అది భ్రమ! పాము కదల్లేదు. అది కుబుసంలో ఉంది.
గురి చూచాడు గురువయ్య.
"ఒరే! గురువా! ఒక్క దెబ్బకు చావాలె. తప్పించుకుంటే పగ పడ్తది. పదిలంగ కొట్టు, పడగకు బెత్తెడు చూచికొట్టు." రామకిష్టయ్య అరుస్తున్నాడు.
పాము__గురువయ్య__పగ__దిగిపోదామనుకున్నాడు__భీమునోలె ఉన్నవు....గుర్తుకు వచ్చింది.
కళ్ళు మూసుకొని కర్ర లేపాడు గురువయ్య, లాగి పాము మీద బాదాడు. పాము 'థప్పు' మని కింద పడ్డది.
కళ్ళు తెరిచి చూచాడు గురువయ్య. పాము నడుములు విరిగాయి _ తోక అడిస్తూంది.
"అరే! ఇంక పానమున్నదిరా! దిగి దెబ్బెయ్యి! దిగి దెబ్బెయ్యి!" ముగ్గురూ కేకలేస్తున్నారు.
గురువయ్యకు కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. దిగాడు గబగబా_తూలి పడబోయాడు. నిచ్చెన కాళ్ళమీద లేచి మళ్ళీ గోడకు ఒరిగిపోయింది.
"ఎయ్యరా ఇంకో దెబ్బ_ఎయ్యి" రామకిష్టయ్య కేక పెట్టాడు.
గురువయ్య కర్రతో బాదాడు. పాము తల చితికి రక్తం కారింది. తోక ఇంక ఆడుతూనే ఉంది.
"అబ్బ! చచ్చింది. జర కట్టెమీద ఏసుకొని ఇవతలికి తీస్కరా" రామకిష్టయ్య పెండ్లాం ఆదేశం.
పామును కర్రమీద వేసి బయటికి తెచ్చి పడేశాడు__గురువయ్య. అతని వళ్ళంతా చెమటలు పట్టింది. ఇనుము చెమర్చినట్లున్నాడు గురువయ్య.
చచ్చిన పామును చూడ్డానికి చుట్టూ చేరారు జనం.
పడగ చితికిపోయింది_రక్తం కారుతూంది.
ఎందుకో ఉసూరుమనిపించింది గురువయ్యకు.
"అరే పామును చంపినవు_నాగుబామును_దహనం చేసి పోవాలె_లేకుంటే పాపం చుట్టుకుంటుంది." రామకిష్టయ్య ఉవాచ.
దిగాలుపడి చూచాడు గురువయ్య. ఆ చూపులు ఎవరికీ అర్థం కాలేదు.
"పిడకలు పడేసిన్రు పేర్చు" ఆదేశం. పేర్చాడు గురువయ్య.
"పైన పాము నోట్లో పెట్టు". పెట్టాడు గురువయ్య.
"ఇగో ఈ పాలు దాని నోట్లో పొయ్యి". పోశాడు గురువయ్య. పిడకల్లో పామును పెట్టి నిప్పంటించాడు. నిప్పు అంటుకుని మండసాగింది.
ఎక్కడివారు అక్కడ వెళ్ళిపోయారు. గురువయ్య మాత్రం నుంచున్నాడు, పిడకలు బూడిద అయింతరువాత బయలుదేరాడు.
"మాలోడు ఇంట్ల దూరిండు. ఇండ్లలకాలె పెండతే_ఎర్రమన్నుతే" అనే శ్రీమతి రామకిష్టయ్య మాటలు వినిపించాయి.
గురువయ్య సాగిపోతున్నాడు_బరువుగా_భారంగా. మనిషిని తగలబెట్టి పోతున్నట్లుంది అతనికి.
తాను ఎందుకు చంపాడు? తనకేం చేసింది పాము!
ఆ ప్రశ్న అతని మనసులో మురగసాగింది.
రక్తం కారుతూ చితికిన పడగ అతని కళ్ళముందు నుంచి కదలడంలేదు.
అయినా సాగిపోతున్నాడు గురువయ్య.
గుడిసె ముందు _ వెన్నెట్లో నుంచుంది లచ్చమ్మ _ భర్తకోసం ఎదురుచూస్తూంది. ముద్దబంతిపూలు సిగలో తరుముకుంది. నొసట పైసంత కుంకం బొట్టు పెట్టుకుంది.
ఎంతకూ రావడంలేదు గురువయ్య.
ఇవ్వాళ ఆమె సంతోషంగా ఉంది. ఏదో చెప్పాలని ఉబలాటపడుతూంది. వెన్నెట్లో వెలిగిపోతుంది లచ్చమ్మ.
గురువయ్య వచ్చాడు. ఆమె చూచింది. గురువయ్య ముఖం చూచింది. ఆమెలోని ఉబలాటం అడుగంటింది.
"ఏమో అట్లున్నవు?" అడిగింది వాకిట్లోనే.
గురువయ్య మాట్లాడలేదు. తల వంచుకొని ఇంట్లోకి దూరాడు. లచ్చమ్మ అనుసరించింది. గురువయ్య మంచం కుక్కిలో కూలబడ్డాడు.
