Previous Page Next Page 
హైజాక్ పేజి 7

పధ్నాలుగు రోజులు గడిచిపోయాయి.
ఆ పధ్నాలుగు రోజుల్లోనూ ఒక్కసారి మాత్రమే ఇంటికి వెళ్ళగలిగాడు సబ్ ఇన్ స్పెక్టర్ రెడ్డి. ఆ ఒక్కరాత్రి మాత్రమే వరుసగా ఆరు గంటలు నిద్రపోగలిగాడు. మిగతా సమయమంతా అతని అడ్రస్ కేరాఫ్ పోలీస్ స్టేషన్.
అతని దర్యాప్తు ఈ రెండువారాల్లో ఏ మాత్రం ముందుకు పోలేదు. అతనికి దాదాపు రూఢీగా తెలిసింది మాత్రం ఒకే ఒక విషయం. ఈ దోపిడీ చేసింది పాత వెధవలెవరూ కాదు - ఎవరో కొత్తవాడే చేసి ఉండాలి.
ఎవడువాడు? ఎలా తెలుసుకోవడం?
ఆలోచించి, ఆలోచించి అతని బుర్ర వేడెక్కిపోయింది. రోజులాగే బ్యాంకుకి బయలుదేరాడు సుజాతనీ, మిగతా స్టాఫ్ నీ ప్రశ్నించడానికి.
అతన్ని చూసినా కొద్దిక్షణాలసేపు గుర్తుపట్టలేకపోయింది సుజాత. అతను ఆ రోజు యూనిఫారంలో కాకుండా మామూలు డ్రస్సులోనే ఉన్నాడు.
'మళ్ళీ వచ్చాడు!' అనుకుంది విసుగ్గా. గంటల తరబడి మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు అడుగుతాడు. 'ఇంకేమన్నా చెప్పగలరా? ఆలోచించండి! ఇంకేమన్నా చెప్పగలరా? ఆలోచిం... ఇంకే... ఆలో ఇం..." అరిగిపోయిన రికార్డులా అవే మాటలు.
మతి పోతున్నట్లు అనిపిస్తుంది తనకు.
"మళ్ళీ వచ్చాడే అని తిట్టుకుంటున్నారా?" అన్నాడు రెడ్డి నవ్వుతూ. అతను చాలా అరుదుగా నవ్వుతాడు.
తనని చూసి సుజాత బెదిరిపోతోందనీ, ఆ భయంవల్లే ఏమీ గుర్తు తెచ్చుకోలేకపోతోందని తోచింది అతనికి.
 అందుకనే ఇవాళ యూనిఫారంలో కాకుండా, ఇన్ ఫార్మల్ గా మామూలు డ్రెస్సులోనే వచ్చాడు. సరదాగా మాట్లాడుతూ, ఆ మాటల్లోనే తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టాలనుకున్నాడు.
తన డ్యూటీని సమర్థవంతంగా నిర్వర్తించడానికి అతను వెయ్యని వేషం లేదు, పడని తిప్పలు లేవు.
"ఇవాళ ప్రశ్నలేమీ అడిగి బోర్ కొట్టించను మిమ్మల్ని. ఇటు వైపుగా వెళుతూ ఊరికే వచ్చాను. మీ క్యాంటీనులో ఒక కప్పు కాఫీ ఇప్పిస్తే తాగి వెళ్ళిపోతాను" అన్నాడు రెడ్డి.
ఒక్కసారిగా తెరిపిన పడ్డట్టు చూసి, "ఓహ్ ష్యూర్!" అంటూ లేచి నిలబడింది.
క్యాంటీనులోకి వెళ్ళి కూర్చున్నారు.
"ఇక్కడ కాఫీ బాగుంటుందా? టీ బాగుంటుందా" అన్నాడు రెడ్డి.
"రెండూ ఒకేలా ఏడుస్తాయి. కాఫీ అంటే కిరసనాయిలు అనీ, టీ అంటే ఫినాయిలు అనీ 'నిక్ నేమ్స్' పెట్టాం మేము."
అందులో పెద్ద జోకేమీ లేకపోయినా పెద్దగా నవ్వాడు రెడ్డి. ఆమెని ఎంకరేజ్ చెయ్యడం కోసం "నిక్ నేమ్సా? భలే తమాషాగా పెట్టారే! నిక్ నేమ్స్ అంటే గుర్తొచ్చింది కాలేజీ డేస్ లో నాకూ ఒక నిక్ నేమ్ ఉండేది. నా పేరు ఏ.ఇ.రెడ్డి కదా - దాన్ని మార్చేసి 'ఎవరెడీ' అని పెట్టేశాడు మా క్లాస్ మేటు ఒకడు. ఇంకో ఇద్దరు ఫ్రెండ్సు ఎప్పుడూ కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి 'లప్పం టప్పం' అని పేరు పెట్టేశాడు. అలా మా అందరికీ ఒళ్ళు మండి మేమూ వాడికో నిక్ నేమ్ పెట్టేశాం"
"ఏమని?" అంది సుజాత చిరునవ్వుతో.
