"అసలింతకీ వాడికి మా అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని వుందా లేదా....? అలా వున్నట్టు మీతో ఎప్పుడయినా చెప్పాడా....? ఇప్పుడు నా భార్యకు నేనేం చెప్పాలో నాకర్ధం కావడంలేదు....." అంటూ లోపలికెళ్ళిపోయాడు కుటుంబరావు.
"ఇంత పరువు తక్కువ పని చేసినందుకు వాణ్ని ఈ రోజు క్షమించను. కోర్టునుంచి రాగానే అటో - ఇటో తేల్చేస్తాను...." అంటూ ఆగ్రహానికి లోనయ్యాడు సూర్యప్రకాశరావు.
అప్పటికే తేరుకుంది అన్నపూర్ణమ్మ.
"నా కొడుకు అలాంటివాడు కాదు. ఇంతకాలం ఎవరి డబ్బుతో చదువుకున్నాడో, నెలకి పది వేలు జీతం ఎవరి మూలంగా వస్తుందో తెలుసుకోలేని అయోగ్యుడు కాదు నా కొడుకు. వాడి నరనరాన వాడి మేనమామ మీద కృతజ్ఞత నిండి వుంది. ఈ ఎండల్లో పెళ్ళి చేసుకోవాలని వాడూ అనుకున్నాడు. ఈలోపు ఆ మాయ పిల్ల మాయాదేవి ఏం చేసిందో.....ఏమిటో? మన వెనుక ఏమైనా కోట్లు వున్నాయనుకుందా....?నిధి నిక్షేపాలు, లంకెబిందెలు వున్నాయనుకుందా....? ఏమనుకుని ఈ పని చేసింది....?" మాయాదేవిని తలుచుకుంటూ కోపంతో అంది అన్నపూర్ణమ్మ.
"పిచ్చిదానా....లంకె బిందెలు, నిధి నిక్షేపాలు ఆ అమ్మాయి కున్నన్ని ఈ నగరంలో ఎవరికీ లేవు...."
"మరెందుకు ఆ పని చేసినట్టు....?" ప్రశ్నించింది అన్నపూర్ణమ్మ.
"అసలేం జరిగిందో....ఎందుకు జరిగిందో....ఎలా జరిగిందో....మనోడు చెప్పి చస్తేగా తెలియటానికి...వాడికి ఫీలింగులు ఎక్కువై పోయాయి. ప్రతి దానికి ఫీలయిపోవడం, మూడ్ లో లేననటం, మనసు బాగోలేదనడం అలవాటయిపోయింది వెధవకి. ఇప్పటి వరకూ అయితే ఫర్వాలేదు. మనవాడు ఏ విషయం మీద కోర్టు కెళ్ళాడో రేపు బయట ప్రపంచానికి తెలియకపోదు....అప్పుడు మన పరిస్థితి ఏంటి....?" చిరాగ్గా అన్నాడు సూర్యప్రకాశరావు.
ఆ సంభాషణంతా వింటున్న మనోహర్ తమ్ముడికి, చెల్లెలికి అసలు విషయమేమిటో తెలియక బిక్కచచ్చిపోయారు.
* * * *
ఈ రోజుకి మన బాస్ ఇక రానట్లేనా.....?" ప్రశ్నించారు ఒకరు.
"బాసేకాదు..... మనోహర్ కూడా ఆఫీసుకి రాడు. మనోహర్ కి పట్టిన అదృష్టం నాకే గనుక పట్టివుంటే.... ఈ పాటికి ఎక్కడుండే వాడినో...."
నువ్విలా మాట్లాడానని తెలిస్తే ఈ సాయంత్రానికే నువ్వు రోడ్డుమీద వుండటం ఖాయం. పెద్దవాళ్ళ విషయాల్లో తలదూరిస్తే, తలేకాదు మొండెం కూడా మిగలదు. ఆమె ఎందుకిలా చేసిందో, దాని వెనక వున్న కారణాలేమిటో తెలుసుకోకుండా అనవసరమైన కామెంట్లు చేయటం అంత క్షేమం కాదు."
"ఏది ఏమైనప్పటికీ మనోహర్ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరొకడు వుండడు. ఈ ప్రపంచంలో ఏ అందగత్తైనా మన బాస్ అందంముందు దిగదుడుపే....పోటీలకు వెళ్ళలేదు గానీ వెళ్ళుంటే మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా కిరీటాలన్నీ ఆమెకే దక్కేవి".
