Previous Page Next Page 
కొత్తనీరు పేజి 8


    శకుంతల మీద పగబట్టిన విద్యార్ధులు ఈ అవకాశంకోసం పదిరోజుల ముందునుంచి కాసుకు కూర్చున్నారు. వాళ్ళలో ప్రతీకార వాంఛ రగలడానికి అంతకుముందు పదిహేనురోజుల క్రితం జరిగిన ఓ సంఘటన కారణం!
    ఆరోజు శకుంతల కాలేజీలో మేడమీదనుంచి దిగి వస్తూంటే మెట్ల మలుపుదగ్గిర ఓ పదిమంది రౌడీ వవిద్యార్ధులు ఆమెను చుట్టుముట్టి ఎటూ వెళ్ళ వీలులేకుండా చేసి, ఆమె గాభరాతో వణికిపోతూంటే ఘనకార్యం చేసినట్లు పగలబడి నవ్వారు. శకుంతల ధైర్యం తెచ్చుకుని కాలినున్న చెప్పు లాగి కళ్ళెర్రచేసింది. 'తోవ వదులుతారా, చెప్పుదెబ్బలు తింటారా!' అని బెదిరించింది. అందులో ఒకడు ఆ చేయి పట్టుకుని "కోమలీ, నీ చేతి చెప్పుదెబ్బకూడా మెత్తగానే వుంటుంది. నీ చెప్పుదెబ్బ తినే అదృష్టంమాత్రం అందరికి పట్టుతుందా? ఊఁ, కొట్టు!" అంటూ హీరోలా పోజు పెట్టాడు. నిస్సహాయతలో ఏడుపు ముంచుకువచ్చింది శకుంతలకి. అయినా బింకంగా "మీ అందరి సంగతి ఇప్పుడే ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేసి మిమ్మల్ని ఏం చేయిస్తానో చూడండి" అని బెదిరించింది.
    "చెపితే నీ పాట్లు వుంటాయి చూసుకో!" అని బెదిరించాడు ఒకడు.
    "చెప్పనీరా. మనకేం భయం? మనమేం చేశాం? మేడమెట్ల మీద నడవడానికి మనకుమాత్రం అధికారం లేదా? మనం నిలుచునుంటే 'చెప్పుతో కొడతానం'దని చెపుదాం." అన్నాడు యింకోడు.
    ఈలోపల ఇద్దరు ముగ్గురు లెక్చరర్లు మేడమీదనుంచి మాట్లాడుకుంటూ రావడంతో, ఎవరిమట్టుకు వారు గబగబా వెళ్ళి పోయారు. ఏడుస్తూ నిలుచున్న శకుంతలని చూసి, సంగతి అడిగి ప్రిన్సిపాల్ కి రిపోర్టు చేయించారు లెక్చరర్లు. ప్రిన్సిపాల్ మర్నాడు సంగతి విచారించి తగిన చర్య తీసుకుంటా నన్నాడు. కూతురిద్వారా సంగతి విని జగన్నాథంగారు ప్రిన్సిపాల్ ని చూశాడు. "ఇదిఎంత మాత్రం తేలిగ్గా విడిచిపెట్టడానికి వీలులేదు. ఇలాంటి విద్యార్ధుల మీద చర్య తీసుకోకపోతే అందరికి అలుసు అవుతుం"దని దగ్గిరుండి విచారణ జరిపించారు.
    విద్యార్ధులు తమ తప్పులేదని వాదించారు. తాము మెట్లమీద నిలబడి మాట్లాడుకుంటూంటే శకుంతలే చెప్పుతో కొడతానందని జవాబిచ్చారు. శకుంతలచేయి పట్టుకోవడంకూడా ఆమె కొడతాననడంవల్ల కోపం వచ్చి చేసిన పనే అని సంజాయిషీ ఇచ్చారు.
    ప్రిన్సిపాల్ శకుంతల చెప్పిందంతా విన్నారు.
    "ఈ అమ్మయిపట్ల మీరిదివరకుకూడా చాలాసార్లు అక్రమంగా ప్రవర్తించారని తెలిసింది" అని తేల్చి అందులో ముఖ్యులైన యిద్దరిని యింక కాలేజీలో చదవడానికి వీలులేకుండా డిబార్ చేశారు. తక్కినవారిని వారివారి తప్పులనుబట్టి ఏడాది, రెండేళ్ళు డిబార్ చేశారు. కొందరికి గట్టి వార్నింగులు యిచ్చారు.