"వాడి అసలు పేరు శతృఘ్నలెండి. ఎప్పుడూ పేలుతూ ఉంటాడని దాన్ని కొంచెం మార్చేసి 'షాట్ గన్' అని పెట్టాం.
నిటారుగా కూర్చుంది సుజాత. "షాట్ గన్నా! ఇన్ స్పెక్టర్! ఆరోజు బ్యాంకుని దోచుకున్న వాడినికూడా వెనుకనుంచి ఎవరో 'షాట్ గన్' అని పిలిచారు. ఇప్పుడు గుర్తొస్తోంది, అవును!"
చటుక్కున ముందుకు వంగాడు రెడ్డి. "షాట్ గన్ అని పిలిచారా? అయితే మీరు చెప్పిన గుర్తులు కరెక్టుగా సరిపోతాయి. పొడుగ్గా ఉంటాడు. గెడ్డం, కళ్ళద్దాలు అవునా? వాడు శతృఘ్నే?"
సంభ్రమంగా చూస్తోంది సుజాత.
స్ప్రింగులా లేచి నిలబడ్డాడు రెడ్డి. "థాంక్స్ మిస్ సుజాతా! థాంక్స్ ఎలాట్!"
"మిస్" అన్న సంభోధన గుండెలో గుచ్చుకున్నట్లు అనిపించింది సుజాతకి.
ఈ వెధవ గొడవంతా జరగకపోతే తను ఈపాటికి మిసెస్ సుజాతా ఆనంద్ అయిపోయి ఉండేది. ఆనందంగా ఈ బ్యాంకు ఉద్యోగానికి రిజైన్ చేసి అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉండేది.
ఆమె మొహంలో కనబడుతున్న భావాలు చదివేశాడు రెడ్డి, క్షమార్పణ చెబుతున్నట్లు అన్నాడు. "సారీ! మిమ్మల్ని హైదరాబాద్ లో దీటెయిన్ చేసి అసౌకర్యం కలిగించాను. ఇంక మీరు వెంటనే ఢిల్లీ వెళ్ళిపోవచ్చు."
"నో యూస్!" అంది సుజాత నిరుత్సాహంగా "వాళ్ళు రేపు అమెరికా వెళ్ళిపోతారు. నేను రేప్పొద్దుటికల్లా ఢిల్లీలో ఎలా ఉండగలను? ఇంపాజిబుల్!"
ఒక్కక్షణం ఆలోచించాడు రెడ్డి. "నేనొకసారి మీ ఫోన్ ని ఉపయోగించవచ్చా?"
"ష్యూర్! మేనేజర్ గారి రూంలో ఉంది ఫోను."
తూచి తూచి మాట్లాడుతున్నట్లు అన్నాడు రెడ్డి. "మిస్ సుజాతా! సహాయం కోసం, ఫేవర్ ల కోసం ఎవరి కాళ్ళమీద పడను నేను. అయినా మీ భవిష్యత్తు కోసం మీరు అందించిన సహకారానికి బదులు తీర్చడం కోసం, ఈ ఒక్కసారికి నియమం వదిలేస్తాను, రండి!"
"కేసు సాల్వ్ అయిపోయింది, మేనేజర్ సాబ్" అంటూ మేనేజరు రూములోకి వెళ్ళాడు రెడ్డి. మేనేజరు మొహం విప్పారింది. అతనికి టూకీగా వివరాలు చెప్పి, ఒక ట్రావెల్ ఏజెన్సీకి రింగ్ చేశాడు రెడ్డి. "హలో! దావూదేనా! రెడ్డి హియర్!"
ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వయంగా ఫోన్ చేసినా అంత హడావిడి పడిపోయేవాడు కాడేమో ఆ దావూద్, కానీ రెడ్డి దగ్గరనుంచి ఫోన్ అనగానే దాదాపు సీట్లో నుంచి లేచిపోయి వినయంగా అన్నాడు "చెప్పండి రెడ్డి సాబ్! క్యా ఖిస్మత్ కర్ సక్తాహూ ఆప్ కో?"

 Previous Page Next Page