Previous Page Next Page 
సీతాచరితం పేజి 7


    సమాజానికి నేత్రం


    సాహిత్యం సమాజానికి దర్పణం అంటున్నాం. దర్పణమంటే అద్దం. దర్పణంలో సమాజం కల్పిస్తుంది అనడం దీని ప్రధానలక్షణం. అంటే సమాజాన్ని సాహిత్యంలో చూడవచ్చని అర్ధం. కాని ఎందుకో సాహిత్యాన్ని దర్పణమనడం నా కిష్టముండదు. సాహిత్యం సజీవమైంది. దర్పణం నిర్జీవమైంది. సజీవ పదార్థాలను నిర్జీవపదార్ధాలతో పోల్చడం నాకంత బాగనిపించదు. తామరపూవు ఎలాగుంది అంటే కుంకుమరంగులో వుంది అనడం కంటే సంధ్యారాగంలో వున్నదనడం బాగుంటుంది. మన సంప్రదాయం కూడా సజీవ పదార్థాలను, సజీవపదార్థాలతో పోల్చడం ముగ్దమొహాన్ని చంద్రునితో పోల్చడం, ఇలా ఎన్నింటినో పోల్చవచ్చు. మన కవులు మానవ స్వభావాన్ని ప్రకృతి స్వభావంతో పోల్చిన సంఘటనలు చాలావున్నాయి. తుదకు సందేశం పంపించాల్సి వచ్చిన కాళిదాసు మేఘునితో పంపించాడు. కాబట్టి చేతన పదార్ధాన్ని చేతన పదార్థంతో 'ఉపమించడం బాగుంటుందని నా ఉద్దేశ్యం' అందుకే సాహిత్యాన్ని దర్పణంతో పోల్చినపుడు మనస్సు కలుక్కుమంటుంది. అందుకు కారణం ఒకటి దర్పణానికి జీవంలేదు. రెండవది దర్పణానికి పరిధి కొద్ది, ఎంత పెద్ద అద్దమైన కొద్ది పరిధిని మాత్రమే చూపించగలదు. సమాజం అనంతమైనది. విశ్వరూపం గలది. అది అద్దంలో ఇమడటం కష్టం. కాక కొండ అద్దంలో ముడుచుక కూర్చుంటుంది. మనం సాహిత్యంలో (అలా ముడుచుకున్న సమాజాన్ని చూస్తామా? కాదు సాహిత్యంలో) సమాజపు విరాట్ స్వరూపం దర్శనమిస్తుంది. సమాజంలోని లొసుగులు దొసగులు, సమాజంలోని మిట్టపల్లాలు, సమాజంలోని వ్యక్తులు, వారి స్వభావాలు, బృహత్తరమైన సమాజ స్వభావం, ఆచార విచారాలు, ఆలోచనలు అనేకాన్ని చూపిస్తుంది సాహిత్యం. ఇవన్ని అద్దంలో కన్పించడం సాధ్యమయ్యే పని కాదు. కాగా అద్ధం మూగది. అది బొమ్మను చూపగలదేకాని బొమ్మ స్వభావాన్ని తిలకించలేదు. స్వభావాన్ని తిలకించడం సాహిత్య లక్షణం. అధ్దంలో మూగబొమ్మలు కన్పిస్తాయి. వాటి నడక అవి కూర్చవడం, విశ్రమించడం చూడగలం. కాని అవి ఎందుకు కూర్చున్నాయి. ఎందుకు నడుస్తున్నాయో అర్ధంకాదు. ఉన్న బొమ్మను చూపడం అద్దంపని. సమాజాన్ని విశ్లేషించి చూడటం సాహిత్యం పని. ఉన్నదాన్ని ఉన్నట్లు చూపడం సాహిత్యలక్షణం కాదు. అందువల్ల సమాజానికి అద్దం పట్టడం అంటే ఉన్న వస్తువును చూపడమే అవుతుంది. ఈ పనిని చిత్రకారుడు చేస్తాడు. అతడొక బొమ్మను వేసి వదిలివేస్తాడు. ఆ బొమ్మ యొక్క స్వరూపం మనకు కన్పిస్తుంది. కొంతవరకు దాని హావభావాలు కన్పిస్తాయి.. కాని పృష్ఠభూమి కన్పించదు. ఆ చిత్రాన్ని గురించిన విశ్లేషణ కన్పించదు. ఆ చిత్రం సైతం ఆనాటి సమాజపు ఒకానొక దృక్కోణాన్ని పరిశీలించగలదు. కాని సమాజాన్ని చూపించలేదు. ఆ చిత్రం ఆనాటి వ్యక్తికి అద్దంలోని ప్రతిరూపం. కాని సాహిత్యం అద్దం మాత్రమేకాదు. అనేకం. వాల్మీకి సాగరాన్ని గురించి చెబుతు ఉపమానం దొరకక "సాగరస్సాగరోపమాః" సముద్రాన్ని సముద్రంతోనే పోల్చవచ్చు అంటున్నాడు. అలాగే 'గగనం గగనాకారం' అంటున్నాడు. ఆకాశం ఆకాశంలాగే వుందని అతని వుద్దేశ్యం. అలాంటిది మరొకటి లేదని అతని భావన. అలాగే సాహిత్యాన్ని పోల్చడానికి మరొక వస్తువు దొరక్కపోవచ్చు.


    సాహిత్యాన్ని పోల్చడానికి మరొక వస్తువు దొరకనిమాట నిజం. ఎందు చేతంటే సాహిత్యం గగనాకారం కలది. సముద్రొపమం వంటిది. సాహిత్యం గగనంలా విశాలమైంది. సముద్రంలా లోతైంది. రామాయణాన్ని సముద్రంతో పోల్చాడొక కవి.


