Previous Page Next Page 
సరస్వతీ మహల్ పేజి 7

                                  నేయి 'పోసి నీళ్ళోదిలిన' లలన!
   
    అలా బృహస్పతి అమరావతికి పోగానే ఇలా ఇంట్లో రకరకాల వంటకాల తయారు చేయించి అంతలో వచ్చిన చంద్రుడ్ని బంగరు పీట మీద కూర్చోబెట్టి తలంటుతూ మీ గురువుగారు నిజంగా వెళ్ళారా? దూరం సాగారా! లేక మధ్యలోనే తిరిగొస్తాడా? మనకు దైవవశాత్తూ ఏకాంతం దొరికింది? ఇక నీ ఇష్టం అని తలంటు పూర్తి చేసి స్నానం చేయించి ఇంపైన భోజనం చేయించి తానూ గొజ్జంగి సిటీ స్నానమాడి వలపచెంగావి పావడ కట్టుకుని, ఆపై బంగారంచు బవంతి చీరసింగారించి పైఠాని రవిక తొడిగి ముఖాన జవ్వాది బొట్టుపెట్టి కస్తురి అడ్డుకుని చంద్రుడు విడిసిన తోటలోకి వచ్చింది.

    ఆమెను చూసిన చంద్రుడికి కొమ్మకాదిది బంగరు బొమ్మగాని, ఇంతి కాదిది జాజి పూబంతిగాని, కలికికాదిది మరుని పూములికి కాని, భామ కాదిది లావణ్య సీమ కాని అన్పించింది.

    ఆమీదట ఆమె అంగాంగాన్ని తనివి తీరాచూస్తూ తన శాస్త్ర పాండిత్యం అంతా వెల్లడి అయ్యేలా వర్ణిస్తాడు. ఆకృతిని హేమ రూపియో - ముక్కు తీరు చూడ తిలోత్తమ - మోముచూసిన శశిరేఖ - మాటతీరు మంజఘోష అని అప్సర శ్శిరోమణులతో పోలుస్తాడు.

    అలా ఆమె సౌందర్యానికి లోనయి---

    చూడకుండంగ కూడదీ సుదతి సొబగు, చూసినంతనె మదిలోన చొచ్చె బాళియేమిటికి ఇందువదన ఎట్టులున్నదో ఇంక రతీశ్వరాజ్ఞ ఈశ్వరాజ్ఞ కాదిది రతి ఈశ్వరుడైన మన్మధుడి ఆజ్ఞ ఎట్లుందో అనుకుంటారు.

    మన్మధుడి ఆజ్ఞ ఏమంటుంది? ఏముంటుంది? ఏకాంతంతో ఏ స్త్రీ పురుషులు కుర్చున్నా తనువు పులకింప చేయడం, చిత్తం తత్తరింపచేయడం, వివశతను పొందించడం ఆ మీదట విరహం లేదా సంయోగం ఇదేకదా మన్మధాజ్ఞ.

    భయంభయంగా తారను చూస్తూ ఎందుకొచ్చావు. ఇంట్లో పనుల్లేవా? మనల్నిలా చూస్తే ఏమనుకుంటారు అని మందలించినట్లుగా అంటే ఆమె పని పడే వచ్చాను. ఇంట్లో పనేముంది? ఎవరైనా చూస్తారనా? చూడనీ, ఏమైనా అనుకుంటారా? అనుకోనీ? ఎవరేం గొప్ప? మన్మధ బారికి లోను కాని వాళ్లెవరు? ఐనా నిజం చెబుతా విను.

    నీనెర నీటు, నీ సొగసు, నీరసికత్వం, నీ విలాసం, నీ నవ మోహనాకారం, నీయెల ప్రాయం చూచి చూచి ప్రేమించి అభిమానంతో దాచి ఇన్నాళ్ళూ మన్మధ వేధకు గురయ్యాను. నీ కోసమే నీ పొందు కోసమే వచ్చాను. నన్ను కరుణించి కటాక్షించి కౌగిలించి సుఖాల లాలించు అంది.

    ఆమాట వినగానే చంద్రుడి గుండె ఝల్లుమంది. అదంతా తగని ఉదంతం అని నీతులు చెప్పాడు.

    దాంతో నేయి పోసిన అగ్గిలాగా భగ్గుమంది. వెతలు తీరని వెతతో ఏమేమో అంది. ఆ మీదట అతని అందాన్ని పొగిడింది. ఆగలేక పైబడి కౌగిలించింది.

