Previous Page Next Page 
ఆఖరి మలుపు పేజి 7


    మరుక్షణం కారు కదిలింది.


    ఆ కారు వెనక ఇంకో డజను కార్లు పొదుపు ఉద్యమాన్ని పరిహసిస్తూ పరిగెత్తాయి.


    మీటింగుకి తేబడిన కిరాయి మూకలు లారీల్లోకి ఎక్కారు. లారీలు వెళ్ళిపోయాయి.


    అంతా చల్లబడ్డాక -


    అప్పుడు -


    "వికలాంగుడు" రాజా, పీటలాంటి బండి మీద నుంచి ఛెంగున కిందికి దిగి, నిటారుగా నిలబడి బండిని ఎడం కాలితో అవతలికి నెట్టేశాడు.


    అతని మొహంలో విజయగర్వంతో కూడిన నవ్వు కనబడుతోంది.


    రాజా చేతిలో మినిస్టర్ విజయకుమారి తాలూకు హాండ్ బాగ్ ఉంది. రెప్పపాటులో దాన్ని కట్ చేసేసి బండి కింద దాచేశాడు అతను. మినిస్టర్ విజయకుమారి భుజం మీద హాండ్ బాగ్ తాలూకు బెల్టు మాత్రం మిగిలింది. బ్యాగ్ లేదన్న సంగతి ఆమె గమనించలేదు.


    హాండ్ బ్యాగ్ తెరిచి చూశాడు రాజా.


    ఆ 'ప్రజా సేవకురాలి' హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు అతనికి ఆశ్చర్యం కలిగించలేదు. కానీ నవ్వు తెప్పించాయి.


    ముందుగా అతని దృష్టిని ఆకర్షించింది ఒక చిన్న పాకెట్టు. దాని మీద అర్థనగ్నంగా ఉన్న ఒక అమ్మాయి బొమ్మ వుంది.


    "ఫారిన్ నిరోధ్!" అనుకున్నాడు రాజా.


    నిరోధ్ అని వినడమే గానీ, అదెట్లా ఉంటుందో అసలు అతనెప్పుడూ చూడలేదు.


    కొనేంత వయసు లేదతనికి.


    అతనికింకా పన్నెండేళ్ళే.


    దాన్లో ఉందేమిటో తర్వాత వివరంగా చూడవచ్చనుకుని దాన్ని చటుక్కున ఫ్యాంటు జేబులో పెట్టేసుకున్నాడు రాజా.


    మినిస్టర్ విజయకుమారి హాండ్ బ్యాగ్ లో నిరోధ్ ప్యాకెట్ కాక, విస్కీ క్వార్టర్ బాటిలు ఒకటి వుంది. చీట్లపేక ప్యాక్ వుంది. ఒక చిన్న రివాల్వర్ వుంది. ఎవరి సంతకాలు వున్న బ్లాంక్ స్టాంప్ పేపర్స్ వున్నాయి.


    వాటితోబాటు ఒక సరికొత్త వందరూపాయల కట్ట కూడా ఉంది.


    అప్పటిదాకా మీటింగు జరిగిన ఆ ప్రదేశంలోనే కటిక బీదవాళ్ళు వుండే ఒక బస్తీ వుంది. చిన్న గుడి ఒకటి కూడా వుంది అక్కడే.


    మీటింగు అయిపోయిందని తెలియగానే, ఆ బస్తీలో ఉన్న బీదలందరూ త్వరత్వరగా వచ్చి ఆశగా రాజా చుట్టూ మూగారు.


    వాళ్ళకు తెలుసు.


    రాజా ఒక జూనియర్ రాబిన్ హుడ్ లాంటివాడు.


    అతనివల్ల అక్కడున్న ప్రతివాడూ, ప్రతినాడూ ఏదోరకం సహాయం పొందవలసిందే.


    ఏ రోజుకారోజు రాజా ఏదో ఒక ఊహాతీతమయిన అడ్వంచరు చెయ్యడమూ, ఆ తర్వాత దానిని గురించి రోజుల తరబడి అందరూ వైనవైనాలుగా చెప్పుకోవడమూ చాలా మామూలే.


    రాజా చేతిలో కనబడుతూ వున్న వందరూపాయల నోట్లకట్ట అందరికీ ఆశ కలిగించింది.


    నవ్వుతూ కట్టలోనుంచి ఒక్క వందరూపాయల నోటు మాత్రం తీసి తన హిప్ ప్యాకెట్ పెట్టుకున్నాడు రాజా.


    ఇంకో నోటు తీసి, అక్కడే దేవుడి గుడి ముందు ఉన్న హుండీలో వేశాడు.


    ఆ తర్వాత అక్కడున్న జనాలందరికీ ఒక్కొక్కరికీ ఒక్కొక్క నోటు చొప్పున త్వరత్వరగా పంచడం మొదలెట్టాడు.


    ఉత్సాహంతో కూడిన మాటలూ, అరుపులూ, కేకలతో తిరనాళ్ళలాగా అయిపోయింది అక్కడి వాతావరణం.


    దేవానందం అనే ఒకతను, తన వంతుకి వచ్చిన నోటు అందుకుని అన్నాడు-


    "అరే అల్లుడూ! ఆ విస్కీసీసా నీకెందుకురా! నాకిచ్చెయ్."


    నవ్వుతూ విస్కీ సీసా దేవానందానికి అందించాడు రాజా.


    పావుగంటలో నోట్లు పంచడం పూర్తయ్యింది దాదాపుగా.


    ఇంక ఒకే ఒక్క నోటు మిగిలింది రాజా చేతిలో.


    అక్కడే గోడకి ఆనుకుని కూర్చుని ఉన్నాడు ఒక ముసలి బిచ్చగాడు. లేచి వచ్చే ఓపిక కూడా లేనట్లుంది అతనికి.


    అక్కడ నుంచే వణుకుతున్న చెయ్యి ముందుకు జాచాడు.

    
    నెమ్మదిగా అతని దగ్గరికెళ్ళాడు రాజా.


    "నోటు తీసుకోలేదా నువ్వు?" అన్నాడు మృదువుగా.


    సమాధానంగా దగ్గాడు ముసలి బిచ్చగాడు. నోట్లో నుంచి మాట మాత్రం రాలేదు.


    అతడికి ఆ వంద రూపాయల నోటు అందించాడు రాజా.


    వెంటనే....


    రాజా చేతిని మొసలి పట్టుకున్నట్లు పట్టేసుకున్నాడు ఆ ముసలాడు. ధృడంగా వుంది అతని చెయ్యి.


    రెండో చేత్తో కప్పుకున్న చినుగుల దుప్పటిని లాగి అవతల పడేశాడు అతను.


    అక్కడున్న అందరూ ఒక్కసారిగా శ్వాస లోపలికి తీసుకున్నారు.


    అతను ముసలి బిచ్చగాడు కాడు.


    మంచి దేహధారుఢ్యం వున్న పోలీసు ఆఫీసరు.


    ఫుల్ యూనిఫారంలో వున్నాడు.

 Previous Page Next Page