3
పదకొండు ముప్పై నిమిషాలకి...
ముగ్గురు స్నేహితురాళ్ళు సుందర సుకుమారి ఇంట్లో కాలుపెట్టారు.
అప్పటికే ఆ ఇంట్లో ఓ సీను బ్రహ్మాండంగా జరుగుతోంది. సుందర సుకుమారి బాసిపెట్లు వేసుకొని నడిమంచంమీద కూర్చుంది. మొహంలో అంతులేని నీరసం కొట్టచ్చినట్లు కానవస్తోంది. ఓ పక్క బామ్మ పారాయణం వింటూ మరోపక్క మాటిమాటికి గోడగడియారం వైపు చూస్తున్నది.
కాలం స్థంభించినట్టు...గడియారంలోని ముళ్ళు ముందుకు కదలనట్టు...క్షణమొక యుగంలా ఉంది సుందర సుకుమారి ప్రాణానికి.
స్నేహితురాళ్ళు వస్తారో...రారో! వాళ్ళకి ఏదయినా అడ్డంకి వచ్చి రాకపోతే తమ ప్లాన్ బెడిసికొడుతుంది. ప్లాను బెడిసికొట్టడం మాట అటుంచి తిండి తినకుండా మరో గంట వుంటే తను శోషొచ్చి పడిపోవటం ఖాయం. ఆ తరువాత...అసలు విషయాన్ని మింగాలో...కక్కాలో తెలీదు. కళ్ళెదురు కుండ కనబడుతున్నా తిండి విషయంలో కూడా మింగాలో...మింగకూడదో తెలీదు. ఇది చాలా పెద్ద కష్టమే.
నిన్నటిరోజు వందనాదేవి చెప్పిన పథకం ప్రకారమే ఉదయం నుంచి నిరాహారదీక్ష పట్టింది సుందర సుకుమారి.
మొహం కడుక్కునే నెపంతో బాత్రూమ్ లో దూరినప్పుడే రెండు లడ్లని తీసుకొని వెళ్ళింది. అవి అక్కడే తినేసి నాలుగు గ్లాసులు మంచినీళ్లు తాగేసి వచ్చింది. బాత్రూమ్ నుంచి వస్తూనే మంచం ఎక్కి కూర్చుంది.
ఆ ఉదయం పెద్దపెద్ద దిబ్బరొట్టెంతసైజు ఇడ్లీలు చేసింది బామ్మగారు. ఇడ్లీలో నంజుకోటానికి కారప్పొడి...అల్లం పచ్చడి... ఉల్లికాడల పచ్చడి మూడు రకాలవి ప్లేట్లో వేసి నాలుగు ఇడ్లీలని పళ్ళెంలో పెట్టుకుని ఇడ్లీలు మునిగేలా వాటిమీద నెయ్యి పోసిందికాక పళ్ళెంలో ఒక్క పక్కగా పెద్ద నిమ్మకాయంత వెన్నపూసవేసి ఆ పళ్ళాన్ని తీసుకోచి సుందర సుకుమారి ముందుపెట్టింది.
"ముందు ఇడ్లీలు తిను. మళ్ళీ కావాలంటే పెడతాను. ఇంతకీ ఈ పూట కాఫీ తాగుతావా? బోర్నవిటా తాగుతావా?" అనడిగింది బామ్మగారు.
"ఆ ఇడ్లీలు చూస్తే ఎక్కడ తినబుద్ధి వేస్తుందోనని మొహం పక్కకి తిప్పుకొని "నాకు ఇడ్లీలు వద్దు" బింకంగా అంది సుందర సుకుమారి.
"ఇడ్లీల పేరు చెబితే చాలు...ఆవురావురుమంటూ తినేదానివి. ఇవాళేమొచ్చిందే సుందరి! దిష్టి తగిలిందో పాడో! మొన్న నువ్వు ఇడ్లీలు తినేటప్పుడు ఆ ఎదురింటి వనజమ్మ వచ్చింది. దాని కళ్ళుపడి దిష్టి తగిలుంటుంది. పోనీ రొట్టెగా వేసిపెట్టనా?" అనడిగింది బామ్మగారు.
