"ఒరే ఎంకా, ఎల్లవేమిరా! పెళ్ళామొస్తే అసలే ఎల్లేటట్లు లేవు" నర్సిమ్మ గొంతు వినిపించింది. తల్లిని వదిలి బయటికి వచ్చేశాడు. బయటికి వచ్చింతర్వాత తల్లి పిలుపు వినిపించింది. అది మామూలే అనుకున్నాడు వెంకడు "కొడకా! మల్ల చూస్తనో లేదో, అట్ల నిలబడు, కండ్ల నిండ చూసుకుంటా" అంటుంది. ఆనాడు ఆ మాటలు వినదలచలేదు వెంకడు. పైగా నర్సిమ్మ తొందర పెడ్తున్నాడు.
ఆరోజు వెంకడు బండమీద కూలబడి ఏడవలేదు. పనిలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. తన తల్లి బతుకుతుంది. ఆమెకు చేపల పులుసు వండి పెడతాడు, తన తల్లి బాగుపడుతుంది, లేస్తుంది, తిరుగుతుంది, తనకు వండి పెడుతుంది, నవ్వుతుంది, ఏడుస్తుంది_ పని చేస్తున్నంతసేపూ అవే దృశ్యాలు అతని మనోఫలకం మీద మసలుతున్నాయి. సూర్యుడు ఇంకా కుంగడు, పని ముగియదు, తాను ఇంటికి పోడు, విసుగు కలిగింది. కుంగే సూర్యుడు తల్లిప్రాణాలు కూడా తీసుకుని కుంగాడని అతడు ఎరుగడు.
పని మాని జనం గూడానికి బయలుదేరారు. వెంకడు తల్లిని చూడ్డానికి ఉరికి వచ్చాడు. చేపలు తేవాలి, పులుసు వండాలి, తల్లికి తినిపించాలని అతడు ఎంతో ఉత్సహంగా ఉరికి వచ్చాడు. గూడానికి దూరంనుంచే చూచాడు. అతని గుడిసెముందు పిల్లలు మూగి ఉన్నారు. మనసు కీడు శంకించింది. మరీ వేగంగా ఉరికాడు. కుక్కిమంచంలో పడిఉన్న ధర్మయ్య వార్త అందించాడు _
"వెంకడూ! మీ అమ్మ చచ్చిపోయిందిరా!"
వెంకడిమీద పిడుగుల వాన కురిసింది. అతని గుండె తునాతునకలైపోయింది.
"అమ్మా!" అని కేకపెట్టి పిచ్చమ్మ శవం మీద పడిపోయాడు. గుండెలు అవిసేట్లు ఏడవసాగాడు. తల కొట్టుకుని ఏడ్చాడు, జుట్టు పీక్కొని ఏడ్చాడు, చేపల పులుసు తినకుండా పోయినందుకు ఏడ్చాడు. తన దౌర్భాగ్యానికి ఏడ్చాడు, తన అశక్తతను తిట్టుకున్నాడు, వెంకడు ఏడ్చాడు, రోదించాడు, విలపించాడు.
గూడానికి జనం చేరుకున్నారు. పెంటడు వెంకడిని ఓదార్చాడు "పుట్టింది చావడం కోసమే. కలకాలం ఎవరూ జీవించరు, జీవితం నీటి బుడగ లాంటిది, మీ అమ్మ అదృష్టవంతురాలు" - ఇలాంటి మాటలతో ధర్మయ్య ఓదార్చాడు.
"పిచ్చమ్మ అదృష్టం మంచిది, మంచంలో కించంలో పడకుండా పోయింది. ఏడిస్తే తిరిగిరాదు, కావలసిన కార్యం జరిపించాలిరా" అని వెంకణ్ణి బయటికి తెచ్చాడు నర్సిమ్మ.
"పొద్దుగూకెయాల చచ్చింది, జాగారం చేయాలె, బజన జరగాలె, ఇన్ని సారనీల ఏర్పాటు చెయ్యాలె, ఎట్లమరి?" పెంటడు బయటపెట్టాడు.
"ఎట్ల ఏంది? దొర దగ్గరికి పోవాలె, పైకం తేవాలె, పదర వెంకడు, నేను ఇప్పిస్త" సారాయి దొరుకుతుందనే ఉత్సాహంలో వెంకడిని ముందుకు తోశాడు నర్సిమ్మ.
