కాలమే ఓదార్చింది అందరినీ. తెల్లవారేవరకు దుఃఖం దిగమింగాడు వెంకడు. తల్లిని మంట్లో కలిపి ఇంటికి తిరిగి వచ్చాడు. గుడిసె ముందు కూలబడి చేతులు నెత్తిన పెట్టుకున్నాడు.
గూడెం సాంతం ఖాళీ అయింది. శివయ్య చాకిరికి వెళ్ళిపోయింది. వెంకడు ఆ రోజు పనికి పోలేదు. నర్సిమ్మ రమ్మనలేదు.
గూడెం నిర్మానుష్యంగా ఉంది.
గుడిసె ముందు కూలబడి కుమిలిపోతున్నాడు వెంకడు.
"మీ అమ్మ నసీబు బాగుండి ఎల్లిపోయిందిరా! బతికినోళ్ళం ఏం చేస్తున్నాం? బాంచోల్లుగ బతుకుతున్నాం. అదే నసీబుగలిది-అరే ఏడ్వకురా!"
"తాతా! మా అమ్మ పోయింది" అని ధర్మయ్య తాత మీదపడి భోరుమన్నాడు వెంకడు.
పేదలు ఏదీ దాచుకోలేరు-దుఃఖాన్ని, సుఖాన్ని సైతం.
4
ఎండ ఎక్కుతూంది. శివయ్య వాకిట్లో ఎండ పరచుకుంది. ఎదురుచూచే జనం పడిగాపులు కాస్తున్నారు. వారి కళ్ళన్నీ శివయ్య వచ్చే గుమ్మం మీదే ఉన్నాయి. వారికి సూర్యుడు వస్తే తెల్లారదు. శివయ్య వస్తే తెల్లారుతుంది. శివయ్య వాలు కుర్చీ ఖాళీగా ఉంది, శివయ్య ముందున్న డస్కు ఖాళీగా ఉంది.
శివయ్య వళ్ళు విరుచుకుంటూ ప్రవేశించాడు. అతని ముఖంలో నలత కనిపిస్తూంది. నీరసంగా ఉన్నట్లున్నాడు. శివయ్యను చూచి అంతా దండాలు పెట్టారు. శివయ్య చిరునవ్వు నవ్వలేదు, అతడు ప్రతినమస్కారం చేయడు. వాలుకుర్చీలో కూలబడ్డాడు.
"దొరవారూ! పొరుగూళ్ళ పని కుదిరింది, జర జల్ది ఇప్పిస్తే పోత" బ్రహ్మయ్య జంధ్యం బయటికి లాగి, తనను ముందు పంపించమని వేడుకున్నాడు.
"బ్రహ్మయ్యా! ఏందా తొందర? జరుండి పంతులేడి? ఇంకా రాలే! ఏం చేస్తడో ఇంట్ల ఎరకలే జరపోయి పిల్చుకరాపో"
"దొరవారూ, నన్నే పిలిచి రమ్మంటారా ఇక్కడ ఇంతముందున్నరు"
"బ్రహ్మయ్య పిలుస్తే నీ జంధ్యలు తెగిపోతాయా? జంధ్యం ఉండంగనే మొగాణ్ణనుకున్నవా? పో పిల్చుకరా పో"
బ్రహ్మయ్య మారు పలకలేదు. కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు.
శివయ్య వళ్ళు విరుచుకున్నాడు. వాకిలి చూచాడు. మనుషులు అతనికోసం పడిగాపులు కాస్తున్నారు, వాళ్ళంతా తనకోసం బతుకుతున్నారు. ఇందుకు కారణం తన డబ్బు.డబ్బుతో వాళ్ళ జీవితాలను కొనేశాడు. డబ్బుతో వాళ్ళ ప్రాణాలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. డబ్బుతో ఈ ఊరిని తనకు ఊడిగం చేసేట్లు చేశాడు. డబ్బు గొప్పది. అది వారి దగ్గర లేదు. తన దగ్గర ఉంది. అదే రహస్యం. ఇది ఇలాగే ఉండాలి. ఇది ఇలా ఉన్నన్నాళ్ళు తానే దొర-తానే ప్రభువు - తానే దైవం. ఇది ఇలా లేకుండా పోతే పోతే పోతే ఆలోచనలు ముందుకు సాగలేదు.
