"ఒరే పోచిగా! ఓరి పోచిగా!" అని కేకలేస్తూ, పరాకుగా పరిగెత్తుతున్న పిచ్చయ్య అడ్డురావడంతో జర్క్ ఇచ్చి కారు ఆగిపోయింది కారు ఆగింది సహితం గమనించకుండ పరిగెత్తాడు పిచ్చయ్య పోచయ్యను పట్టుకున్నాడు.
త్రాగనని ఒట్టేసుకున్నాడు పోచయ్య అదీ తన లచ్చిమీద కూలి నుంచి తిరిగి వచ్చేప్పుడు సంచిలో బియ్యం వగైరాలు తీసుకొని ఇంటికి వెళ్తున్నాడు లక్ష్మికోసం సన్నజాజి పూల మాలకూడా కొన్నాడు లక్ష్మి సినిమాకు వెళ్దామంది పని దగ్గరనుంచి త్వరగా బయలు దేరుదామంటే కంట్రాక్టరు తెమలనిస్తేనా? వారం పొడుగునా కూలి చేసినా విసుక్కొని నసుక్కొని ధర్మం చేసినట్టు డబ్బిస్తాడు అందులో అనేక కోతలు, పండక్కిచ్చినది, పెళ్ళికిచ్చింది డబ్బు చేతిలో పడేవరకే ఆలస్యం అయింది గుండె కలుక్కుమంది అయినా, లచ్చి తయారుగా ఉంటుంది అనే ఉత్సాహంలో అన్నీ కొని బయలుదేరాడు స్నానంచేసి, తెల్లబట్టలు వేసుకొని లచ్చితో కలిసి సినీమాకు పోవడం తల్చుకుంటే అతనికీ గర్వంగా ఉంది పూలు తురుముకొని తెల్లచీర కట్టుకున్న లచ్చి ప్రక్కన తానుండటాన్ని ఊహించుకుని మురిసిపోతూ ఫుట్ పాత్ మీద సాగిపోతున్న పోచయ్యకు పిచ్చయ్య కేకలు వినిపించలేదు.
అమాంతంగా వెనుకనుంచి వచ్చి జబ్బ పట్టుకు లాగాడు పిచ్చయ్య పోచయ్య వెనక్కు తిరిగి చూచాడు పిచ్చయ్య! ఉలిక్కిపడ్డాడు గజగజా వడకాడు బియ్యపు సంచి పడిపోతుందేమోనని గట్టిగా పట్టుకొన్నాడు.
"ఒరే పోచిగా! ఏందిరా ఇంత పొద్దాల పోతున్నావు? ఇయ్యాల ఉన్నదిర మజా కంపోన్ కనపడ్తాంటే ఎట్లపోతున్నవుర! అగ్గొ పరమయ్య సుత సస్తాండు నడువ్ ఒక్క చఫ్టీ కొట్టిపోదాం"
ఇంతలో పరమయ్య వచ్చేశాడు "ఆలికి గులామయినావుబే భాడ్ ఖావ్! లచ్చి వద్దన్నదనుకో నువ్వెమన్నా తాగుబోతు వైనావుబే! అప్పుడింత ఇప్పుడింత త్రాగు పెద్ద దెబ్బ కొట్టిండు" అని ఇద్దరూ కలిసి లాక్కోపోయారు పోచయ్యను.
పోచయ్య మాట్లాడలేకపోయాడు ఒకవైపు కల్లు సీసాలూ, రెండోవైపు తెల్లచీర కట్టుకొని పూలు తురుముకున్న లచ్చి లచ్చి తనకోసం ఎదిరి చూస్తుంటుంది తాను ఒట్టేసుకున్నాడు తాగి ఇంటికి చేరితే, లచ్చి - తన లచ్చి ఏమనుకుంటుంది? లచ్చి, నవ్వు, జతగా సినిమా కెళ్ళడం - లచ్చి లాగేసింది పోచయ్యను.
ముందు సీసా లున్నాయి, పక్కన బియ్యపు సంచీ, ఎదురుగా ఇద్దరు కూర్చుని ఉన్నారు వారిని బ్రతిమిలాడి లాభంలేదు తాను ఎదిరించలేడు లచ్చి పూలను గురించీ తెల్లచీరను గురించీ ఎలా చెపుతాడు? ఏం చేయాలి? ఏం చేయాలి?
"కొట్టరా పోచిగా, సునాయించు ఒక షేర్" అన్నాడు పిచ్చయ్య.
