జగన్నాధంగారికి పట్టరాని కోపం వచ్చింది. "దాని బోడి సలహా ఎవరూ అడగలేదు. నీవిలాంటి వెధవ కబుర్లు విని నా దగ్గిర సణిగావంటే వూరుకోను.....ఇకముందు యిలాంటి మాటలు చెప్పొద్దు" అని భార్యని కేకలు వేశారు.
"ఆవిడ మాత్రమేనా? ప్రతివాళ్ళూ అంటున్నారు. ఊర్లోవాళ్ళదాకా ఎందుకు! మా అన్నయ్య, మామేనమామ, మేనత్త అందరూ "పదహారేళ్ళు వచ్చిన పిల్లకి పెళ్ళి చేయకపోవడం ఏమిటని నన్ను తిడుతున్నారు. ఇంకా చదివిస్తున్నామని ఆడిపోస్తున్నారు."
"మరో పనీ, పాటా లేని వాళ్ళందరూ ఏదో అంటుంటారు. బొడ్డూడని పిల్లకి పెళ్ళిచేసి, పన్నెండేళ్ళకి విధవరాలిని చేసి కూర్చోపెట్టమని లా వుంది వాళ్ళ ఉద్దేశం!"
"అయ్యో, అయ్యో! అవేం మాటలండీ!"
"మరేమిటి లేకపోతే? మీ అన్న కూతురికి పదేళ్ళకి పెళ్ళిచేశాడు. ఆపిల్ల కాపురానికి వెళ్ళకముందే ఆమొగుడు ఛస్తే, పన్నెండేళ్ళ దాన్ని వితంతువును చేసి కూర్చోపెట్టి జన్మంతా ఏడవ మన్నారు. మీ మేనమామ కొడుక్కి పెళ్ళిచేసి కట్నం సరిగా ముట్టలేదని ఆ పిల్లని కాపురానికి తీసుకురాకుండా ఇంకో పెళ్ళి చేశాడు కొడుక్కి. ఆ మామా నీతులు బోధించడమేనా యింకోరికి? మీ మేనత్త మొగుడు చచ్చి పదిహేనేళ్ళకి అన్నపంచ చేరి చాకిరీ చేసుకుంటూ బ్రతుకుతూంది. అలాంటి ఆవిడ బుద్ధిలేక యిలాంటి సలహాలు చెపుతూంది" కోపంగా అన్నారాయన.
"అవునులెండి. సందుదొరికితే మా వాళ్ళని ఆడిపోసుకోవడమే మీ పని. మీఅంత గొప్ప వాళ్ళు కారు మావాళ్ళు!" మూతి ముడుచుకుఅంది పార్వతమ్మ.
"నా పిల్లల బాగోగులు నాకు తెలుసు! వాళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకోగలను. ఈ విషయంలో ఎవరి సలహా అక్కరలేదు నాకు. నీతో ఎవరన్నా యిదే మాట చెప్పు" అని ఖచ్చితంగా తన నిర్ణయం చెప్పాడు.
"బాగానే వుంది. నాకేం పోయింది. రేపొద్దున్న పిల్లకి చెడ్డపేరు వచ్చి పెళ్ళి పెడాకులు లేకపోతే బాధపడేది మీరేగా!"
"అలా అని వూరుకో. అంతగా నా పిల్లకి పెళ్ళికాకపోతే చదివించి ఉద్యోగం చేయిస్తాను," ధీమాగా జవాబిచ్చాడాయన.
కాని ఆయన ధీమా రోజులు గడిచిన కొద్దీ దిగజారిపోసాగింది. శకుంతల కాలేజినుంచి వచ్చి చెప్పే సంగతులు వింటూంటే.
ఓరోజు అసభ్యమైన బొమ్మలువేసి అడ్డదిడ్డంగా గోడలనిండా రాశారని, మగపిల్లలముందు తలెత్తుకోలేక పోయానని, ఏడుపు గొంతుతో చెప్పింది.
ఇంకోరోజు వెనకనుంచి తన చీర కొంగు కత్తిరించారని బిక్కమొగం వేసుకు చీర చూపించింది.
మరోరోజు తన జడ బెంచీకి కట్టేసి అల్లరిపెట్టి నవ్వారని ఏడుపు మొహంతో చెప్పింది.
ఇంకోసారి ఎవడో పెళ్ళిచేసుకోమని ప్రాధేయపడుతూ ప్రేమ లేఖ రాశాడని ఉత్తరం చూపించింది.
కాలేజీలో నడవకుండా వెనకనుంచి రోజుకో పేరుతో పిలిచి చప్పట్లుకొట్టి ఏడిపిస్తున్నారని తనకి భయమేస్తూందని దిగులుగా అనేది.
