"ఐకెన్ అండర్ స్టాండ్ యువర్ సెంటిమెంట్స్... వుయ్ విల్ ట్రై అవర్ బెస్ట్ టూ సేటీస్ ఫై యూ" మెహతా వినయంగా అన్నాడు.
"ఏం రాజేశ్వరి నీకింకా ఏమన్నా కావాలంటే చెప్పు- నేనేదన్నా మర్చిపోతే చెప్పు" కేశవరావు భార్యవంక చూసి అన్నాడు. రాజేశ్వరి కాసేపు ఆలోచించి ఇంకేం తట్టనట్టు, అన్నీ చెప్పినట్టే వున్నారు, ఆలోచిస్తాలెండి" అంది.
"సో మిస్టర్ మెహతా మీరు యీ మార్పులన్నీ ఎంత త్వరగా చేయగలరు అనుకుంటున్నారు" మెహతా భార్యవంక చూసి కాస్త ఆలోచించి...
"మినిమమ్ సిక్స్ మంత్స్ సార్-"
"ఓ, నో మిస్టర్ మెహతా, ఆరు నెలలు చాలా టైము. ఇంకాస్త త్వరగా కావాలి నాకు. మెటీరియల్ సమకూర్చుకుని మొదట రూఫ్ తో మొదలుపెట్టి, గోడలు, కిటికీలు, ఆఖర్న ఫ్లోరింగ్ - ఓ బాత్ రూములు అలా ప్లాన్ చేసుకుని...అలా మొత్తం నాల్గునెలల్లో పూర్తికావాలి..."
"సార్, కొత్త యింటికంటే పాత ఇంటిని అన్నవేట్ చేయడము కష్టం సార్... ఎనీ హౌ, వీలయినంత తొందరగా, నాన్ స్టాప్ గా పనిచేయిస్తాను" ఐ ప్రామిస్.
"మేకిట్ ఇన్ ఫర్ మంత్స్... మెహతా...."
"ఐ విల్ ట్రై సార్ - ముందు హైదరాబాదు వెళ్ళగానే ప్లాన్ ఎస్టిమేట్ తయారుచేసి చూపిస్తా... మీరు ఓకే చెయ్యగానే పని మొదలుపెడతాం."
"ఎస్టిమేట్ అంకె తెలియచెయ్యండి చాలు... నేను ఇక్కడ రెండురోజులుండి హైదరాబాద్ వస్తాను. ఈలోగా ప్రిపేరు చేయండి రఫ్ గా. ఈ నెల పదిహేనో తారీకునుంచి పని ఆరంభించాలి. అంటే ఇంక పదిరోజులు టైముంది మీకు - ఇక్కడ మీరు సూపర్ విజన్ కి ఎవరిని వుంచుతారు."
"ముందు సీలింగ్, ఫాల్స్ సీలింగ్, గోడలు, బాత్ రూముల పని మా ఇంజనీర్ల పర్యవేక్షణలో చేయించి ఆఖరు ఫినిషింట్ టచెస్ వేళకి మేమిద్దరం వస్తాం సార్ - మీకు కావాల్సిన ఫర్మిచర్, ఇంటీరియల్ డెకరేషన్ మెటీరియల్ అది ఈలోగా హైదరాబాదులో ఆర్డరు చేస్తాం.
"ఓకే...ఓకే...ఏం చేస్తారో, ఎలా చేస్తారో అది మీ బాధ్యత. మీకు ఇక్కడ ఒకటే ప్రాబ్లమ్. ఇక్కడ హోటల్స్ ఉండవు. భోజనానికి, వసతికి...." కేశవరావు సందేహంగా ఆగిపోయాడు.
"ఈ వూర్లో అడుగుపెట్టిందగ్గర్నించి ఆమాటే నేను ఆలోచిస్తున్నాను. చూస్తుంటే ఒక కుక్ కి హెల్పర్ ని అరేంజ్ చేసి ఇక్కడ వర్కర్స్ కి, ఇంజనీర్, సూపర్ వైజర్ అందరికి భోజనాల ఏర్పాట్లు చెయ్యాల్సి వచ్చేట్టుంది. వంటకి టెంట్ గాని, షెడ్ గాని వేయిస్తాను. స్టాఫ్ యీ గడులలోనే సర్దుకుని పడుకోవాలి. నుయ్యి వుంది. నీళ్ళ ప్రాబ్లం ఉండదు పనికి..."
"ఓ సారీ, మర్చిపోయా... నూతిలోంచి మిషను పెట్టించి వాటర్ పైపులు ఏర్పాటు చెయ్యాలి. గీజర్లు పెట్టాలి. "వీలయితే ఓ సోలార్ వాటర్ హీటర్ ఇన్ స్టల్ చెయ్యండి- నూతిలో నీరు సరిగా లేకపోతే చెరువు తవ్వించండి. ట్వంటీఫోర్ అవర్సు వాటర్ సప్లయ్ వుండాలి- కింద పంపు వుండాలి."
"మీరు చెప్పకపోయినా నాకు గుర్తుంది సార్. ఒక్కమాట, మా స్టాప్ ఒక నాలుగయిదు నెలలు వుండి పనిచెయ్యాలి కనుక ఎస్టిమేట్ పెరుగుతుంది."
"ఐ టోల్డ్ యూ మెహతా. మనీ నో ప్రాబ్లెమ్ అని... మెటీరియల్, వర్కర్లు అన్నీ సిటీ నుంచి రావాలి. కాస్ట్ పెరుగుతుందని తెలుసు-" అభయం ఇచ్చాడు.
