Previous Page Next Page 
అహల్య పేజి 7


    భృగు మహర్షికి ఎంతో ఆనందమయింది.


    సకల శాస్త్రాలూ నేర్చి, ధర్మాలూ తెలిసి, న్యాయ సూత్రాలను నిర్మిస్తోన్న గౌతములంటే మహర్షి లోకంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన నిర్మల జీవనం, ప్రశాంత ఆశ్రమ జీవితం అందరికీ ఆదర్శప్రాయం. ఆయన శాంత చిత్తానికి ప్రతీక! కోపధారి అయిన భృగుమహర్షి కూడా ఆనందించాడంటే ఆయన గురించి చెప్పక్కరలేదు కదా!


    పూర్ణాహుతి ప్రారంభమయింది. సకల ద్రవ్య శేషమూ హోమగండంలో సమర్పించారు. హోమం పూర్తయింది. అందరికీ శిష్యులు హోమ భస్మాన్ని అందించారు. ఆపై అచట నుండి కదిలి సమీపంలోని తిన్నె మీద కూర్చున్నారు ఇద్దరు మహర్షులు. అశోక వృక్షం దట్టమైన నీలి నీడ కల్పిస్తున్నది.


    'నాయనా గౌతమా! మేం కోసల దేశం వెళుతున్నాం. కౌసల్యా దేవికి పుత్రోదయం కలగాలని మంత్రోపదేశం చేసి, మంత్ర జలం ఇచ్చి ఆ విషయం కోసలేంద్రుడికి చెప్పడానికి వెళుతున్నాం. దశరధుడు సంతానం లేక పరితపించి పోతున్నాడు కదా! వేల ఏండ్లు గడిచినా పుత్ర సంతతి లేక ఆయన అలమటిస్తున్నాడు. త్వరలో సకలముని సమావేశం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాడు. కౌసల్య యీలోగా మంత్ర జపం పూర్తి చేసుకుని తోటి రాణులు సుమిత్రకూ కైకేయికీ ఉపదేశిస్తుంది. వారూ జపం పూర్తిచేస్తారు. అన్నీ చక్కగా అమరిపోతాయి.'


    'దేశమే కాదు ఈ త్రేతాయుగమే తరించిపోతుంది మహర్షీ!' అన్నాడు గౌతముడు.

    
    'అవును! మనమంతా అదృష్టవంతులం. ఒక ఆదర్శమూర్తి అవతరిస్తాడు! అతని సమకాలంలో మనం జీవిస్తాం! ఆ విషయం అటుంచు గౌతమా! తమరిప్పుడు నిర్వహించిన హోమం అపూర్వమైంది. దీని ఫలమేమో తెలుసా నీకు?' అడిగారు భృగువు.


    'ఏముంది స్వామీ! లోకాస్సమస్తా సుభినోభవంతు! అంతకంటే ఏమి కావాలి మహర్షీ!'


    భృగుమహర్షి నవ్వారు వింతగా.


    ఎక్కడో కోయిల కూసింది. పక్కనే ఉన్న రసాలం మీది జక్కువ పక్షులు కలస్వరం చేశాయి.


    'లోకం సంగతి సరే మునీంద్రా! తమరి సంగతి ఏమిటీ?'


    'నేనూ లోకంలోని వాడినే కదా! మా ఆశ్రమం ప్రశాంతంగా ప్రకృతి సిద్ధ ఫల సమృద్ధిగా ఉంటుంది. కృషి లభ్య సంభార సమన్వితంగా ఉంటుంది. అంతే!'


    'అంతే కాదయ్యా! అమాయక చక్రవర్తీ! నువ్వు చేసిన ఈ హోమం ఫలితంగా నీ జీవితంలో శుభోదయమౌతుంది.'


    'నా జీవితంలోనా!' ఆశ్చర్యపోయాడు గౌతముడు.


    'అవును! నీకు పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది'


    'అంటే!'


    'అంటే! నీ జీవితం ద్వంద్వమవుతుంది'


    'స్వామీ!'


    'అవును గౌతమా! నీకు తగిన ఇల్లాలు లభిస్తుంది. ఏ మహనీయురాలు ఈ ఆశ్రమ సీమలో పాదం మోపుతుందో! ఇంతటి తపస్సంపన్నుడికి కన్యాదానం చేయగల పుణ్యాత్ముడెక్కడున్నాడో! ఎవరో! నాకయితే తెలియడం లేదు. దివ్యదృష్టికీ అందబోదని అలా యోచించడంలేదు. కానీ నీకు త్వరలో వివాహం జరుగుతుంది. ఈ ఆశ్రమానికి నీ అమృత జీవితానికీ పరిపూర్ణత సిద్దిస్తుంది.'


    గౌతముడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఏమీ చెప్పడానికి తోచలేదు. తనేదో సంకల్పించి హోమం పరిసమాప్తి చేశాడు. అనుకోకుండా ఈ దివ్యర్షి విచ్చేసి యిలా భవిష్యత్తు సూచిస్తున్నాడు. కానీ పరమేష్టి సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుని అంజలి ఘటించి మహర్షి మాటలను ఆశీస్సులుగా స్వీకరించాడు.


                                                   *    *    *    *


    భృగుమహర్షికి ఆతిధ్యం ఏర్పాటయింది.


    అయోధ్యా పురవరాధీశుడు- ఇక్ష్వాకుల కుల దీపకుడు- ఇనవంశ తిలకుడూ దశరధ మహారాజు ఆయన ప్రధాన సచివుడూ అయిన సుమంత్రుడు మహారాజా వారి అంతఃపురంలో ఆలోచనా మందిరంలో ఆసీనులై ఉన్నారు.


    ప్రభువులకు ప్రశాంత చిత్తం కోసం దూరంగా వైణిక నిపుణి చతురిక వీణ వాయిస్తున్నది. చతురిక కౌసల్యాదేవి అంతరంగిక చెలి. కైకకు సఖి. సుమిత్రకు మిత్రురాలు. ముగ్గురు రాణులకూ ముచ్చట తీర్చే ముగుద.    


    సుతారంగా వినిపిస్తోన్న వీణానాదం వింటున్న మహారాజు లేచి పచార్లు చేయసాగాడు. సుమంత్రుడు ఏమీ తోచక దీర్ఘాలోచనలో ఏ పరిష్కారం తోచక మహారాజునే గమనించసాగాడు.


    'సుమంత్రా!'


    ప్రభువుల పిలుపుకి లేచి ఆయనను సమీపించాడు.


    'విభాండక మహర్షికి హరిణి వల్ల జన్మించిన ఋష్యశృంగుల వారు పాదం మోపితే తప్ప రోమపాదుడి రాజ్యంలో క్షామం నివారణ కాదు. ప్రజలలో ఆయన కలిసిపోతే తప్ప అయోధ్యలో అడుగుపెట్టడు. ఆయన వచ్చేదెప్పుడూ? పుత్రకామేష్టి జరిగేదెప్పుడూ? ఫలం అందేదెప్పుడూ? ఆపై పుత్రోదయమై పుత్రుడి ముఖం చూసేదెప్పుడూ?' నిట్టూర్చినాడు దశరధుడు.


    సుమంత్రుడు మెల్లిగా అన్నాడు.

 Previous Page Next Page