"రొట్టె వద్దు పిట్టె వద్దు. నన్నసలు మాట్లాడించకు" అంది సుందర సుకుమారి.
"ఓహో! కోపమొచ్చిందన్న మాట. అవునా! ఇంతకీ నీ కోపమేమిటో చెపితే కదా నేను తీర్చేది" లాలనగా అడిగింది బామ్మగారు.
"మా స్నేహితురాళ్ళు ముగ్గురిని వాళ్ళింట్లో ఏమీ అభ్యంతరం పెట్టకుండా టూర్ కి పంపిస్తున్నారు. నువ్వేమో "వద్దని" చెప్పేశావు. వాళ్ళముందు నాకెంత ఇన్ సల్టుగా వుందో తెలుసా? నన్ను వాళ్ళతోపాటు టూర్ కి పంపిస్తానంటేనే తిండి తింటాను. నువ్వు "ఊ" అన్న తర్వాతనే వచ్చి మంచినీళ్ళయినా తాగేది... ఎండు రొట్టెలైనా తినేది. అంతవరకు ఇంతే. మంచం దిగేది లేదు."
"ఇదెక్కడి గోలే!" అంది లబలబలాడుతూ బామ్మగారు.
"ఇది గోలకాదు. ఆహారం విసర్జించడం అంటారు. ఆహార సత్యాగ్రహం అన్నమాట. అసలు మౌనదీక్ష పట్టాలనుకున్నాను. విషయమేదో నీతో చెప్పకపోతే తెలీదు కదా! అందుకని మౌనదీక్ష పట్టలేదు. ఎలాగూ ఆహారం లేకపోతే నీరసంతో మాట్లాడే శక్తిలేక మౌనదీక్ష వచ్చేస్తుంది. దీంతోపాటు అది కూడాను" ఇడ్లీలున్న పళ్ళెంవైపు చూడకుండా జాగ్రత్తపడుతూ చెప్పింది సుందర సుకుమారి.
క్షణకాలం బామ్మగారికి కాళ్లు చేతులు ఆడలేదు. మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుని "అయినా దీని బెట్టు ఎంతసేపులే! కాసేపాగితే అదే దిగివస్తుంది" అనుకుంది.
బామ్మగారు కూడ ఉదయం పూట ఫలహారం చేస్తుంది. మనవరాలు తినకుండా తను తినటం ఇష్టంలేకపోయినా ఎట్లాగొట్ల నిరాహారదీక్షని మనవరాలిచేత విరమింపజెయ్యాలని తను ఇడ్లీలు తెచ్చుకుని సుందర సుకుమారి మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుని తినటం ప్రారంభించింది.
తింటే ఫరవాలేదు. ప్రక్కనే వ్యాఖ్యానం. "పూర్వం ఇడ్లీలని "కుడుములు" అనేవాళ్ళు. వినాయకుడు పుట్టిన ఆ యుగంలోనే కుడుములూ పుట్టాయ్. అప్పుడు బియ్యంరవ్వ... మినపప్పుతో చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఉప్పుడు రవ్వ...మినపప్పుతో చేస్తున్నారు. అప్పుడు ఆవిరి మీదే ఉడికించారు. ఇప్పుడు ఆవిరిమీదే ఉడికిస్తున్నారు..."
అంతవరకు మాట్లాడిన బామ్మగారు ఇడ్లీ ముక్కని అల్లంపచ్చట్లో ముంచి వత్తి నోట్లో వేస్కొని "గారెలకి నంజుడుగ అల్లం పచ్చడి అంటారు. ఇడ్లీలోకి కూడా అల్లం పచ్చడి చాలా బాగుంటుంది" అంది. మరో ముక్క తుంచి ఉల్లికాడల పచ్చడితో వెన్నపూస చేర్చి నోట్లో పెట్టుకోబోతు "కారం కారంగ ఇలా ఉల్లికాడలతో పచ్చడి చేయడం అందరికీ రాదు. ఉల్లికాడలు... వెన్నపూస... ఇడ్లీముక్క... అసలు ఈ వాసనే వేరు... ఈ రుచే వేరు" అంటూ ఆ ముక్కని నోట్లో వేసుకుంది బామ్మగారు.