Previous Page Next Page 
క్రిమినల్స్ -1 పేజి 7

    పరమశివం, అతని కొడుకు ఉదయ్ తో అటుకేసి వస్తూ కనిపించాడు.

    పట్టాభి  అతి ప్రమాదకరమయిన మెదడు చురుగ్గా పనిచేసుకుపోతోంది.

    మరో నిమిషానికి ఈ ఇద్దరికీ ఆ ఇద్దరు దగ్గర అయ్యారు. పరామర్శగా ఒకర్నొకరు కళ్ళతోనే పరామర్శించుకున్నారు.

    వారికి  తెలుసు వారి పలకరింపుల్లో జీవం లేదని....చిన్న పిల్లలాడుకునే టాయ్స్ ద్వారా తాము లక్షలు నష్టపోయామని పట్టాభి, మధుమూర్తి దిగులు  పడుతుంటే  తన కొడుకు ఉదయ్ మరో కుర్రాడితో కలిసి పోలీసులు వెంటాడుతున్నారన్న  భ్రమ కలిగించి గంజాయిని నాశనం చేయించాడు.

    అది బయటకు తెలిస్తే?

    పట్టాభి, మధుమూర్తి తన కొడుకును చంపకుండా  వదలరు. మధుమూర్తి పరమశివంతో మాట్లాడుతున్నాడు. పట్టాభి డేగచూపులు ఉదయ్ మీదకు వెళ్ళాయి.

    అతని అనుమానం అతనిది.

    ఎంత వెతికినా ఉదయ్ కళ్ళలో అతనికి బెరుకుగాని, భయంకాని కనిపించలేదు.

    పట్టాభి ఉదయ్ ని ఎత్తుకున్నాడు.
   
    ముగ్గురూ  నడక సాగించారు.

    పట్టాభి ఉదయ్ ని మోయటం చాలా కష్టంగానే వుంది. అయినా ఓపిగ్గా భరిస్తున్నాడు, ఏదన్నా క్లూ దొరకక పోతుందా అని.

    కావాలనే పట్టాభి నడకలో వేగం  తగ్గించి వారికి ఒకింత వెనుక బడిపోయాడు.

    బాగా చదువుతున్నావా ఉదయ్?"

    పట్టాభి గొంతులోకి కృత్రిమమయిన వాత్సల్యాన్ని  తెచ్చుకున్నాడు.

    "ఆ....బాగానే" అన్నాడు ఉదయ్.

    "నువ్వు రోజూ స్కూల్ కెళతావా?"

    "ఓ రోజూ వెళతా...."

    "నిన్న కూడా వెళ్ళావా?"

    "ఆ....వెళ్ళానే

    ముందు మధుమూర్తితో నడుస్తున్న  పరమశివానికి భయంగా వుంది. తన కొడుకెక్కడ నోరుజారతాడో అని.

    "మీ నాన్నలాగా నువ్వు మంచిపనులు చేస్తుంటావా?"

    "ఏం మీరు చెయ్యరా?"

    చాచి లెంపకాయ కొట్టినట్లయింది అతనికి.

    "చేస్తాం....చేస్తాం...."

    ఉదయ్ ని ట్రాఫ్ లోకి ఎలా లాగాలో అర్ధంకాక సతమతమయిపోతున్నాడు.

    రోజూ సాయంత్రం ఎక్కడ ఆడుకుంటారు?"

    "స్కూల్ గ్రౌండ్ లో."

    "కేవలం అక్కడేనా?"

    "అప్పుడప్పుడు మామిడి తోపులో."

    "ఎన్నింటికి ఇంటికెళ్ళావ్?"
   
    "మా నాన్నగారింకా వాచీ కొనివ్వలేదు"

    అదేదో పెద్ద జోకన్నట్లుగా పెద్దగా నవ్వాడు పట్టాభి.

    "అకారణంగా నవ్వితే పిచ్చివాడనుకుంటారు అంకుల్."

    మరలా లెంపకాయ కొట్టినట్లయింది.

    "ఆ....ఏం లేదు. నువ్వు జోకేసావని నవ్వలేదు. ముద్దొచ్చి నవ్వాను"

    "ముద్దొస్తే ముద్దెట్టుకుంటారుగాని ఎవరయినా నవ్వుతారా?"

    అతను ఉదయ్ చతురతకు కలవరపడ్డాడు. అతని అనుమానం మరింత బలపడింది.

    "నువ్వు బొమ్మలు బాగా కొనుక్కుంటావా?"

    "ఆ....కొనుక్కుంటాను"

    "ఏమేం బొమ్మలు కొన్నావ్?"

    "అమ్మో నే చెప్పను" ఉదయ్ భయం నటిస్తూ అన్నాడు.

    అతని అనుమానం మరింత బలపడింది.

    "చెప్పుబాబు ఫర్వాలేదు" బుజ్జగించాడు పట్టాభి.

    "చెపితే నువ్వు లాగేసుకుంటావు" కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవిచేసి అతన్ని దొంగలా చూస్తూ అన్నాడు.

    అతనికి సర్రున కోపం వచ్చింది.

    "నేను లాగేసుకోనుబాబూ"

    "లాగేసుకోనప్పుడు  మీకు నా బొమ్మల గురించి వివరాలెందుకు ?"

    ఆ కుర్రాడితో మాట్లాడటం కష్టమనిపించింది అతనికి.

    పరమశివం కాని తన కొడుక్కి ట్రైనింగు ఇచ్చాడా?

    ఏమయినా పోలీసు ఛేజింగ్, డ్రామా ఆడింది మాత్రం ఈ కుర్రాడే, ఆడించింది పరమశివంగాడే.

    సరిగ్గా  ఇదే సమయంలో  ముందు వెళుతున్న  పరమశివానికి, మధుమూర్తికి మధ్య ఘర్షణ జరుగుతోంది.

    "అవన్నీ నాకనవసరం, తప్పంతా మీది. మీ తప్పుకు నేనెందుకు నష్టపోవాలి. మర్యాదగా నా వాటా నాకిచ్చేస్తే నే వెళ్ళిపోతాను. లేదంటే బూడిదయిన నిజాన్ని బయటకు లాగవలసి వస్తుంది"

    మొండిగా అన్నాడు పరమశివం.

    మధుమూర్తి గుండెల్లో  రాయిపడినట్లయింది. అంతలోనే తిరిగి సర్దుకుంటూ__

    "ఇప్పటికిప్పుడు  తెమ్మంటే ఎలా తేగలం?" తనూ బెదిరిస్తున్నట్లుగానే  అన్నాడు అతను.

    "ఇప్పటికిప్పుడేం అక్కరలేదు. సరిగా పదిహేనురోజుల్లో యిస్తే చాలు."     

 Previous Page Next Page