మల్లమ్మ గ్లాసులో చాయ్ తెచ్చి ముందు నుంచుంది. ఆలోచనల్లో గమనించలేదు. ఆలోచన తెగుతే చూచాడు.
"అట్ల నిలబడ్డాడు - దయ్యమోలె - చాయ్ తెచ్చిన్నని చెప్పొద్దు?"
మల్లమ్మ మాట్లాడలేదు. గ్లాసు అందించింది. వెళ్ళిపోయింది. చాయ్ వేడిగా ఉంది. చప్పరిస్తే నాలుక చురుక్కుమంది.
"దొరవారూ! పంతుల్లేడు. తలుపులు బార్ల తీసున్నాయి. ఇల్లంత ఊడ్చినట్లున్నది. ఏమీలేదు. పంతులు పారిపోయినట్లున్నాడు. నా పనిముట్లు" బ్రహ్మయ్య ఉరికి వచ్చాడు. అలిపిరి వస్తూనే ఉంది. ఊపిరి పీల్చుకోకుండా అనేశాడు.
"ఏంది? పంతులు పారిపోయినాడా!" శివయ్య చేతులోని గ్లాసు వణికింది. గ్లాసు వేడిగా ఉండి, జారిపడేట్లుంది. చేయి కాలుతూంది. గ్లాసు మెల్లగా నేలమీద పెట్టాడు.
"యాడికి పోతడు? ఎట్ల పోతడు? సరిగ్గా చూచినవా? అరే బాలిగా! కొమరిగా! మల్లిగా! పొండిరా, చూచి రాండి ఊళ్ళ యాడున్నడో పట్టుకురాండి"
"చూచిన దొరవారూ! బాగా చూచిన, పంతులు లేడు, పారిపోయినట్లున్నడు"
"నోర్ముయ్యి" గట్టిగా కేక పెట్టాడు శివయ్య. ఆ కేక ఇంట్లో ప్రతిధ్వనించింది. బ్రహ్మమ గుండెలో చేరి గుబగుబ లాడించింది.
బ్రహ్మయ్య భార్యకు బావుండలేదు. పొరుగూళ్ళో పని దొరికింది. ఒప్పుకున్నాడు. పనిముట్లు త్వరగా తీసికెళ్ళాలని అతని ఆతురత.
శివయ్యకు అంతా అయోమయంగా ఉంది. శాస్త్రి గుర్తుకు వచ్చాడు. అతని వినతి గుర్తుకు వచ్చింది. తాను వాదించడం గుర్తుకు వచ్చింది. అయినా శాస్త్రులు సాధించినట్లున్నాడు! కృష్ణారావును బదిలీ చేయించినట్లున్నాడు! శివయ్యకు సూర్యుడు రాలిపడినట్లనిపించింది. సర్వత్రా కటిక చీకట్లు కమ్ముకుంటున్నట్లు అనిపించింది. తన బలదర్పాలకు ఎక్కడో చిల్లు పడినట్లూ, అవి కారిపోతున్నట్లూ అనిపించింది. పంతులు బదిలీ తనకు తెలియకుండా ఇంతవరకు కాలేదు. తన పెత్తనం మీద ఎవరో దెబ్బ తీస్తున్నట్లు అనిపించింది. గౌరీనాధశాస్త్రి ప్రత్యక్షం అయినాడు. శివయ్య పళ్ళు పట పటా కొరికాడు.
జ్యోతుల్లాంటి కళ్ళు, విరబోసిన జుట్టు, చేతులో మనిషి పుర్రెతో కనిపించాడు గౌరీనాధశాస్త్రి. శివయ్యకు చలిచలిగా ఉంది. వణుకు వస్తూంది. నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నలుగురికీ కనిపించనీయరాదనుకున్నాడు.
"దొరా! పనిముట్లు ఇప్పించండి, పోతా. నాకు పొరుగూళ్ళ పని దొరికింది" బ్రహ్మయ్య అడిగాడు.
"వస్తయి పనిముట్లు! ఇక యిస్త! తిందురుగాని! లెక్క రాసేటోడు రానియ్యండి. అప్పటి దన్క చావుండి. లంజకొడుకులు చావాలె. గాడ్ది కొడుకులు కడుపు మాడ్తే మీరే చస్తరు కుక్కల కొడుకులు" అని దిగ్గున లేచి వెళ్ళిపోయాడు శివయ్య.