    విద్యార్ధులందరూ ఆ తీర్పు అన్యాయమని వాదించారు. ప్రిన్సిపాలు వారికి మాట్లాడడానికి అవకాశం యీయలేదు. వారి మాటలని లక్ష్యపెట్టకపోవడంతో తక్కిన విద్యార్ధులందరిని కూడాకట్టుకుని మూడురోజులు సమ్మె చేశారు. ప్రిన్సిపాలు అందుకూ లొంగలేదు. "ఇరవై నాలుగు గంటల్లో కాలేజీకి రాని విద్యార్ధు లందరిమీద చర్యతీసుకొనడం జరుగుతుం"దని నోటీసు ఇచ్చారు.
    దానితో చాలామంది విద్యార్ధులు మర్నాడు కాలేజీకి వెళ్ళారు. తల్లితండ్రులచేత చీవాట్లు తిని మరికొందరు వెళ్ళారు. ఇదంతా చూసి మన కెందుకాని మరికొంతమంది హాజరయ్యారు. మొత్తంమీద డిబార్ చేయబడినవారు తప్ప మిగతా అందరూ క్లాసులకు హాజరు అయ్యారు.
    శిక్షకు గురిఅయిన ఆ పదిమంది విద్యార్ధులు శకుంతలమీద త్రాచుపాము పగపట్టారు. అవకాశం కోసం కాచుకున్నారు. ఆఖరికి ఆరోజు మాటువేసి శకుంతలను భ్రష్టురాలిని చేసి తమ పగ తీర్చుకోవడానికి నిశ్చయించారు. కాని దైవికంగా ఓ కారు ఆ తోవను వచ్చింది ఆ సమయంలో. లిటు వెలుగులో జరుగుతున్న గలభాచూసి కారులోవాళ్ళు కారాపి దిగివచ్చేసరికి ఆ ఆకతాయిలు పారిపోయారు. అప్పుడు వాళ్ళు బండివాడి కట్లు విప్పి వాడిద్వారా సంగతి తెలుసుకుని స్పృహతప్పిన శకుంతలని యింటికి చేర్చారు.
    కూతురుని చూసి పార్వతమ్మ రాగాలు పెట్టింది. జగన్నాథం గారు నిశ్చేష్టులైపోయారు.
    మర్నాడు తెల్లవారక ముందే యీ వార్త ఊరంతా చిలవలు, పలవలతో గుప్పుమంది. అదిగో పులి అంటే, యిదిగో తోక అనే రకం మనుష్యులందరూ శకుంతల మీద అత్యాచారం జరిగినట్లు, శకుంతల భ్రష్టురాలైపోయినట్లు పుకార్లు పుట్టించేశారు. ఊళ్ళో వాళ్ళ పరామర్శలకి, సానుభూతి మాటలకి జగన్నాథంగారు మండిపడ్డారు. పార్వతమ్మ అవమానంతో తల ఎత్తుకోలేక పోయింది.
    శకుంతల ససేమిరా యింక తను చదవనంది పార్వతమ్మ యింక దాన్ని చదివిస్తే నూతిలోకి దూకుతానని బెదిరించింది.
    ఇంత జరిగాక, యింకా కూతుర్ని చదివించే సాహసం లేక జగన్నాథంగారు తన కోరిక తీరే అవకాశంలేదనినిర్ణయించుకున్నారు. చదువు అప్పటితో ఆగిపోయింది.
    ఆ తరువాత శకుంతల పెళ్ళి కూడా ఓ సమస్యగా తయారయింది. ఆమె చదువు మానివేసిన దగ్గరనుంచీ ఎలాగయినా పెళ్ళి చేసివెయ్యాలని ఎన్నెన్నో పెద్ద సంబంధాలు చూశారాయన. అసలు కాలేజీ చదువులు చదివిన ఆడపిల్లల్ని పెళ్ళాడడానికి అప్పుడందరూ యిష్టపడే వారు కారు. దానికితోడు ఎవరైనా పిల్లని చూసుకోడానికి రావడం తరవాయి, జరిగిన గత్తర సంగతి వాళ్ళకి ఎలా తెలిసేదో తెలిసేది. దానితో ఆ సంబంధం కుదిరేది కాదు.
    అలా వచ్చిన సంబంధాలన్నీ చేయిజారిపోతూంటే జగన్నాధం గారికి బెంగపట్టుకుంది. కూతురికి ఉత్తి పుణ్యాన వచ్చిన ఆ చెడ్డ పేరుకు ఎవరిని ఏమనలేని కోపంతో, అవమానంతో ఆయన హృదయం మండిపోయేది.
    పార్వతమ్మకీ మనోవ్యథ పట్టుకుంది. కూతురి పెళ్ళి గురించి. పిల్ల పెళ్ళి కాలేదన్న చింతేకాక, ఇరుగు పొరుగు ఆడే మాటలకు మరింత కుమిలి పోయేది. "అన్నిటికి మీరే కారణం" అని భర్తని ఆడిపోసుకునేది.

 Previous Page Next Page