Previous Page Next Page 
కొత్తనీరు పేజి 9


    రోజులు గడిచిన కొద్దీ పార్వతమ్మకీ, జగన్నాథంగారికీ కూడా యింక శకుంతలకి పెళ్ళికాదేమో అన్న భయం పట్టుకుంది. ఆయన ధైర్యం ఒక్కొక్క సంబంధం వచ్చి తిరిగి పోతూంటే సన్నగిల్లుతూ వచ్చింది.
    మొదటి ఆడపిల్ల పెళ్ళి మంచి ఉద్యోగస్థుడితో ఆడంబరంగా చెయ్యాలనుకున్న ఆయన ఆశ క్రమంగా ఎవరో ఒకరు శకుంతలకి మొగుడంటూ దొరికితే చాలనే స్థితికి వచ్చింది.
    ఆఖరికి వున్న వూళ్ళో పెళ్ళి చూపులు జరిపించడం మాని ఎవరో దూరపు బంధువులు మద్రాసులో వుంటే అక్కడికి తీసుకువెళ్ళి పిల్లని చూపించారు. ఓ సంబంధం వాళ్ళకి-జరిగిన రభస వాళ్ళ చెవిని పడకుండా వుండాలని. అదృష్టవశాత్తు ఆ సంబంధం కుదిరింది. పెళ్ళికొడుకు బి.యల్. ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. చెప్పుకో దగ్గ ఆస్తిపాస్తులులేవు. ఓ మాదిరి సంసారులు. వరుడు అందగాడూ కాదు.
    జగన్నాథంగారికి అల్లుడు ఏ ఇంజనీరో, కలెక్టరో కావాలని వున్నా యింతటితో సరిపెట్టుకోక తప్పలేదు. ఆయన యీసంబంధం గురించి తటపటాయిస్తూంటే, పార్వతమ్మ "యీకుదిరిన సంబంధం చేసితీరవలసిందే, పిల్లకి ఇరవై ఏళ్ళు వచ్చాయి. యింక నేను నలుగుర్లో తలయెత్తుకోలేను." అంటూ పట్టుపట్టింది.
    శకుంతలకీ తనకి ఎప్పటికైనా యీ పెళ్ళి చూపుల గొడవ నుంచి విముక్తి దొరికి మనశ్శాంతి లభిస్తుందా అన్నట్టుండేది. అంచేత తండ్రి అడగ్గానే మనసులోని పెద్దపెద్ద ఆశలను చంపుకుని వెంటనే అంగీకరించింది పెళ్ళికి.
    మొత్తంమీద ఇరవై ఏళ్ళకి శకుంతల పెళ్ళి జరిపించగలిగారు జగన్నాథంగారు. అయితే ఆ పెళ్ళి ఏ విషయంలోనూ ఆయనకి సంతృప్తి కలిగించలేదు.
    పెద్దకూతురి విషయంలో జరిగిన అనుభవంవల్ల రెండో కూతురు అన్నపూర్ణ విషయంలో ఆయన ముందు నుంచి జాగ్రత్త పడ్డారు. కనీసం పూర్ణనైనా గ్రాడ్యుయేటు చేసి తన కోరిక తీర్చుకుని పెద్ద సంబంధం చేయాలని నిశ్చయించారు.
    'ఆడపిల్లను పొరుగూరిలో హాస్టలులో పెట్టి చదివించడం ఏమిటన్న పార్వతమ్మ గోల ఆయన ఎంతమాత్రం లక్ష్యపెట్టలేదు. స్కూల్ ఫైనల్ కాగానే పూర్ణని మద్రాసులో క్వీన్ మేరీస్ లో చేర్పించి హాస్టలులో పెట్టారు. పూర్ణ బియ్యే రెండో ఏడు చదువుతూండగానే చాలా సంబంధాలు చూసిచూసి విదేశాలు వెళ్ళి వచ్చిన ఒక డాక్టరుతో పెళ్ళిచూపులు ఏర్పాటు చేశారు.
    కాని విధి యీసారీ ఆయన ఆశలను తారుమారు చేసి గేలిచేసింది. పూర్ణ తన కాలేజి లెక్చరర్ ని ప్రేమించానని, అతన్ని తప్ప ఎవరినీ పెండ్లాడ నంది.
    ఆ క్షణంలో ఎన్నడూ రానంత కోపం వచ్చింది కూతురిమీద జగన్నాథంగారికి. తన పద్దతికి విరుద్ధంగా కూతురిమీద కేకలు వేశారు. ఆయన ఆశలు తీరడం లేదన్న బాధతో, ఎన్నోవిధాల నచ్చచెప్పబోయారు. బ్రతిమిలాడారు.
    "దమ్మిడీ ఆస్తి లేనివాడు, నూట ఏభైరూపాయల జీతం వాడు తప్ప నీకు ప్రేమించడానికి ఎవరూ దొరకలేదా?" అని ఎత్తి పొడిచారు.