మధ్యాహ్నం టీ తీసుకుని వచ్చిన టాక్సీలో మెహతా మెహతా, సునీత వెళ్ళిపోయి మళ్ళీ ఆ టాక్సీ వెంటనే వెనక్కి పంపేట్టు ఏర్పాటు చేశాడు.
"సో... వర్కవుట్ అనేది డిటైల్స్ ఇన్ టూ డేస్ మెహతా..." వారిని సాగనంపాడు కేశవరావు.
ఈ ఒక్క కాంట్రాక్ట్ తోనే ఖర్చులపోను ఓ రెండు లక్షలు దక్కవచ్చు అన్న సంతోషం భార్యాభర్తల మొహాల మీద కన్పించింది. కారులో వెడుతున్నంతసేపూ మెహతా రఫ్ గా లెక్కలు వేస్తూనే వున్నాడు సునీతతో చర్చిస్తూ.
"ఊ... ఏమిటి రంగా. నా ఉత్తరం చూసి ఆశ్చర్యపోయి వుంటావు అవునా?"
మెహతాని సాగనంపి వచ్చి. మండువాలో వాలుకుర్చీలో సాగిలబడ్డాడు కేశవరావు.
"ఆశ్చర్యమా! అడక్కు. మూడురోజులబట్టి నీకెందుకింత సడెన్ గా ఈ వూరికి రావాలని బుద్ధి పుట్టిందని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను- ఇదంతా ఏమిటి మావయ్యా- నిజంగా మీరు ఈ వూరు వచ్చేస్తారా" నమ్మశక్యం కానట్టు అన్నాడు.
"ఇంకా సందేహమే నీకు. వాళ్ళని ఎందుకువెంటబెట్టుకువచ్చి చూపించానంటావు అంతా- ఈ యింటిని మార్చడానికి యింత డబ్బు ఎందుకు ఖర్చుపెడ్తున్నానంటాఉ- ఇదేదో సరదాగా అన్నమాట అనుకుంటున్నావా?" కేశవరావు నవ్వి అన్నాడు.
"మీ మామయ్యకి హఠాత్తుగా జన్మభూమి మీద ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. నా వూరు- నే పుట్టి పెరిగిన వూరిలో వుండి వూరిని బాగుచేస్తాను అంటూ మొదలుపెట్టారు- మొదట్లో నీలాగే నేనూ ఇదంతా విని ఆశ్చర్యపోయాననుకో-"
"అసలు ఇంత హఠాత్తుగా ఇన్నేళ్ళ తర్వాత ఈ ఉద్దేశం ఎందుకు కల్గింది మావయ్యా..." కుతూహలంగా చూశాడు రంగా.
"మీ ముఖ్యమంత్రి ప్రవాస భారతీయులు తమ జన్మభూమి రుణం తీర్చుకోమన్నారుట. డబ్బు గడించినందుకు మీ జన్మభూమికి ఏదన్నా చేయండి. దేశాన్ని ఆడుకోండి అని పిలుపు ఇచ్చారుట. ఆ మాటలు ఈయనకి చాలా నచ్చి ప్రభావితులైపోయారు. అంతే ఇంక ఇండియా వచ్చేస్తానని మొదలుపెట్టారు..." రాజేశ్వరి హాస్యంగా అంది. ఆమె చెప్పిన కారణం విని సుగుణ ఆశ్చర్యంగా రంగా వంక చూసింది.
"నిజంగానే రంగా మన సి.ఎం. నిజంగా మనరాష్ట్రం కోసం కష్టపడుతున్నాడు కదూ... మనిషి పుట్టాక ఒక మంచిపని చెయ్యాలనిపించింది అతని మాటలు విన్నాక. సంపాదించడం అంతా చేస్తారు. ఆ సంపాదనకి సార్ధకత చేకూర్చి, నేనూ నా జన్మభూమి కోసం ఏదన్నా చెయ్యాలనిపించింది.
"అంటే ఏం చేద్దామని మామయ్యా... ఇక్కడ ఉండి వైద్యం చెయ్యాలనా" అర్థంకాక అడిగాడు రంగ.
"వైద్యమనే కాదు రంగా - యీ వూరు నేను దత్తతతీసుకుంటాను. ఈ వూరిని నా శాయశక్తులా ఆర్థికంగా, ప్రగతిపథం వేపు నడిపించాలన్నదే నా ఆశయం" అర్థమయి, అర్థమవనట్టు మేనమామ ఉద్దేశం- అంటే ఇదేదో ఆషామాషీగా కొన్నాళ్ళుండి పోదామని రాలేదన్నది మాత్రం అర్థమయింది."
"అంటే ఇంక ఇక్కడే వుండిపోతారా, అమెరికా వెళ్లరా..."
"వుండాలన్న ఉద్దేశంతోనే యిదంతా చేస్తున్నాను- ఏమో నేను అనుకున్నది సాధించలేకపోతే... యిక్కడ పరిస్థితులు నన్ను పారిపోయేట్టు చేస్తే ఏమో ఏం చేస్తానో చెప్పలేను... ప్రస్తుతానికి సీరియస్ గా వుండాలన్న ప్రయత్నానికి నాంది ఇది..." సుగుణ, రంగా మరోసారి మొహాలు చూసుకున్నారు.
వాళ్ళ వంక చూసిన కేశవరావుకి వాళ్ళ ఆలోచన అర్థం అయింది.