వెంకడు నర్సిమ్మ వెంట శివయ్య ఇంటికి చేరుకున్నాడు. శివయ్య లోన ఉన్నాడు, నర్సిమ్మ పిలిస్తే వచ్చాడు.
"ఏందిరా ఇట్లొచ్చిన్రు?"
వెంకడు మాట్లాడలేదు. నర్సిమ్మ అందుకున్నాడు_
"దొరా! పిచ్చి చచ్చింది కద, ఖర్చుకు కావాలినాయె, పైకం అడిగెటందుకు వచ్చిండు"
"బెల్లంకొట్టిన రాయలే ఉన్నవు, మాట్లాడవేమిర?" శివయ్య వెంకణ్ణి అడిగాడు.
"అరే! నువ్వేడవకురా" అని వెంకడిని కసిరి, "దొరా! దయదల్చాలె - ఎట్లయితది మళ్ళీ పీనిగ ఎల్లాలె గద - ఏదన్న మీరే చూడాలె" అని నర్సిమ్మ నసిగాడు.
"వాని దగ్గర ఏమున్నదని ఇయ్యమంటవుర! అయ్య చావుకు చేసిన అప్పు కింద వీడే నాకు వెట్టికుండె ఇగేం చూసి ఇయ్యమంటవు?"
"అట్లంటె ఎట్ల బాంచను. ఎంకడు లగ్గం చేసుకోడా_వానికి పోరలు పుట్టరా_ వాండ్లను మీ కాల్లకాడ పడేస్తడు"
"ఏమిరా ఎంకా! పెండ్లిచేసుకుంటవా?"
"ఏం చేసుకుంట బాంచెను_మా అమ్మ చచ్చింది" మళ్ళీ భోరుమన్నాడు ఎంకడు.
"వాడేం మాట్లాడ్తడుండి నేనున్నగద, అన్ని చేస్త. సారా దుకాణానికి చిటిప్పించుండి, పొద్గాలొచ్చి చావుపైకం పట్కపోత"
"సరే, అట్లనే కానియ్యి. సారా దుకాణంల నా పేరు చెప్పు" అని శివయ్య లోనికి వెళ్ళిపోయాడు.
వెంకడికి పుట్టబోయే బిడ్డల్ను తాకట్టు పెట్టి, సార దొరుకుతుందనే సంతోషంతో నర్సిమ్మ బయటపడ్డాడు-వెంకడిని తీసుకొని.
శివయ్య ఇంట్లోకి వెళితే మల్లమ్మ కనిపించింది. "దొర్సానీ! పిచ్చమ్మత్త చచ్చిందట - పోయొస్త" అని సుభద్రమ్మ అనుమతి అడుగుతూంది.
"నువ్వు పోతే చచ్చింది లేచొస్తదా? పని తప్పించుకునే ఉపాయం బాగ నేర్చినవు పో పనిచేయి పో!" సుభద్రమ్మ కసిరింది.
"పనిచేసి పోత దొర్సానీ! కాల్మొక్త, చచ్చిందాన్ని చూసొస్త-బాంచను-పొద్గాలనే మల్లొస్త" అని మల్లమ్మ సుభద్రమ్మ కాళ్ళు పట్టుకుంది.
"పొమ్మంటే ఇంటలేవు. ముంగలపోయి పనిచేయి-పోవటానికి వీల్లేదు - పనెవడు చేస్తడే నీ మిండడా!" సుభద్రమ్మ కాళ్ళమీద నుంచి నెట్టేసింది. మల్లమ్మ గుడ్లనీరు కుక్కుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది.
అప్పుడే లోన అడుగుపెట్టిన శివయ్య అడిగాడు "ఏమిటే?" అని.
"మల్లి గూడేనికి పోయి చచ్చిందాన్ని బతికిస్తదట, పోతనంటున్నది"
"పోనియ్యరాదు, పాపం, చూసొస్తదేమో!" సానుభూతి కనబరచాడు శివయ్య.
"బాగున్నది వెంట తీసుకపోయి పంపించిరాండి. అదంటే ఏందో మెత్తపడిపోతున్నరు. పనెవడు చేస్తడనుకున్నరు? పోతె మల్లొస్తదా? తాగి మిండల దగ్గర పంటది. మీకంత మనసుంటే వెంటపెట్టుక పోండి" సుభద్రమ్మ గొంతులో దుఃఖం దుముకుతున్నది.
