Previous Page Next Page 
పావని పేజి 7


    పోచయ్య శివయ్యను - దొరను చూచాడు. శివయ్య పులిలా ఉన్నాడు. చేతిలో "హంటర్" ఉంది. పులి నాల్క చాచి రక్తం కోసం చప్పరిస్తున్నట్లనిపించింది. దొరేం చేస్తాడు, తాను అన్యాయం చేయలేదు అనుకున్నాడు. అధికారానికి కళ్ళుండవని తెలియని అమాయకుడు పోచయ్య. ప్రపంచంలో జరిగిన మారణ హోమాలన్నీ అధికారం కోసమే జరిగాయని తెలియనివాడు పోచయ్య.
    శివయ్య పోచయ్య మీద లంఘించాడు. హంటర్ తో కసికొద్దీ వేశాడు. హంటర్ వంటిమీద అంటుకుంది. దద్దురు వచ్చింది.
    పోచయ్య పలకలేదు సహించుకున్నాడు.
    పోచయ్య శిలాప్రతిమలా నుంచున్నాడు. పెదవి కదపడం లేదు. మాట రావడం లేదు. అన్యాయం చేయలేదు, దొరేం చేస్తాడు? అనుకున్నాడు.
    శివయ్య దెబ్బమీద దెబ్బ వేస్తున్నాడు. పోచయ్య చర్మం చిట్లుతూంది. రక్తం కారుతూంది. రణరంగంలో ఓటమి ఎరుగని వీరునిలా నుంచున్నాడు పోచయ్య. పోచయ్య పూచిన మోదుగులా ఉన్నాడు.
    "మాట్లాడవేం బే. తప్పయిందను. కాళ్ళమీద పడు" కసిగా అంటున్నాడు. కొడుతున్నాడు శివయ్య చెమట్లు కక్కుతున్నాడు. శక్తీ క్షీణిస్తున్నది. దెబ్బలు కొట్టలేకపోతున్నాడు. బాదలేకపోతున్నాడు. అయినా బలం పుంజుకుని కొడ్తున్నాడు.
    పోచయ్య పడిపోయాడు. మొదలు నరికిన చెట్టులా పడిపోయాడు. వంటినిండా రక్తం, కళ్ళు ఉబ్బి ఉన్నాయి, ముఖం వాచి ఉంది.
    శివయ్య జడుసుకున్నాడు.
    ఒక్క అడుగు వెనక్కు వేశాడు.
    చేతిలోని కొరడా జారవిడిచాడు.
    రొప్పుతూ నుంచున్నాడు.
    భయంగా పోచయ్యను చూస్తున్నాడు.
    "నేను అన్నాలం చెయ్యాలే దొరేం చేస్తడు?
    నేను అన్నాలం చెయ్యాలే దొరేం చేస్తడు?" పలవరించినట్లు పలుకుతున్నాడు పోచయ్య.
    పోచయ్య పలుకులు నినాదాల్లా ఉన్నాయి. అవి శివయ్య చెవుల్లో దూరి, గుండెలోకి చొచ్చుకొని పోయి మారుమ్రోగుతున్నాయి. శివయ్య చకితుడయినాడు. క్షణం ఆశ్చర్యపోయాడు. శివయ్యా మనిషే - కాకుంటే ఆస్తి, అధికార తాపత్రయం అతనిలోని మానవతను అడుగంటించాయి. ప్రతి మనిషికీ మానవత మీద ఎదో ఒకలాంటి కవచం ఉంటుంది. ఆ కవటం బద్దలయిన్నాడు మానవత కనిపిస్తుంది. అయితే, ఆ కవచం మళ్ళీ అంటుకుంటుంది. మానవతను అణచివేస్తుంది. దాని వెలుగుకు మసి పూస్తుంది.
    శివయ్య ప్రతిమలా నుంచున్నాడు. అతనిముందు పోచయ్య పడిఉన్నాడు. అతని దేహం రక్తసిక్తంగా ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో శరతల్పం మీద ఉన్న భీష్మ పితామహునిలా ఉన్నాడు. అతని వాక్కు సత్యం పలుకుతూంది. కఠిన సత్యం కఠోరమైన సత్యం.