    "వెయ్యి రూపాయలు సంపాయించే డాక్టరుకంటే ఆ లెక్చరరు నీకు ఎక్కువా?" అని అరిచారు.
    "చిన్నప్పటినుంచీ మీకు చనువిచ్చి, మీ అభిప్రాయాలను గౌరవించి, మీరు ఆడింది ఆటగా పెంచినందుకు నాకు యిది శిక్షా" అని వాపోయారు.
    "ఇంత చేసిన తండ్రికి మీరు చూపించే కృతజ్ఞత యిదేనా" అని దైన్యంగా అడిగారు.
    "ఈ అనర్ధాలన్నింటికి అసలు కారణం రామం. వాడే ముందు దారితీశాడు" అంటూ కొడుకుమీద విరుచుకుపడ్డారు.
    "నిన్నేనా చదివించి, పెద్ద సంబంధం చేయాలనుకున్న కోరికని తీరుస్తావని ఆశించాను" అని బ్రతిమిలాడాడు.
    ఎన్నివిధాల చెప్పినా అన్నపూర్ణ పట్టు విడవలేదు. బలవంతంగా యింకొకరితో పెళ్ళిచేస్తే చస్తానని బెదిరించింది.
    ఇంక ఆ పెళ్ళి చెయ్యక తప్పలేదు ఆ తండ్రికి. గుడ్డిలో మెల్ల అన్నట్టు తమ కులంవాడు, కాస్త సంప్రదాయంగల కుటుంబానికి చెందినవాడు అవడం కాస్త తృప్తి కలిగించింది ఆయనకి.
    ఇన్నిసార్లు డుబుకీలు తిన్న జగన్నాథంగారు యింక ఆఖరి కూతురిమీద వెర్రిమొర్రి ఆశలు ఏమీ పెట్టుకోలేదు. ఏది ఎలా జరగవలసివుంటే అలా జరుగుతుందన్న వేదాంతధోరణిలో పడ్డారు.
    విజయ వేళకి రోజులు మారి ఆడపిల్లల చదువుల సమస్య లేకపోయింది.
    విజయ బియస్సీ ప్యాసయాక, యింకా చదువుతానంటే అలాగే అన్నాడు జగన్నాథంగారు. ఎమ్మెస్సీ అయ్యాక నేను రీసెర్చి చేస్తానంటే ముభావంగా 'నీ యిష్టం' అని వూరుకున్నారు.
    పార్వతమ్మ మాత్రం 'అప్పుడే ఇరవైఏళ్ళు నిండిపోయాయి, పెళ్ళి చేయండి' అంటూ గొడవ చేస్తూవచ్చింది మధ్యమధ్య. ఆయన భార్యమాటలు లక్ష్యపెట్టడం మానేశాడు. కూతురి భవిష్యత్తు నిర్ణయం ఆమెమీదే వదిలారు. మధ్యలో ఒకటి రెండుసార్లు తన కర్తవ్యంగా ఎంచి పెళ్ళి సంగతి కూతురికి గుర్తుచేశాడు.
    కాని విజయ 'ఇప్పుడు కాదు' అంటూ వాయిదావేసింది.
    విజయ డాక్టరేట్ తెచ్చుకున్నాక......తనకి ఫారిన్ స్కాలర్ షిప్ వచ్చిందని, ఫారిను వెళ్ళాలని వుందని చెప్పిన రోజునమాత్రం జగన్నాథంగారు కూతురితో ఆమె భవిష్యత్తు గురించి చర్చించారు.
    "బియస్సీ అనుకున్నాను. తరువాత ఎమ్మెస్సీ చదువుతా నన్నావు. తరువాత రీసెర్చి అన్నావు. నీ అభిలాషని కాదనడం యిష్టంలేక సరే అన్నాను. డాక్టరేట్ తెచ్చుకున్నావు. బాగుంది. ఇంకా ఫారిన్ వెళ్ళాలంటున్నావు. ఇప్పుడు నీకు ఇరవైమూడేళ్ళు నిండాయి. ఈ రీసెర్చ్ లకి అంతం ఎప్పుడు? అనంతమైన యీ చదువుకి అంతం ఎప్పుడు? ఇంకా చదివి ఏం చెయ్యాలని నీ ఉద్దేశం?" విజయ తల వంచుకుంది. చేతిగోళ్ళు చూసుకుంటూ ఉండిపోయింది.
    "మీ అమ్మ నీ పెళ్ళిగురించి రోజూపోరుతున్నా, నీకుచదువు మీద ఉన్న అభిలాషను చూసి అది ఇన్నాళ్ళు వాయిదా వేశాను. ఇరవై మూడేళ్ళ దానివి. పెళ్ళి ఇంకా వాయిదా వేయడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. నీకు అంతగా ఫారిన్ వెళ్ళానివుంటే దానికి తగ్గట్టు అలాంటి వరుణ్ణి చూస్తాను. పెళ్ళయాక ఇద్దరూ వెళ్ళవచ్చు!" కూతురి మొహంలోకి చూస్తూ అన్నారు ఆయన.

 Previous Page Next Page