"యూరప్ శృంగార దేవత వీనస్ ను, మన శృంగార దేవత రతీదేవిని కాలిగోటితో తోసెయ్యగల గొప్ప అందగత్తె- మన బాస్...."
"అసలీ రివర్స్ గేర్ గొడవేమిటో నాకేమాత్రం' అర్ధమయి చావట్లేదు."
"నీకేది మాత్రం అర్ధమయి చచ్చింది....? ఉద్యోగంలో చేరి పదేండ్లు అవుతోంది. ఒక్కసారయినా మన ఆఫీసులో పని చేసే అమ్మాయిల్లో ఎవరినయినా కనీసం హలో..... అనగలిగావా....?"
ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా ఒకచోటే గుమిగూడి మాట్లాడుకోవటాన్ని దూరం నుంచి గమనించిన అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మూర్తి సీరియస్ గా అయిపోయాడు.
అంతే....మరో నిమిషానికి ఆఫీసు నిశ్శబ్దాన్ని ఆశ్రయించింది.
తిరిగి తన పనిలో నిమగ్నమయిపోయాడు మూర్తి.
సరిగ్గా అప్పుడే ఐ. ఎస్. డి కాల్ వచ్చిందంటూ రిసెప్షనిస్ట్ పెద్దగా కేకేసి చెప్పినట్లు చెప్పింది.
మూర్తి కంగారుపడుతూ ఫోన్ ఎత్తాడు.
"హలో..... నేను..... బెనర్జీని మాట్లాడుతున్నాను. చెల్లాయ్ ఎక్కడ.....? తన కేబిన్ లోకి ఫోన్ చేస్తే ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయటంలేదు. ఏం జరిగింది.....? ఈరోజు ఆఫీసుకి మాయ రాలేదా....? సెల్ కూడా ఆఫ్ లో వుంది. ఎనీథింగ్ రాంగ్....? ఆరోగ్యం బాగానే వుందికదా?
ఫోన్ కి ఆవలి వేపునున్న మాయాదేవి అన్న బెనర్జీ టోక్యో నుంచి మాట్లాడుతుంటే మూర్తికి ఒళ్ళంతా చమటలు పట్టేశాయి.
తనిప్పుడేం చేయగలడు....ఏం జరుగుతుందని చెప్పగలడు.....ఎలా చెప్పగలడు.....? స్వభావరీత్యా బెనర్జీ ఎంత మంచివాడో అంత కోపిష్టి.
"ఏం మాట్లాడవేం....? చెల్లెలికి జ్వరం ఏమైనా వచ్చిందా....?" బెనర్జీ గొంతులో ఆందోళన తొంగిచూసింది,
"లే..... లే......లేద్సార్ మేడమ్ ఈజ్ ఆల్ రైట్. బయటేదైనా పనుండి వెళ్ళారేమో.....నేను కూడా ఇంటికి ఫోన్ చేశాను. మేడమ్ గారు ఉదయమే ఎవరో లాయర్ ను తీసుకుని బయటకెళ్ళారని తెలిసింది."
"ఎనీ లీగల్ ప్రాబ్లమ్....?" తిరిగి ప్రశ్నించాడు బెనర్జీ.
అంత కంగారు పడాల్సిన పనేం లేద్సార్.....షి ఈజ్ ఏ జీనియస్ షికెన్ మేనేజ్ ఎనీథింగ్...." అసలు విషయాన్ని దాస్తూ నెమ్మదిగా అన్నాడు మూర్తి.
"నా చెల్లెలు అన్నీ చూసుకోవలసి వస్తే మీరెందుకు వున్నట్టు.....మిమ్మల్నెందుకు అపాయింట్ చేసినట్టు....?" కోపంగా ప్రశ్నించాడు బెనర్జీ.
అరిచేతులు, అరికాళ్ళు భయంతో పట్టిన చెమటతో తడిసిపోయాయి.
"సారీ సార్....మేడమ్ గారి సంగతి మీకు తెలియందేముంది....? ఆమెగారు చెప్పింది చేయటమే తప్ప, మా అంతట మేము ఏదైనా చేసే స్వతంత్రం ఎక్కడిది....? అయినా ఇప్పుడే అన్నిచోట్లకు ఫోన్చేసి విషయమేమిటో కనుక్కుంటాను...." అన్నారు మూర్తి వినయంగా.