    "శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులమ్I
    కాండగ్రాహ మహామీనం వన్దే రామాయణార్ణవమ్. II"


    అంటే సాహిత్యం సముద్రమంత విశాలమైంది. సముద్రమంత లోతైంది. అంటున్నాడు.


    "సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరమ్II"


    ఇక్కడ కవి మరొక అడుగు ముందుకు వేశాడు. సాహిత్యం సముద్రంలా రత్నాకరం అంటున్నాడు. రత్నాలు సముద్రంలో చూస్తే కన్పించవు. ఎంతో లోతుకు వెళ్లి చూస్తే కన్పిస్తాయి. కాబట్టి సాహిత్యంలో లోతుకు వెళ్లి వెదకవలసిందెంతో వుంది. వెదగ్గల్గేవారికి రత్నాలే కన్పిస్తాయి. పై పైన చూసేవారికి నత్తగుల్లలు, రాళ్లే కన్పిస్తాయి. ఈ నత్తగుల్లలు చూడటం చూపులోని లోపం. కాని నిజంగా సాహిత్యంలో రత్నాలే వున్నాయి. ముఖ్యంగా రామాయణంలో ఐతే వాటికి వెదకటానికి దమ్ముకావాలి. సత్తాకావాలి. పరిశీలన కావాలి. అది చేతకానివారు రామాయణం నిండా చిల్ల పెంకులే వున్నాయని చెబుతుంటారు. ఈ చిల్లపెంకులు చూసేవారి కళ్లు అద్దంలాంటివి, వారికి చూపులేదు. అవి లోతుగా చూడలేవు.


    సాహిత్యం సమాజానికి దర్పణం అనే దానికంటే సాహిత్యం సమాజానికి నేత్రం లేదా నేత్ర ప్రాయం అనడం బాగుంటుందని నా ఉద్దేశ్యం. సాహిత్యాన్ని అద్దం అనడం మనసొప్పక ఆలోచించగా, ఆలోచించగా సాహిత్యం సమాజానికి నేత్రం అనే నిర్ణయానికి వచ్చాను. నేత్రం దర్పణంలా నిర్జీవమైంది కాదు. కాబట్టి సజీవమైన నేత్రంతో సాహిత్యాన్ని పోల్చడం బాగేమోననే ఆలోచన వచ్చింది. నేత్రం సజీవమైంది. దాని పరిధి దర్పణాన్ని మించింది. అది దూరాన్ని చూడగలదు. మనిషి ఎంత ఎత్తునుంచి చూస్తే అన్ని సుదూరపు ప్రాంతాలు కన్పిస్తాయి - అలాగే మనిషి సంస్కారం పెరుగుతుంటే ఆ కంటికి సాహిత్యంలోని సుదూర సత్యాలు ద్యోతకమవుతుంటాయి.


    కంటి చూపు మనిషిని చూసి ఊరుకోదు. అతన్ని కొలవగలదు. అతని స్వరూపంతో బాటు స్వభావాన్ని తెల్సుకోగలదు. చాతుర్యం గల కన్ను అతని లోతు పాతులను పరిశీలించగలదు. హృదయ కుహరంలోని భావాలను, మేధస్సులోన ఆలోచనలను, పసిగట్టి పరిశీలించగలదు. పరిశీలించి ఆ వ్యక్తి లేక ఆ సంఘటనను, లేక ఆ దృశ్యపు పరిణామాలు పరికించగలదు. కంటికి మహత్తరమైన శక్తివుంది. కన్ను కనలేనిదాన్ని కనగలదు. ఆరోగ్యవంతమైన కన్ను మాత్రమే అన్నింటిని సక్రమంగా సాభిప్రాయంగా చూడగలదు. కలకలున్న కంటికి అన్ని కంటకాలుగానే కన్పిస్తాయి. కామెర్లు వచ్చిన కంటికి అన్నీ పచ్చగానే కన్పిస్తాయి. అసలు మానవ జీవనం కంటిమీదనే ఆధారపడి వుంది. అందుకే -


    "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" అన్నాడు.


    సాహిత్యం సమాజానికి నేత్రం అనుకుంటే అది సమాజంలో వున్న అన్ని అంగాలకు అతి ప్రధానమైందని అర్ధమవుతుంది. సాహిత్యం సమాజంలోని ఇతర అంగాలన్నింటికన్న ప్రధానమైంది కావటానికి కారణం దాని పరిశీలన. మరొక కారణం దాని శాశ్వతత్వం.


    Even Gods must die,
    But the Sovereign poetry
    Remains stronger than the death.


    (దేవుళ్లు కూడ చస్తారు. కాని ఉత్తమ సాహిత్యం మృత్యువును జయించి జీవిస్తుందంటారు-)


    "సుకవితా యద్యస్తి రాజ్యేన కిం"


    మంచి కవిత్వముంటే రాజ్యమెందుకు అంటాడు భర్తృహరి.


    సమాజ నేత్రం సాహిత్యం అనుకుంటే ఇది సాధారణమైన నేత్రంకాదు. ఈ నేత్రానికి చావులేదు.


    రామాయణాన్ని గురించి చెబుతూ-


    "యావత్ స్థాస్యంతి గిరయ స్సరితశ్చ మహీతలే తావద్రామాయణ కథోలోకేషు ప్రచరిష్యతి."


    (భూమిమీద పర్వతాలు, నదులు ఎంతకాలముంటాయో రామాయణం అంతకాలముంటుంది.)


    రచయిత యొక్క సాహిత్య సిద్దిని బట్టి సాహిత్య నేత్రపు ఆయువు పెరగడం గాని, తరగడంగాని జరుగుతుంది.

 Previous Page Next Page