    చంద్రుడు తార అందానికి బందీ అయ్యాడు. శృంగార బందీ అయ్యాడు. శృంగార సంబంధి అయ్యాడు. అలా వాళ్ళిద్దరూ శృంగారకాండ సర్వస్వం పరస్పరం పాఠం చెప్పుకుంటూ వుండగా వచ్చాడు బృహస్పతి.

    వచ్చిన తర్వాత కుశల ప్రశ్నలు అయ్యాక వాళ్ళ అన్యోనత చూసిన ఆయనకు అనుమానం వచ్చింది. ఇది పరిచయంతో ఏర్పడిన చనువో లేకపోతే మరో బంధ సంబంధమో చూద్దాం అనుకున్నాడు.

    పరిహాసాలు, కనుసన్నలు, బొమ ముడిపాట్లు, సరసోక్తులు, మర్మ గర్భ సంభాషణలు చూశాడు. కోపంతో తారను పిలిచాడు.

    నువ్వు సాధ్వివి అనుకున్నాను. ఇలా చేశావేం. ఆ మూర్ఖుడ్ని శిష్యుడనుకున్నాను. వాడలా ప్రవర్తించాడేం? మీవల్ల అపకీర్తి వచ్చిందో! పెద్ద లెవరూ లేకుండా మీ ఇద్దర్నీ ఒంటరిగా విడిచి వెళ్ళానే అదీ నా తప్పు. పెద్దతనం వచ్చి బుద్ధి పెడతల పట్టింది! ఎంత పాపం చేశారు మీరు!

    నన్ను నాన్నా అనీ, నిన్ను అమ్మగారు అని పిలిచేవాడే. అన్ని వేదాలు చదివాడే! అలా చేశాడేం! నిజం! ఆడువారిని నమ్మకూడదు. మీకు నిలకడ వుండదు. వావి వరసలు వుండవు.
స్నేహంలేదు, భయంలేదు. చంచల హృదయులు, దురాత్మకులు, అబద్ధాల కోరులు. అందుకే రాజులు అంతఃపురాల్లో పోతుటీ గనైనా రానివ్వరు...

    ఎందుకా ఏడ్పు? ఏమిటలా బొటన వ్రేలు నేలరాస్తావు. మీ శీలమంతా దివ్య దృష్టితో చూశానులే! ఇంతకీ రెచ్చగొట్టింది నువ్వా? వాడా? చెప్పు... తప్పు చేసిన వారిని శిక్షిస్తాను....

    భర్త మాటలు వింటూ- తప్పు చేసిన వారిని దండిస్తామన్నారు.... నిజానికి తప్పు చెయ్యందెవరు? ఆ బ్రహ్మగారి కూతురు అహల్యే తప్పు చేసిందంటే నేర్చి నడువ ఒకరి తరమౌతుందా? ఎలాగైనా మగవాళ్ళు ఓర్చుకోవాలి. లేకపోతే మీకే నగుబాటు కదా! అని భర్త పాదాల మీద వాలి ఎక్కిళ్ళు పెడ్తూ ఏడ్చింది....తార....

    ఇంకేం అంటారు బృహస్పతి.... చంద్రుడ్ని పిలిచి....ఊరికి వెళ్ళిరా అని పంపేశాడు. చంద్రుడు కూడా భయ భక్తులతో సెలవు తీసుకుని వెళతాడు.

    వియోగంలో ఇద్దరూ మునిగిపోతారు. కొన్నాళ్ళకు తాళలేక వచ్చి గురుపత్నిని లేవదీసుకుని వెళతాడు చంద్రుడు. బృహస్పతి ఇంద్రుడికి కధంతా చెప్పి తన భార్యను తిరిగి తెప్పించమంటాడు. ఇంద్రుడు యుద్ధం ప్రకటిస్తాడు. చిత్రంగా బృహస్పతి శత్రువైన శుక్రుడు చంద్రుడికి తోడొస్తాడు. పెద్ద పోరు జోరుగా జరుగుతుంది. చివరికి రాజీగా---


    శివకేశవుల యుద్ధాన్ని బ్రహ్మ ఆపు చేస్తాడు. బుధుడు తార కుమారుడు చంద్రుని తనయుడే అని నిర్ధారించి అబ్బాయిని చంద్రుడికి తారను బృహస్పతికి ఇప్పిస్తాడు బ్రహ్మ---

    శేషం వేంకటపతి చమత్కారాలు అడుగడుగునా ఆస్వాదించ దగ్గవి.... ప్రతి పాదంలోనూ చమత్కారం రంగరించడం చేమకూర వెంకన్న నేర్పించిందే ఐనా దాన్ని బాగా వంట పట్టించుకుని ప్రదర్శించిన వాడు వేంకటపతి మాత్రమే!


                                                  ---*---

 Previous Page Next Page