దీపం బుడ్డి పొగ కక్కుతూ వెలుగుతూంది.
లచ్చమ్మ గురువయ్య కాళ్ళ దగ్గర కూలబడ్డది. మొగని మోకాలిమీద చెయ్యి వేసి అడిగింది "ఏమైంది? అట్లున్నవు" అని.
గురువయ్య లచ్చమ్మ కళ్ళల్లోకి చూచాడు__చూపు మరల్చుకున్నాడు__అన్నాడు "పాపం చేసిన లచ్చీ పాపం!" గోడకు చెపుతున్నట్లుగా చెప్పాడు.
"నువ్వు పాపం చేసినావు. ఏం పాపం చేసినవు చెప్పు" గురువయ్యను ఊపి అడిగింది లచ్చమ్మ. తన భర్త పాపం చేయడానికి వీల్లేదు. చేయడనే విశ్వాసం ధ్వనించింది ఆమె మాటల్లో.
"పామును చంపిన నాగుబామును చంపిన" గురువయ్య స్వరం కంపించింది.
"నాగుబామును చంపినవులే. నాగుబామును" భయం వ్యక్తపరిచింది లచ్చమ్మ.
"నేను చంపలే. సాహుకారు చంపించిండు. పడగ చితక్కొట్టిన, రక్తం కారి చచ్చింది" చితికి రక్తం కారుతున్న పడగ తన ముందే ఉన్నట్లు చెప్పాడు.
"ఎందుకు చంపినవు? పామును చంపుతే పోరలు బతకరట" ఉద్వేగంతో అన్నది లచ్చమ్మ.
"నేను చంపలేదు లచ్చీ! చంపించిన్రు. నాతోని పాపం చేయించిన్రు" మాటల్లో దుఃఖం ఉట్టిపడుతూంది. అది గ్రహించింది లచ్చమ్మ. దాన్నే మరింత నొక్కదలచలేదు. ఆమెలోని స్త్రీత్వం సంద్రంలా పొంగింది. మనసులోని దుఃఖపు గూటిని హాలాహలంగా మిగింది. చిరునవ్వు నవ్వి వెన్నెల కురిపించింది.
"అయిపోయింది, అయిపోయింది. లే బువ్వతిందాం. కోడికూరొండిన" అన్నది లచ్చమ్మ. గురువయ్యను లాలించింది, ఓదార్చింది, అనునయించింది. భోజనానికి లేపింది.
ఇద్దరూ మట్టిమూకుళ్ళలో అన్నాలు తిన్నారు. మంచంలో వాలారు.
గురువయ్య దగ్గరగా జరిగి చెవిలో చెపుతున్నంత మెల్లగా అన్నది. "ఒక ముచ్చట చెప్పనా!"
"మంచి ముచ్చటయితే చెప్పు" పెళ్ళాన్ని దగ్గరకు లాక్కొని అన్నాడు.
"శాన మంచి ముచ్చట" లచ్చమ్మలోని ఆరాటం మళ్ళీ వ్యక్తం అయింది.
"అయితే చెప్పు."
చెప్పలేకపోయింది లచ్చమ్మ. ఆమెను సిగ్గు ముంచేసింది. అయినా అన్నది. "నేను నీలు పోసుకున్న."
గురువయ్య ఉలిక్కిపడ్డాడు. ఆమెకు దూరం జరిగాడు.
అతనికి చచ్చిన పాము కనిపించింది. తోకాడిస్తున్న పాము కనిపించింది. పిడకల మంట కనిపించింది_బూడిద కనిపించింది.
లచ్చమ్మ బెదిరిపోయింది. దిగ్గున లేచి కూర్చుంది.
బయట పెద్దపిట్ట అరచింది__కుక్కలు ఏడ్చాయి__ఒక ఉల్క రాలి పడింది.
చంద్రుడు మబ్బుల్లోకి వెళ్ళిపోయాడు.
5
నారాయణస్వామి చిత్రాసనం మీద, తూర్పు ముఖంగా కూర్చున్నారు. నాంచారమ్మ వ్యాసపీఠం తెచ్చి ముందుంచింది. తరువాత కళ్ళద్దాలు అందించింది. గోడకు ఆనుకొని కూర్చున్న స్వామి కళ్ళద్దాలు తగిలించుకొని భారతం విప్పారు. అలా పుటలు తిప్పుతుండగానే రామకిష్టయ్య వచ్చి నేలకు చేతులానించి నమస్కరించాడు. తరవాత మరికొంతమంది వచ్చి నమస్కరించి కూర్చున్నారు.
కొంతసేపు లోకాభిరామాయణం తరువాత పురాణం ప్రారంభించారు స్వామి:
"పాండవులు వనవాసమున నున్నారు. అప్పుడు వారికడకు మార్కండేయ మహర్షి వచ్చినాడు. అతడు వారికి అనేక ధర్మములు బోధించాడు. ఒకనాడు మార్కండేయుడు "నిజభర్తృ శుశ్రూష యందు నిత్యాసక్తమయిన పతివ్రతకు నఖిలయజ్ఞ దాన తపంబులు సులభంబులగు నొక్క ఇతిహాసంబు చెప్పెద"నని కౌశికుని కథ చెప్పినాడు. నేడా కౌశికుని కథ విందము"