మరోసారి లేబరేటరీలో కెమిస్ట్రీ ఎక్స్ పర్ మెంట్ చేస్తూంటే డిమాన్ స్ట్రేటర్ అవతలకి వెళ్ళగా చూసి, వెనకనుంచి ఎవరో తనని గట్టిగా పట్టుకుని, కళ్ళుమూసి ముద్దు పెట్టుకుని.....తను గొడవ చేసి విడిపించుకోగానే ఎవరో తెలియకుండా వెళ్ళిపోయారని చెప్పింది. ఆరోజు కళ్ళు వాచి పోయేటట్లు ఏడుస్తూ వచ్చిన శకుంతలని చూసి జగన్నాథంగారు కంగారు పడ్డాడు. పార్వతమ్మ భర్తని ఏమనలేక నెత్తీ నోరూ కొట్టుకుంది.
శకుంతల ఆరోజుతో పూర్తిగా భయపడిపోయింది. తను యింక చదవనని చెప్పేసింది. కాలేజీకి వెళ్ళడం అంటే భయంగా వుందంది. ఆయన కూతురికి ధైర్యం చెప్పి కాలేజీకి వెళ్ళి ప్రిన్సిపాల్ ని కలుసుకుని మాట్లాడాడు. "ఇలాంటి గొడవలు జరుగుతూంటే విద్యార్ధులమీద ఏ చర్యా తీసుకోకుండా ఎలా వూరుకున్నారు" అని నిలవేసి అడిగాడు.
తనదాకా యీ విషయాలు ఎప్పుడూ రాలేదనీ, శకుంతల ఎన్నడూ రిపోర్టు చేయలేదనీ ప్రిన్సిపాల్ చెప్పాడు. ఇకముందు తన నోటీసుకి యీ విషయాలు వస్తే ఆ విద్యార్ధుల మీద కఠిన చర్య తీసుకుంటానని మాటిచ్చాడు. ఎవరూ చేసిందీ తెలియకపోతే తను ఏం చెయ్యలేనన్నాడు. పేర్లు తెలిస్తే, శకుంతల చెప్పగలిగితే తగు చర్య తీసుకోగలనని అన్నాడు.
ఇంటికి వచ్చి కూతురికి ధైర్యం నూరిపోశాడు జగన్నాథం గారు. ఏం జరిగినా ప్రిన్సిపాల్ కి వెంటనే రిపోర్టు చేయమని ప్రోత్సహించాడు. శకుంతల రోజూ ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని కాలేజీకి వెళ్ళేది.
ప్రిన్సిపాల్ విద్యార్ధులందరినీ గట్టిగా హెచ్చరించాడు. కాలేజీలో యిలాంటి అసభ్యకరమైన పనులు జరిగితే, వారిమీద చర్య తీసుకోడం జరుగుతుందని నోటీసులు పంపాడు.
విద్యార్ధులేనా అంత తెలివి తక్కువవారు! కాలేజీ ఆవరణలో గొడవచెయ్యడం మానివేశారు. గేటు దాటినా దగ్గిరనుంచి శకుంతలని ముప్పు తిప్పలు పెట్టేవారు. రోడ్డుమీద నడవ వీలులేకుండా గుంపులు గుంపులుగా అడ్డు వచ్చేవారు. రోడ్డంతా ఆక్రమించుకుని వెన్నంటే వారు..... ....గాలిలోకి ముద్దులు విసిరేవారు. రోజు కో పేరుతో పిలిచే వారు.
ఈ సంగతి విని జగన్నాథంగారు ఎంతమాత్రం అధైర్య పడకుండా కూతురు కాలేజీకి వెళ్ళడానికి ఓ బండి కుదిర్చారు ప్రత్యేకంగా.
ఆయన పట్టుదలతో కూతుర్ని చదివిస్తూ వచ్చారు. కాని ఇంటర్ రెండో యేడు జరుగుతుండగా ఓ దుర్ఘటన జరిగింది.
ఆరోజు 'కాలేజీడే' అయింది. ఫంక్షన్ లు, నాటకాలు య్యె సరికి రాత్రి పదిగంటలయింది. శకుంతల తనకోసం సిద్దంగా వున్న బండిలో తనకి సీనియర్ అయిన ఒక అమ్మాయినికూడా ఎక్కించుకుని ఇంటికి బయలుదేరింది. త్రోవలో తన స్నేహితురాలిని ఇంటిదగ్గిర దింపి, కాస్త నిర్మానుష్యంగా వున్న రోడ్డుమీద బండి వెడుతూండగా పదిమంది విద్యార్ధులు వచ్చి చుట్టుముట్టారు. ముందు బండి వాడి నోటిలో గుడ్డలుకుక్కి, చేతులు కాళ్ళు కట్టి పడేశారు. భయంతో కేకలు పెట్టుతూన్న శకుంతలను నోరునొక్కి పక్కనున్న మామిడి తోటలోకి లాక్కుపోయారు.