    పోచయ్య తనను ఎదిరించలేదు. పల్లెత్తు మాట అనలేదు. తాను కొట్టిన చావు దెబ్బలు తిన్నాడు. ప్రాణం ఎక్కడో కడగంటింది. అయినా తనను ఓడిస్తున్నాడు. ఇప్పుడేం చేయగలడు తాను? - ప్రాణాలకు లక్ష్యపెట్టని పరమ యోధునిలా ఉన్నాడు. సత్యం కోసం, న్యాయం కోసం, ప్రాణాలు త్యజించడానికి సిద్ధంగా ఉన్నాడు. పోచయ్య రామునిలా కనిపించాడు. కృష్ణునిలా కనిపించాడు. జీసస్ లా కనిపించాడు. శిలువనెక్కి సత్యం చెబుతున్నట్లు అనిపించింది -
    "నేను అన్నాలం చెయ్యలే దొరేం చేస్తడు?"
    శివయ్యలోని మనిషి మళ్ళీ ఇనుప కవచం కప్పుకున్నాడు. నిరంకుశునికి పశ్చాత్తాపం పనికిరాదు. మానవత అతనికి చుక్కెదురు.
    "నర్సిగా! వీణ్ణి తీసుకపోయి ఇంట్లో పడెయ్యి" అని వెనక్కు తిరిగి మెట్లెక్కాడు. "పోచిగాడు బాగయ్యేటట్లు చూడు పైకం కావల్నంటే నేనిస్త" అని తిరిగి చూడకుండానే చరచరా నడిచి ఇంట్లో దూరాడు. తలుపు వేసుకున్నాడు.
    పోచయ్యను గూడానికి తెచ్చినప్పుడు పిచ్చమ్మ వెర్రిదానిలా కేకలు పెట్టింది. గూడెం సాంతం కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కాని ఒక్కరూ శివయ్యది తప్పనలేదు. పోచయ్య చేజేతులా చేసుకున్నాడనుకున్నారు.
    పాలకులు ఎప్పుడూ తాము పరమేశ్వరులమనే అనుకుంటారు.ఆ అసత్యాన్ని పాలితులు అంగీకరించడమే బానిసత్వం తమ హక్కులను కాక పాలకుల హక్కులను పరిరక్షిస్తారు బానిసలు.
    పోచయ్య వెంటనే చచ్చిపోలేదు. చాలా రోజులు బాధపడ్డాడు. అతనికి మందు లేదు. వైద్యం లేదు. తిండి లేదు. శివయ్య చేస్తానన్న సాయం నర్సిమ్మ కాజేశాడు. చివరి క్షణంలో కొడుకును పిలిచాడు పోచయ్య "ఒరే ఎంకడూ! మనం బాంచోల్లంరా! బాంచ లోలెనే బతకాలె దొరమాటకు తిరుగుచెప్పకు" అని వాణ్ణి పిచ్చమ్మకు అప్పగించి ప్రాణాలు వదిలాడు. పిచ్చమ్మ బావురుమంది. గూడెం గొల్లుమంది. అయినా పీనుగు ఆగలేదు. లేవడానికి ధర్మయ్యకు కాళ్ళు రాలేదు. చేతులు ఆడలేదు. భూమాత పోచయ్యను తన ఒడిలో దాచుకుంది.
    శివయ్య దినవారాలకు అప్పు పెట్టాడు.
    వెంకడు పుట్టు బానిసగా మారిపోయాడు.
    పోచయ్య పోయిన్నాడే పిచ్చమ్మ ప్రాణాలు సగం ఎగిరిపోయాయి. పిచ్చమ్మ కంకాళంలా జీవిస్తూంది. జీవచ్చవంలా బతుకుతూంది.
    వెంకడు పెద్దవాడయినాడు, శివయ్యకు చాకిరి చేస్తున్నాడు. మంచంలో ఎముకల బోనులా పడి ఉంది తల్లి. తల్లిని చూస్తే మనసు తరుక్కుపోతుంది. వెంకడికి తండ్రి చావు కళ్ళారా చూచాడు. తల్లి చావబోతూందని గ్రహించాడు. కర్మను నిందించాడు. దేవుని దూషించాడు.
    బతికున్నన్ని రోజులు తల్లికి సేవ చేయాలని వెంకడి కోరిక. పిచ్చమ్మ కుక్కి మంచంలో పడి ఉంది. వెంకడు ఆమెకు పరిచర్యలు చేస్తాడు. అంబలి కాచి పోస్తాడు. పొద్దు పొడిచే వరకు శివయ్య చాకిరికి పోవాలి. అతను బయలుదేరేప్పుడు పిచ్చమ్మ పిలుస్తుంది_
    "కొడకా! మల్ల చూస్తనో లేదో అట్ల నిలబడు, కండ్లనిండా చూసుకుంట" అంటుంది. వెంకడికి దుఃఖం ముంచుకొస్తుంది. అయినా దిగమింగుతాడు. ప్రతిమలా నుంచుంటాడు. పిచ్చమ్మ అతని చేతులు పట్టుకు నిమురుతుంది. కొడుకుని మొత్తం తాగేయాలన్నట్లు చూస్తుంది. తన కళ్ళలోనే దాచుకోవాలన్నట్లు చూస్తుంది. వెంకడు ఆమెను తప్పించుకుని బయటపడ్తాడు. బండ మీద కూర్చొని మోకాళ్ళ మీద తలపెట్టి భోరున ఏడుస్తాడు. ఏమి చేయగలడతను? ఏడవగలడు - అంతే.
