్ లైట్ వాడాం. అవే వాడితే పోలేదూ....అనే అధమ స్థాయిలో మన సమాజముంది. ఈ సమాజానికి ఎవేర్ నెస్ లేదు.....రాదు .... తమకు ఏది మంచిదో....ఏది చెడో పక్కవాళ్ళు చెబితే తప్ప వినదు. వారికై వారు తెలుసుకోరు. ఏది ఏమైనా ఇంకొకరి సమస్యలని, పరిస్థితుల్ని, అనుభవాలని నా కళ్ళతో ఎలా జడ్జి చేయగలను.....? నేనున్నది, నేను పుట్టినది, నేను బతుకుతున్నది నా కోసం. ఇంకొకరి కోసం బతకటం అన్నది నాకెప్పుడూ ట్రాష్ గానే కనిపిస్తుంది. కనుక నేను చేసింది తప్పుకాదు."
   
    అంతటి వాగ్ధాటి ఆమెకుందని ఊహించని జడ్జిలిద్దరూ నివ్వెరపోయారు.
   
    యువతరానికి, పాత తరానికి మధ్యనున్న వంతెన కూలిపోయిందేమో....? లేదంటే నేటితరం ఆడపిల్లల్లో ఇంతటి విప్లవాత్మక భావాలు, స్వేచ్చపట్ల ఒక నిర్దుష్టమైన అవగాహన వుండటం సాధ్యమేనా__?
   
    సాధ్యమేనని నిరూపిస్తోంది మాయాదేవి. ఇక్కడ తప్పంటూ ఏదయినా వుంటే అది ఈ తరానికి చెందింది కాదేమో__ అర్ధంచేసుకోలేని పాత తరానికి చెందిందే ముమ్మాటికి.

    మాయ అంత ఆవేశంగా ఉద్వేగంగా బల్ల గుద్దినట్లు మాట్లాడుతుంటే తన లాయర్ మాలవ్య ఏమీ మాట్లాడకపోవటం మనోహర్ కి కోపం తెప్పించింది.
   
    అది గమనిస్తూనే లాయర్ మాలవ్య ఆవేశంగా లేచి నిలబడింది.
   
    "వాగ్ధాటి కంటే వాస్తవాలకు విలువిస్తే ఈ కేసు త్వరగా పరిష్కరింపబడుతుంది. మిస్ మాయాదేవి ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడకుండా, సమాజ వృక్షపు కూకటివేళ్ళకు పట్టిన చీడపురుగుల గురించి మాట్లాడటం విచారకరం. దీనిని మీరు గమనించాలని విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్...."
   
    లాయర్ మాలవ్య ఆవేశాన్ని, ఆవేదనని అర్ధంచేసుకున్న జస్టిస్ మెహతా సూటిగా మాయాదేవి వేపు చూశాడు.
   
    "సమాజపు పునాదులు గురించి సమాజవృక్షపు వేర్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేనడిగే ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పాల్సి వుంటుంది...." మందలిస్తున్నట్టుగా అన్నారు జస్టిస్ మెహతా.
   
    "అడగండి...." అంది మాయాదేవి ఏ జంకూ లేకుండా.
   
    "నువ్వు మనోహర్ ని సెడ్యూస్ చేశావా లేదా....?"
   
    "నాకర్ధంకాలేదు యువరానర్...." స్థిమితంగా చెప్పింది మాయాదేవి.
   
    ఆ ప్రశ్నని ఎలా అడగాలో తోచక కొద్దిసేపు సందేహించినా అడగక తప్పలేదు.
   
    "నువ్వు మనోహర్ ని రేప్ చేశావా....లేదా....?" అతికష్టంమీదనే అడిగారు జస్టిస్ మెహతా.
   
    మాయాదేవి సమాధానం చెప్పలేదు.....నవ్వి ఊరుకుంది.
   
    "ప్లీజ్ స్పీక్...." అన్నారు జస్టిస్ ప్రమీలారాణి.
   
    "రేప్ అంటే తెలుగులో ఏమిటి....?" అడిగింది మాయాదేవి వస్తున్న నవ్వును పెదాలమాటున దాచుకుంటూ.
   
    "మానభంగం..." సమాధానం చెప్పింది లాయర్ మాలవ్య.
   
    "ఎవరి మానానికి భంగం కలిగింది....?" ప్రశ్నించింది మాయాదేవి.
   
    ఒక్క క్షణం జడ్జీలు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు. మనోహర్ కోపంగా చూశాడు మాయాదేవి వైపు.
   
    "మనోహర్" చెప్పారు జస్టిస్ మెహతా.
   
    "మానభంగం అంటే అర్ధమేమిటి....? శబ్దార్ధ రత్నాకరము తెలుగు నిఘంటువును సంకలనం చేసిన మేధావుల విద్వాన్, మధురకవి శ్రీ వారణాసి వెంకటేశ్వర్లు, ఉభయ భాషా ప్రవీణ, శ్రీమాన్ ఉత్పల వెంకట రంగాచార్యులు నిర్వహించిన ప్రకారం మానభంగం అంటే అవమానం అని అర్ధం.
   
    మానం అంటే గౌరవము, గర్వము, స్త్రీలకు పురుషుల పట్ల కలిగే రోషము, ప్రమాణము, అబిమానము, మర్యాద అని అర్ధము.
   
    మానము మూడురకాలు-తులామానము, అంగుళీమానము, ప్రస్థమానము. ఇంతవరకే నాకు తెలుసు...."
   
    స్థిరమైన చూపులతో న్యాయమూర్తుల ఇద్దరివైపు చూస్తూ అంది మాయాదేవి.
   
    అప్పటివరకు ఆగ్రహావేశాలతో వూగిపోతూ కుర్చీలో కూర్చొని వున్న మనోహర్ విసురుగా లేచాడు.
   
    మాయాదేవి మాటలకు మనోహర్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. కుర్చీలోంచి లేచి మిస్ మాయాదేవి తిరిగి కేసును తప్పుదారి పట్టిస్తున్నారు.
   
    రేప్ అన్న పదం, గుడ్ అనే పదం కన్న ఎక్కువ పాపులర్ అయింది!
   
    వార్తాపత్రికల ద్వారా, సినిమాల ద్వారా, విజువల్ మీడియా ద్వారా,  శాటిలైట్ ఛానెల్స్ ద్వారా, రేప్ అనే పదం, జన బాహుళ్యంలోకి బాగా చొచ్చుకొని పోయింది. కనుక రేప్ అంటే అర్ధం ఏమిటో తెలియని చిన్న పిల్లకాదు మిస్ మాయాదేవి.
   
    అసలు విషయం వదిలేసి ఎటో వెళుతున్న మిస్ మాయాదేవిని సరైన దారిలోకి రావాలనీ, మీరు శాసించాలనీ, నేను అర్ధిస్తున్నాను" అన్నాడు మనోహర్ న్యాయమూర్తుల వేపు అభ్యర్ధనగా చూస్తూ.

 Previous Page Next Page