అక్కడున్నవారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. "మనమేం చేసినామని?" అడిగాడు కొమరయ్య. "ఇపాసాలు పండ బెట్తాండు. ఉసురు తాకక పోతాది!" శివయ్య ఇల్లు దాటి చాలా దూరం వచ్చాక అన్నాడు బ్రహ్మయ్య.
శివయ్యకు ఆనాడు పులకరం తగిలింది. సుభద్రమ్మ గుండె గుబగుబ లాడింది.
పిల్లిని చూచి భూతం అనుకునేవాళ్ళుంటారు. అలాంటి భయమే పట్టుకుంది శివయ్య దంపతులకు.
5
శివయ్య వాలు కుర్చీలో కూర్చున్నాడు. అతని ఎదురుగా డస్కు వుంది. డస్కు ముందు కూర్చోవాల్సిన పంతులు లేడు. అతని స్థానంలో జగన్నాధం కూర్చున్నాడు. లెక్కలు పూర్తిచేశాడు. డబ్బు లెక్కపెడ్తున్నాడు. పనిముట్లు తీసుకుని అంతా వెళ్ళిపోయారు. ముంగిలి ఖాళీగా ఉంది. పావని ప్రవేశించింది.
శివయ్య గుమ్మంలో అడుగుపెడ్తున్న పావనిని చూచాడు. పావని బక్కపల్చగా పొడుగ్గా ఉంది. ఆమె ముఖంలో అమాయకత్వం కనిపించింది. మామూలు ఆడపిల్లలా ఉంది. మహకాళిలా లేదు. తాను భయపడినట్లు లేదు. పావని సౌమ్యంగా ఉంది. ఆమె పాములా లేదు. గోవులా ఉంది. పావని అంటే తాను ఎందుకు భయపడ్డాడో అర్థంకాలేదు.
"నమస్కారం శివయ్యగారూ!" పావని నమస్కరించింది.
"నమస్కారం, వచ్చినవా ఈ ఊరికి! శాణ్ణాళ్ళకు కనబడ్డవు, ఉంటావా నాల్గు రోజులు? బాగా చదువుకున్నవని చెప్పిండ్రు మీ నాయన గారు. ఎందాక చదివినవు_ఏంది కథ?"
పావని మెట్లెక్కి వచ్చింది. పక్కనున్న కుర్చీమీద కూర్చుంది. ఒక ఆడపిల్ల తనముందు వచ్చి అలా కూర్చోడం శివయ్యకు వింతగా ఉంది.
"బి.ఏ.దాకా చదువుకున్నాను. బడి పంతులు ఉద్యోగం అయింది. ఇప్పుడీ ఊరికి బదిలీ అయింది, వచ్చాను. ముందు మిమ్మల్ని చూతామని వచ్చాను"
"బాగున్నది, అంత చదువు చదివి ఈ ఊళ్ళ ఏం చేస్తావు? ఈ ఊళ్ళ చదువుకునేటోడు ఎవడు?" శివయ్య కాస్త ఆగాడు.
"ఇగో పావనీ! నువ్వు ఈ ఊరికి రావటమే నాకు ఇష్టంలేదు. వచ్చినవు ఇంకొకరు అయితే రానిచ్చెటోన్నికాను. మీ నాయనగారి మొకం చూసి ఊరుకున్న వచ్చినవు. ఇంట్ల పండుండు. మీ నాయినకు ఇంత వండి పెట్టు. సర్కారు జీతం తీస్కో, ఊళ్ళ ఉండు చదువుగిన చెపుతనంటవా ఇగబాగుండదు ఇన్నవా?" అని లేచి లోనికి వెళ్ళిపోయాడు శివయ్య. ఒక ఆడపిల్ల వచ్చి తనను ఎదిరించి మాట్లాడ్డం నచ్చలేదతనికి.
"పావనమ్మా! ఇన్నవా దొరేమన్నడో? ఇగ పెండ్లి చేసుకుని పిల్లల్ని కను" జగన్నాధం నీతి బోధించాడు.
"నాకు జీతం ఇచ్చేది గవర్నమెంటు. నేను చదువు చెప్పక తప్పదు" పావని మెట్లుదిగి వెళ్ళిపోయింది.
జగన్నాధం నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు.
లోన ఉండి పావని మాటలు విన్న శివయ్య సిగరెట్టు పొగ గట్టిగా లాగి, వదలాలా వద్దా అన్న సంశయంలో, ఉక్కిరిబిక్కిరి అయినాడు.