'పిచ్చయ్యన్న' కడుపునొస్తోందే జర ముంత పట్కపొయ్యొస్త" అని ముంత తీసుకొని బయలుదేరాడు కనుమరుగయ్యేదాకా నడచి ముంత బద్దలుకొట్టి పరిగెత్తాడు.
గుడిసెముందు కూర్చొని చిన్న అద్దంముందు తల దువ్వుకుంటూంది లక్ష్మి- పోచయ్య తేనున్న పూలు తురుముకోవడానికి పోచయ్య వచ్చాడు ముఖం పీక్కోపోయింది - చేతులో సంచీలేదు మౌనంగా వంగి గుడిసెలోకి దూరాడు, లక్ష్మీ గుండెపగిలింది ఉత్సాహం నీరుకారిపోయింది దువ్వెన తలలోనే వుంది అమాంతంగా లేచి గుడిసెలోకి దూరింది పోచయ్యకు దుఃఖం పొంగివచ్చింది "లచ్చీ!" అని భుజంమీదపడి బావురుమన్నాడు అర్ధం కాలేదు లక్ష్మికి కాళ్ళు వడికాయి దుఃఖం పొంగింది లక్ష్మికూడా ఏడ్చేసింది ఒకరిని చూచి ఒకరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలియదు.
"లచ్చీ! తాగలేదు లచ్చీ! తాగలేదు నూకలసంచి పోయింది లచ్చీ, నూకలసంచీ పూలు సుత తెచ్చిన అయ్యి సుత పోయినయి సైకల్ మోటరోడ్డడ్డ మొచ్చిండు బెదరి స్నాచి పడేసిన సంచిమీద గాడిపోయింది లచ్చీ! పూలు పోయినను లచ్చీ, పూలు" అని ఏడ్చేశాడు.
అర్ధం చేసుకుంది లక్ష్మి "అయ్యో! దెబ్బల్తగలలేదుగద!" అని వళ్ళంతా చూచింది "పోతే పోయినైలే ఒక్కపూట ఉపాసముంటం దెబ్బలు తగులలేదు అంతనేచాలు మాంకాళమ్మదయ" అని పైటతో పోచయ్య కన్నీరు తుడిచింది పోచయ్య లక్ష్మి కన్నీరు తుడిచాడు కమ్ముకున్న చీకటితెర తొలగిపోయింది లక్ష్మి చిరునవ్వు నవ్వింది పోచయ్య మనసులో వెన్నెల విరిసింది సినీమా కోసరం ఉంచిన డబ్బుతో నూకలుతెచ్చి వండేసింది లక్ష్మి ఇద్దరూ తిన్నవి కారంమెతుకులే అయినా పంచభక్ష్య పరమాన్నాలు తిన్నట్లు ఆనందించారు.
* * *
"ఒరే పోశిగా! ఓరి పోశిగా! తీయ్ బే తడక సంచి తెచ్చినంర, గట్ల పారొస్తి వెందుకో" అని తడక తట్టాడు పరమయ్య తడక తీసి సంచి అందుకుంది లక్ష్మి "కంపోన్ల ఇడిచి పారొచ్చిండే" అని అందించాడు అందుకుని తడికేసుకుంది లక్ష్మి అంతా గ్రహించింది ఆమెలో ప్రేమ పెల్లుబికింది "ఎంత మంచోనివి!" అని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంది సంచిలోని జాజిపూలదండ లక్ష్మి తలలో తురిమాడు పోచయ్య మురిసిపోయాడు.
* * *
3
పూర్వం అసఫ్జాహీ డవంశంలోని ఒక నవాబుకు సంతానం కలుగలేదు అతడు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కాడు మసీదులు దేవాలయాలు కట్టించాడు అయినా, ఫలితం కలుగలేదు.
మక్కా నుండి ఒక ఫకీరు హైద్రాబాదుకు వచ్చాడు అతడు నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాడు తాను నవాబును దీవించ తలచుకున్నాననీ, అందువలన తప్పక నవాబుకు సంతానం కలుగుతుందనీ చెప్పాడు ప్రధాని నవాబుతో ఆ విషయం విన్నవించాడు నవాబు ఫకీరు దీవనలు అందుకోవడానికి అంగీకరించాడు కాని ఏనుగును ఎక్కే అధికారం ఉన్నవాడు మాత్రమే నవాబును దీవించే అర్హత కలిగి ఉంటాడని మనవి చేశాడు ప్రధాని ఆ అర్హత ఫకీరుకు కల్గించాల్సిందని ఆదేశించాడు నవాబు జాగీరు కలవాడు మాత్రమే ఏనుగును ఎక్కే అర్హత కలిగి ఉంటాడని నివేదించాడు ప్రధాని ఆ నియమాలు విసుగు కలిగించాయి నవాబుకు అయినా, అతనికి జాగీరు ఇవ్వాల్సిందని ఫర్మాను జారీచేశాడు నవాబు.
