Previous Page Next Page 
మండు వెన్నెల పేజి 7

"నేను మీ బొమ్మను లాక్కోవడానికి రాలేదు" అన్నాడు జాగ్రత్తగా. "బొమ్మ భలే బావుంది. అందుకే చూస్తున్నాను."
"ఇంట్లో అయితే పింకీ లాగేసుకుంటుంది. అందుకే ఇక్కడ ఆడుకుంటున్నాను" అంది సంజాయిషీ చెబుతున్నట్లు.
"ఎక్కడ మీ ఇల్లు?"
"ప్రేమనగర్ అపార్ట్ మెంట్స్. కానీ అక్కడ మా అమ్మ లేదు. దేముడి దగ్గరికెళ్ళి పోయింది" అంది భాను దిగులుగా.
గుండెలు పిండేసినట్లయింది రవిచంద్రకి.
"ఐ యామ్ వెరీ సారీ!"
"ఇట్సాల్ రైట్ అంకుల్!"
తేలు కుట్టినట్లు ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర. అంకుల్! తనని అంకుల్ అంటోందా ఈ అమ్మాయి! తను ఈ అమ్మాయి కంటే నాలుగయిదేళ్ళు పెద్దయి ఉంటాడు. తను అంకుల్ ఏమిటి! నిశ్చయంగా ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు!
"నేను వెళ్ళిపోవాలి! లేటయితే కొత్త అమ్మ కొడుతుంది!" అని చటుక్కున లేచి నిలబడింది భానురేఖ. అతను ఏదో అడిగేలోపలే చిన్నపిల్లలా భానురేఖ పరుగెత్తుకెళ్ళి కార్లో కూర్చుంది. డ్రయివర్ కారు స్టార్ట్ చేశాడు.
నిర్ఘాంతపోయి నిలబడ్డాడు రవిచంద్ర.

                                                                    * * * *

అపార్ట్ మెంట్ నెంబరు పదహారు వైపు వెళ్తున్న భానురేఖ వైపు చూశాడు జయరాజ్. అతను అపార్ట్ మెంట్ నెంబరు పదమూడులో ఉంటాడు. టెన్త్ క్లాస్ చాలాసార్లు ఫెయిలయి, ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కి వెళుతున్నాడు అతను. భానురేఖ వయసే వుంటుంది.
జారిపోయిన పమిట సరిచేసుకోకుండా, త్వరత్వరగా నడుస్తుంది భాను. పమిట వేసుకోవడం ఆమెకి ఇంకా సరిగా అలవాటు కాలేదు. ఒంటి ఒంపులు చూసి సిగ్గుపడడం ఆమెకింకా తెలియలేదు.
ఆమె వేపు ఆశగా చూస్తూ, పెదిమలు తడి చేసుకున్నాడు జయరాజ్. "గుడ్ ఆఫ్టర్ నూన్ భానూ!"
"గుడ్ ఆఫ్టర్ నూన్ అంకుల్!"
నవ్వుకున్నాడు జయరాజ్. ఆమె సంగతి అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న వాళ్ళందరికి తెలిసిపోయింది. "కామిక్స్ చదువుతావా నువ్వు? నా దగ్గర బోలెడున్నాయి!"
"యా! ఐ లైక్ కామిక్స్! అమ్మ వారానికి నాలుగు కొనిచ్చేది. మిక్కీ మౌస్ ఈజ్ మై ఫేవరేట్ అంకుల్!"
"మిక్కీ మౌస్! లేటెస్టువి చాలా ఉన్నాయి నా దగ్గర! ఇవ్వనా?"
"ఇవ్వండి అంకుల్!"
"మా అపార్ట్ మెంట్ లోకి రావూ? నీకు మిల్క్ చాక్ లెట్ కూడా ఇస్తా!"
"ఇప్పుడు కాదు అంకుల్! కొత్త అమ్మ కొడుతుంది. కామిక్సు ఇవ్వండి చాలు!"
"ఓకే! ఓకే!" అంటూ అతను లోపలికెళ్ళి, నాలుగు కామిక్సూ, ఒక చాక్ లెట్ బారూ తెచ్చి, పమిటలేని ఆమె గుండెలవైపు చూస్తూ చేతులకి చేతులు తాకిస్తూ ఇచ్చాడు.
అది గ్రహించలేని భానురేఖ థాంక్స్ చెప్పి, లోపలికి వెళ్ళిపోయింది.
హాల్లో ఒకాయన కూర్చుని ఉన్నాడు. తీక్షణంగా చూసే చూపులు, చిరాగ్గా వున్న మొహం, బట్టతల, సగం నెరిసిన గెడ్డం.
"ఇవాళ నుంచి ఈయన నీకు ట్యూషన్ చెబుతారు" అంది విలాసిని.
"వద్దండీ! నేను స్కూలు కెళతాను రేపట్నుంచి" అంది భానురేఖ.
"అండీ గిండీ అనకు! కాల్ మీ మమ్మీ! తెలిసిందా ఇంకా స్కూలుకేం వెళతావ్ నువ్వు! పెళ్ళి చేస్తే నలుగురు పిల్లల్ని కని ఉండేదానివి ఈ పాటికి."
కమ్చీతో కొట్టిన దెబ్బ తగిలినట్లు చూసింది భానురేఖ. "సరేనండీ!" అంది అయిష్టంగా.
"అండీ కాదు! మమ్మీ!" అంది విలాసిని కళ్ళు పెద్దవి చేస్తూ.
"సరే మమ్...మమ్మీ!" అంది భానురేఖ హీనస్వరంతో.

                                                                 * * * *

మాటలకు ఈటెల కంటే వాడిగా మనసుని గాయపరిచే శక్తి ఉంటుందని తెలియదు చాలా మందికి.
సవతి తల్లిమాటలకు గుండె నీరయిపోతూండగా బెదురుచూపులు చూస్తూ నిలబడిపోయింది భానురేఖ.
"బెదురుగొడ్డులాగా అలా చూడకు! హ్యాపీగా నవ్వుతూ ఉండడం నేర్చుకో! టీచర్ పాఠాలు చెబుతారు. శ్రద్ధగా చదువుకోవాలి. తెలిసిందా?"
తెలిసిందన్నట్లు తల ఊపింది భానురేఖ.
విలాసిని లోపలికెళ్ళిపోయింది.
"కూర్చో!" అన్నాడు టీచరు. ఆయన పేరు గోపాలకృష్ణ.
బుద్ధిగా కూర్చుంది భానురేఖ. గోపాలకృష్ణ పెద్ద బండిలు విప్పాడు. అందులో సరికొత్త పుస్తకాలు ఉన్నాయి.
"ఇవి మెట్రిక్యులేషన్ పరీక్షకి టెక్స్ ట్ బుక్స్! ఇప్పటికే నువ్వు చదువులో ఎనిమిదేళ్ళు వెనకబడిపోయావ్! అందుకని రాత్రింబగళ్ళు చదివి ఆ గ్యాప్ 'కవర్' చెయ్యాలి! తెలిసిందా?
ఆయన పలుకుతున్న ఒక్కొక్క పలుకూ ఒక్కొక్క పిడుగులా వినబడుతుంటే, భయంగా తల ఊపింది భాను.

 Previous Page Next Page