Previous Page Next Page 
మనీ బాంబ్ పేజి 7

'మమ్మీ తాలుకు శాపం' అనేసి నిజమేనో లేక అదంతా కాకతాళీయంగా జరిగిందో తెలియదుగానీ, మొత్తంమీద 'మమ్మీని సమీపించిన వాళ్ళు మరణించి తీరుతారు' అనే వదంతి ఈ యూనిట్ విషయంలో నిజమే అయింది అని అనుకున్నారు చాలామంది.
ఆ యూనిట్ మొత్తంమీద ప్రాణాలతో బతికి బయటపడింది గైడ్ ఒక్కడే. అతను భయంకొద్దీ విగ్రహానికి చాలా దూరంలోనే ఆగిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. అతని పేరు భూతాలరాజు - అంటే నువ్వే !" అన్నాడు సందీప్.
"కాదు ! కాదు !" అన్నాడు భూతాలరాజు గట్టిగా. కానీ అతని గొంతు ఇందాకటిలాగా నిబ్బరంగా లేదు. "నువ్వు పొరబడుతున్నావ్ ! నాకు మీ తండ్రి శేషాద్రి ఎవరో తెలియదు. మమ్మీ గురించీ, బంగారు విగ్రహం గురించీ బొత్తిగా తెలియదు. నేను ఎన్నడూ, ఏ అడవికీ వెళ్ళలేదు. నేను రైల్వేస్టేషనులో సామాన్లు మోసే కూలీని. దొంగకేసు బనాయించి నన్ను జైల్లో మూసేశారు. అంతే!"
సందేహంగా చూశాడు సందీప్. భూతాలరాజు అనేది చాలా అసాధారణమైన పేరు. ఆ పేరు ఎక్కువమంది పెట్టుకోరు. అసలు నువ్వు కాకుండా భూతాలరాజు అనే పేరుతో మరో మనిషి ఉంటాడనుకోను. పైగా, నాకు తెలిసిన సమాచారాన్నిబట్టి నువ్వే ఆ గైడ్ వి అని తెలుస్తోంది. బుకాయించకు."
చప్పున నెత్తిమీద చెయ్యి పెట్టుకున్నాడు భూతాలరాజు. "ఎంత ఒట్టుపెడితే అంత ఒట్టు."
"కుర్రోడా ! నువ్వు వెదుకుతున్న శాల్తీని నేను కాను. మా అమ్మా నాన్నలకి పుట్టిన పిల్లలు ఒక్కళ్ళు బతక్కుండా చచ్చిపోతుంటే, ఈసారి పుట్టిన పిల్లాడు బతికితే భయంకరమైన పేరు పెడతామని మొక్కుకున్నారు. నేను బతికి బట్టకట్టాను. అందుకని నాకు ఈ పేరు పెట్టారు. మా ఊళ్ళో ఇలా పేర్లు పెట్టడం మామూలే! నా జతగాళ్ళలోనే ఒకడి పేరు పిల్లి దేముడు, ఒకడు భూతపిల్లి, మరొకడి పేరు నరక చతుర్దశి. పేరు చూసి మోసపోకు!" అన్నాడు. అతని కణతల మీదనుంచీ ధారగా చెమట కారుతోంది. పట్టుబడిన జంతువులా చూస్తున్నాడు. గబగబ వెళ్ళి కుండ ఎత్తి గటగట నీళ్ళు తాగాడు.
అతను చెబుతోంది నిజమో, అబద్ధమో తేల్చుకోలేకపోయాడు సందీప్. తీక్షణంగా చూస్తూ అన్నాడు.
"ఆ మమ్మీ గురించి ఉన్న వదంతి ప్రకారం, ఈసారి హేలే తోకచుక్క కనబడినప్పుడు రాకుమారి చివరిసారి ప్రాణంతో లేచి సంచరిస్తుంది. ఆ తర్వాత ఇంక శిథిలమై పోవడమో, అదృశ్యమై పోవడమో జరుగుతుంది.
అందుకని, ఈ మిస్టరీని సాల్వ్ చేసి, మా నాన్నగారు ఎలా చనిపోయారో తెలుసుకోవడానికి ఇదే చివరి ఛాన్సు కావచ్చు."
"చదువుకున్నవాడిలా కనబడుతున్నావ్. నువ్వు కూడా ఈ మాయలూ, మహిమలూ అన్నీ నమ్ముతావా ?"
"అన్నీ నమ్మను. కానీ ఒక బంగారపు విగ్రహం ఉండడం, అందులో రాకుమారి మమ్మీ ఉండడం అసంభవమేమీ కాదు. మా నాన్నగారు కూడా ఆ విషయాన్ని నమ్మబట్టే, పరిశోధించడానికి బయలుదేరారు. ఇంకపోతే మహిమల సంగతంటావా - వెల్ ! నేను కూడా మా నాన్నగారిలాగే నాస్తికుడిని! అలాంటి అజ్ఞానపు మాటలని కలలో కూడా నమ్మను.
నేను ఈ ప్రయత్నంమీద బయలుదేరుతున్నానని తెలియగానే, మంచిరోజుచూసి బయలుదేరమని బతిమాలింది మా అమ్మ. కానీ నేను కావాలనే పంతంకొద్దీ, అమావాస్య అర్థరాత్రి పూటే సన్నాహాలు మొదలెట్టాను."
భూతాలరాజు రెండోకన్ను కూడా గాజుకన్నులా నిశ్చలంగా అయిపోయింది. చాలాసేపు గుడ్లప్పగించి సందీప్ ని చూశాక, అతి కష్టంమీద గుటకమింగి అన్నాడు. "నన్ను ఈ రొంపిలోకి లాగకు! నేను నువ్వు వెదుకుతున్న భూతాలరాజుని కాను."
నిస్పృహగా చూశాడు సందీప్. "సరే! దాని సంగతి వదిలెయ్! ముందు జైల్లోనుంచి బయటపడిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. జైల్లోనుంచి బయటపడడం ఇష్టమేనా నీకు ?"

 Previous Page Next Page