    తల్లి మంచం మీద తీసుకుంటూంది. రోజు రోజుకూ చావుకు దగ్గర పడుతూంది. తెలుసు ఆ విషయం అతనికి. అయినా ఏం చేయలేడు. తల్లికి వైద్యం చేయించాలని అతని తహతాహ. తల్లిని బతికించుకోవాలని అతని తపన. ఒకనాడు గౌరీనాధశాస్త్రి దగ్గరికి వెళ్ళాడు మందు ఇమ్మనీ, తల్లిని బతికించమనీ బతిమిలాడాడు.
    "ఒరే వెంకడూ! మీ అమ్మను మీ నాయన పిలుస్తున్నాడ్రా - దానికి మందెందుకు?" అన్నాడాయన.
    శాస్త్రిగారు మందివ్వదలచుకోక అన్నమాట అది. గూడెంలో చావు బతుకులు అంటరానివి. అక్కడిదాకా వెళ్ళరాయన. గూడెంలో పుట్టుకలాగే చావు అతి సహజం అయింది. అక్కడ రెంటికీ స్వేచ్చ ఉంది, అడ్డేవారు లేరు.
    శాస్త్రిగారు ఎందుకన్నారో గ్రహించలేకపోయాడు వెంకడు. తల్లితో శాస్త్రిగారు చెప్పిన మాటలే చెప్పాడు. శాస్త్రులు చెప్పిందే వేదం. పిచ్చమ్మ పాపం నమ్మింది. పోచయ్య తనకోసం అక్కడ వేచి ఉన్నాడనుకుంది. బొందితో ఎలాగూ చేరలేదు. బొంది విడిచి కైలాసం చేరుకోవాలనుకుంది. పోచయ్యను కలుసుకోవాలనుకుంది. బతికి సాధించలేని సుఖం చచ్చి సాధిద్దామనుకుంది.
    బతకదలచని వారిని బతికించడం ధన్వంతరికి కూడా తరంకాదు. పిచ్చమ్మ పరిస్థితి విషమించసాగింది. ఆమె వాంతి చేసుకుంటే ఒకనాడు రక్తం పడింది. ఆ రక్తం చూసి వెంకడి గుండె తల్లడిల్లింది. తల్లి దగ్గరే ఉండిపోవాలనుకున్నాడు. పనికి పోవాలి, పోకుంటే అంబలికి గింజలు రావు. మందుకాకున్నా ఇంత గంజి పోయాల్సిందే గొంతులో. ఆ బండమీద కూర్చుని మరింత ఏడ్చాడు. గుండె బరువు దిగేట్టు ఏడ్చాడు. బండలు కరిగేట్టు ఏడ్చాడు. నర్సిమ్మ గద్దించాడు. అరచేతులతో కన్నీరు తుడుచుకుని పనిలో ప్రవేశించాడు. అతనికి తల్లి కక్కిన రక్తమే కళ్ళలో ఆడుతూంది.
    చివరిరోజు వెంకడు పిచ్చమ్మకు అంబలి కాచిపోశాడు. పిచ్చమ్మ తాగింది. ఆమె కాస్త ఉత్సాహంగా ఉంది. "బిడ్డా. చేపల పులుసు తినాలని ఉన్నదిరా!" అన్నది. వెంకడికి ఏదో బరువు దిగుతున్నట్లనిపించి, "అమ్మా! వండిపెడ్తనే మాపటికి చేపలు తెస్త" అన్నాడు. "అరే! అయ్య ఉన్నప్పుడు నేను వండి పెట్టేదాన్ని. నీకు వండొస్తాదిర" అన్నది. "వండొస్తదే నీకెందుకు, వండి పెడతగద" అన్నాడు. "వండిపెట్టు కొడక, చేపల పులుసు తిని చస్త" అన్నది. "వండి పెడతగద, నువ్వెందుకు చస్తవే, అమ్మా! బతుకుతవు, నిన్ను బతికించుకుంట" అన్నాడు. అతని స్వరంలో ఆశ గోచరించింది. యమునికి తొడగొట్టి సవాలు చేస్తున్నట్లనిపించింది.

 Previous Page Next Page