ఫకీరుకు జాగీరు లభించింది ఏనుగు నెక్కాడు నవాబును దీవించాడు తరువాత నవాబుకు సంతానం కలిగిందీ లేనిదీ మన కధకు సంబంధించింది కాదు అయితే, ఫకీరు బంగళా కట్టుకొని బేగమ్ ను తెచ్చుకొని సుఖంగా ఉంటున్నాడు.
ఒకనాటి ఉదయం నైజాంనవాబు తమ బంగళామీద ఎక్కి నగర సౌందర్యం తిలకిస్తున్నారు జాగీర్దారుగా మారిన ఫకీరు బంగళామీద వెంట్రుకలు ఆరబెట్టుకుంటున్న బేగం కనిపించింది ఆమె పారసీక దేశపు సుందరి ఆమె సౌందర్యం చూచి ముగ్ధుడైనాడు నవాబు మన్మధ తాపంలాంటివన్నీ అనుభవించి ఆ యువతిని తీసుకొని రావలసిందని హుకుం జారీ చేశాడు.
ప్రధానికి ఆ విషయం తెలిసింది ప్రధానికి ఫకీరంటే భక్తి తాను చేయగలిగింది రాజాజ్ఞను గురించి ఫకీరుకు ముందుగా తెలియపరచడం ఆ పనే చేశాడు ప్రధాని.
ఆ రాత్రి ఫకీరు బంగళాకు నిప్పంటుకుంది మంటలు ఆకాశాన్నంటాయి నగరం యావత్తూ హాహాకారాలతో నిండిపోయింది పట్నం అంతా కలిసి మంటలను ఆర్పారు ప్రధానీ, నవాబు లోనికివెళ్ళి చూచారు కాలి కూలిన ఫకీరు, ఫకీరు భార్య శవాలు కనిపించాయి ఇద్దరూ కన్నీరు కార్చారు.
అది శాపదగ్ధ స్థలమనీ, అక్కడ ఎవరూ ఇళ్ళు కట్టుకోరాదనీ ఫర్మాన్ జారీ చేశాడట నవాబు.
ఆ ఫర్మాను ఎంత నిజమో, ఆ కధలో ఎంత సత్యం ఉందో తెలీదుకానీ అక్కడ కొన్ని శతాబ్ధాలపాటు ఎవరూ ఇల్లు కట్టుకోలేదు ఆ శాపం సంగతి తెలిసీ గుడిసెలు వేసుకొని ఉంటున్నారు బాలయ్య మొదలైనవారు ఆ ప్రాంతంలో.
పల్లెల్లో జమీందార్ల దౌర్జన్యాలు పెరగడం, చిన్నచిన్న నేలచెక్కలవాళ్ళు వ్యవసాయం చేసుకోలేకపోవడం, చేతి పరిశ్రమలు మూలపడ్డం, ఊళ్ళలో పక్షాలూ, కక్షలు పెరగడం మూలాన జనం పల్లెలు వదిలి పట్నాలు పట్టారు అలా పట్టిన పేదలు వెంట రెక్కలు తప్ప వేరేమీ తెచ్చుకోలేదు ఉండడానికి స్థలం చూచుకుంటూ విడిగా ఉన్న స్థలాలలో గుడిసెలు వేసుకున్నారు ఇవే మనం నగరాలకు పీడలనే మురికి పేటలు అక్కడ లైట్లుగానీ, పంపులుగానీ ఉండవు మరుగు దొడ్లకు మైళ్ళు నడవాలి డ్రైనేజి ఉండదు ఏ ఇంటికి ఆ ఇంటిముందే ఒక మురికి కాలవ దోమల ఉత్పత్తి పంచవర్ష ప్రణాళిక అంచనాలను అధిగమిస్తుంది పిల్లల శౌచాన్ని శుభ్రం చేయడానికి మాత్రం వస్తుండే పందులు మనుషులతో సహజీవనం చేస్తుంటాయి.