"వద్దులే_నాకెందుకు_నీ ఇష్టం"
శివయ్య తనకేమీ పట్టనట్లు దొడ్లోకి వెళ్ళిపోయాడు.
సారాయి సీసాలతో గూడానికి చేరుకున్నాడు నర్సిమ్మ. సారాయి చూడగానే ప్రాణం లేచివచ్చింది గూడానికి. వెంకడు పిచ్చమ్మ శవం దగ్గర కూర్చొని పిచ్చెత్తినట్లు ఏడుస్తున్నాడు. అతన్ని ఎవరూ గమనించలేదు. గూడెం సాంతం కూడింది కర్రా కంపా తెచ్చి నెగడు వేశారు. మంట భగ్గున మండింది. గూడేన్ని వెలిగించింది. మంట వెలుగుకు డప్పులు కాపుతున్నారు.
"తద్దిన తక్క - తద్దిన తక్క" - దప్పులు సాగాయి. నర్సిమ్మకు అప్పటికే తలకెక్కింది - దుకాణంలోనే దంచి వచ్చాడు. జనం సారా సీసాలమీద పడ్డారు. గూడెం సాంతం పిచ్చమ్మ గుడిసెముందే ఉంది.
"వరే! గాడ్దికొడుకుల్లార ఊగుకుంట కొడ్తా న్రేమిరా మీ అమ్మల - సారపడ్దెనక డప్పట్ల సాగాలెరా!" అని డప్పందుకుని "ధనక-ధనక, ధనక-ధనక" సాగించాడు నర్సిమ్మ.
"ధర్మయ్య తాతా! సారానీలు పడ్డా సోలుగుతాన్ని వేందే బజన కానియ్యి ఊఁ కానియ్యి" డప్పు కొడుతున్నాడు నర్సిమ్మ.
"ఓ రామ - నీ నామా - మెంతారుచిరా" అందుకున్నాడు ధర్మయ్య తాత. అంతా వంత పలుకుతున్నారు. రాగాలు-తాళాలు సాగుతున్నాయి. ఎవరికీ స్పృహలేదు. వెంకడు ఏడుస్తూనే ఉన్నాడు. ఎవడూ వినడంలేదు. అందరూ వళ్ళు మరచారు- ఇళ్ళు మరచారు- ఎగురుతూనే ఉన్నారు.
నెగడు మండుతూంది.
వెంకడు ఏడుస్తున్నాడు.
పెంటడూ తాగి ఉన్నాడు. అయినా వెంకడి ఏడుపు విన్నాడు. పెంటడు వెంకడి దగ్గరికి వెళ్ళాడు. అతడూ తూలుతున్నాడు అయినా ఓదార్చాడు.
"అరే వెంకడూ! ఓరి ఎంకడూ! లే, ఎందుకేడుస్తవు? ఒరే, మనం పుట్టిందే ఏడ్చెటందుకురా! వరే ఇన్నవా, అంత ఇప్పుడే ఏడుస్తే బతుకంత ఏమేడుస్తవ్! లే నా మాటిను ఒక్క గుటకేసుకో అరే! ఇది సారారా, సకల రోగాలకు మందు, పట్టు. ఒక్క గుటక ఆఁ అట్ట కానియ్యి తాగు తాగరా!" వెంకడికి తాగించాడు.
బయట నెగడు వెలుగుతూంది
పాటలు సాగుతున్నాయి
డప్పులు మోగుతున్నాయి
"ఒరే ఎంకన్నా! మీ అమ్మ చచ్చింది వరే మంచిదిరా! చచ్చినోల్లె మంచోల్లు. బతికి మనమేం చేస్తున్నాంరా? మనం కూడా చస్తె మంచిది - దొరకు మనిషి తక్కువయితడని బతకాలె"
"మా అమ్మ చచ్చిందే - పెంటయ్యన్నా!" అని పెంటడిని పట్టుకుని బోరుమన్నాడు వెంకడు.
"అరె ఊరుకో ఊరుకొమ్మంటే - ఇగ ఏడ్వకు ఏడ్వకుమంటే" ఓదారుస్తున్నాడు పెంటయ్య.